Previous Page Next Page 
మారణహోమం పేజి 23

 

    అమూల్య, రాధ ఇద్దరూ అతనివైపు ఆశ్చర్యంగా ప్రశ్నార్ధకంగా చూశారు.    
    "కూచోండి." అన్నాడు నిఖిల్ తను ఒక సోఫాలో కూర్చుంటూ అతనికి కొంచెం దూరంలో కూర్చున్నారు ఆడవాళ్లిద్దరూ.  
    "కిడ్నాపింగ్ కి అమెరికాలో శిక్ష ఏమిటో తెలుసునా? యావజ్జీవ కారాగారవాసం! ఇండియాలో అయితే అంత కఠినమైన శిక్షలేదు కిడ్నాపింగ్ కి. ఆ మాటకొస్తే, నా చెల్లెలిని కిడ్నాప్ చేసినవాళ్ళకి అసలు శిక్షే పడలేదు. పెద్దమనుషుల్లాగా చలామణీ అయ్యారు చాలా సంవత్సరాలపాటు, చివరికి నేనేపూనుకుని ఒక్కొక్కళ్ళనీ ఒక్కొక్క రకంగా చంపేదాకా!    
    చెప్పడం ఆపి, లేచి ఫ్రిజ్ దగ్గరకు వెళ్ళి మూడు గ్లాసుల్లో టొమాటో జ్యూస్ నింపి తెచ్చాడు నిఖిల్. అతను నడుస్తుంటే అప్రయత్నంగానే కళ్ళప్పగించి చూసింది అమూల్య. అతని కాళ్ళు చాలా పొడుగు. పొడుగాటి ఆ కాళ్ళవలన అతనికి చాలా అందం వచ్చింది.    
    గ్లాసుల్లోంచి టొమాటో జ్యూస్ రక్తంలా ఎర్రగా ఉంది. అది తాగబుద్ది వెయ్యలేదు అమూల్యకి. ఊరికే ఒకసారి గ్లాసు పెదిమలకు తాకించి పక్కన పెట్టేసింది.    
    జ్యూస్ ఎన్ జాయ్ చేస్తున్నట్లు సిప్ చేస్తూ మధ్యమధ్యలో రమేష్ వైపు చూస్తూ చెప్పడం మొదలెట్టాడు నిఖిల్.    
    "అవును! నాకో చెల్లెలుండేది. కాదంబరి తన పేరు. ఎంత బాగుంటుందో నేను చెప్పినా ఎవరూ నమ్మరు. అందుకని చూపిస్తాను."    
    జేబులోనుంచి పర్సు తీశాడు అతను. అందులో ఒక ఫోటో. అద్భుతమైన కనుముక్కు తీరు ఉన్న ఒకమ్మాయి. పదమూడేళ్ళు ఉంటాయి. చీకటి విరిగి వెలుగు వస్తున్నట్లు అప్పుడప్పుడే అమాయకత్వం తొలిగి పెద్ద మనిషి తరహా వస్తున్నట్లు ఉంది ఆ ముఖంలో కనబడుతున్న భావం.    
    "కాదంబరి మా అందరికీ పెట్. మరీ ముఖ్యంగా నాకు. అలాంటి కాదంబరి ఒకరోజు స్కూలునుండి ఇంటికి తిరిగిరాలేదు."    
    తదేకంగా అతనివైపు చూస్తోంది అమూల్య. రాధ ఇంకా వెక్కుతూనే ఉంది.    
    "ఊరంతా వెదికాం కాదంబరి కోసం. పోలీసు రిపోర్టు ఇచ్చాం. అమ్మాయి కనబడలేదు. నాలుగు రోజులపాటు తలక్రిందులయిపోయిన తర్వాత తెలిసింది, తను బాంబే రెడ్ లైట్ ఏరియాలో ఉన్నట్టు. ఆమెని కిడ్నాప్ చేసినవాళ్ళు బాంబే తీసుకెళ్ళి అమ్మేశారు. నేను బాంబేవెళ్లి అక్కడి పోలీసుల కాళ్ళా వేళ్ళా పడ్డాను. అప్పట్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి నిరుద్యోగిగా ఉన్నాను నేను. యూనివర్శిటీ ఫస్ట్ రాంక్ వచ్చింది కానీ ఉద్యోగమే రాలేదు.    
    అక్కడ పోలీసులు నేను చెప్పింది శ్రద్దగా విన్నారు. చెయ్యవలసిందంతా తప్పకుండా చేసి తెల్లారేలోపల నా చెల్లెలిని నాకు అప్పగిస్తామన్నారు. నేను నమ్మేశాను.    
    కానీ వాళ్ళు చేసింది వేరే వుంది. తెల్లారేలోపల కాదంబరిని ఆ భోగం కొంపలోనుంచి మరో ఇంట్లోకి మార్చేశారు. అంత అందగత్తెను అడ్డం పెట్టుకుని లక్షలు సంపాదించవచ్చని వాళ్ళకూ అనిపించినట్లుంది. ఆ తర్వాత నాలుగు రోజులపాటు పోలీసుల చేతులు మారుతూ ఉండిపోయింది నా చెల్లెలు.    
    అప్పుడొచ్చింది నాకు అనుమానం. పోలీసులు నాకు సహాయం చెయ్యరని నిశ్చయించుకున్నాను.    
    ఆ తర్వాత ఒక రాజకీయ నాయకుడిని అప్రోచ్ అయ్యాను. అతను ఉపన్యాసాల లెవెల్లో ఏదో చెప్పి ఏదో చేస్తామని వాగ్దానం చేశాడు.    
    కానీ నాకు అప్పట్లో తెలియని విషయం మరొకటి ఉంది. సరిగ్గా అదే సమయంలో నా చెల్లెలు అతని ఇంట్లోనే ఉంది. అప్పటికి రెడ్ లైట్ ఏరియాలోనుంచి పోలీసు ఆఫీసర్ల చేతులు మారి రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లోకి వచ్చి ఇరుక్కుపోయింది కాదంబరి. నేను వెర్రివాడిలా వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. అప్పుడు ఇంకో ఘోరం జరిగింది." కాసేపు ఆగి గొంతుని కంట్రోల్ లోకి తెచ్చుకుని మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు నిఖిల్.    
    "ఆ రాజకీయనాయకుడి ప్రత్యర్ధి ఒకడు హఠాత్తుగా ఎదిగిపోయాడు. అతన్ని మంత్రివర్గంలోకి కూడా తీసుకొంటారని గుసగుసలు బయలుదేరాయి. అందుకని అతన్ని రాజకీయంగా సమాధి చేసెయ్యదలచుకున్నాడు మనవాడు. గిఫ్టు ప్యాకింగ్ లో ప్రెజెంటేషన్ పంపినట్లు బలవంతంగా కాదంబరిని అలంకరించి ప్రత్యర్ధి దగ్గరకు పంపాడు. ఆ రాత్రికి ఆ ప్రత్యర్ధి రాక్షసత్వాన్ని రహస్యంగా వీడియో టేపు తీయించాడు. ఫోటోలు తీయించాడు.    
    మర్నాటికి ఆ ఫోటోలు పంచరంగుల్లో ప్రింట్ చేయిచి అందరికి పంచిపెట్టాడు. వాల్ పోస్టర్లమీద అచ్చుకొట్టించి, నగరంలో నాలుగుమూలలా అంటించారు. అభం శుభం ఎరుగని నా చెల్లెలి బ్రతుకు అన్యాయంగా అంతం అయిపోయింది. ఆ కొద్దిరోజుల్లో నేను లోకం గురించి చాలా తెలుసుకున్నాను. రౌడీలతో, బ్రోకర్లతో, పోలీసులతో, రాజకీయ నాయకులతో వాళ్ళ పద్దతులతో బాగా పరిచయం అయింది. వాళ్ళను దగ్గరనుండి చూసి చాలా విషయాలు గ్రహించాను. డబ్బూ, బలం, పదవీ, పవరూ, అన్నీ అన్యాయానికి అండగా ఎలా నిలుస్తున్నాయో ప్రత్యక్షంగా చూశాను. ఆ డబ్బూ, బలమూ, పదవీ, పవరూ సంపాదించడానికి వాళ్ళు అన్యాయానికి ఎలా పాల్పడుతున్నారో చూశాను.
    అప్పుడనిపించింది నాకు! వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి! అన్యాయాన్ని అన్యాయంతోనే తొక్కివెయ్యాలి. కుక్కకాటుకి చెప్పు దెబ్బే మందు అని.
    తిరగబడ్డాను నేను. ఈ లోకం ఊరకుక్కలాంటిది. భయపడితే భయపెడుతుంది. తిరగబడితే తోకముడిచి తనే పారిపోతుంది.    
    అలాగే జరిగింది నా విషయంలో. డబ్బు ఉన్నవాడిదగ్గరే డబ్బు చేరుతుంది. పవరు ఉన్నవాడికే మరింత పవరు వస్తుంది.    
    అలా పెరిగిపోయాను నేను. ఆ అర్ధబలమూ, అంగబలమూ ఉండడంవల్లే ఇవాళ ఆ అమ్మాయిని రక్షించగలిగాను."
    స్వగతంలా మాట్లాడుతున్నాడు అతను.    
    "మీవల్లే నేను రక్షించబడ్డాను.....లేకపోతే...." అంది రాధ మెల్లిగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS