తిరిగి మెలకువ వచ్చి చేతినున్న వాచి చూసుకునేసరికి పది దాటిపోయింది. కంగారు పడుతూ లేచి ఆదరాబాదరాగా స్నానం పూర్తి చేసుకుని, బట్టలేసుకుని వార్డుకు వెళ్ళిపోయాను.
నేను మేల్ వార్డులో పనిచేస్తున్నాను. అక్కడికి వెళ్ళేసరికి అసిస్టెంట్ ఎవరూ కనిపించలేదు. సిస్టర్స్ యథాప్రకారం అటూ యిటూ హడావుడిగా తిరుగుతున్నారు. ఒక నిముషం ఊరుకుని ఫిమేల్ వార్డువైపు వెళ్ళాను.
లోపలకు వెళుతూంటే వాతావరణంలో ఏదో మార్పు కనిపించినట్లయి, గుండె గబగబ కొట్టుకుంది మరి నాలుగడుగులు వేసేసరికి రాత్రి ఆమె పడుకున్న మంచం పరుపూ, ఎర్రటి దుప్పటీ లేకుండా బోసిగా కనిపించింది.
"సిస్టర్ !" అని గట్టిగా అరిచాను.
డేసిస్టర్ నా పిలుపుకు ఏమనుకుందో పరిగెత్తుకుంటూ వచ్చింది.
"ఈ బెడ్ మీద వుండే స్త్రీ ఏమయిపోయింది ?"
"చాలా చిత్రం డాక్టర్ ! నేను డ్యూటీలోకి వచ్చాక పది నిముషాల పాటూ నవ్వుతూ కనిపించింది. 'రాత్రి మీకు బాగా నిద్రపట్టిందా సిస్టర్ ?' అంటూ నన్ను పలకరించింది కూడా. ఏమయిందో ఏమో_కాసేపటికి ఒక వెర్రికేక వినిపించి అంతా అటుకేసి పరుగెత్తుకుపోయాం. అంతవరకూ నవ్వుతూ కలకలలాడిన ఆమె ముఖం వివర్ణమైపోయి వుంది. శ్వాసకోసం నరకయాతన పడుతూంది. మేము కంగారుపడి అటూ ఇటూ పరుగులెత్తాం. ఒక్క డాక్టరుగానీ, హౌస్ సర్జన్ గానీ ఎవరూ కనబడలేదు. ఆక్సిజన్ పెట్టి, సెలైన్ పెట్టీ మా చేతనైంది మేము చేశాం. ఏమయితేనేం; మరో పది నిమిషాల్లో అంతా ముగిసిపోయింది. పాపం, వెరీ బ్యూటీఫుల్ లేడీ" అన్నది సిస్టర్ విచారంగా.
నాకు కళ్ళు చీకట్లు క్రమ్మినట్లయింది .అంత బాధ ఎప్పుడూ పడలేదు. అక్కణ్నుంచి నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయాను.
రెండు రోజుల దాకా మామూలు మనిషిని కాలేకపోయాను. బాండేజస్ తో నిండివున్న శరీరం, అందులోంచి వికసించినట్లు పద్మంలాంటి ఆమె ముఖం, ఆమె నిర్భయత్వం, దుడుకు మాటలూ నిర్దయగా వెన్నాడాయి నన్ను.
అర్దరాత్రి గదిలో కిటికీ ముందు కూర్చుని థియేటర్ వంక చూస్తూ 'నేను డాక్టర్ని ఇలాంటి అనుభూతులూ, మమకారాలూ, మమతలూ నేను పెట్టుకోకూడదు. త్రికరణ శుద్ధిగా వైద్యం చేయడమే నా ధర్మం. ఒక రోగికి సానుభూతిలో శుశ్రూష చేయాలేగాని అంతరంగికమైన స్పందనలకు చోటివ్వకూడదు, అనుకున్నాను.
మనశ్శాంతికోసం మరునాడు పాథాలజీ మ్యూజియంలోకి వెళ్ళి నలువైపులా కలయ తిరిగాను. అక్కడ కనిపించింది అసలు మానవ జీవితంలోని పరమ రహస్యం నాకు. రోగాలతాలూకు అంతఃస్వరూపాలు, సామాన్య జీవి చూడలేని మానవ శరీరావయవాలలోని రోగ చిహ్నాలు, వాటిలోని నిజ వేదాంతం నాకు కనిపించింది.
ఎన్ని రకాల స్పెసిమెన్ లు! అందమైన గాజు జార్లలో లోషన్ లో భద్రం చేయబడి అపురూపంగా వాడబడుతూన్న అమూల్య మానవ శిథిలాలు.
ఒకచోట కేన్సర్ ది....వక్షస్థలంలో, కడుపులో, చర్మంలో, కంఠావయవాల్లో, లివర్ లో, ప్రేవులో, యుటెరస్ లో, తలలో, ఊపిరితిత్తుల్లో కేన్సర్.
గుండె జబ్బులు గుండెలు, రాళ్ళు వున్న కిడ్నీలు, పుండు పడిన కడుపు, దానికి సంబంధించిన యితర భాగాలు, రకరకాలకంతులు....అన్నీ చూసుకుంటూ ముందుకు పోతున్నాను.
ఒకచోట అనుకోకుండా నా కాళ్ళాగిపోయాయి. ప్రొఫెసర్ హాల్డెన్ శరీరంలోని వివిధభాగాలు పొందుపరచబడి వున్న విభాగం అది అతడు విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త. బయోకెమిస్ట్రీలో ఆచార్యపదవి చేసి విరమించిన వాడు. కేన్సర్ వ్యాధితో పీడించబడి, మరణించక మునుపే తన శరీరాన్ని ప్రజల ఉపయోగార్ధం వాడుకొనవచ్చునని దత్తం చేసేశాడు. చనిపోయాక ఆయన మృత కళేబరాన్ని మా హాస్టల్ కి తీసుకువచ్చారు. ఆయన శరీరానికి ఎటాప్స్ చేస్తూంటే నేను కూడా దగ్గర నిల్చుని చూశాను. ఎన్నో అవయవాలను, యించుమించు యిరవై భాగాలను కేన్సర్ తినేసింది.
తన రోగాన్ని గురించి ఆయన ఉల్లాసంగా ఓ గేయం రాసుకున్నాడు. అది అందమైన ఫ్రేములో కట్టి గోడకు తగిలించబడి వుంది.
"....I know that cencer often kills
put so do cars and sleeping pills
And it can hunt one till one sweets
so can bad teeth and unpaid debts...."
అంత ఉల్లాసంగా రాస్తూ తనకు జరిగిన ఆపరేషన్ గురించి అతి రమ్యంగా వర్ణించుకున్నాడు.
"My rectum is a sarious loss to me
But I have a very near colostomy" అంటాడు.
మనసులో ఆయనకు అంజలి ఘటించి తేలికపడిన హృదయంతో అక్కడ నుంచి వచ్చేశాను.
అలాగే మనసు బావుండనప్పుడు హిపోక్రేటిక్ ఓత్ చదువుకుంటూ వుంటాను.
"నా వైద్య పరిజ్ఞానాన్ని రోగగ్రస్తులకు పూర్తిగా ధారపోస్తాను. ఎవరన్నా విషం యివ్వమని అడిగినా యివ్వను అట్లాంటి పనులు చెయ్యమనీ సలహా యివ్వను. గర్భస్రావాలు చేయటానికి ప్రోత్సాహించను. నా జీవితాన్నీ, కళను కూడా పవిత్ర జ్ఞానంతో నింపుకుంటాను...." యిట్లా ఎన్నో సూక్తులతో సాగిపోతుంది.
తిరిగి మామూలు జీవితంలో పడిపోయాను. మళ్ళీ హాస్పిటల్, మళ్ళీ పేషెంట్లు, మళ్ళీ ఆపరేషన్లు....
సర్జికల్ వార్డులో నేను ఆడవాళ్ళ వైపుకు మారలేదు. ఫిమేల్ వార్డుకు, చీఫ్, రౌండ్సుకు తప్ప మిగతా వేళల రావట. అక్కడే సుఖంగా వుంది. రెండో నెలకూడా అక్కడే వుండిపోతానని జగన్నాధం అన్నాడు. అసిస్టెంట్లెవరూ మమ్మల్నడగలేదు. మేము వార్డులు మారలేదు.
ఒకసారి రెండు రోజులపాటు జగన్నాధం సెలవు పెట్టాడు. నేను రెండుచోట్ల కూడా పని చేయాల్సి వచ్చింది. ఒకనాడు ఫిమేల్ వార్డులో ఇంజక్షన్ చేస్తుంటే గైనకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కామేశ్వరిగారు వెనుక నుండి మెల్లగా వచ్చి "డాక్టర్ !" అని పిలిచింది.
నేను తలత్రిప్పి చూసి, వెంటనే ఒదిగి నిలబడుతూ "ఏమండీ, మేడమ్" అన్నాను వినయంగా.
"మీరు యిందులో పని చేస్తున్నారా ?" అంది.
నే నామెకు బాగా తెలుసు నా యింటర్నీ షిప్ లో నా ఉత్సాహం చూసి, ఆమె నేనంటే శ్రద్ధ తీసుకుని ఫోర్ సెప్స్ వేయటం, డి. ఎండ్ సి. ఆపరేషన్లు చేయటం, దగ్గర వుండి, చెప్పి చేయిస్తూ వుండేది.
"అవును, మేడమ్" అన్నాను.
"ఈ వార్డులో కేన్సర్ బ్రెస్ట్ కేసు లేమయినా వున్నాయా ?" అనడిగింది, ఒక క్షణం వూరుకుని.
"ఉన్నాయి మేడం ! ఒకటి నిన్న ఎడ్మిట్ అయింది. ఒకటి క్రిందటి వారం ఎడ్మిట్ అయింది."
"నాకు చూపిస్తారా ?"
"రండి" అని కామేశ్వరిగారిని నా వెంట తీసుకువెళ్ళాను. రెండు కేసులూ చూపించాను. ఒకటి తర్డు స్టేజి, రెండవది ఫోర్త్ స్టేజి.
"థాంక్స్ ! మీరు వెళ్ళి పని చూసుకోండి డాక్టర్ !" అని ఆమె దానిలో ఒకరిని పలకరించడానికన్నట్లుగా ఒకామె భుజంపైన ఆప్యాయంగా చెయ్యివేసింది. నేను అక్కడి నుంచి వచ్చేశాను.
వార్డంతా కలయ తిరుగుతూ, యింజక్షన్ లు చేస్తూ, మధ్య మధ్య కామేశ్వరిగారి వంక చూడకుండా వుండలేకపోయాను. ఆమె వారిని ఏవో ప్రశ్నలడుగుతూ వారు చెప్పేది శ్రద్దగా వింటూ ,స్క్రీన్ కొంచెం ప్రక్కకి లాగి, వారి రవికా ,అవీ వూడ దీయించి, వక్షస్థలంలోని కేన్సర్ ని ఎంతో శ్రద్ధగా పరీక్ష చేస్తోంది.
కామేశ్వరిగారికి నలభయి ఏళ్ళుంటాయి. మనిషి మనిషి రూపసి. పచ్చగా, సన్నగా, పొడవుగా వుంటుంది. కళ్ళజోడు పెట్టుకుంటుంది. ఆమె పెదవులెప్పుడూ అమాయకంగా చిరునవ్వు చిందుతూ వుంటాయి. ఆమె అవివాహిత.
కామేశ్వరిగారు చాలా సాధుజీవి. ఆమె అవివాహితగా ఎందుకు వుండిపోయిందో తెలియదుగాని, ఎవర్ని గురించైనా సరే చెడుగా మాట్లాడటానికి అలవాటుపడిన వారు కూడా ఆమెని గురించి ,కించిత్తుమాట మాట్లాడటం నేను వినలేదు. ఆమె తరుచు వేదాంత గ్రంథాలు చదువుతూ వుండేది దేవాలయాలకు వెడుతూ వుండటం, ఆధ్యాత్మిక సభలకు వెళ్ళటం నేనెన్నోసార్లు చూశాను. విద్యార్ధులకు క్లినిక్స్ తీసుకునేటప్పుడు కూడా ఎప్పుడైనా అధ్యాత్మిక చర్చ వస్తే కేసు గురించి ముచ్చటించటం మానేసి, యిహ ఆ చర్చను తలచుకుంటూ వెళ్ళిపోయేది.
ఓ అరగంట గడిచాక ఆమె పేషెంట్లిద్దరితోనూ మాట్లాడటం పూర్తిచేసి, అక్కణ్నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయింది. మోకాళ్ళ వరకూ వ్రేలాడే పొడుగాటి ఏ ప్రాన్ వేసుకుని చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ ఆమె కదిలి వెళ్ళిపోతూంటే వెనక నుంచి చూడటానికి ఎంతో ఠీవీగా వుంది.
సిస్టర్ నా ప్రక్కకు వచ్చి నిలబడటం మొదట గమనించలేదు. "ఎందుకనో ఆవిడ అప్పుడప్పుడూ వచ్చి బ్రెస్ట్ కేన్సర్ కేసులు చూసిపోతూ వుంటుంది" అన్న మాటలు వినిపించినప్పుడు తలత్రిప్పి చూశాను.
"చాలా సార్లు వచ్చేవారా ?"
"నేను క్రిందటి నెల్లో కూడా ఈ వార్డులోనే పనిచేశాను. రెండు మూడుసార్లు ఆవిడ వచ్చి ఎంతో జాగ్రత్తగా బ్రెస్ట్ కేన్సర్ పేషెంట్లని పరీక్షచేసి వెళ్ళింది. మూడు నాలుగు నెలలుగా యిలా జరుగుతోందని స్టాఫ్ చెప్పింది."
సిస్టర్స్ ని ప్రతినెలా పోస్టింగ్ మార్చేస్తారు. ఎప్పుడైనా ఒకసారి మాత్రం మార్చటానికి కుదరదో ,ఎందుచేతో చేసిన చోటనే వుంచుతారు. స్టాఫ్ నర్సులకు మాత్రం ఆరేడు నెలలు ఒకసారి గాని ఒక వార్డు నుంచి మరో వార్డుకు మార్చరు.
"అలాగా !" అని ఊరుకున్నాను.
నాలుగు రోజులు గడిచిపోయాక ఒకనాటి సాయంత్రం ఒక యిన్ జరీ కేసుకు గ్లూకోజ్ యివ్వాల్సి వచ్చింది. పేషెంటు ఓ లారీ డ్రైవరు. అంత బలాడ్యుడు లారీ యాక్సిడెంటులో తలకి గట్టిదెబ్బ తగలడంచేత అర్ధస్మృతిలో వున్నాడు. మూలుగుతూ వుంటాడు. కాని బయటేం జరిగేదీ అతనికి తెలియదు.
