Previous Page Next Page 
రాజ హంస పేజి 23

 

    "ఆయా పరిస్థితుల్ని బట్టి, వాతావరణాన్ని బట్టి ఒక్కో యింట్లో ఒక్కో రకంగా ప్రవర్తిస్తూ వుంటారు. ఈ వాతావరణంలో నీకింత కంటే యింకో రకంగా ప్రవర్తించటం చేత కావటం లేదు."
    "అదే. అలా ఎందుకు జరుగుతోంది అని."
    "ఏమో నాకు తెలీదు."
    "ఒక భాద్యత గల స్త్రీవి. ఇంటి యిల్లాలివి. ఓ బిడ్డకు తల్లివి. ఎలాగో ప్రవర్తిస్తూ 'ఏమో నాకు తెలీదు' అని ఒక్క ముక్కలో దులిపెసుకుంటే ఎలా చెప్పు."
    స్త్రీ, యిల్లాలు, తల్లి - యిలాంటి పదాలు ఆమెకు ఎలర్జీ కలిగించాయి.
    "తెలీని విషయం తెలీదని చెబితే తప్పా? అయినా యిలా సూక్తులు వల్లించక - అసలు పాయింటేమిటో చెప్పండి. నాకు నిద్ర వస్తోంది."
    "ఈ మధ్య...."
    ఆమె అసహనంగా వింటోంది.
    "నీలో చాలా మార్పు వచ్చింది.
    "మనుషులు మారకుండా ఎప్పుడూ ఒకేలా ఎలా వుంటారు? అది మీలాంటి వాళ్ళకు సాధ్యమేమో గాని ఏదో ఓ కొత్తదనం , చైతన్యం ఆశించే నాలాంటి వాళ్ళకది సాధ్యం కాదు."
    "కొత్తదనం, చైతన్యం - అంటే యింతకన్నా సభ్యతగా వుండే అనేక మార్గాలున్నాయి. ఈ మీటింగులూమ పార్టీలు, ఆడవాళ్ళు, మొగవాళ్ళు సోషల్ గా తిరగటాలూ ....కొంతమందికి స్వాభావికం అయితే కావచ్చు, గాని, మనలాంటి మధ్యతరగతి కుటుంబీకులకది మంచిది కాదేమో."
    "మానసికంగా ఎదగని వాళ్ళకది అసహజంగానే కనిపిస్తుంది. మీరనుకున్నట్లు అసభ్యంగా నేనేమీ ప్రవర్తించటం లేదు. సోషల్ అవుట్ లుక్ లేని బ్రూట్స్ అలా అనుకుంటారు."
    "బ్రూట్స్" యీ పదం అతని గుండెల్లోకి వెళ్ళి గుచ్చుకుంది. అయినా తమాయించుకున్నాడు.
    "కాని ....నలుగురూ నీ గురించి రకరకాలుగా చెప్పుకుంటుంటే వినటానికి నాకు బాధగా వుంది."
    "డాషింగ్ గా వుంటే వారి గురించి పనికిమాలిన నలుగురు చేరి మీరన్న రకరకాలుగా చెప్పుకోవటం ఎప్పుడు రుగ్మతే. ఇది కొత్త జబ్బేమీ కాదు. చూడండి నేను ధందాలో ముందు కేడుతున్నాను. భార్యా భర్తలు, యిల్లు, యిల్లాలు యిలాంటి చెత్త కబుర్లు చెప్పి వెనక్కి లాగే వ్యర్ధ ప్రయత్నాలు చెయ్యకండి. యావగేషన్ లేని రొటీన్ డ్రై లైఫ్ అంటే అసహ్యం నాకు నిద్రవస్తోంది పడుకుంటున్నాను. అంటూ లేచి లైటు తీసేసింది.
    

                                                        12

    మర్నాడు పొద్దుట రాజహంస నిద్రలేచే సరికి ఎనిమిది దాటిపోయింది.
    బయటనుంచి ఏవో అరుపులు వినిపిస్తున్నాయి.
    ప్రక్క మీద నుంచి లేచి వరండాలో కొచ్చింది.
    ఎవరో మార్వాడి అతనిలా వున్నాడు. బాకీ చెల్లించలేదని పాండురంగను పట్టుకు దులిపెస్తున్నాడు. మధ్య మధ్య అసహ్యమైన పదజాలం విశ్రుంఖలంగా ప్రయోగిస్తున్నాడు. ఇరుగూ పొరుగూ వాళ్ళు బయటకొచ్చి వినోదం చూస్తూన్నట్లుగా నిలబడ్డారు.
    పాండురంగ తలవంచుకుని నిలబడ్డాడు. ఒక్కమాట కూడా జవాబు చేప్పటం లేదు.
    వారం రోజుల్లో చెల్లించకపోతే ప్రాపర్టీ కి ఎటాచ్ మెంట్ పెట్టిస్తానని బెదిరించి మార్వాడి అతను వీరుడిలా వెళ్ళిపోయాడు.
    పాండురంగ అవమాన భారంతో కుమిలిపోతూ లోపలికొచ్చాడు. అతని ముఖం నల్ల బడి వుంది. రాకహంస అతని వెనకనే నడిచి వచ్చింది.
    "మార్వాడి దగ్గర అప్పు చేశారా?"
    అతను జవాబు చెప్పలేదు.
    "మాట్లాడరేం?"
    "చేశాను"
    "దేనికి?"
    "దేనికో నీకు తెలీదా?" సౌమ్యంగానే అడిగాడు.
    "ఊహు తెలియదు చెప్పండి."
    "నీ అవసరాల కోసం"
    "అంటే?"
    "ఇంట్లో ఫ్రిజ్, కలర్ టి.వి. వి.సి.ఆర్ , మిక్సిలు , గ్రైండర్ , నీ ఆభరణాలు, నీ రోజు వారి ఖర్చులు....
    "అంటే చివరికి నేరం నామీద పెడుతున్నారా?"
    "ప్లీజ్! నన్న అపార్ధం చేసుకోకు. నిన్ను నేను నిందించటం లేదు. నా జీతం సాదా జీవితం గడపటానికి సరిపోతుంది గాని, యివన్నీ అనుభవించటానికి స్థోమత లేదు. ఈ సంగతి యిదివరలో నీకు కొన్నిసార్లు చెప్పాను. నువ్వు వినిపించుకోలేదు. సంతోష పెట్టటం కోసం అప్పులు చేసి యివన్నీ కొన్నాను."
    "నన్ను సంతోష పెట్టటం కోసం , అప్పులు చేయ్యనిదే యీ కనీస అవసరాలను , తట్టుకోలేని వారు పెళ్ళెందుకు చేసుకున్నారు?"
    "రాజహంసా ప్లీజ్! నిన్ను నేను బ్లేం చెయ్యటం లేదు. నిన్ను సంతోషపెట్టటం భర్తగా నా ధర్మం . అందుకని...."
    "అందుకని అప్పులు చేస్తే ....వాళ్ళంతా యింటిమీద పడి అల్లరి చేస్తే నలుగురు ఏమనుకుంటారు?"
    "నలుగురూ.....నలుగురూ ఏమనుకున్నా కేర్ చెయ్యను" అని రాత్రి ఆమె అన్నమాటలు గుర్తు చేద్దామనుకున్నాడు. నోటిదాకా వచ్చింది. కాని రెచ్చిపోతుందని భయపడి తమాయించుకున్నాడు.
    "ఐయామ్ సారీ రాజహంసా నిన్ను కష్ట పెట్టినందుకు అంటూ అవతలి గదిలో కెళ్ళి పోయాడు.


                                                              *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS