Previous Page Next Page 
సౌందర్య దీపం - 2 పేజి 24


    అతను అపురూపంగా ఆమె చెంపలు నిమిరాడు. ఆమె అతనివేపు చూడలేదు.


    "పురుషుడు పురుషుడితో కలబడి కొట్టొచ్చు. స్త్రీ స్త్రీతో కలబడి కొట్టొచ్చు కాని ...." అంటూ మళ్ళీ నవ్వాడు. "పురుషుడితో కలబడితే అది ఒక అపురూపము, తియ్యని భావం అయి మనసు దగ్గరవుతుంది" అన్నాడు.


    ఆమె మాట్లాడలేదు.


    ఇంద్రసేనకు దుఃఖం ముంచుకు వచ్చేస్తుంది. కళ్ళల్లో నీళ్ళు అతనుగాని చూస్తే.


    తనని ఇంకా లోకువచేసి చులకన చేస్తాడు. అందుకే వస్తున్న దుఃఖాన్ని గుండెల్లోనే దాచుకుంది! కృష్ణమౌళి మెల్లగా ఆమెను వదిలేశాడు.


    చూపుడువేలు చూపిస్తూ అన్నాడు.


    "ఈ క్షణం నీ గుండెల్లో, మెత్తగా, మత్తుగా, తియ్యగా, మధురంగా, హాయిగా, ఆనందంగా, పాలపొంగులా హత్తుకుపోయి ఉంటుంది. నీవు ఈ క్షణాన్ని మర్చిపోవాలన్నా మర్చిపోలేవు. ఈ క్షణం నీ మదిలో మెదులుతూ అనుక్షణం నీకు గుర్తుచేస్తూనే ఉంటుంది" అంటూ ఆగి అన్నాడు.


    "ఈ క్షణంనుండీ నీ మనసు నా గురించి ఆలోచిస్తుంది. నీ మనసు నన్ను గుండెల్లో దాచుకుంటుంది. నీ మనసు నా మనసుతో కలిసిపోవాలని కలలు కంటుంది. ఆ కలలు నిజం కావాలని మనసారా అనుకుంటుంది. ఆ మార్పు నీలో వచ్చి తీరుతుంది." అన్నాడు.


    ఇంద్రసేన మాట్లాడలేదు. అతనివైపు చూడలేదు.


    "మీ వదినగారు అంబిక నన్ను ఆడించాలని చూస్తుంది. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది. ఎంత ధైర్యం. ఆమెను జాగ్రత్తగా ఉండమని చెప్పు. నేను తల్చుకున్నాను అంటే మిమ్మల్ని అందర్నీ ఈ బంగళాతో సహా పెళ్ళగించి అవతలకి విసిరివేయగలను. జాగ్రత్త" అన్నాడు మహా కోపంగా.


    ఏమన్నావ్! అన్నట్టు విసురుగా తలతిప్పి గిర్రున చూసింది యింద్రసేన.


    కాని అతనివేపు చూశాక మాట రాలేదు. ముఖ్యంగా ఆమె జడవడానికి కారణం తను ఒంటరిగా ఉండటం వలన.


    అందుకే ఆమె మౌనం వహించింది.


    మనసులో తన్నుకువస్తున్న కోపాన్ని, దుఃఖాన్ని బలవంతంగా మింగుకోసాగింది.


    "నేను వస్తా!" అంటూ ఒక్క అడుగు ముందుకువేసి ఆగి తల తిప్పి వెనక్కి చూసి చెయ్యి చాపి ఆమె భుజం మీద వేసి చిన్నగా నవ్వాడు.


    ఆ నవ్వు ఈసారి అందంగా పున్నమినాటి వెన్నెల వెదజల్లినట్లుగా లేదు.


    ఆ నవ్వు కటువుగా పంతమే నా ధ్యేయం అన్నట్లు కోపంగా కసిగా, కక్షగా ఉంది.


    ఇంద్రసేన తల తిప్పకుండా కళ్ళు మాత్రమే తిప్పి అతనివైపు చూసింది.


    "నీవు అయిశ్వర్య గర్వంతో ఎంత విర్రవీగినా నువ్వు నన్ను ఎంత పరాయివాడిగా చూసినా నువ్వు ఏదో ఒకరోజు నా వద్దకు నిరుపేదలా అన్నీ ఉన్నా ఏమీ లేనిదానిలా పరుగెత్తుకు వస్తావు, ఆ మాట మాత్రం నిజం"


    "అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు" అంది ఆవేశంగా.


    "అలా జరుగని మరుక్షణం నిన్ను ఎగరేసుకు వెళ్ళి నీ మెడలో బలవంతంగా తాళికట్టి నిన్ను నా అర్ధాంగిని చేసుకుంటాను" ఖచ్చితంగా అన్నాడు.


    "మీకు అంత ధైర్యం వచ్చినప్పుడు చూద్దాంలెండి. మీరు ఇక దయచెయ్యండి" అంది కాస్త కోపంగా. వెళతాను నువ్వు ఉండమని నా కాళ్ళు పట్టి బ్రతిమాలినా ఉండను నువ్వే నా కాళ్ళుపట్టి బ్రతిమాలే రోజు వస్తుంది. వచ్చి తీరుతుంది అన్నాడు. ఇంద్రసేన నిర్లక్ష్యంగా తలతిప్పుకుంది.


    వెళ్తున్నాను. ఈ క్షణం నీకు గుర్తు ఉండేలాచేసి మరీ వెళ్తున్నాను. ముందు మనం గడపబోయే దాంపత్య జీవితానికి ఇది పునాదిరాళ్ళుగా చేసి వెళ్తున్నాను. ఈ క్షణాన్ని గుర్తు ఉంచుకో" అంటూ చెప్పి విసురుగా తలుపు తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు.


    అతను వెళ్ళినవైపే చూస్తూ బొమ్మలా నిలబడిపోయింది.


    అతను ఇక్కడికెలా వచ్చాడు.


    లోపలకు ఎలా రాగలిగేడు!


    ఒంటరిగా ఉన్నానని తెలిసి మరీ చులకన చేస్తూ మాట్లాడేడు.


    ఎంత ధైర్యం! తనని ఎన్ని మాటలు అన్నాడు!


    ఇంద్రసేనకు దుఃఖం ముంచుకు వచ్చింది.


    పురుషుడితో తలబడితే అన్న నిజాన్ని మధుర క్షణంగా మార్చి వెళ్ళాడు.


    మధురక్షణం అనుకున్న అతను ఆ క్షణాన్ని నామరాపాలు లేకుండా చెయ్యని.


    అది మధుర క్షణమా!


    తన గుండెల్లో నిలిచిపోయి హత్తుకుపోయే క్షణము! మనసులో అసహ్యించుకుంది.


    మంచంమీద కూలబడుతూ కళ్ళు గట్టిగా మూసుకుంది.


    అదే క్షణం కళ్ళముందు కదలసాగింది.


    ఆమె గుండెలు దడదడలాడిపోసాగాయి.


    అతని గుండెలకు తను ఎంత దగ్గరయింది.


    ఆ క్షణాన్ని ఆధారం చేసుకుని అతను ఎంత ధైర్యం చేశాడు.


    ఆ క్షణం ఏమిటోగా అయిపోయింది.


    ప్రేమ, అనురాగం అంటే తెలియని తను ఆ క్షణంలో ఏమయిపోయిందో ఏమిటో చెప్పటం కష్టం.


    ఆ క్షణం రోజు రోజుకి పెద్దది అయి తన గుండెల్లో పర్వతంలా తిష్ట వేసుకుంటే!


    ఇంద్రసేన గుండెలు భయంతో గుబగుబలాడాయి.


    తన తండ్రి, అన్నయ్య, వదిన, తల్లి అందరు తన పెళ్ళి విషయంలో ఎన్ని ఆశలు పెట్టుకున్నారు.


    విద్యావంతుడు, అయిశ్వర్యవంతుడు, గుణవంతుడు, అందగాడు అయి ఉండాలని అనుకుంటున్నారు.


    వాళ్ళ ఆశలని మసిచేసి తమ యింట్లో పనివాడిగా ఉన్న కృష్ణమౌళిని తను పెళ్ళి చేసుకుంటుందా!


    అది ఈ జన్మలో జరగని పని.


    కాని... కాని... అతను బాగా పంతం పట్టి ఉన్నాడు. బలవంతంగా లాక్కువెళ్ళి పెళ్ళి చేసేసుకుంటే! ఆమెకు భయంతో మచ్ఛూరి చెమటలు పోసేశాయి.


    వెంటనే తనకుతాను ధైర్యం తెచ్చుకుంది.


    అన్నయ్య తనపక్కన ఉండగా అతను చుట్టుపక్కలకిరాడు రాలేడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS