Previous Page Next Page 
మారణహోమం పేజి 22

 

    "వాణ్ణి టాకిల్ చెయ్యాలి."    
    "యస్ సర్!"    
    "టెలీఫోన్ తీసుకురా!"
    ఫోన్ తీసుకొచ్చి, అతని ముందు బల్లమీద ఉంచి, ప్లగ్గుని సాకెట్ లో పెట్టాడు రాజు.    
    రెండు నెంబర్లు డయల్ చేసి ఇద్దరు మనుషులకి చెప్పాడు నిఖిల్. "ఒక ఎన్ జీవో....." అని ప్రశ్నార్ధకంగా తల ఎత్తి రాజువైపు చూసి, అతను చెప్పింది విని.... "పేరు రంగారావు.....ఆయన కూతుర్ని ఒక రౌడీ టాక్సీలో ఎత్తుకెళ్ళాడుట. వాడూ, ఆ అమ్మాయి ఎక్కడున్నా నాకు కావాలి. అరగంటలో! అత్యవసరం!"    
    వెంటనే ఆ మాట మరో పది మందికి అందింది. ఆ పదిమంది మరో పదిమందికి చెప్పారు. ఆ అర్దరాత్రి అప్పుడు నగరంలో సగం నిశ్శబ్దంగా మేలుకుంది. దరిద్రులు, పీడితులు, తాడితులు, వేశ్యలు, బ్రోకర్లు, గోనె సంచిలో చిత్తుకాగితాలు ఎత్తుకుని అమ్ముకు బతికే వాళ్ళు, ఆటోడ్రయివర్లు, హోటలు సర్వర్లు, లారీ క్లీనర్లు-    
    సమాజంలో అట్టడుగు పొరకు చేరుకున్న ఆ జనం అంతా లేచి ఆ రౌడీకోసం వెదకడం మొదలెట్టారు. అందరి మనసులోనూ ఒకేభావం. ఇన్నాళ్ళూ నిఖిల్ వల్ల రకరకాల సహాయాలు పొందారు తామందరూ.    
    ఇప్పుడు తాము నిఖిల్ కి సాయం చేసే అవకాశం - కాదు - అదృష్టం వచ్చింది. దీన్ని జారిపోనివ్వకూడదు. ఆ చీకట్లో కంటికి కనబడని వల ఒకటి ఆ నగరాన్ని, దాని పరిసరాలనీ కప్పేసింది.    
    త్వరలోనే అందులో చిక్కుకుపోయాడు ఆ రౌడీ. అతని పేరు రమేష్.    
    అర్దరాత్రి పన్నెండు గంటలకి ఇంకా పది నిమిషాలు ఉందనగా, ఆ రౌడీ రమేష్ నీ, అతనికి బందీగా ఉన్న ఎన్ జీవో రంగారావు గారి అమ్మాయి రాధనీ తెచ్చి నిఖిల్ దగ్గర వదిలేశారు.    
    ఆ అమ్మాయి వైపు చూశాడు నిఖిల్. పొడుగ్గా ఉంది అమ్మాయి. ఇంకా పసితనం కనబడుతోంది మొహంలో. చెంపలమీదా, వక్షంనిండాగాట్లు. కింద పెదిమ తెగి కారిన రక్తం తెల్లజాకెట్ ని ఎర్రగా మార్చేసింది. జాకెట్టు ఒకవైపంథా చిరిగిపోయి ఉంది. బ్రాబెల్టు తెగిపోయి ఉంది. రౌడీ రమేష్ కుడిచెంపమీద గోళ్ళతో రక్కినట్లు నలుగు రక్తపు చారికలు నిలువుగా కనబడుతున్నాయి. అతని చెంప మీదనుంచి ఊడివచ్చిన చర్మం ఆ అమ్మాయి గోళ్ళలో ఇరుక్కుని ఉంది.    
    "ఏం చేశాడు?" అన్నాడు నిఖిల్, రాధతో, ధర్మాధికారిలా.    
    "ఇప్పటిదాకా ఏం చెయ్యకుండా గింజుకుంటూ ఆపగలిగాను. వీళ్ళు సమయానికి వచ్చి రక్షించకపోతే, ఆయాసంతో లొంగిపోక తప్పి ఉండేది కాదు" అంది ఆ అమ్మాయి, రుద్దమైన గొంతుతో.    
    "వీడేనా నిన్ను ఇలా చేసింది."    
    "అవును"
    లేసర్ బీమ్స్ లా తీక్షణమైన చూపులతో ఒక్కసారి రమేష్ వైపు చూశాడు నిఖిల్. తర్వాత బిల్డింగ్ వాలా వైపు తిరిగి సాభిప్రాయంగా తల పంకించాడు.    
    భయంతో నిలువు గుడ్లేసుకు చూస్తున్నాడు రమేష్. "కమాన్ సన్నీ" అని అతని భుజంమీద చెయ్యేసి లోపలికి తీసుకెళ్ళాడు బిల్డింగ్ వాలా.    
    ఇదంతా కళ్ళార్పకుండా చూస్తూనే ఉంది అమూల్య. రౌడీ రమేష్ రాధని ఎత్తుకెళ్ళిపోవడం, రంగారావుగారు పోలీసు రిపోర్టు ఇవ్వడం, వాళ్ళు పెద్దగా పట్టించుకుపోవడం నిఖిల్ రంగంలోకి దిగి నిమిషాల్లో దోషిని పట్టి తెప్పించడం, రాధ మానప్రాణాలు కాపాడడం ఇవన్నీ ఆమెకి అర్ధమయ్యాయి.    
    అప్పుడు మళ్ళీ వచ్చాడు బిల్డింగ్ వాలా. "రామ్మా అమూల్యా! దా!" అన్నాడు నవ్వుతూ. "రవుండ్స్ కి టైమయింది. రాధా! నువ్వు కూడా!"    
    తప్పదని తెలుసు అమూల్యకి. రాధకూడా బెదురు చూపులతో చుట్టూతా చూస్తూ బిల్డింగ్ వాలాని అనుసరించింది.    
    టార్చర్ ఛాంబర్ దగ్గరికి వచ్చారు ముగ్గురూ.    
    అక్కడ పందిలా గీపెడుతున్నాడు రమేష్. అతని కళ్ళు షాక్ తో పెద్దవయి ఉన్నాయి. అనెస్తీషియా ఇవ్వకుండా, ఆపరేషను చెయ్యకుండా తన దేహంలోని ఒక భాగాన్ని తెగకొట్టేస్తే విలవిల్లాడినట్లు దుర్భరమైన బాధతో గింజుకుంటున్నాడు అతను. అతని పాంటు రక్తంతో ముద్దలా తడిసిపోయి ఉంది.    
    తెగిపోయిన బల్లితోక గిజగిజ కొట్టుకున్నట్లు కాసేపు అతను కాళ్ళూ చేతులూ తపతప కొట్టుకుని తర్వాత నిశ్చలంగా అయిపోయాడు.    
    అదంతా నిశ్చలంగా చూస్తోంది అమూల్య. చిత్రంగా, ఆమెకు ఈసారి భయమెయ్యలేదు. జాలి అనిపించలేదు. అభం శుభం తెలియని అమ్మాయి మీద అత్యాచారం చెయ్యబోయిన వాడికి ఈ శిక్ష చాలదు. ఇంకా తీవ్రమైన శిక్ష కావాలి అనిపించింది.    
    పక్కన ఉన్న రాధవైపు చూసింది అమూల్య. ఆ అమ్మాయి కళ్ళు ప్రతీకార జ్వాలతో వెలిగిపోతున్నాయి. పెదిమలు బిగపట్టి, ముక్కుపుటాలు పెద్దవిచేసి, చూస్తోంది టార్చర్ ఛాంబర్ లో నేలమీద పడి ఉన్న రౌడీ రమేష్ ని.
    
                                                          * * *
    
    రౌడీ రమేష్ అనుభవిస్తున్న చిత్రవధని అమూల్యా, రాధలకు వెనుకగా నిలబడి తనుకూడా చూస్తున్నాడు నిఖిల్, అతని కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి.    
    మెల్లగా వెనక్కి తిరిగి చూసింది అమూల్య.    
    "చచ్చిపోతున్న ఆ పురుగుని చూసి జాలిపడుతున్నావా అమూల్యా?" అన్నాడు నిఖిల్.    
    అమూల్య సమాధానం చెప్పలేదు.    
    "రాధా నీకెలావుంది? ఆర్ యూ హాపీ?"    
    కన్నీళ్ళతో అయోమయంగా తల ఊపింది రాధ.    
    మళ్ళీ అమూల్యవైపు తిరిగాడు నిఖిల్. "రాధ పరిస్థితిని నేను అర్ధం చేసుకోగలను. నా పరిస్థితిని రాధ కూడా అర్ధం చేసుకోగలదు. ఎందుకంటే ఇప్పుడు రాధా, ఆమె కుటుంబం అనుభవించిన మానసిక నరకం ఒకప్పుడు నేనూ అనుభవించినవాడినే కాబట్టి!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS