Previous Page Next Page 
మారణహోమం పేజి 24


    
    అమూల్య ఏమీ మాట్లాడలేదు. సంజాయిషీలా ఇదంతా చెప్పాడు దేనికి? ఈ ఊకదంపుడంతా ఎవరిని ఉద్దేశించి? అనిపించింది ఆమెకి.    
    "కమాన్! నిన్ను మీ ఇంటికి పంపించేస్తాను" అన్నాడు నిఖిల్ రాధతో.
    రాధ కృతజ్ఞతతో అతనివైపుచూసి మొహమాటంగా అమూల్య వైపు తిరిగి వెళ్ళివస్తానన్నట్లు తలపంకించి నిఖిల్ తోబాటు నడిచింది.    
    తాత్కాలికంగా అక్కడ నిశ్శబ్దం అలముకుంది. చచ్చిపోతున్న రమేష్ తప్ప ఇంకెవ్వరూ అక్కడలేరు. అక్కడ కాసేపు తటపటాయిస్తూ నిలబడి, తర్వాత మెల్లిగా అడుగులు ముందుకు వేసింది అమూల్య. పరిశీలనగా చూస్తూ ఒక్కొక్క గదీ దాటుతోంది. తను ఇవాళ కాకపోతే రేపయినా వీళ్ళ కళ్ళల్లో దుమ్ముకొట్టి పారిపోవడం ఖాయం! ఈలోగా వీళ్ళని గురించి సాధ్యమైనన్ని వివరాలు సంపాదించాలి. తరుణ్ తనని ఇక్కడికి పంపించిన పని సగమన్నా సంతృప్తికరంగా పూర్తిచెయ్యాలి.
    ఆమెకి ఇంకో సంగతి గూడా గుర్తొచ్చింది. మంచికో చెడుకోగానీ, తనని పెళ్ళి చేసుకోవాలన్న ఉద్దేశం కలిగింది నిఖిల్ కి. తను కొంచెం సుముఖంగానే వున్నట్లు నాటకమాడితే ఈ గ్యాంగు తాలూకు మొత్తం రహస్యాలు తన గుప్పెట్లోకి తెచ్చేసుకోవడం ఎంతసేపు? శత్రువు రహస్యాలు తెలిస్తే యుద్ధం సగం గెలిచినట్లే.    
    అతనితో పెళ్ళిట! ఇంతకంటే పెద్ద జోక్ ఏమన్నా ఉందా!    
    తరుణ్ చెప్పింది నిజమే! తనని గురించి తాను చాలా గొప్పగా అంచనా వేసుకుంటున్నాడు ఈ నిఖిల్. అతని చెల్లెలికి చిన్నప్పుడు అన్యాయం జరిగి ఉండొచ్చు. అయితే తనకు అన్యాయం జరిగిందన్న మిషతో ప్రతివాడూ ధ్వజమెత్తి ఒక గూండాగా మారితే ఈ ప్రపంచంలో బ్రతకడమెలాగ? అసలు కారణం అదికాదు! అతని చెల్లెలికి అలాంటి అనుభవాలు జరిగినప్పుడు నిఖిల్ సంఘ విద్రోహశక్తులతో సన్నిహితంగా మెలగవలసి వచ్చింది. ఆ జీవితం అతనికి గ్లామరస్ గా కనబడింది. తనూ దూరిపోయాడు.    
    అంతే! దానికి అందమైన పేర్లు ఏవేవో పెడుతున్నాడు. మాఫియా గాంగ్ స్టర్ ఆల్ కాపోన్ కి అమెరికాలో అభిమానులు ఎంతమందిలేరు?    
    ఇతనూ అలాగే క్రిమినల్ లైఫ్ వైపు ఆకర్షించబడ్డాడు. అప్పుడప్పుడూ చిల్లర మల్లర మంచిపనులు చేస్తూ జీడిమరకలా తనకి అతుక్కున్న చెడ్డపేరుని తుడిచేసుకోవాలని వృధాగా తాపత్రయ పడుతున్నాడు. కలియుగ కర్ణుడనీ, అభినవ రాబిన్ హుడ్ అనీ అనిపించుకోవాలని అనవసరంగా శ్రమ పడుతున్నాడు. అలాంటి పనుల్లో ఒకటే రాధని రక్షించడం! అంతే! అంతకు మించి మరేంలేదు!    
    మానసిక పరివర్తన రాని దొంగ ఒకడు గంగలో మునిగి పాపాలు కడిగేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు ఉంది ఇది!    
    హఠాత్తుగా ఆగిపోయింది అమూల్య. ఆమె ముందు భయానకమైన ఒక ఆకారం నిలబడి ఉంది.    
    నోటిమీద చెయ్యివేసుకుని రాబోతున్న కేకని ఆపేసుకుంది అమూల్య.    
    ఆ ఆకారం మరింత దగ్గరకు వచ్చింది. ఆ మొహంలో ముక్కు లేదు. చెవులులేవు. చేతులకీ కాళ్ళకీ వేళ్ళులేవు.    
    "ఎక్కడికెళ్తున్నావ్?" అంది.    
    ముక్కుకు బదులుగా రెండు రంధ్రాలు మాత్రమే ఉండడంవల్ల మామూలుగా లేదు మాట. సరిగ్గా పనిచెయ్యని విజిల్ ఊదుతున్నట్లు వస్తున్నాయి శబ్దాలు.    
    నోరుతెరిచి చూస్తూ ఉండిపోయింది అమూల్య.    
    "ఏమెత్తుకెళ్ళిపోతున్నావ్! నిన్ను సోదాచెయ్యాలి!" అంది ఆ ఆకారం ఒక అడుగు దూరంలోకి వచ్చి చేతులు ముందుకు జాస్తూ.    
    అప్పుడు గ్రహించింది అమూల్య. అతనొక కుష్టురోగి. అలా గ్రహించగానే ఆమెకి కలిగింది భయం కాదు. జలదరింపు! అనుకోని సంఘటన జరగడంవల్ల కలిగిన షాక్!    
    వెర్రికేక పెట్టింది అమూల్య. ఆమె కనుగుడ్లు నెమ్మదిగా పై రెప్పలలోకి వెళ్ళిపోయాయి. వెనక్కి విరుచుకుపడిపోయింది తను.    

                                                    * * *
    
    అమూల్య కళ్ళు తెరిచి చూసేసరికి జేన్, బిల్డింగ్ వాలా ఇద్దరూ కూడా తన మొహంమీదికి వంగిచూస్తున్నారు.    
    "బాగా భయపడి పోయినట్లున్నావే?" అన్నాడు బిల్డింగ్ వాలా నవ్వుతూ. "కిష్టయ్య చాలా మంచివాడు. చూడడానికి బొచ్చూడిపోయిన భూతంలా ఉంటాడనుకో! కానీ చీమకి కూడా అపకారం చెయ్యడానికి ఇష్టపడడు!"    
    ఆ కిష్టయ్య అక్కడే ఇంకా ఉన్నాడేమో అన్నట్లు అనుమానంగా చుట్టూ చూసింది అమూల్య.
    "ఎవరతను?" అంది బలహీనంగా.    
    "మన మెసెంజర్! ఇంకెవరితో పంపడానికి సాధ్యంకాని సమాచారాన్ని అతని చేత పంపుతుంటాం. లెపర్స్ అంటే అందరికీ భయంకదా! అందుకని వాళ్ళని ఎవరూ సమీపించి సోదాచెయ్యరు. ఈ లెపర్స్ ని చాలా మంది చాలా రకాలుగా వాడుకుంటారు. వీళ్ళచేత దొంగసారా రవాణా చేయించేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు హెరోయిన్, గంజాయి, చరాస్ లాంటి డ్రగ్స్ చేరవేయిస్తున్నారు"    
    మళ్ళీ వళ్ళు జలదరించింది అమూల్యకి.
    ఎదుటిమనిషి రోగాన్ని కూడా తమ మంచికి అనుగుణంగా మార్చుకునే మనుషులున్నారా?

    ఎలాంటి జాడ్యం ఇది! లెప్రసీ కంటే భయంకరమైన రోగంకాదూ?    
    ఆమె భావాలని కనిపెట్టినట్లు అన్నాడు బిల్డింగ్ వాలా. "అమ్మాయ్! అందరూ ఈ లెపర్స్ ని వెలేసినట్లు చూస్తుంటే నిఖిల్ ఒక్కడు మాత్రమే వాళ్ళకీ ఒక మంచి వ్యాపకం ఏర్పాటుచేసి పదిమందికీ పనికొచ్చే పనులు చేయిస్తున్నాడు. వాళ్ళకోసం అతను ప్రత్యేకంగా ఒక హాస్పిటల్ కూడా కట్టించాడు తెలుసా?"    
    "మనమేం చేస్తే అది ఘనకార్యం!" అనుకుంది అమూల్య మనసులోనే మంటగా.    
    సో! అనుకోకుండా ఈ విషయం ఒకటి బయటపడింది. నిఖిల్ తాలూకు కొంత సమాచారం ఈ లెపర్స్ చేరవేస్తూ ఉంటారన్నమాట! ఈ సమాచారాన్ని తను తరుణ్ కి చేరవెయ్యాలి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS