Previous Page Next Page 
హౌస్ సర్జన్ పేజి 23


    వార్డుబాయ్ అతని  చేతిని  గట్టిగా  పట్టుకున్నాడు, కదలకుండా. సిస్టర్ గ్లూకోజ్ యాంపుల్స్ పట్టుకుని  ప్రక్కన  నిలబడింది. లావుగా, బలంగా, ఉక్కు దూలంగా  వుంది చెయ్యి. అటూ యిటూ  గింజుకుంటున్నాడు. అంత కదిలికలోనూ  అదృష్టవశాత్తూ  మొదటి ప్రయత్నంలోనే  వెయిన్ చిక్కింది. గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు.

    రోగి కేకలు  పెడుతున్నాడు. ఎవర్నో  తలుచుకుని  బూతులు  తిడుతున్నాడు.

    ఉన్నట్లుండి  పిడుగులా  పడింది  మీద  ఒక దెబ్బ, తల చిట్లిపోయి  నట్లయింది, కళ్ళు చీకట్లు  క్రమ్మాయి. తర్వాతేం  జరిగిందీ  నాకు  తెలియలేదు.

    కళ్ళు తెరచి  చూసేసరికి  మా వార్డులోనే  ఒక బెడ్ మీద పడుకుని  వున్నాను. నా మంచం చుట్టూ  నలుగురయిదుగురు  హౌస్ సర్జన్లూ, సిస్టర్లూ, లేచి తిరగ గలిగే  పేషెంట్లూ  గుమిగూడి  వున్నారు.

    "హమ్మయ్య ! లేచారా బాబూ ! మీ యింటికి  వైర్  ఇవ్వాలేమోనని  హడలి చస్తున్నాం. గంటసేపట్నుంచీ  నీకు  సపర్యలు  చేస్తున్నాం, తెలుసా ?" అన్నాడు ఒక హౌస్ సర్జన్.

    అతని పేరు బాబూరావు.

    "గంటసేపట్నుంచీ  తెలివి తప్పి వున్నానా ?" అన్నాను, లేచి కూర్చోవటానికి  ప్రయత్నం  చేస్తూ. మోచేతి  మడతలో  చురుక్కుమని  మండినట్లయింది. యేమిటా  అని, చూసుకుంటున్నాను.

    "అదేమీలేదు. నీకు గ్లూకోజ్  ఎక్కించాం. కోరమిన్  కూడా యిచ్చాం. అవసరమైతే  అసిస్టెంటు  నెవర్నయినా  పిలుచుకు వద్దామని  చూస్తున్నాం .ఇంతలో  కళ్ళు  తెరిచావు."

    "చల్లనిబాబు. చల్లని   బాబు" అంటూ  పేషెంట్లు  అక్కణ్నుంచి నెమ్మదిగా  వెళ్ళిపోయారు.

    హౌస్ సర్జన్ లు కూడా  అయిదు నిమిషాలు  కబుర్లు  చెప్పి  "బాగా నీరసంగా  వున్నావు. కాసేపు రెస్టు  తీసుకుని  మరీ  వెళ్ళుభాయి. అవసరమనుకుంటే  రాత్రంతా  వుండు. బోలెడు  మంది అమ్మాయిలు  నీకు  సపర్యలు చెయ్యటానికి" అని వెళ్ళిపోతూండగా  ఒకతను  అంటూంటే.
    ఒక సిస్టర్  అతని వంక  ఎర్రగా  చూసి "ఊ, అమ్మాయిలు. మీకంత కోరికగా  వుంటే  తలకు  పెద్ద దెబ్బ తగిలించుకుని  రండి. మీ తనివితీరా  సేవలు  చేస్తాం" అంది.

    "ఓ ఎస్. నా కెప్పుడు  జ్వర మొస్తుందా, హాస్పిటల్ లో  ఎడ్మిట్ అవుదామా  అని కలలు  కనలేక  చస్తున్నా." నవ్వుల  మధ్య  వాళ్ళంతా  వెళ్ళిపోయారు.

    "డాక్టర్ ! కులాసాగా  వుందికదా  యిప్పుడు. మరింకెప్పుడూ ఆ పేషెంటు  జోలికి వెళ్ళకండి" అని సిస్టర్ నావంక సానుభూతిగా చూస్తూ  పరామర్శ చేసి  "పదవే. స్టాఫ్  యింక  కేక లెయ్యటం  మొదలెడుతుంది. అసలే  ఆవిడ  సౌండ్ యింజనీర్. ఆ కాంప్లెక్సుతో  మనం  ఏమనుకున్నా  తిట్టుకుంటున్నా  మానుకుని  తిట్టి  పోస్తుంది." అనుకుంటూ, నెమ్మదిగా   సిస్టర్స్ కూడా  వెళ్ళిపోయారు.

    సౌండ్ యింజనీరు  అనే మాట  చెవిటివాళ్ళని  ఉద్దేశించి  ఉపయోగిస్తారు  వాళ్ళు.

    మా వార్డు సిస్టర్  ఒక్కతే  మిగిలింది.

    "అసలు వీళ్ళంతా  ఎలా వచ్చారు సిస్టర్ !" అనడిగాను, ఒక క్షణం మౌనంగా  గడిచాక.

    ఆమె మరి కొంచెం  దగ్గరకు  వచ్చి  నా ప్రక్కన నిల్చుంది. "ఏముంది ? ఆ పేషెంటు  బలంగా  తన చెయ్యి విసిరేసరికి  మీరొక ప్రక్కా, వార్డుబోయ్ ఒక ప్రక్కా  పడిపోయారు. నేను  చేతిలో  యాంపుల్స్ వదిలేసి  గాభరాతో బయటకు  పరిగెత్తుకు  వెళ్ళి  కేకలు పెట్టాను. దాంతో ప్రక్క వార్డులనుంచి  సిస్టర్లూ, హౌస్ సర్జన్లూ  పరిగెత్తుకు  వచ్చారు" అంటూ, విడమర్చి చెప్పింది.

    వార్డుబాయ్ విషయం అప్పుడు  జ్ఞాపకం వచ్చి "అన్నట్లు  సహదేవుడి కేముంది ?" అనడిగాను.

    "ముక్కు పగిలి  నెత్తురుకారింది. కట్టు కట్టించుకుని, సెలవు తీసుకుని ఏడుస్తూ  యింటికివెళ్ళిపోయాడు."

    సహదేవుడికి దెబ్బ  తగిలినందుకు  విచారం  వేసింది. ఒక నిముషం మెదలకుండా  పడుకుని  యిహ వెళ్ళిపోదామని  లేచి  కూర్చున్నాను. తలంతా యింకా  దిమ్ముగా  వుండి, లోపల రైళ్ళు  పరిగెత్తున్నట్లు  అనిపించింది. బాధగా కళ్ళు మూసుకున్నాను.

    సిస్టర్ నా నుదుటిమీద  చెయ్యివేసి  "ఏం డాక్టర్, నొప్పిగా వుందా ?" అనడిగింది.

    "కొంచెం" అన్నాను నవ్వి.

    "నళినికి కబురు  చెయ్యమంటారా ?"

    ఒక్కసారిగా  అదోలా  అనిపించింది. ఈ ప్రచారం  ఎందువల్ల వచ్చింది ? మేమిద్దరం తరుచు వంటరిగా  కనబడటం చూసి  దానంతట అదే పుట్టిందా ? లేక ఈ ప్రచారానికి  నళినే  బాధ్యురాలా ! మళ్ళీ  ఆమె గురించి  అంత తేలికగా  ఆలోచించకూడదనిపించింది.

    "అఖ్కర్లేదులెండి" అన్నాను  మెత్తగానే.

    "పాపం నళిని  బాధపడుతుందండి  మీకు దెబ్బ  తగిలిందని  తెలిస్తే."

    "పడనివ్వండి. ఆమె  ఆరోగ్యం  బాగుపడుతుంది" అంటూ  ఆమె చేతిని  మృదువుగా  విడిపించుకుని  లేచి  నిల్చున్నాను.

    ఆమె ఫక్కుమని  నవ్వింది. ఆ మాటలు  తలుచుకుని  తలుచుకుని  మరీ నవ్వింది.
   
    "బలే మాట్లాడతారండి మీరు. ఉండండి ఆమెకు  చెబుతాను. మీపని పట్టిస్తుంది లెండి ,రేపు" అంది, నవ్వటం పూర్తి అయాక.

    "వస్తాను సిస్టర్ !" అని నేను నెమ్మదిగా  ఆయల్దేరేసరికి "చీఫ్ తిరుపతికి  వెళ్ళబట్టి  వార్డు  యింత  ప్రశాంతంగా  వుంది. లేకపోతే  యీ పాటికి  మీ ఇద్దరూ  రౌండ్సు  చేస్తూ, పేషెంట్లను  పరామర్శిస్తూ  ఉండేవారు" అంది వెనక నుండి.         

    నేను వార్డుదాటి  బయటకువస్తూ  నాకు యీ బహుమానం  ప్రసాదించిన  లారీ  డ్రైవరు  కేసి  ఒకసారి  చూశాను. ఇక్కడి  విషయాలతో  సంబంధం  లేకుండా తను మత్తు  ప్రపంచంలో  మునిగి ఉన్నాడతను.

    చక్రపాణిగారికి  లారీ  డ్రైవర్లన్నా  పోలీసువాళ్ళన్నా, ఒకరకమైన కోపం వుండేది. వాళ్ళెప్పుడైనా  రోగులుగా  వార్డులో చేరితే  ఏదో  ఒక  నెపం  పెట్టుకుని  వాళ్ళను  వెటకారం  చేస్తూండేవారు. బహుశా  మునుపెన్నడో వారిద్దరివల్లా  చేదు అనుభవాలేమైనా  కలిగివుండాలి.

    క్వార్టర్సుకు  వెళ్ళి, నా గదితలుపులు  తెరిచి  లోపలకు  వెళ్ళేసరికి  ఏడయింది. ఆపూట  భోజనానికి  వెళ్ళాలనిపించలేదు. బట్టలు  మార్చుకుని, పైజామా, స్లాక్ వేసుకుని  మంచంమీద  పడుకుని, ఓ యింగ్లీషు జర్నల్ చేతిలోకి  తీసుకున్నాను. ప్రభాకరం గదిలో  లేడు.

    ఓ పావుగంట గడిచాక  బయట  అడుగుల  చప్పుడయితే  తలత్రిప్పి  చూశాను. దగ్గరకు  వేసి వున్న  తలుపులు  తెరుచుకుని  మృదుల లోపలకు  అడుగు పెట్టింది.

    "రా మృదులా!" అన్నాడు లేచి కూర్చుంటూ. ఆమెను  ఆహ్వానిస్తున్నట్లుగా.

    ఆమె గదిలో యింకెవరైనా  వున్నారేమోనని  ఓసారి  అటూ యిటూ  చూసి  దగ్గరకు వచ్చి, మంచానికి  సమీపంగా కూర్చుని  లాక్కుని  కూర్చుని  "వార్డులో ఏదో  ఫీట్  చేశావుటగా ! తలా  అదీ  బాగానే  ఉండే" అంది.

    "అప్పటికే  నీ దాకావచ్చిందే" అన్నాను.

    "నీకోసం  వార్డుకి  వెళ్ళాను. అక్కడ  వుంటావని. అక్కడక్కడే  సిస్టరూ ,నైట్ సిస్టరూ  డ్యూటీలు మార్చుకుంటున్నారు. నిన్ను గురించి అడిగితే  నీకు జరిగిన సత్కారం  గురించి  చెప్పి రూమ్ కెళ్ళి  పడుకుని వుంటావని  అంది డే సిస్టర్."

    సాయంత్రం  స్నానం  ముగించుకుని, లేతరంగు చీరెకట్టుకుని, వొదులుగా వేసుకున్న  జడతో మల్లెపందిరి మీది నుంచి వీచినపుడు  సుగంధంలా  వుంది  మృదుల. కాటుక  పెట్టుకున్న నీలినేత్రాలూ, చిలిపిగా  తెరిచి మూసుకునే కనురెప్పలూ, ఎడమ చెంపమీద  చిన్న  పుట్టుమచ్చా, కంఠం మీది  నీలిచారలూ....నాలో కొత్త అభిరుచి మేలుకొన్నట్లయింది.

    "ఏమిటా  చూస్తున్నావు ?"

    "నిన్ను."

    "ఎందుకు ?"

    ఏం చెప్పను ? ఆ క్షణంలో  నా కేడుపు  వచ్చింది. ఎప్పుడో ఏ రెండు మూడేళ్ళకో  ఒకసారి, ఇతరులకు  మామూలుగా  కనిపించే  సన్నివేశంలో  గుండె  బావురమన్నట్లుంటుంది.

    మృదుల  నా వంక  వింతగా చూసి ,మరికొంచెం  దగ్గరగా జరిగింది "బండరాయీ? నీ కళ్ళలో  నీళ్ళు చిమ్మాయేం ?" అంది. 

    బలవంతంగా  నా ముఖంలోకి  నవ్వుతెచ్చుకున్నాను. "బండరాయికీ గుండె ఉంటుందని...."

    "గుండె  ఉంటుందిలే, అయితే  అది సిరలూ  ధమనులతో  కనెక్ట్ చేయబడి, రక్తప్రసారం చేస్తూ  బండి  సరిగ్గా  నడుస్తుందా  లేదా అన్న ధ్యాస తప్ప  మరొకటిలేదు. ఆ రక్తకణాల్లో  కొందరు  కావాలనుకునేవి  తొణికిసలాడవు."

    "నామీద  యింత  నిందవేస్తే  ఎలా మృదులా! అంతబరువు  మొయ్యలేను !"

    "తప్పించుకోవాలని  చూడకు. నీ మెడికల్  పుస్తకాలకన్నా  బరువున్నాయా  మా మాటలు?" మృదులా  నా కళ్ళల్లోకి  గ్రుచ్చి  గ్రుచ్చి  చూస్తూ  అంది.

    నిట్టూర్పు విడిచి  నేనన్నాను "తప్పించుకోవాలని  చూడటమెందుకు మృదులా ? నేను పిరికివాణ్ణే అయినా  మరీ  గిరినుంచి  ప్రక్కకి  పారిపోయేటంతటి  భీరువునుకాను  నా అసమర్ధతను  అంజలి ఘటించి  ఒప్పుకోవటంలో  ఎనలేని  ఆనందం వుంది నాకు"

    మృదుల ఒక నిమిషం  మౌనముద్రదాల్చి, తర్వాత  హఠాత్తుగా నవ్వేసి  "ఏమిటి మన బాధ ? ఇంతకీ  మనం   దేన్నిగురించి  మాట్లాడుకుంటున్నాం ?" అన్నది.

    నాకూ  నవ్వు  వచ్చింది. "ఎంత తేలికగా  వాతావరణాన్ని  మార్చి వేయగలదీ  అమ్మాయి" అనుకున్నాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS