Previous Page Next Page 
మారణహోమం పేజి 25

   

    మర్నాడు సాయంత్రందాకా మళ్ళీ విశేషం ఏమీ జరగకుండానే గడిచిపోయింది.    
    చీకటి పడుతుండగా జరిగింది ఆ సంఘటన!    
    రాజు ప్రక్కన కూర్చుని పనిలో సాయం చేస్తోంది అమూల్య.    
    ఆమె అక్కడఉండిపోబోయే మనిషే గనుక పని నేర్చుకోవడం అవసరం అనుకుంటున్నారు వాళ్ళు.    
    వాళ్ళ కళ్ళలో దుమ్ము కొట్టడానికి వాళ్ళపనీ పద్దతులూ అన్నీ తెలుసుకోవడం అత్యవసరం అనుకుంటోంది తను. చేతికి దొరికిన ప్రతి ఫైలునీ, పరీక్షకెళ్ళబోయేముందు దొరికిన గెస్ పేపరుని చదివినంత దీక్షగా చదివేస్తోంది. చదివినది వృధా పోవడంలేదు. వాళ్ళ తాలూకు చిన్నచిన్న రహస్యాలు బయటపడిపోతూనే ఉన్నాయి. కంప్యూటర్ మెమొరీలో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసి పెట్టుకున్నట్లు ఒక అక్షరం పొల్లుపోకుండా అవన్నీ గుర్తు పెట్టుకుంటోంది అమూల్య.    
    నిఖిల్ వచ్చాడు ఆఫీసులోకి. రాజు చెప్పిన వివరాలు యధాలాపంగా విన్నాడు. వెంటనే జేన్ ని పిలిచి డిక్టేషన్ ఇవ్వడం మొదలెట్టాడు.    
    చెవులురిక్కించి వింటోంది అమూల్య. అతను చెబుతున్న డిక్టేషన్ ఏదో కోడ్ లాంగ్వేజ్ లా ఉంది. క్లూ ఏమన్నా దొరుకుతుందేమోనని ఆలోచిస్తోంది తను.
    చెప్పడం పూర్తిచేశాక నిఖిల్ విసుగ్గా అన్నాడు. "ఇంక ఈ కోడ్ పాతదయిపోయింది. రేపటినుంచి త్రీ ఎక్స్ కోడ్ ఉపయోగించండి. ఆ తరుణ్ వచ్చాక ఏ రహస్యమూ ఎక్కువరోజులు దాగడంలేదు. ఇంకొన్నాళ్ళుపోతే ప్రతిరోజూ కోడ్ మార్చవలసి వస్తుందనుకొంటాను."
    ఫోన్ మోగింది. రాజు అందుకుని విన్నాడు. వెంటనే అతని ముఖకవళికలు మారిపోయాయి. ఫోన్ నిఖిల్ కి అందించాడు.    
    నిఖిల్ ఒక్క నిమిషంసేపు మౌనంగా విని "లోపలికి పంపు!" అన్నాడు క్లుప్తంగా.    
    అయిదు నిమిషాల తరువాత అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వచ్చింది రాధ. ఆమె జడ వీడిపోయి ఉంది. చీరెముడి వీడిపోయి జారిపోయి ఉండడం కూడా గమనించేస్థితిలో లేదు తను. కళ్ళు వాచిపోయి ఉన్నాయి.    
    "ఏమయింది?" అన్నాడు నిఖిల్ నిదానంగా.    
    "నన్ను ఇంట్లోనుంచి వెళ్ళగొట్టేశారు." అంది వెక్కిళ్ళమధ్య.    
    "ఎవరు?"    
    "పిన్ని - నా సవతితల్లి."
    "ఎందుకుట?"    
    "మీరు నన్ను ఎత్తుకెళ్ళి చెడగొట్టేశారుట! నేను ఇంట్లో ఉంటే నా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు కావుట! అందుకని మీ దగ్గరికే వెళ్ళిపొమ్మని నన్ను తరిమేసింది."    
    "మీ నాన్నగారేం అన్నారు?"    
    "ఆయన ఆఫీసులో ఆఫీసరుకీ, ఇంట్లో పిన్నికీ భయపడిపోతారు. అందుకని నోరెత్తలేకపోయారు అలవాటుగానే!"
    ఒకసారి జాలిగా ఆమెవైపు చూసి, "మరేం చెయ్యదలుచుకున్నావ్!" అన్నాడు నిఖిల్. నా బతుకు ఎలాగూ పాడయిపోయింది. అందుకని మీ దగ్గరే ఉండిపోతాను. మీరేం చెయ్యమంటే అది చేస్తాను. దిక్కు లేదు నాకు. మీరుకూడా వెళ్ళిపొమ్మంటే టాంక్ బండ్ లో దూకేసి చచ్చిపోతాను" పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది రాధ.    
    "రాధా!" అన్నాడు నిఖిల్ మృదువుగా. అతని గొంతులో మామూలుగా వుండే కటుత్వం ఇప్పుడు వినబడడం లేదు. "నీకు నేను తోడుంటాను. నీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డం! సరేనా! ఈ లోకం ఎంత గుడ్డిదో నీకుకూడా అర్ధం అయిందా! ఒప్పుని తప్పుగా, తప్పుని ఒప్పుగా చూపగలశక్తి దీనికొక్కదానికే ఉంది! ఈ లోకం ఉత్త చెవిటి మాలోకం రాధా! సగమే విని, ఆ సగంలో సగాన్ని మాత్రమే అర్ధం చేసుకొని మిగతా సగాన్ని అపార్ధం చేసుకునే వెర్రిమాలోకం ఇది! నువ్వేం భయపడకు! నెత్తిమీద రూపాయి పెట్టి అమ్మితే అర్ధరూపాయికి అమ్ముడుపోని ఈ మనుషులని చూసి నువ్వు భయపడనక్కర్లేదు. వీళ్ళు పెట్టిన నియమాలు, నీతులూ నువ్వు పాటించనక్కర్లేదు. మాతో ఉండిపో! కొత్త సమాజం, కొత్త సొసైటీ స్థాపిస్తాం మనం. అక్కడ మంచి అంటే ఒంటికాలిమీద లేస్తూ చెడు కనబడితే నంగినంగిగా మాట్లాడి, వంగివంగి దణ్ణాలు పెడుతూ వెన్నెముకలేని బతుకులు బతికే ఈ మనుషులెవ్వరూ ఉండరు. అందరం సర్వ సమానంగా అందరం సర్వ స్వతంత్రంగా అందరం సర్వ సుఖాలు అనుభవిస్తూ ఉంటాం.    
    ఉండిపో రాధా! ఉండిపో ఇక్కడ! వెల్ కమ్ టూ ద గ్యాంగ్!"    
    సజల నయనాలతో అతన్ని చూస్తూ తల ఊపింది రాధ.    
    కళ్ళార్పకుండా ఇదంతా చూస్తోంది అమూల్య. ఇతనిది భస్మాసుర హస్తమా ఏమిటి? ఇతను ఎవరిని తాకితే వాళ్ళ జీవితం నిలువునా తగలబడి పోతుందా?    
    సరిగ్గా తను ఉన్న అవస్థలోకే వచ్చింది ఈ అమ్మాయికూడా! చిత్రంగా ఉంది!    
    ఇప్పుడీ దీన జనోద్దారకుడు ఏం చేస్తాడు? "నిన్ను కూడా పెళ్ళిచేసేసుకుంటా!" అంటాడా ఈ అమ్మాయితో. ఉదారంగా అన్నా అంటాడు. రాబిన్ హుడ్ కి రెండో భార్య ఉండకూడదని రూలా ఏమిటి.    
    మనసులోనే చులకనగా నవ్వుకుంది.    
    ఆ మనుషుల మధ్య ఉంటే ఎగ్జయిట్ మెంట్ కి కొదవేమీ ఉండదని ఆ రాత్రికి మరోసారి రుజువైంది అమూల్యకి.    
    అర్ధరాత్రి అవుతుండగా -    
    అప్పుడప్పుడే నిద్ర పడుతోంది అమూల్యకి. ఇంతలో గందరగోళంగా మాటలు వినబడ్డాయి. మనుషులు గబగబ నడుస్తున్న చప్పుడు. కొద్ది క్షణాల్లో అందరూ ఒకచోట చేరారు.    
    తను కూడా వెళ్ళింది అమూల్య. ఆమె వెనకే రాధకూడా వచ్చింది. రెండు ప్లస్ మార్కు బ్యాండేజెస్ కనబడుతున్నాయి రాధ మొహంమీద.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS