"నీకు తగిలిన దెబ్బ గురించి చెప్పవేం ? ఎలా వుందిప్పుడు ?"
"బాగానే వుంది మృదులా ! ఏ బాధాలేదిప్పుడు."
"హమ్మయ్య ! నా మనసు శాంతించింది" అని హాస్యమూ, గంభీరమూ మిళితమైన ముఖ కవళికలు ప్రదర్శించింది. వ్రేళ్ళతో నా మంచం మీది దుప్పటి సవరిస్తోంది. తెల్లటి దుప్పటిమీద తెల్లని పాదరసదీపకాంతిలో తెల్లగా మెరిసే ఆమె చేతివ్రేళ్ళు చూస్తూ మెదలకుండా పడుకున్నాను.
తల వంచుకుని కొంచెంసేపు ఏదో ఆలోచిస్తూన్నట్లు ఊరుకుని "చెప్పు" అని, నా కేమనటానికీ తోచక, అనేసరికి ముఖంయెత్తి "చెప్పనా? ఏమిటి ?" అంది.
"నీ యిష్టం"
"అలాకాదు, చూడు. నేనీ రూముకురావటం నాకిదే తొలిసారి అన్న సత్యం నీకు స్పురించిందా ?"
నేను తికమకపడి "ఎందుకు స్పురించదు...." అని అంటూండగా.
"మరైతే ఎప్పుడూ వచ్చేమనిషిని ట్రీట్ చేసినట్లు చేస్తావేం ? ఎలా వుంది నా గది అని అడగాలి. బిస్కెట్లూ, కాఫీ వగైరాలు సప్లయిచేయాలి. ఏం ? మాట్లాడవేం ? ఊ....? బాగానే వుంది నీ గది. మంచిగాలి, సౌకర్యాలూ....నీ రూమ్ మేటు ప్రభాకరంకాదూ ! కనిపించడేం ? సాయంత్రాలు గదిలో వుండటం అతనికి చిన్న తనమా ఏమిటి ?" జవాబివ్వటానికి సందివ్వకుండా గడగడ మాట్లాడేసింది మృదుల.
"సినిమాకు వెళ్ళాడేమో" అన్నాను.
"ఒక్కడే వెళ్ళాడా ? జతగా వెళ్ళాడా, ఏ నర్సునైనా తీసుకుని."
"ఛ ! అలా మాట్లాడకూడదు మృదులా !"
"ఏం ? అంతా విడ్డూరంగా చెప్పుకుంటూంటే లేదుగాని, నేనంటే వచ్చిందేమిటి ? అతన్ని గురించి అంతా ఎంత విపరీతంగా చెప్పుకుంటారో తెలుసా ? నర్సులతో తిరుగుతాడనీ ,వాళ్ళ నెక్క డెక్కడికో తీసుకు వెడతాడనీ....అంత విచ్చలవిడిగా తిరక్కపోతేనేం ?"
"అతని పర్సనల్ విషయాలు నాకు తెలియవుమరి !"
"తెలిస్తే మట్టుకు నీవు చెబుతావా ఏం ? నీకు మహా గుట్టు" అంది రెట్టిస్తూ.
మళ్ళీ తనే "నాకేం తెలుసుకోవాలని కుతూహలంలేదు. నీవెంత లోతైన మనిషివో తెలుసుకుందామని అడిగాను. అంతే !" అంది.
తర్వాత మృదుల మరో పదినిముషాల సేపు కూర్చుని, కబుర్లు చెప్పి "నేనింక వెడతానుబాబూ ! ఆకలేస్తూంది. నీకేం ? ఉపవాసాలే నీ జీవిత పరమార్ధం" అంటూ లేచి గుమ్మందాకా వెళ్ళి, "అన్నట్లు ఇది విన్నారా ? డాక్టరు కామేశ్వరిగారికి జబ్బుచేసిందిట" అంది, వెనుదిరిగి.
నేను ఉలికిపడి "కామేశ్వరిగారికా ? ఏమిటి సుస్తీ ?" అన్నాను.
"అదింకా తెలియదు. మొన్న విపరీతమైన వెన్నుపోటు వచ్చి గిలగిలలాడిపోయిందిట. మంచంమీద నుంచి కూడా లేవలేక పోతోంది ఇది వరకటి నుంచీ కూడా అప్పుడప్పుడూ వెన్నులో నొప్పి వస్తూ ఉంటుందని చెప్పి యాంటీరుమాటిక్ టాబ్లెట్లు తీసుకుంటూ ఉండేదిట. మన సూపరింటెండెంట్, ఇంకా సర్జరీ రాఘవన్ గారు కూడా కలిసి చూస్తూ యిన్ వెస్టిగేషన్స్ చేయిస్తున్నారు. నీకు తెలియలేదా ?"
"ఉహు ! నీ ద్వారానే నేను తెలియలేదా ?"
"పాపం చాలా బాధపడుతోందిట ! అంత ఉత్తమురాలైన లేడీ డాక్టర్ని నేను చూడలేదు" అని మృదుల విచారం వెలిబుచ్చి "వీలు చూసుకుని ఒకసారి వెళ్ళి చూసి వద్దాం" అని చెప్పి వెళ్ళిపోయింది.
నా మనసంతా వికలమై పోయినట్లయింది, వేదాంత స్వరూపిణిలా గోచరించే డాక్టర్ కామేశ్వరిగారి రూపమే నా కళ్ళెదుట సాక్షాత్కరించింది. నా మనసులో ఏదో పాడు అనుమానం పొడసూపింది. ఆ అనుమానాన్ని బలవత్తరంగా అవతలకు నెట్టివేస్తూ ,మనస్సుని నిర్మలంగా వుంచుకోవటానికి ప్రయత్నించాను.
ఆ రాత్రి చాలా సేపటివరకూ నిద్రపట్టలేదు.
* * *
తర్వాత కొన్నాళ్ళకు సర్జికల్ పోస్టింగ్ అయిపోయి గైనిక్ వార్డుకు వచ్చాను. రంగయ్యగారిదంతా వింత ప్రవృత్తి. మే మిరువురం కలిసి ఎన్నోసార్లు రాత్రుళ్ళు రౌండ్స్ చేశాము ఒకసారి ఆయన కుమారుడి కోసం పోలియో వాక్సిన్ ఎక్కడనుంచో లారీలో తెప్పించుకుంటూ, ఆ లారీ కంపెనీ ఏదో సరిగ్గా తెలుసుకోకపోతే ఊళ్ళో వున్న లారీ కంపెనీలన్నీ ఆయన కారులో తిరిగి, చివరికి సాధించాం. ఇంత సన్నిహితంగా సంచరించినా నా పేరైనా ఆయనకు తెలుసో తెలియదో అనుమానమే ఇతరుల గురించి అంత పట్టించుకోకుండా వుంటారు.
ఒకసారి మాత్రం ఆయన నన్ను చిన్నమాట అనటం సంభవించింది. ఒక పోలీస్ కేసుకు ఆపరేషన్ చేశాక చాలా కాంప్లికేషన్సు వచ్చి చావుబ్రతుకుల్లో వున్నాడు. ఎప్పటిలాగానే రంగయ్యగారు అతని బెడ్ దగ్గరే పీఠం వేసుకు కూర్చుని అతన్ని బ్రతికించటానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు.
ఉన్నట్లుండి నన్ను దగ్గరకు పిలిచి "నిన్న బ్లడ్ యూరియాకు పంపించమన్నాను, రిపోర్ట్ వచ్చిందా ?" అని అడిగారు.
ఆయన నిన్న నా కా విషయం చెప్పలేదు. అయినా అట్లా అని బయటకు చెప్పక "పంపించలేదండి" అన్నాను, తల వంచుకుని.
"ఏం ? ఎందుకు పంపించలేదు ? అసలు కేసిలా సీరియస్ టరన్ తీసుకున్నప్పుడు ఆ విషయం మీకే తట్టాలి. తట్టకపోయినా, నేను చెప్పినప్పటికీ పంపించకపోవటం క్షంతవ్యం కాదు" అన్నారు.
నేనేం మాట్లాడలేదు. మనసులో చెప్పరాని బాధ కలిగింది. మూడు నాలుగు రోజులవరకూ ఆ బాధ చెరిగి పోలేదు.
గైనిక్ వార్డులోకి వచ్చాక రెండు మూడు రోజులవరకూ ఏ పనీ లేనట్లనిపించి కొత్తగా వుండేది. గైనిక్, యాంటీనేటల్ అంతా కలిపి మొత్తం పద్దెనిమిది హౌస్ సర్జన్లు వుండేవారు, డాక్టర్లు ఎక్కువ. పని తక్కువ. ప్రతివారూ ఆపరేషన్ అవకాశాలకోసమని ఓపిగ్గా కాచుకుని కూర్చునేవారు. ఎక్కువగా స్టైరిలైజేషన్, డి ఎండ్ సి _ యీ రెంటికీ అవకాశముండేది. మిగతా వాటికి అసిస్ట్ చేయటమే.
ఓ.పి.లో పని చేసేటప్పుడయితే ఓ.పి. చీటి తీసుకుని ప్రక్కన నిల్చోవటం, అసిస్టెంట్ పి.వి. చేసి డిక్టేట్ చేస్తూన్న ఫైండింగ్స్ గబగబ రాయటం ,లేకపోతే యాంటినేటల్ ఓ.పి. అయితే కడుపు నొక్కి ఎన్నో నెలో చూడటం, బి.పి. చూడటం _ యిదీ హౌస్ సర్జన్ పని.
కొంతమంది అసిస్టెంట్లు "డాక్టర్ ! ఎంతసేపూ మేము చెప్పే పైండింగ్సే రాసుకుంటూ పోతే మీకు పి.వి. చెయ్యట మెలా వస్తుంది ? మీరు కూడా చెయ్యాలి. రేపు ఏ.పి. హెచ్.సి. లోనో ఉద్యోగంలో చేరితే ఆ పల్లెటూరి హాస్పిటల్ లో మీకు సలహాలు చెప్పేవారెవరుంటారు ? మీకు మీరే సర్వాధికారి. అన్నీ మీరే దయాగ్నైజ్ చేసుకుని ప్రొసీడ్ అవాలి రండి పి.వి. చేసి మీ ఫైండింగ్స్ చెప్పండి" అనేశారు.
పాపం కొంతమంది ఆడవాళ్ళు సిగ్గుపడేవాళ్ళు. అయినా గవర్నమెంటు ఆసుపత్రిలో ఉచిత వైద్య సౌకర్యం పొందాలంటే యివన్నీ భరించక తప్పదు. ఒక స్త్రీ పరీక్ష చేయించుకోవాలంటే ఎదురుగా పదిమంది నిలబడతారు. ఒక ఆడది ప్రసవిస్తూంటే అది గమనిస్తూ చుట్టూ యిరవైమంది. ఇష్టపడాలి. తప్పదు.
ఒకసారి అసిస్టెంట్ సుశీలగారు రౌండ్స్ కు వచ్చేసరికి నేను కేసు షీటు పూర్తిచేస్తూ కనిపించాను. మిగతా వాళ్ళంతా ఏమయ్యారని ఒక్కొక్కరి గురించి పేరు పేరునా అడిగింది.
"కాఫీకి వెళ్ళారనుకుంటాను మేడమ్" అన్నాను.
"అంతా ఒక్కసారి కట్టకట్టుకునా ? వార్డు ఏమైపోవాలి ? సరే రేపు థియేటర్ రోజు కదూ మిగతా వాళ్ళెవరికీ ఛాన్స్ యిచ్చేదిలేదు. మీరు ఉదయం ఎనిమిదికల్లా వచ్చేసి సిద్ధంగా వుండండి" అంది.
అలాగే మరునాడు ఎనిమిది గంటలకల్లా థియేటర్ డ్రెస్ వేసుకుని లోపలికి వెళ్ళాను. ఆ వెళ్ళటం మధ్యాహ్నం వొంటిగంట వరకూ బయటకు రావటం పడలేదు .నాలుగు డి ఎండ్ సి ఆపరేషన్లూ, రెండు స్టెరిలైజేషన్లూ నాతో దగ్గరుండి చేయించింది సుశీలగారు. ఎనన్దటిస్ట్ రాధారాణిగారికి కన్నెర్ర పుట్టిందేమో. "ఏమిటి మేడమ్! అన్నీ ఇతన్తోనే చేయించారు. ఒక్క ఛాన్సుకూడా రానివాళ్ళు యింకెంత మందో వున్నారు" అని మధ్యలో వారించటానికి ప్రయత్నించింది.
"నో! నో!! మీకు తెలీదు రాధారాణీ! నిన్న మధ్యాహ్నం వార్డుకు వెళ్ళేసరికి ఒక్కరూ లేరు. అంతాపోయి కేంటిన్ లో కూర్చున్నారట. అంత శ్రద్ధలేకుండా వున్న వాళ్ళేమి నేర్చుకుంటారు ? వాళ్ళీవేళ సఫర్ అవాల్సిందే. అందుకే ఒక్కర్ని కూడా లోపలకు రావద్దన్నాను" అంది సుశీల గారు. ఆమెకు వాళ్ళమీద యింకా కోపం తగ్గనట్లులేదు.
నా పని చచ్చిన చావుగా వుంది. థియేటర్ లో బిగించి వుంచినట్టున్న ఆ వాతావరణంలో ఉక్కిరి బిక్కిరి అయినట్లుగా వుంది. బయటకు వెళ్ళాక నన్ను గురించి మిగతా వారంతా ఏమనుకుంటారు ? ఇదంతా కావాలని చేశా రనుకోరూ ?
అలాగే జరిగింది కూడా. కొందరు ప్రత్యక్షం గానూ, కొందరు పరోక్షంగానూ నన్ను వెటకారం చేశారు. ఇందులో నేను చేసిన తప్పేమీ లేదని సమర్ధించుకుని బాధపడకుండా వుండటానికి ప్రయత్నించాను.
మా హాస్పిటల్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్ధులు లేరు కాబట్టి కొంతవరకూ నయమే. వచ్చిన కాసిని అవకాశాలనూ వారు గ్రద్దలా తన్నుకుపోతారు. పోతే సీనియర్ హౌస్ సర్జన్లు వున్నారు అక్కడక్కడ. హౌస్ సర్జన్ గా చేసి సంవత్సర కాలమూ అయిపోయాక తమకు అభిరుచి వున్న శాఖలలో పొడిగిస్తారు. వారి బెడద రెగ్యులర్ హౌస్ సర్జన్ కు కొంచెం ఎక్కువగానే వుంటుంది. ఒక్కో వార్డులో రెండు నెలలకంటే ఎక్కువ వుండరు కదా వాళ్ళు. ఆ కాస్త కాల వ్యవధిలో వచ్చే కొద్దిపాటి సర్జరీ అవకాశాలనూ సగం వాళ్ళు కబళించి వేస్తూ వుంటారు.
కామేశ్వరిగారు లేచి గైనిక్ వార్డు కళావిహీనంగా కనిపించేది. మృదుల, తర్వాత కొన్నాళ్ళకు వివరాలన్నీ కనుక్కొచ్చి నాకు చెప్పింది. ఆమె మంచాన పడిపోయి విపరీతమైన వెన్ను పోటుతో బాధపడుతూంటే కారణం కనుక్కోలేక మా హాస్పిటల్ లోని కొమ్ములు తిరిగిన డాక్టర్లందరూ సతమత మయారుట. ఎక్స్ రే తీస్తే వెన్నుపూసలో సెకండరీస్ వున్నాయి. బాధకు కారణం తెలిసింది. అయితే వాటి పుట్టుకకు కారణమైన ప్రైమరీ ఎక్కడ ? కారణం పోల్చుకోలేక వాళ్ళు తల బట్టలు కొట్టుకున్నారట రెండు రోజులు.
వారి అవస్థ చూసి కామేశ్వరిగారు నవ్విందట. ఆఖరికి 'ఎందుకలా బాధ పడతారు ? నాకు బ్రెస్ట్ కేన్సర్. ఇహ నన్నువొదిలి దయ వుంచి మీరంతా వెళ్ళిపోండి. మీకు పుణ్యముంటుంది" అన్నదిట.
