Previous Page Next Page 
రాజ హంస పేజి 25

 

    "దిలీప్! దిలీప్! నన్నెందుకిలా పిచ్చిదాన్ని చేసేస్తున్నావు? అసలెందుకు కనిపించావు నాకు?"
    మరో పదిహేను రోజులు గడిచి పోయాయి. దిలీప్ రాలేదు. అతని దగ్గర్నుంచి ఉత్తరం కూడా రాలేదు. తాను రాసినా జవాబు రాలేదు. అసలేక్కడున్నాడో తెలియటం లేదు.
    "దిలీప్! దిలీప్ అని ఆమె హృదయం ఆక్రోశిస్తూన్నది.
    ఓ సాయంత్రం ఆరుగంటల వేళ ఊర్వశి కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది.
    రాజహంస స్నానం చెయ్యకుండా మాములు దుస్తులతో ఫేము కుర్చీలో కూర్చుని పరధ్యానంలో మునిగి వుంది.
    అలికిడి విని తల పైకెత్తి "రా ఊర్వశి" అంది.
    'అదేం? అలాగే వుండి పోయావేం స్నానం చేసి డ్రెసప్ అవకుండా"
    "దేనికి?"
    "నీకు యిన్విటేషన్ రాలేదా? అనుపమలో రాగదీప్ వాళ్ళు ఏర్పాటు చేసిన గెట్ టు గెదర్ కి"
    "యిన్వి'టేషన్ వొచ్చింది. కాని రావాలని యింటరెస్ట్ అనిపించటం లేదు.'
    "ఎందుకని?"
    రాజహంస ఏదో చెప్పబోయి మళ్ళీ తటపటాయించి "ఏమో తెలీదు" అంది.
    'అర్ధమయిందిలే' అన్నట్లు నవ్వి , ఆమె తల దగ్గరకు వంగి చాలా చిన్నగా "దిలీప్ వచ్చాడు" అంది.
    ఒక్కసారిగా ఒళ్ళంతా పులకింత కళ్ళలో వింత మెరుపు.
    'అవును, యిందాక ఫోన్ చేశాడు. నిన్ను తప్పకుండా తీసుకు రమ్మన్నాడు. ప్లీజ్ హర్రేయప్"
    రాజహంస లేచి లేడిలా పరిగెత్తింది. ఇరవై నిమిషాల్లో స్నానం చెయ్యటం నీట్ గా డ్రస్ చేసుకోవటం చలాకీగా పూర్తీ చేసి ఊర్వశి ప్రక్కన కారులో కూర్చుంది.
    
    
                                                         *    *    *

    అతిధులందరి చేతుల్లో ప్లేట్లున్నాయి. వాటిలో వున్నస్వీటూ, క్యాజూ తింటూ అటూ ఇటూ కదులుతూ మాట్లాడు కుంటున్నారు.
    కాన్ఫరెన్స్ హాల్లోకి ప్రవేశించగానే వాళ్ళిద్దరి చేతుల్లో కూడా సప్లయిర్స్ తీసుకొచ్చి ప్లేట్లు వుంచారు.
    యాంత్రికంగా అందుకుని కళ్ళతో హాలంతా వెదుకుతోంది.
    ఎక్కడ?
    ఇంతలో ప్రక్కనుంచి భుజం మీద చెయ్యి బడే సరికి తలత్రిప్పి చూసింది.
    ఒక్కసారిగా లోపల్నుంచి భావతరంగాలు ఉబికి వచ్చాయి. ఏదో అందామని పెదవులు కదలబోయి అలిగి నట్టుగా ఆగిపోయాయి.
    "రాజా!"
    ముఖం ప్రక్కకి త్రిప్పుకుంది.
    "రాజూ!"
    "నువ్వు...." అంటూ అతని కేసి తిరిగింది. విసురుగానే అందామనుకుని చేతగాక మృదువుగా "నువ్వు నన్ను మోసం చేశావు' అనగలిగింది.
    "మోసమా? నీ విషయంలో నాకు చేతకానిదేమయినా వుంటే అదే"
    ఆమెకు గర్వం కలిగింది. అవునా?" అనుకుంటూ అతని ముఖంలోకి చూసింది. అమాయకంగా, సుకుమారంగా పసితనం వుట్టి'పడుతుంది. ఇతను తనని మోసం చెయ్యలేడు. అతని కళ్ళలో తొణికిసలాడుతూన్న ప్ర్రేమ చూస్తే అతనికా శక్తి లేదని అర్ధమవుతుంది.
    "మరి?"
    "ఇంతమందిలో చెప్పనా?"
    'అలా నడుద్దాం."
    ఇద్దరూ చేతుల్లో ప్లేట్లు ఉంచుకునే హాల్లోంచి బయటకు - డాబాలో కొచ్చారు.
    ఇప్పుడు ఏకాంతం.
    "రాజా!"
    ఈ పిలుపు ....ఆమె హృదయం చలించింది. తలెత్తి అతని ముఖంలోకి చూసింది.
    "నీ దగ్గర కోస్తేనే.....మనిద్దరి మధ్యా జ్వలించే ఈ ప్రేమాగ్ని లోని ఉద్రిక్తతకు భయపడే నావల్ల నీకు శాంతి లేకుండా పోతుందనీ , నీ జీవితం పాడవుతుందని భయపడే నీకు దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఇన్నాళ్ళూ రాలేదు. నన్ను నేను ప్రశ్నించుకుంటూ దూరంగానే వుండిపోయాను. కాని చివరకు రాకుండా ఉండలేకపోయాను."
    అతని మాటల్లోని నిజాయితీ, ఆర్ద్రత ఆమెను కదిలించింది.

    
                                                          *    *    *

    రాత్రి తొమ్మిది దాటింది.
    ఎపార్టుమెంటు డోర్ లాక్ తీసి దిలీప్ లోపల కడుగు పెట్టాడు. బయటనే బజర్ ప్రక్కన వున్నా మాస్టర్ స్వేచ్ నొక్కడం వల్ల లైట్లు వెలుగుతున్నాయి.   
    రాజహంస అతని వెనకనే నడిచింది.
    డోర్  వేసేశాడు.
    'అంతమంది మధ్య నీతో ఫ్రీగా మాట్లాడలేక పోయాను దిలీప్ నేను అర్ధం పర్ధం లేని జీవితంలో ఇరుక్కుపోయి వున్నాను. నన్నా ఊబి లోంచి బయటకు లాగు."
    ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి.
    రెండు చేతులూ ఆమె చుట్టూ వేసి దగ్గరకు లాక్కున్నాడు.
    'అబ్బ! ఎంత రిలీఫ్!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS