Previous Page Next Page 
కె. ఆర్. కె మోహన్ కథలు పేజి 24

       
    అధ్యక్ష, కార్యదర్శులు క్రిందామీదా పడి వారినీ, వీరినీ పట్టుకొని ఎలాగైతేనేం..... విద్యుచ్చక్తి శాఖామాత్యులు దర్శనమ చేసుకుని వారిని తమ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేయమని అర్దించారు.


     అమాత్యులవారు ముందు 'అదుగో - ఇదుగో ..... చూస్తాను' అంటూ వాక్రుచ్చి చివరన  తమకు  ఎన్నికలు, ఎన్నో పనులూ,  ఒత్తిడులున్నా వారికోసం ఎలాగో తప్పక వీలుచేసుకుని వస్తానని అభయమిచ్చారు. మంత్రిగారంతటివారు తమ వార్షికోత్సవానికి వస్తున్నందున  సంఘంవారు ఘనంగా ప్రోగ్రాం  కాగితాలను, ఆహ్వాన  పత్రాలను  అచ్చువేయించి  కాలనీలోని అందరికీ  మామూలుగానూ,  కొందరికి ప్రత్యేకంగానూ పంచిపెట్టారు.

 
    వార్షికోత్సవం మరొక్క రోజు వుందనగా - అమాత్యులవారు  తాము అనుకోకుండా  ఢిల్లీ వెళ్ళవలసి వచ్చిందనీ, అందువల్ల వార్షికోత్సవానికి తాము రాలేకపోతున్నామనీ విచారం వ్యక్తపరుస్తూ సందేశం పంపించారు.

 
      ఆ సందేశం  వినగానే అధ్యక్షులవారికీ, కార్యదర్శికీ గుండెల్లో రాయి పడింది. తాము పడ్డ శ్రమ అంతా వృధా అయిందని  బాధపడ్డారు. పైగా... తమ శక్తిసామర్ద్యాలను కించపరుస్తూ నలుగురిలో తాము నవ్వులపాలౌతామని విచారించారు.


    'అమాత్యులవారు కొంపముంచారురా బాబూ...!' అనుకుంటూ మంత్రిగారు లేకపోయినా కనీసం ఎం. ఎల్. ఏ గారినైనా తీసుకురావాలని  తాపత్రయ పడసాగారు. ఆదరా బాదరాగా ఎలాగైతేనేం. .. ఒక లేడీ ఎం. ఎల్. ఏ. గారిని పట్టుకున్నారు.


    పాపం... ఆమె అట్టే బెట్టు చేయకుండానే రావడానికి ఒప్పుకుంది.

 
    అన్నమాట ప్రకారం  వార్షికోత్సవానికి వచ్చింది కూడా. అంతవరకూ ఆమె వస్తుందో -  లేదో...,  అమాత్యులవారిలాగా  చివరి నిమిషంలో ఎక్కడ అదృశ్యమౌతుందోనని  భయపడుతున్న సొసైటీవారు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.


    మంత్రిగారి రాకను దృష్టిలో వుంచుకొని ఘనంగా చేసిన ఏర్పాటులో ఆ శాసన సభ్యురాలి సమక్షంలో  వార్షికోత్సవం ఘనంగా జరిగింది. వినతిపత్రంలో  అమాత్యులవారి పేరు తీసేసి ఆమె పేరుంచి చదివి, ఆమె పలుకుబడి నుపయోగించి తమ కాలనీ అవసరాలకు - ముఖ్యంగా.... వీధి దీపాలను  మంజూరు చేయించవలసిందిగా కోరారు.

 
    ఎం.ఎల్. ఏ గారు  వినతిపత్రాన్ని శ్రద్దగా విని తాము శక్తి వంచన లేకుండా కృషి చేస్తాననీ,  ఎలక్ట్రిక్ లైట్లు అక్కడ ఎలాగూ వున్నాయి కనుక, వీధి దీపాలు అతిత్వరలోనే వచ్చేటట్లు చూస్తానని హామీ ఇచ్చారు.


    సభికుల కరతాళధ్వనుల మధ్య ఆనాటి ఉత్సవం ఘనంగా ముగిసింది.


    కొన్ని సందర్భాలలో వ్రతం జరిగినా, ఫలితం దక్కదు. మరికొన్ని సందర్భాలలో వ్రతం చెడ్డా ఫలం దక్కుతూ వుంటుంది. ఈ కాలనీ విషయంలో కూడా అంతే అయింది. మంత్రిగారు రాకపోయినా  కావాలనుకున్న పని అయింది. పాపం..... ఆ శాసనసభ్యురాలు శ్రద్ద తీసుకుని, విద్యుచ్చక్తి బోర్డు వెంటపడి  అతి త్వరలోనే కాలనీకి వీధి దీపాలు మంజూరు చేయించింది. వారం తిరక్కుండానే కాలనీలో వీధి దీపాలు అమర్చబడ్డాయి. సంఘంవారి ఆనందానికి అంతులేదు. వారు ఆమెకి కృతజ్ఞతలు  తెలియజేశారు.

 
    కాలనీకి అంత త్వరలోనే వీధి దీపాలు అమర్చబడడం ఎంతో ఘనవిజయంగా భావించారు సంఘంవారు.

 
    అంతటి ఘన విజయానికి తగినట్లుగా వీధి దీపాలకు  ఏ ప్రముఖ వ్యక్తి చేతనో స్విచ్  ఆన్ చేయించి ప్రారంభం చేయించాలని భావించారు. పైగా ... సంఘం అధ్యక్షకార్యదర్శులు తాము మంత్రిగారిని తీసకురాలేనందుకు తన ప్రతిష్ట దెబ్బ తిన్నదనీ, ఈసారి తీసుకురాగలిగితే దానిని పెంచుకోవచ్చుననే ఆలోచనలో వున్నారు. ఈ పరిస్థితులలో వారు సంఘ సభ్యులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

 
    సమావేశంలో కొందరు విద్యుచ్చక్తి శాఖామాత్యుల పేరును సూచించారు. మరికొందరు విద్యుచ్చక్తి బోర్డు అధ్యక్షులైతే సబబుగా వుంటుందన్నారు. ఇంకొందరు ఇంతటి ఘనకార్యాన్ని సాధించిపెట్టిన ఆ లేడీ ఎం. ఎల్. ఏ. గారి చేతనే ప్రారంభోత్సవం చేయిస్తే సబబుగానూ, సభ్యంగానూ వుంటుందనీ, తమ కృతజ్ఞతలను వ్యక్తం చేసుకోవడానికి అంతకన్నా మంచి అవకాశం వుండదనీ వాదించారు.


    ఎప్పటిలాగే ఈ విషయంలో కూడా సభ్యులలో ఏకాభిప్రాయం కుదరలేదు. చివరికి సభ్యులు అధ్యక్ష, కార్యదర్శులను విద్యుచ్చక్తి బోర్డు అధికారులతో త్వరపడి  లైట్లను ఆనే చేయవద్దనీ, త్వరలోనే  ప్రముఖ వ్యక్తి చేత వాటికి ప్రారంభోత్సవం చేయించాలనే విషయం తదుపరి సమావేశంలో నిర్ణయించాలని ప్రదిపాదించి ఆ సమావేశం వాయిదా వేశారు.

 
    సభ్యుల ఆదేశం ప్రకారం అధ్యక్ష, కార్యదర్శులు విద్యుచ్చక్తి బోర్డు అధికారులతో మాట్లాడి, తమ సంకల్పం  వారికి తెలియజేసి, కొద్దిరోజులు కాలనీలో లైట్లను వేయవద్దని కోరారు. అందుకు వారు కాడూ ఒప్పుకున్నారు.


    రోజులు మాత్రం గడిచిపోతున్నాయి.


    కాలనీలో వీధి దీపాలు పడ్డా వాటికి వెలిగే యోగ్యత ఇంకా కలుగలేదు. ప్రారంభోత్సవం ఎవరిచేత చేయించాలనే విషయం ఇంకా నిర్ణయం కాలేదు. విద్యుచ్చక్తి బోర్డువారు కూడా - కాలనీ వారికి పట్టనప్పుడు తమకేమిటి? అని పట్టించుకోకుండా ఊరుకున్నారు.


    వానాకాలం వచ్చేసింది. వానలు జోరుగా కురవసాగాయి. గడిచిన మూడు రోజులుగా ముసురు పట్టి వానలు దట్టంగా కురుస్తున్నాయి. కాలనీలోని గోతులన్నీ నీళ్లతో నిండిపోయాయి. ఏది రోడ్డో, ఏది స్థలమో, ఎక్కడ గోయి వుందో తెలియరావడం లేదు.


     ఆరోజు రాత్రి వాన బాగా కురుస్తోంది. ఆకాశం కారు మేఘాలతో వుండడంతో  అంతా చిమ్మచీకటిగా వుంది. ఆ రాత్రి ఆఫీసు నుంచి ఆలస్యంగా వస్తూ కంగారుగా ఇంటికి చేరే ప్రయత్నంలో  కాలనీలో వుండే ఒక వ్యక్తి - నీటితో నిండిపోయి, రోడ్డువారగానున్న ఒక నూతిలోకి పడిపోయాడు. అంతే... మళ్లీ లేవలేదు.


    ఆ దుర్మరణ వార్తని పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. కాలనీలో వీధి దీపాలు ఏర్పాటుచేసి కూడా వాటిని విద్యుచ్చక్తి బోర్డువారు అశ్రద్దతో వేయడంలేదనీ, వాటిని వేసి వుంటే ఆ దుర్ఘటన జరిగి వుండేది కాదని ఘాటుగా విమర్శించాయి.


    తేలు కుట్టిన దొంగల్లాగా ఊరుకున్నారు- కాలనీ సంఘంవారు. నిష్కారణంగా వచ్చిన అపనిందకు చాలా బాధపడ్డారు విద్యుచ్చక్తి బోర్డువారు.


    అంతే... ఆ మర్నాడే ఆ కాలనీలో వీధి దీపాల ప్రారంభోత్సవం జరిగింది - ఎవరికీ చెప్పకుండా, ఎవరినీ పిలవకుండా, ఏ సన్నాహమూ లేకుండానే.


    ఆ ప్రారంభోత్సవం చేసినవాడు... ఒక లైన్ మన్!


                -ఆంధ్రభూమి దిన పత్రిక... ఆదివారం 12 ఫిబ్రవరి '78


    
                                             పర్వాలేదు


     డాక్టర్ :    చూడండి మేడం... మీరు మీ భర్తకి దూరంగా వుండడం అవసరం.


    వనజ    :ఎన్నాళ్ళు?


    డాక్టర్    :ఎన్నాళ్ళోనా... జస్ట్ - మూడు నెలలు!


    వనజ    : అయితే పర్వాలేదు. నా పాత బాయ్ ఫ్రెండ్ ని పిలుస్తాను. ఈ మూణ్ణెల్లూ అతను కంపెనీ ఇస్తాడు.


    
                              ముచ్చటగా మూడు మాటలు


    రాజారావుది వన్ వే ట్రాఫిక్. ఎంతగా చీదరించుకుంటున్నా వెంకట లక్ష్మి వెంటపడుతూనే వుండేవాడు.


    ఒకరోజున ఆమె పార్క్ లో  ఒంటరిగా వుండడం చూసి - "ప్రేయసీ.. ముచ్చటగా మూడే మాటలు చెప్పు. అది విని నేను ఆనందంతో గాలిలో తేలిపోవాలి" అన్నాడు.


    "వెళ్ళి వురేసుకు చావు!"  అంది వెంకట లక్ష్మి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS