Previous Page Next Page 
సౌందర్య దీపం - 2 పేజి 25


    వదినకూడా జాగ్రత్త పడుతుంది తన విషయంలో. ఆమె చెప్పిన సంబంధం ఏదో చేసేసుకుంటే అతనిమాటే ఉండదు తన ప్రాణం హాయిగా ఉంటుంది.


    ఇంద్రసేన ఆలోచిస్తూ అలా ఉండిపోయింది.


    ఎంత వద్దనుకున్నా అవే ఆలోచనలు.


    అప్పుడే అంబిక హాస్పిటల్ నుండి యింటికి వచ్చింది.


    వస్తూనే ఇందు ఏం పని చేస్తుంది, ఒక్కర్తే ఉందని ఆమె గదిలోకి వచ్చింది.


    "ఇందు ఏం చేస్తున్నావమ్మా" అంటూ.


    తలతిప్పి వదినవైపు చూసింది.


    "ఇందూ అలా పడుకున్నావేం!" అంటూ దగ్గరకు వచ్చింది.


    ఆమె వైపుచూసి తలతిప్పేసుకుంది.


    ఇంద్రసేనకు దుఃఖం ఆగటంలేదు.


    "ఏమిటమ్మా అలా పడుకున్నావ్?" మంచంమీద కూర్చుంటూ తలపై చెయ్యివేసి నిమిరింది.


    అంతే ఆమెకు దుఃఖం ఆగలేదు.


    వదినను పట్టుకుని "వదినా!" అంటూ బావురుమంటూ ఏడ్చేసింది.


    "అరే! ఏమిటిది! ఏమైంది?" అంబిక కంగారుగా అడిగింది.


    ఇందు వెక్కి వెక్కి ఏడ్వసాగింది.


    "ఇందూ! ఇందు! ఏం జరిగింది? నిన్ను ఎవరైనా ఏమన్నా అన్నారా, చెప్పమ్మా!"


    "అరే అలా ఏడుస్తావేమిటి!"


    "నువ్వు ఏదీ చెప్పకపోతే నాకు ఏం తెలుస్తుంది!"


    "వదినా" ఆమెకు మాట రావటం లేదు.


    ఏమిటమ్మా?" బుజ్జగిస్తున్నట్లుగా అడిగింది.


    "మరి.... మరి...." ఆమె వెక్కిళ్ళ మధ్య అంది.


    అంబిక కనుబొమ్మలు ప్రశ్నార్ధకంగా ముడుచుకున్నాయి. తను యింటివద్ద లేదు. అత్తగారు మామగారు ఆయనా ఎవరూ యింటివద్దలేరు.


    ఇందు ఒక్కర్తె ఉంది.


    ఒకవేళ కృష్ణమౌళిగాని ఫోన్ చేశాడా!


    ఫోన్ చేసి ఇందు మనసు కష్టబెట్టుకునేటట్లుగాని మాట్లాడేడా?


    అసలు ఏం చెప్పటంలేదుకదా!


    "ఇందూ! ఏమిటమ్మా నాకు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది! కృష్ణమౌళిగాని ఫోన్ చేశాడా?"


    "ఫోన్ చెయ్యడం కాదు" అంది దుఃఖంతో పూడుకుపోయింది ఆమె కంఠస్వరం.


    "మరి!"


    "అతను సరాసరి యింటికి వచ్చేశాడు" అంది కన్నీళ్ళతో.


    "ఆ యింటికి వచ్చాడా?" ఆశ్చర్యంగా తెల్లబోయినట్టుగా చూసింది.


    "అవును వదినా యింటికే వచ్చేశాడు. తిన్నగా నా గదిలోకి వచ్చి...." అంటూ మళ్ళీ చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్వసాగింది.


    "ఆ" అంబిక క్షణంసేపు ఊపిరి బిగబట్టి అలా ఉండిపోయింది.


    పెళ్ళికానిపిల్ల ఒంటరిగా ఉంది. అతను అసలే మంచివాడు కాదు. తనలో తాను అనుకుంటూ ఆ మాటలుపైకే అనేసింది.


    ఇంద్రసేన మాట్లాడలేదు.


    నవ్వి "ఏమన్నాడు!" అడిగింది.


    "నన్ను ఎంత అవమానించాలో అంత అవమానించాడు. ఆ మాటలు అతని ప్రవర్తన నేను తల్చుకు భరించలేక పోతున్నాను" అంది.


    "అంటే నిన్ను ఏం చెయ్యలేదుకదా? పెళ్ళి కావలసిన పిల్లవు. అతను మంచివాడు కాదు. అదీ నా భయం" అంది అంబిక భయంగా చూస్తూ.


    "అతని మనసులో ఏ ఉద్దేశం ఉందో ఏమనుకొని ఈ యింటికి వచ్చాడోకాని నన్ను చూసి నా కోపంచూసి కాస్త తగ్గాడు. అంత సాహసం చెయ్యలేకపోయాడు. కాని.... ఎన్నిమాటలు అన్నాడు వదినా" అంది ఏడుస్తూనే.


    ఆ మాట వినగానే అంబిక తేలిగ్గా నిట్టూర్చింది.


    "ఏమన్నాడు!"


    "నన్నుఎలా అయినా పెళ్ళి చేసుకోవాలని పంతంపట్టి కూర్చున్నాడు. అతని మాటలు వింటుంటే నాకేదో భయంగా ఉంది. ఏ మత్తు మందో జల్లి తీసుకుపోతాడు అనిపిస్తుంది"


    అంబిక మాట్లాడలేదు. సీరియస్ గా ఏదో ఆలోచిస్తూ కూర్చుంది.


    "వదినా ఈ విషయం మనం దాస్తే చాలావరకు వెళుతుంది. ముందు ఈ సంగతి అన్నయ్యకు, నాన్నగార్కి చెప్పేద్దాం" అంది ఆవేశంగా.


    ఆ మాటతో అంబిక ఉలిక్కిపడింది.


    "ఎవరికి చెపుతావు?" అడిగింది.


    "అన్నయ్యకు, నాన్నగార్కి."


    "చెప్తే వాళ్ళు ఏం చెయ్యగలరు అనుకుంటున్నావు!"


    "అతని ప్రాణాలు తీస్తారు" కసిగా, కోపంగా ఒక్కో అక్షరం నొక్కి పలుకుతూ అంది.


    "చంపేస్తారు సరే ఆ తరువాత!" అడిగింది సూటిగా.


    ఇంద్రసేన ఆమెవైపు అయోమయంగా చూసింది అర్ధంకాని దానిలా.


    "అతన్ని చంపేస్తారు. మన కసి, కోపం చల్లారిపోతాయి సరే. అప్పుడు చట్టం ఏం చేస్తుంది" అడిగింది.


    తృళ్ళిపడినట్టుగా చూసింది ఇందూ.


    "ఒకరి ప్రాణాలు తియ్యడానికి మనకి హక్కు, అధికారం లేదు. చట్టం వెయ్యికళ్ళతో వేటాడి మరీ తరిమి తరిమి చివరకు పట్టుకుంటుంది. శిక్షకు శిక్ష విధిస్తుంది. ఆ శిక్ష నీ తండ్రికి, నీ అన్నయ్యకు పడితే అప్పుడు నువ్వు ఏమవుతావు! నువ్వు తట్టుకోగలవా?" అడిగింది సూటిగా.


    ఇందూ తలవంచేసింది. తను అంతదూరము ఆలోచించలేదు. కసితో కోపంగా, ఆవేశంగా అనేసింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS