మంత్రిగారి గారడీ - మహ గొప్ప పేరడీ
టౌన్ హాల్ జనంతో కిటకిటలాడుతోంది.
సభాస్థలికి మంత్రి పుంగవులు భాగ్యారావు వేంచేశారు.ఆయన వెనకాలే స్థానిక యం. ఎల్. ఏ. వామన మూర్తి, మున్సిపల్ చైర్మన్ రంగప్రసాద్ గారూ వచ్చారు. వారివెంట ఊరిలోని ఛోటా, బడా నాయకులు కొందరు వచ్చారు.
అమాత్యులవారు అగుపడగానే జనంలోంచి "భాగ్యారావుగారూ... జిందాబాద్!"అన్న నినాదాలు మిన్నుముట్టాయి.
సభా నిర్వాహకుల తరపున ఒక వ్యక్తి వేదిక పైకి ఎక్కి మైక్ ముందు నిలబడి, "మహాశయులారా! మనం స్థాపించిన కుల నిర్మూలన సంఘం ఈ సుదినాన వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రులు, గౌరవనీయులు అయిన భాగ్యారావుగారు విచ్చేయడం మన భాగ్య విశేషం. ఈ సమావేశానికి మన నియోజకవర్గ శాసనసభ్యులైన గౌరవనీయులు వామన మూర్తిగారు అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఆత్మీయ అతిథిగా మనందరికీ పరమ ఆత్మీయులైన మున్సిపల్ ఛైర్మన్ గారైన గౌరవనీయులు రంగప్రసాద్ గారు ప్రసంగిస్తారు. గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులు, ఛైర్మన్ గార్లను వేదికపైకి రావలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను" అని చిరుప్రసంగం చేశాడు.
ఆహ్వానితులు అందలం ఎక్కగానే అతగాడు వేదిక దిగి వెళ్ళి ముందువరసలో కూర్చున్నాడు.
వామన మూర్తిగారు నిలబడి -
"మహా జనులారా! నేను ఎంతో సుదినం. ఈనాడు మనందరికీ మహత్తరమైన సందేశం అందించడానికి మంత్రివర్యులు విచ్చేయడం మనందరి భాగ్యం. మీరందరూ వారి ఉత్తేజపూర్వకమైన ఉపన్యాసాన్ని వినడానికి ఉవ్విళ్ళూరుతున్నారన్న విషయం నాకు తెలుసు. మీరే కాదు..., నేను కూడా ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నాను. అందువల్ల నేను ఎక్కువ మాట్లాడకుండా, గౌరవనీయులైన అమాత్యశేఖరుల వారిని తమ అమూల్య సందేశం అందించవలసిందిగా అర్దిస్తున్నాను" అని కూర్చున్నాడు.
జనం కరతాళ ధ్వనుల మధ్య చిద్విలాసంగా లేచి నుంచున్నారు అమాత్య శేఖరులు. చిరునవ్వు చిందిపోకుండా తలవంచి, చేతులు మోడ్చి నమస్కరించారు. వెంటనే మళ్ళీ జనంలోంచి చప్పట్లు పెద్దగా మోగాయి.
ముందు కూర్చున్న సభా నిర్వాహకుడు ఛంగున స్టేజీ మీదకెక్కి -
"మహాజనులారా... ఇప్పుడు మొట్టమొదటి ముఖ్యమైన కార్యక్రమం వేదికపైనున్న ప్రముఖులను పుష్పమాలలతో సత్కరించడం. ముందుగా మంత్రివర్యులను మా మున్సిపల్ కౌన్సిలర్లు అయిన నిమ్మకాయల దబ్బయ్యగారు, గున్నపాటి పున్నారావుగారూ ప్రత్యేక పూలహారంతో సన్మానిస్తారు" అని ప్రకటించాడు.
వేదికకు వెనుకగా వెదురుబుట్టలు పెట్టిన సుమారు పది కిలోల బరువున్న కొండచిలువలాంటి గులాబీపూల మాలను సుందోపసుందుల వంటి ఆ ఇద్దరూ చెరోవైపూ పట్టుకొని, ఆపసోపాలు పడ్తూ వేదిక పైకి మోసుకొచ్చారు.
మంత్రిగారిది చూడడానికి భారీకాయమే కాని..., వట్టి ఊబ శరీరం. వాపే కాని బలుపు లేనట్లు వుంటుంది. గాలి కొట్టిన ట్యూబ్ లాగా వుండి పిన్ను గుచ్చుకుంటే గాలి దిగిపోయి అప్పడంలా మారే బాపతు. ఆయన ఒక మొబైల్ షుగర్ ఫ్యాక్టరీ. చక్కెర వ్యాధికి చిక్కి "తింటే ఆయాసం... , తినకపోతే నీరసం' అన్నట్లుంటాడు.
సుందోపసుందులు ఆ మాలను అతి జాగ్రత్తగా పట్టుకొని శ్రీవారి దగ్గరకు తీసుకువచ్చారు.
ఆ దండను చూడగానే ముందు కొంచెం ఉలిక్కిపడ్డాడు భాగ్యారావుగారు. కానీ.... సభా మర్యాద తప్పదు కనుక, చిరునవ్వు పులుముకొని కొంగలాగా తల ముందుకు సాచాడు.
అసలే డయాబెటిస్...! ఆపైన అప్పటికే అతివినయ భారంతో వంగిపోయి మెడ ఎంత నెమ్మదిగా వేసినా ఆ దండ బరువుకి శ్రీవారి మెడ గుర్రపు నాడాలాగా మరింత వంగిపోయింది.
ఒక్క దండ అయితే ఏదో సంసారపక్షంగా సర్దుకుపోవచ్చు. కాని - ఆయన అభిమానులూ, అభిమానాన్ని ఆకాంక్షించేవారూ, వారి అభిమానాన్ని బహిరంగంగా ప్రదర్శఇంచాలని ఆరాటపడే వీరాభిమానులూ, ఆశ్రితులూ, ఆశ్రయం కోసం అర్రులు చాచేవారూ...., వగైరా, వగైరాలూ, ఆమాంబాపతు వారూ.... వెంట వెంటనే తమ 'దండయాత్ర' మొదలుపెట్టారు.
దండ - దండకీ చప్పట్లు దండిగా, మరింత దండిగా మోగసాగాయి. దండల సంఖ్యలోనూ, మోగుతున్న చప్పట్ల తీవ్రతలోనూ తనకున్న పలుకుబడిని అంతరంగంలో అంచనా వేసుకోసాగారు అమాత్య శేఖరులవారు.
పుష్ప విలాసం పూర్తి అయింది.
మనసులో అయిష్టంగానే వున్నా మర్యాదకోసం మంత్రిగారు ఆ దండలను అతి సున్నితంగా దంతపు భరిణలను ఎత్తినట్లు జాగ్రత్తగా ఎత్తి ముందున్న బల్ల మీద వుంచారు. ఆ గుట్ట చాటున మంత్రివర్యులు పిట్టలాగా వుండిపోతారేమోనన్న భయంతో సభా నిర్వాహకులు తాము వేసిన భారీ దండను మాత్రం బల్ల మీద వుంచి మిగిలిన వాటిని వెనుక బల్ల మీదికి మార్చారు. అటుతర్వాత సభామర్యాదను పాటించి తోడి పెళ్లికొడుకుల్లాగా వేదికపైన కూర్చున్న యం. యల్. ఏ. గారికీ, చైర్మన్ గారికీ పూలమాలలు వేసి చేతులు దులుపుకున్నారు.
సభ సద్దుమణిగింది. జన సమూహం అమాత్యులవారి ఉపన్యాస ఝరిలో తేలియాడడానికి చెవులు రిక్కించుకొని వుంది. అంతటి ప్రజావెల్లువను చూస్తుంటే శ్రీవారి ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. నెమ్మదిగా మైక్ ను పట్టుకొని దగ్గరకు లాక్కున్నారు. గొంతు సవరించుకొని ఉపన్యాసానికి ఉపక్రమించారు.
ఆన్ లో వున్నమైక్ లో ఆయన గొంతు ఉరుము ఉరిమినట్లుగా వినిపించి ఆయననే భయపెట్టింది. మైక్ కూడా భయపడిందో, ఏమో.... 'కుయ్యి -' మని కూసింది. వెంటనే మోకానిక్ రంగంలోకి దూకి మైక్ ని సరిచేశాడు.
ఈసారి మంత్రివర్యులు మైక్ టెస్టింగ్ కోసం దాని మీద వ్రేలితో తాటించారు. ఆ తాటింపు మైక్ లో మద్దెల దరువల్లే మ్రోగింది. మైక్ ఆర్డర్ లో వుందన్న తృప్తితో శ్రీవారు ఈసారి గొంతు సరిచేసుకోకుండానే ఉపన్యాసానికి ఉపక్రమించబోయారు. కానీ..., కర్మకొద్దీ దగ్గు తెర వచ్చి మైక్ ద్వారా పిడుగులు కురిపించింది.
ఎలాగైతేనేం.. ఈ బాలారిష్టాలన్నిటినీ తట్టుకుని మంత్రిపుంగవులు "మహా జనులారా! సోదర సోదరీమణులారా!" అంటూ ప్రారంభించారు.
'సోదర సోదరీమణులు మహా జనులు కారా?' అంటూ వెనక బెంచీ వర్గాలు కొన్ని కుశ్శంకలు, లఘుశంకలు లేవదీశాయి. అయితే అవి మంత్రిగారి చెవిదాకా రాలేదు.
".....అందువల్ల నేను చెప్పేదేమిటంటే మనం, మనందరం - అంటే... మీరూ, మేమూ అందరం కలిసి ఈ కులతత్త్వ రాక్షసిని సమూలంగా నాశనం చేయాలి. మారుమూల పల్లెల్లోని హరిజనులు, గిరిజనులు కూడా సగర్వంగా తలెత్తుకు తిరగగలిగేటట్లు చేయాలి. వారికి చిన్నపాటి అవమానం జరిగినా మనం సహించకూడదు. ఆ విషయంతో ఉదాసీనత చూపించే అధికారులపై వారు ఎంత పెద్దవారైనా, ఎంతటి ప్రముఖులైనా, ఆఖరికి మంత్రులైనా సరే... తీవ్రమైన చర్య తీసుకోవాలి."
