Previous Page Next Page 
హౌస్ సర్జన్ పేజి 25


    వాళ్ళు వెళ్ళలేదు. ఆమెను నఖశిఖ పర్యంతం పరీక్షించటం  మొదలు పెట్టారట.

    "అందుకే. మీరంతా  నన్ను యిలాంటి అసహ్యానికి  గురిచేసి పీడిస్తారనే  యిన్నాళ్ళు  ఎవరికీ  చెప్పకుండా  దాచాను. అసలీ రహస్యం  ఎవరికీ తెలియక ముందే ఉద్యోగం  రిజైన్ చేసి  ఏ ఋషికేశ్ కో వెళ్ళిపోడా మనుకున్నాను. నా కర్మకాలి యీ లోపలే  మంచాన  పడిపోవల్సి వచ్చింది. ఈ వ్యాధి నాలో  అంకురించిందని  ఎప్పుడో గుర్తించాను. ఈ వ్యాధితో బాధపడే ప్రతి ఒక్కరూ  నా మనసుని దోచుకున్నారు. వారందరితో  చెలిమి చేశాను. వారే నా స్నేహితులు .అంతకు తప్ప నాకు కావలసిన  వాళ్ళెవరూ  లేరు. ఎందుకు నా గురించి  మీరంతా  శ్రమ తీసుకుంటారు ? నేను మీకెవర్ని ? ఆసుపత్రిలో రోజూ  ఎంతో మంది మరణిస్తూంటే  మీరు వ్యక్తిగతంగా  తీసుకుని  బాధపడతారా ? నా గురించి  అలానే భావించండి. వెళ్ళిపోండి. మీరంతా  వెళ్ళిపోండి ప్లీజ్" అని ప్రాధేయపడిందట.

    కాని వాళ్ళు  వెళ్ళిపోలేదు. హైదరాబాద్  కేన్సర్  హాస్పిటల్ లో చేర్చాలని  పట్టుబట్టారట.

    "నాకు  యిష్టంలేని పని నాతో  ఎలా చేయించగలరు ? అక్కడ నన్ను నరక యాతన పెడతారు. రేడియమ్ థిరఫీ అంటారు. డిప్ ఎక్స్ రే అంటారు. ఆ బాధ నేను భరించలేను. నన్నిలాగే  వుండనివ్వండి  నా యిష్టప్రకారం  నన్ను  బ్రతకనివ్వండి" అంటూ  ఘోష పెట్టిందిట.

    కాని ఆమె పంతం  చెల్లలేదు. బలవంతాన  ఆమెను హైదరాబాద్ తీసుకువెళ్ళి  కేన్సర్ హాస్పిటల్ లో చేర్పించారు.

    కామేశ్వరిగారు  గుర్తు  వచ్చినప్పుడల్లా  ఏదో వైరాగ్యం  ఆవహించినట్లుంటుంది.

    ఆమె మరో  సంవత్సరంపాటు  ఉద్యోగంలో  వుండివుంటే  చీఫ్ అయిపోయేవారు.

    గైనిక్ చీఫ్ శ్యామలాదేవిగారు  చాలా గంభీరమైన  మనిషి  నాలుగు రోజులపాటు ఏ విషయమూ  పట్టించుకోనట్లు  కనిపిస్తుంది. ఉన్నట్లుండి ఒకరోజు నలుగుర్ని  పట్టుకుని  గడగడ దులిపేస్తుంది. ఇంచుమించు ఆమె దగ్గర  పనిచేసే అసిస్టెంట్లందరూ  ఆమె దగ్గర  చదువుకుని  ఆమెవల్లే  డిగ్రీ పొందినవారే. ఆమెతో  మామూలుగా మాట్లాడటానికి  హడలిపోతూ వుంటారు. ఎంతో అవసరముండి తప్పనిసరి  అయితేనే గాని  ఆమె జోలికిపోరు.

    ఆమె ఏమీ పట్టించుకోనట్లు  కనిపిస్తూన్న  అన్ని విషయాలూ  గమనిస్తూనే వుండేది. అంత మంది హౌస్ సర్జన్లు పనిచేస్తున్నా, ఎవరికి మట్టుకు  వారు తమ గురించి  ఆమె కేమీ  తెలియదని  అనుకుంటున్నా, ఏదో ఒక క్షణాన  హఠాత్తుగా ఎవరో ఒకర్ని  పేరుపెట్టి  పిలిచేది.

    గైనిక్  అసిస్టెంట్లను  చూస్తూంటే  ఒక విషయంలో  నాకు గమ్మత్తుగా వుండేది. వాళ్ళు చాలా గంభీరంగా  స్త్రీల జబ్బులను గురించి ,వారి గర్భిణీలకు  సంబంధించిన విషయాల గురించీ  క్లాసుల్లో  బోధిస్తూ వుంటారు. ఉన్నట్లుండి వారిలో  ఒకరి కడుపు పెరగ నారంభిస్తుంది. ఒక బోధకురాలిగా, డాక్టరుగానే  చూడటానికి  అలవాటు పడిన వారికి ఆ స్థితిలో చూసి అందరిలాంటి  స్త్రీగానే  ఊహించుకొనటం  చిత్రమైన అనుభూతినిస్తుంది .ఏడోనెల  వచ్చేటంతవరకూ  అలాగే  హాస్పిటల్ కు వస్తూ  వెడుతూ  వుంటారు. తర్వాత  సెలవు  పెట్టేసి  మళ్ళీ  ప్రసవించటానికి హాస్పిటల్ లో ఎడ్మిట్ అయి....ఆ సమయానికి  లేబర్ రూమ్ కి తీసుకుపోబడతారు.

    సైన్సు, విద్య, క్లాసులు, పేషెంట్లు. డెలివరీలు, ఆపరేషన్లు  యీ వాతావరణపు సుడిగుండంలో  వూహించుకోబడే  లేడీ  డాక్టరుకు  యింట్లో పెనిమిటి ,పిల్లలు, వంటపని, పిల్లలను  చూసుకోవడం, పెనిమిటితో సరాగాలు _యీ గార్హస్థ్య  జీవితాన్ని  ఊహించుకుంటే  ఆ అనుభూతి తమాషాగా వుండేది.

    గైనిక్ పోస్టింగ్ లో పనిచేసే రెండు నెలల్లోనూ  హెడ్ సర్జన్ చేసేపని  వివిధ విభాగాలుగా వుండేది. గైనిక్ వార్డు, యాంటీనేటల్ వార్డు మళ్ళీ విడివిడిగా  ఓ.పి. లు, థియేటర్, లేబర్ రూమ్ యిట్లా  వుండేది.

    ఒకసారి  లేబర్ రూమ్  నైట్ డ్యూటీలో  వున్నాను. ఆ రాత్రి యింటర్నీ  చేస్తున్న నలుగురు విద్యార్ధులు కలిసి చిన్న  తమాషా చేశారు. వారిలో చలపతిరావు  అనే అతను  కాస్త  అమాయకంగా, మందకొడిగా వుంటాడు. అతను ఎంతకూ  ఆవేళ  కేసులు  రాకపోతే  చిరాకుపడి "నేను నిద్రపోతాగాని, కేసేమైనా  వస్తే  వెంటనే  "లేపండి" అని మిగతావారికి  వురమాయించి, అతను మంచంమీద పడుకుని  నిద్రకు  ఉపక్రమించాడు. అసిస్టెంట్ తన డ్యూటీ  రూమ్ లో పడుకుని నిద్రపోతోంది. మిగతా ముగ్గురూ  కలిసి సరదాగా  ఓ ఎత్తుగడ  వేశారు. లేబర్ రూమ్ లోని  మూడు టేబుల్సూ  ఖాళీగా  వున్నాయి. వారిలో  ఒకడు  లోపలకు  వెళ్ళి  ఒక టేబిల్ మీద ఎక్కి  ముసుగు కప్పుకుని  పడుకున్నాడు. మిగతా యిద్దరూ  గబగబ వచ్చి గాఢనిద్రలో వున్న  చలపతిరావును  హడావుడిగా లేపి "త్వరగా లే భాయీ ! కేసొకటి డెలివరీకి రెడీగా  వుంది. నువ్వు హ్యాండ్స్ వాష్ చేసుకుని  పద, నిన్నే చెయ్యమంటోంది  అసిస్టెంటు" అని  కంగారు పెట్టారు. రికార్డులో  ప్రతి విద్యార్దీ యిరవైకేసులు  చేసినట్లు  రాసి  చూపించాలి .చలపతిరావు ఉలిక్కిపడి  లేచి "ఆఁ, నన్ను చెయ్యమన్నదా ?" అని ఆదరా బాదరాగా  లోపలకు  పరిగెత్తాడు.

    నేను నవ్వబోతూంటే  నవ్వద్దని  సౌంజ్ఞలు  చేసి  వాళ్ళు కూడా  వెనకాలే లోపలకు వెళ్ళారు.

    చలపతిరావు  టేబిల్ దగ్గరకు  వెళ్ళి, 'ఊ, ఆ' అని మూలుగుతూన్న  ముసుగులోని  మనిషిని చూస్తూ "ఇదేమిటి ? లేబర్  రూమ్లోకి  వచ్చి  ముసుగు పెట్టుకుని  పడుకుంటూందే  యీవిడ ? ఏరీ ? సిస్టర్సెవరూ  కనిపించరేం? నాకు అసిస్ట్ చెయ్యటాని  కెవరూ  లేకపోతే  ఎలా ?" అని చికాకుపడి టేబిల్ మీద వ్యక్తితో  "చూడమ్మా, ముసుగులా వేసుకోకూడదు. నీకేం భయంలేదు. నేనున్నానుగా" అంటూ దుప్పటి లాగేశాడు.

    బల్లమీది  విద్యార్ధి  నవ్వుతూ  లేచి  కూర్చున్నాడు.

    ప్రక్కన  దాక్కుని  వినోదం  చూస్తున్న  సిస్టర్లూ ,మిగతా యిద్దరు విద్యార్ధులు గొల్లుమని  నవ్వారు. చలపతిరావుకు పాపం  ముఖం  కందగడ్డలా అయిపోయింది. వాళ్ళందర్నీ  తిడతాననుకున్నాను. కాని ఏమనుకున్నాడో, కోపం దిగమ్రింగి యివతలకు వచ్చి  వంటరిగా  కూర్చున్నాడు.

    ఈ విషయం అసిస్టెంటుకు  రిపోర్ట్ చేసి కసి తీర్చుకుంటాడేమోననుకున్నాను. కాని అదేమి చేయక ,ఎవరేమి అనుకుంటున్నా లెక్కచేయనట్లు  ముభావంగా  ఊరుకున్నాడు.

    తర్వాత యీ జోక్  హాస్పిటలంతా  వ్యాపించి చలపతిరావును చూసినప్పుడల్లా  ముఖాలు చాటు చేసుకుని నవ్వుకోసాగారు.

    నేను లేబర్ రూమ్ డ్యూటీలో వున్న రోజుల్లోనే  ఓ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఓ రాత్రి హఠాత్తుగా నలుగురు నర్సులు కలిసి క్వార్టర్స్  నుంచి  ఓ సిస్టర్ ని యించుమించు చేతులమీద తీసుకొచ్చినట్లు  తీసుకొచ్చారు. ఆ తీసుకురాబడిన  సిస్టర్ కి కళ్ళు  మూతలు  పడిపోయి  వచ్చే ప్రాణమా పోయే ప్రాణమా అన్నట్లుగా  వుంది.

    ఏమిటని  విచారిస్తే  ఆ సిస్టర్ కి నెలతప్పిందట. ఏమి చేయటానికి దిక్కుతోచని దశలో  తెగించి ఏ మందో మాకో తిన్నది. దాంతో గర్భస్రావం అసంపూర్తిగా జరిగి, రక్తం విపరీతంగా  పోయి  తెలివితప్పి  పడిపోతే మిగతా సిస్టర్లు చూసి  మోసుకొచ్చారు.

    ఇంతకీ ఆ సిస్టర్ లలిత. నేను మొదట ఫిమేల్ ఓ.పి. లో పని చేస్తున్నప్పుడు  మేల్ ఓ.పి.లో పనిచేస్తూ  మాతో సరదాగా  గడిపిన అమ్మాయి.

    అసిస్టెంట్ రుక్మిణి  వచ్చి  చూసి, పరీక్ష  చెయ్యటం  ముగిశాక "యిన్ కంప్లీట్ ఎబార్షన్ బాగా బ్లడ్ పోయింది. డి. ఎండ్ సి చెయ్యాలి. బ్లడ్ ట్రాన్స్ ఫ్యూషన్  యివ్వాల్సిన అవసరం వుందని తోస్తోంది. ఈ లోపల గ్రూపింగూ ,క్రాస్ మెచింగ్ అర్జంటు అని రాసి, వెంటనే  చేయించి, బ్లడ్ బాటిల్  సిద్ధంగా  వుంచమనండి" అని ఆపరేషన్ కి రెడీ చెయ్యమని చెప్పి చేతులు వాష్ చేసుకోవటానికి  వెళ్ళింది.

    ఏ పేషెంటుకు నెత్తురు యివ్వవలసిన  అవసరం  వచ్చినా హౌస్ సర్జన్ చెయ్యవలసిన బాధ్యతే  బ్లడ్ బ్యాంకికి వెడితే, ఆ గ్రూప్ బ్లడ్ లేదనటం, ఎవర్జన్సీ అయితే యివ్వటానికి ప్రయత్నిస్తాననటం, యీ గొడవలో హౌస్ సర్జన్ వార్డుకూ, బ్లడ్ బ్యాంకుకూ మధ్య పదిసార్లు  తిరగవలసిరావటం  పెద్ద తతంగం.

    లలితకు ఆపరేషన్ జరిగింది వార్డులోకి  తీసుకు వెళ్ళాక ఆమెకు నెత్తురుకూడా  ఎక్కించాం.

    అర్దరాత్రి మూడు  గంటలకు  ఆమె ఎలా  వుందో  చూడటానికి  వెళ్ళాను. ఆమె కూడా వచ్చిన సిస్టర్లంతా 
వెళ్ళిపోయారప్పటికి. రెండు చేతుల్లో  తల దాచుకుని  ఏడుస్తోంది లలిత.

    నాకు జాలి వేసింది. దగ్గరకు వెళ్ళి "సిస్టర్ !" అని పిలిచాను.

    ఆమె ముఖంమీద  నుంచి  చేతులు తీసి  నన్ను చూసి  వెక్కి వెక్కి ఏడుస్తూ  "నన్నెందుకు  బ్రతికించారు ? నన్ను  చూసి అంతా  నవ్వుకోవటానికా ?" అంది.

    నే నామెను ఓదార్చటానికి  ప్రయత్నిస్తూ, "ఊరుకోండి, సిస్టర్ ! మీరసలే చాలా వీక్ గా  వున్నారు. అట్లా అలిసిపోవటం  మంచిదికాదు !" అన్నాను.

    ఆమె నా మాటకు  సమాధానం చెప్పకుండా  అలాగే కాసేపు విలపించి, కొంచెం వున్నాక హఠాత్తుగా, "డాక్టర్, నాకో ఉపకారం చేస్తారా?" అంది.

    ప్రశ్నార్ధకంగా  చూశాను.

    "తెల్లవారటానికి  యింక అట్టే వ్యవధిలేదు, డాక్టర్ ! ఈ రాత్రికి రాత్రి నన్ను యిక్కడ నుంచి బయటికి పంపించి వేస్తారా ?"

    "తప్పు సిస్టర్ ! హాస్పిటల్ రూల్సు  మీకూ తెలుసు .మీరు  ఆలోచించటం మాని హాయిగా  నిద్రపోండి."

    ఆమె నా మాటలు  వినకుండా  అలాగే గుండెలు  పగిలేటట్లు  ఏడుస్తోంది. ఇహ అలా లాభం లేదనుకుని  ఓ గార్డినాల్ ఇంజక్షన్ చేసేసి అక్కణ్నుం  వెళ్ళిపోయాను.

    రెండు రోజులు పోయాక  అప్పుడే  ఓ ఫోర్ సెప్స్  వేసి  చేతులు కడుక్కుంటూంటే  నళిని నా దగ్గరకు వచ్చింది. ఆమె ముఖమంతా  పాలిపోయివుంది ,తెల్లగా.

    "అలా వున్నారేం ?" అనడిగాను.

    "లలితను సస్పెండ్ చేశారు" అంది.  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS