ఈ విషయం తన తండ్రికి అన్నయ్యకు చెప్తే వాళ్ళు అంతపనీ చేస్తారు. ఆ తరువాత బాధపడేది ఎవరు? ఆలోచనలతో అలా బొమ్మలా ఉండిపోయింది. అంబిక చిన్నగా నవ్వింది.
"ప్రాణం తియ్యటం అంత సులభంకాదు. చట్టం ఉంది దానికి మనం జడవాలి. ఆవేశం పనికిరాదు. ఆలోచన ముఖ్యం ఇప్పుడు ఈ విషయం మనం అంతవరకూ తీసుకెళ్ళవద్దు" అంది అంబిక.
"మకి ఆ కృష్ణమౌళి రోజురోజుకి పంతం పట్టినట్టు మాట్లాడుతున్నాడే అతడ్ని తప్పించుకోవటం ఎలా!" అడిగింది భయంగా.
అంబిక నవ్వుతూ ఆమె భుజం తట్టింది, ధైర్యం చెపుతున్నట్టుగా,
బేలగా చూసింది ఇంద్రసేన.
"నీ పెళ్ళి జరిగిపోతే అతనితో గొడవే ఉండదు. నాకు హాస్పిటల్ కి ఫోన్ చేశారు. రేపు వాళ్ళబ్బాయి ఇష్టమయితే వాళ్ళకీ ఇష్టమేనట, అతను మన ఇంటికి వచ్చేముందు గొడవ ఏం పెట్టుకోవద్దు. ఈ పెళ్ళిచూపులు చాలా రహస్యంగా జరిగిపోవాలి, పెళ్ళి సంబంధం నిశ్చయం అయిపోయి పెళ్ళి జరిగిపోతే ఇక అతని పట్టుదల ఏమవుతుంది" అంటూ నవ్వింది అంబిక.
"వదినా!" అంది సంతోషంగా, ఆశ్చర్యంగా, ధైర్యంగా.
"ఈ విషయం ఎవ్వరికి చెప్పకు నేను ఉన్నాను. నీవు ధైర్యంగా ఉండు. నాన్నగార్కి, అమ్మగార్కి నేను చెపుతాను. కృష్ణ రేపే మన ఇంటికి వస్తున్నాడు." అంది.
ఇంద్రసేన సిగ్గుగా చూసింది.
"నీవు చక్కగా అందంగా ముస్తాబవ్వాలి. అసలే నీవు అందమైన దానివి అనుకో. అతను నిన్ను చూడగానే అలా ఉండిపోవాలి అంతే" అంటూ నవ్వింది అంబిక.
"పో వదినా" అంటూ సిగ్గుపడిపోయింది.
అంబిక ఆమెకు ధైర్యం చెప్పి నవ్వింది. ఆమె మళ్ళీ మామూలుగా, హుషారుగా అయ్యేటట్టుచేసి ఆమె మనసులో భయాన్ని పోగొట్టింది.
అంబిక మనసులో నవ్వుకుంది.
ఇందు ఎంత పెంకిఘటమో! తన తెలివి, గడుసుతనం ముందు ఆమె ఓడిపోతుంది. కృష్ణమౌళి వస్తాడని తనకి తెలుసు. ఈ ఇంట అందర్ని చూస్తుంటే తనకి జాలి ముంచుకువచ్చి నవ్వు వస్తుంది. అంబిక మనసులో నవ్వుకుంది.
54
గణేశ్ రావు గారు జయరామ్ కి ఒకటే హడావుడిగా ఉంది.
ఆ రోజు సాయంత్రమే ఇంద్రసేనని చూడ్డానికి కృష్ణ వస్తున్నాడని-
సుభద్రమ్మ తనని కానట్టు అలా ఉండిపోయింది.
ఆవిడ మనసులో కృష్ణమౌళి మెదిలాడు.
చిన్నప్పుడు అనుకున్నది. అదికాక వేరే సంబంధం చూడవలసి వస్తుంది, పరిస్థితులు అనుకూలించక అని బాధపడింది ఆవిడ. ఇంద్రసేన సాయంత్రం అయిదుగంటలు అయ్యేసరికి ముస్తాబు మొదలుపెట్టింది.
డ్రసింగ్ టేబుల్ వద్ద కూర్చుని ముస్తాబు అవసాగింది.
లేతాకు పచ్చ చైనా శిల్కు చీర కట్టుకుని అదే రంగు లేతాకు పచ్చి చైనా శిల్కు జాకెట్ వేసుకుంది.
మెడలోకి చెవులకి చేతులకి ముత్యాలశెట్టు పెట్టుకుంది. అతను ఎంత అందంగా ఉంటాడో.
వదిన చెప్పిన మాటలు ఆమె చెవిలో మారుమ్రోగాయి.
ఇంద్రసేన తనలో తాను నవ్వుకుంది.
ఆ పాపం ఆయన తనకంటే అందమైన మనిషా!
అందంగా ఉన్న ఆయనకి తనని ఇచ్చి చెయ్యాలని నాన్నగారి కోరిక.
నాన్నగారి కోరిక నెరవేరబోతుంది.
ఇకనుండి తనకి ఆ కృష్ణమౌళికి గొడవ ఉండదు. తనకి పెళ్ళయిపోతే ఏం చేస్తాడు!
మనసులో గర్వంగా అనుకుంది.
అంబిక ఇంటిదగ్గర ఉండాలని అనుకున్నా హాస్పిటల్ పనిమీద వెళ్ళటం తప్పలేదు.
ఆమె తొందరగా వచ్చేస్తానని చెప్పింది.
అంబికకోసం చూస్తున్నారు గణేశ్ రావుగారు, జయరామ్. ఆమె ఇంకా రాలేదు.
సుభద్రమ్మ కూడా చూస్తుంది కోడలు ఇంకా రాలేదని "అమ్మాయి ఇంకా రాలేదు! ఆ అబ్బాయి కృష్ణగాని వచ్చేస్తే" అంది ఆవిడ భర్తతో.
"అదే చూస్తున్నాను సరే టైమ ఉందిలే అమ్మాయి కూడా టైము చూసుకునే వచ్చేస్తుంది అనుకో" అన్నారు ఆయన.
కోడలు అంబిక మాటమీద ఆయనకు ఆవిడకు మంచి నమ్మకం.
టైము ఆరుగంటలు అవుతుంది.
ఆరున్నర ఏడుగంటలు అవుతుంది.
అంబిక రాలేదు ఇంటికి.
హాస్పిటల్ కి ఫోన్ చేస్తే అక్కడ లేదని చెప్పారు.
కృష్ణ వచ్చేస్తాడేమో అనుకున్నారు.
అతను రాలేదు.
అంబిక ఏడున్నర ఎనిమిది గంటలయినా ఇంటికి రాలేదు.
ఆమె అలా ఎప్పుడయినా ఆలస్యంగా వస్తుంది, అర్జంట్ కేస్ లు ఏమైనా ఉంటే....
ఎనిమిదిన్నర తొమ్మిది.... తొమ్మిదిన్నరయింది టైము. ఇంద్రసేన ముస్తాబు అయి అలా కూర్చుంది.
ఆమె వదనం చిన్నబోయింది.
ఎప్పుడూ లేనిది ఈ రోజు ఇలా అయింది ఏమిటి!
ఒకవేళ ఆ కృష్ణ తమ యింటికి వస్తుంటే ఏ కారు అయినా ఏక్సిడెంట్ కాలేదు కదా!
ఆమె మనసు ఎందుకో కీడును శంకించింది.
ఇంద్రసేన గుండెలు ఎందుకో దడదడ కొట్టుకోసాగాయి. గదిలోకి వెళ్ళి వస్తువులు అన్నీ తీసి పారేసింది. తలలో గులాబీలు పీకిపారేసింది.
అది ఉడుకుమోత్తనమో---
