మీనాక్షమ్మగారు తన గదిలో మంచం మీద ప్రక్క మీద నుంచి లేవలేని స్థితిలో పడుకుని వుంది.
"పాండూ యిలా దగ్గరకు రా" అని పిలిచింది . బలహీన స్వరంతో.
మంచం దగ్గర కెళ్ళి ఆమె ప్రక్కగా నిలబడ్డాడు.
"పాండూ" అంది దగ్గుతికతో . వయోభారం, రోగ ప్రభావం వల్ల కాంతి నశించి వున్న ఆమె కళ్ళలో నీళ్ళు చిమ్ముతున్నాయి.
"అమ్మా" అన్నాడు.
"ఏనాడూ ఎవరి దగ్గరా ఒక పైసా అడగటానికి అభిమానపడే వాడివి యిప్పుడు అప్పు చేశావా నాయనా."
అతను జవాబివ్వలేదు. తలవంచుకుని నిలబడ్డాడు.
"పెళ్ళి విషయంలో తొందరపడి - నీ జీవితం నాశనం చేశానురా"
"ఇందులో నువ్వు చేసిందేముందమ్మా, నేనూ ఇష్ట పడ్డానుగా.'
చిత్రమేమంటే జీవితంలో అత్యంత ప్రధానమైంది పెళ్ళి. ఎక్కడో తప్ప మనుషులు ముందు చూపు లేకుండా ఆత్రుత పడి తప్పటడుగు వేసేది కూడా అక్కడే.
"పాండూ!"
"నువ్వేమీ చెయ్యలేని నిస్సహాయస్థితిలో వున్నావని తెలుసు. ఆ మార్యాడి అతను నిన్ను అంతలేసి మాటలంటుంటే గుండె తూట్లు పడుతోంది రా. నా బీరువాలో రెండు పేటల చంద్ర హరముంది. ఎనిమిది కాసులుకు పైగా వుంటుంది. అది తీసుకెళ్ళి అమ్మేసి అప్పు తీర్చేయ్యి నాయనా."
"వోద్దమ్మా , ఎలాగో తిప్పలు పడి నేనే తీరుస్తాను."
"నువ్వెక్కడ్నుంచి తెస్తావు రా? ఈ అప్పు తీర్చాలంటే మరో అప్పు చెయ్యవలసిందే కదా. నా మాటవిని ఆ చంద్రహారం తీసుకెళ్ళి అమ్మేయ్."
పాండురంగ వున్న నిస్సహాయస్థితి అతన్ని ఎదురు మాట్లాడకుండా చేసింది.
* * *
రాజహంస కాఫీ కలుపుకుని త్రాగేసి గబగబా స్నానం చేసి ఊర్వశి యింటి కెళ్ళింది.
ఆ సమయానికి ఊర్వశి తన భర్త అరవింద రావుతో నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెబుతోంది. లోలోపల ఎవరి వ్యక్తిగత జీవితాలు వారికున్న బయటకేమీ తెలీనట్లు ఒకర్నొకరు చీట్ చేసుకుంటూ గడిపెయ్యటం వారి కలవాటు.
"రా బేబీ" అంటూ ఊర్వశి ఆమెను లోపలి గదిలోకి తీసుకెళ్ళింది.
రాజహంస జరిగినదంతా స్నేహితురాలితో చెప్పుకుని, తన వేదనని వ్రేళ్ళగక్కుకుని ఏడ్చేసింది.
"జరిగినదంతా వింటే యిక్కడో విశేషముంది. మనిషి తన వెర్షన్ ని చెప్పుకునే టప్పుడు , తనకు తెలీకుండా సెల్ఫ్ సిటిలో ఆత్మవంచన చేసుకుంటూ , తన సైడ్ నుంచి డిఫెన్స్ నీ , లాజిక్ నీ అల్లుకుంటూ తనని తాను ఓ అతీత వ్యక్తిని చేసుకుంటూ చెప్పుకు పోతాడు. జరిగినదంతా నిగూడ సత్యాలు నిక్షిప్తమై వుంటాయి.
"కట్టుకున్న పెళ్ళానికి కనీసపు సౌకర్యాలు సమకూర్చలేని వాడు పెళ్ళెందుకు చేసుకున్నాట్ట" అంది కసిగా ఊర్వశి . కనీసపు సౌకర్యాలు అంటే అర్ధమేమిటో వివరించి చెప్పలేదు.
"నేనా యింట్లో వుండలేక పోతున్నాను ఊర్వశి. ఆ వాతావరణంలో యిమడలేక పోతున్నాను.
13
దిలీప్ హైదరాబాద్ నుంచి ఉత్తరం రాశాడే. ఆ ఉత్తరం నిండా ప్రేమే.
రాజహంస యిన్నాళ్ళూ జీవితంలో అసంతృప్తి ననుభవించింది . ఇప్పుడు ప్రేమననుభవిస్తుంది.
అతనికి జవాబుగా మధురాతి మధురమైన భావాలతో 'దిలీప్! నువ్వు నా ప్రాణానివి, నాలోని ప్రతి అణువు నువ్వు. నా వెలుగుని , నా అమృత నీరిక్షణకు జలధార వంటి సమాధానానివి. నాపై ప్రకృతి వెదజల్లిన వింత పరిమళానివి..." యిలా రాసుకుంటూ పోతుంటే అనీల్ తప్పటడుగులు వేసుకుంటూ దగ్గర కొచ్చాడు.
"అమ్మా' అని పిలిచాడు. బుల్లి ఎర్రని పెదాలను కదిలిస్తూ.
ఆమెకు వినిపించలేదు.
భుజం మీద చెయ్యి వేసి కుదుపుతూ మళ్ళీ 'అమ్మా" అన్నాడు.
"తియ్యని ఊహలకు ఒక్కసారిగా అంతరాయం కలిగి "ఛీ పో" అంటూ విసురుగా ఒక్కతోపు తోసింది.
అనీల్ కొంచెం దూరంలో వెళ్ళి క్రింద పడ్డాడు. తలకి దెబ్బ తగిలింది. "అమ్మా" అని బాధతో మూలిగాడు.
'అమ్మ" ఆమె నిగ్రహించుకోలేక చేతిలోని కాగితం పెన్నూ ప్రక్కన పెట్టి వెళ్ళీ, అనీల్ ని లేవదీసి దగ్గరకు తీసుకుంది.
"దెబ్బ తగిలిందా అనిల్"
వాడు జవాబు చెప్పలేదు. సరిగ్గా వ్యక్తం చెయ్యగల భాష వాడిలో లేదు. తల్లి ప్రేమ తను పొందటం లేదనీ తనకి కావలసిన వాత్సల్యం లభించటం లేదనీ ఆ పసి హృదయానికి తెలుసు.
ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగుతున్నాయి.
"నేను తప్పు చేస్తున్నానా?" అన్న ప్రశ్న ఉదయించబోయింది.
కాని అహంతో అణగ ద్రోక్కేసింది.
* * *
నెలరోజులు గడిచాయి. దిలీప్ వస్తానన్న టైముకు రాలేదు.
ఆమెలో తహతహ ఎక్కువయింది. కోపం, ఉక్రోషం, దుఃఖం అన్నీ కలిసి గుండెను నలిపెస్తున్నాయి.
