"డాక్టరుగారూ ! అత్తయ్యకేమీ ఫరవాలేదంటారా ?" అంది, ఒకచోట ఆగిపోయి.
అప్పుడు చూశానామె వంక. చెంగు ముఖంమీద నుండి ప్రక్కకి జారిపోయింది. చకితుణ్నయి నిలబడిపోయాను .దీపం వెలుగులో పాల నురుగులా గోచరించిందామె.
ఏదో చెప్పాను. ప్రశ్నలు వేసింది ,ఆదుర్దా వ్యక్తపరుస్తూ. అన్నిటికీ ఓపికగా జవాబు చెప్పి డ్యూటీ రూమ్ వైపు సాగిపోయాను.
ఈ సంఘటన గుర్తు రావటానికి ఇంతసేపు పట్టింది నాకు. అంత అవలీలగా ఆమె ఎలా జ్ఞాపకం చేసుకుందో.
"కొంచెం దగ్గరగా రండి డాక్టర్!" ఒకసారి కళ్ళను అటూ యిటూ కదిపి, ఎవరూ లేరని నిర్ధారణ చేసుకుంది కాబోలు, అభ్యర్ధిస్తున్నట్లుగా అంది.
రెండడుగులు ముందుకువేసి, ఆమె ముఖానికి చేరువగా నిల్చున్నాను.
"ఎవరికీ చెప్పరుగా యీ విషయం. మీలోనే దాచుకుంటారుగా. మరే...." అంటూ ఏదో చెప్పబోయి ఆగిపోయింది ఆమె. కళ్ళకు ఏదో యిష్టంలేని దృశ్యం కనిపించినట్లు, చూపు ఒకచోట ఏమీ తోచనట్లు నిలబడి పోయింది.
"ఎలా వుంది డాక్టర్ మా ఆవిడకు ?" వెనక నుండి కంఠం వినబడి తలత్రిప్పి చూశాను.
"ఫిమేల్ వార్డులోపలకు అడుగు పెట్టినందుకు క్షమించండి డాక్టర్ ! నా ఆదుర్దా అలాంటిది." నా వంక చూస్తూ వినయంగా అన్నాడతను.
ఆమె సంభాషణలో కల్పించుకుని "మావారిని పాపం, లోపల కాసేపు వుండటానికి అనుజ్ఞ యివ్వండి డాక్టర్ ! ఎంతయినా భార్యాభర్తలం కదా. అంతరంగికంగా కాకపోయినా విధిగా మాట్లాడుకోవాల్సిన విషయాలనేకం వుంటాయి" అన్నది అతన్ని సానుభూతిగా ఓసారి తిలకించి.
"ఇదిగో లక్ష్మీ ! నువ్విప్పుడు ఎలాంటి పరిస్థితిలో వున్నావో తెలుసా ? ఏమీ మాట్లాడకూడదు .పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి" అన్నాడు భర్త, ఆమెకు నచ్చచెబుతున్నట్లు.
"పాపం ! మిమ్మల్ని చూస్తే జాలేస్తోందండీ నాకు. మీ వల్లే కాలిపోయినట్లు బాధపడుతున్నారు" అని ఒక్క నిముషం మాట్లాడకుండా ఊరుకుంది.
ఇంతలో సిస్టర్ సిరెంజి చేతిలో పట్టుకుని నా దగ్గరకు వచ్చి "డాక్టర్ ! మార్పియా మరో డోసు యివ్వమని అసిస్టెంటు మరీ మరీ చెప్పి వెళ్ళారు. ఇదిగో తీసుకువచ్చాను. ఇవ్వండి" అంది.
అవును. ఆమె ముఖం చూస్తుంటే, తెలియని భయం నన్నావహించింది .ఆమెనలా మాట్లాడనివ్వటం మంచిదికాదని సిరంజి అందుకుని ముందుకు వంగాను.
ఆమె ముఖంలో ఆకస్మికంగా చెప్పరాని భయం, ఆతృత కనిపించాయి. "ఏమిటీ, నాకు మత్తు మందు యిస్తున్నారా ? వీల్లేదు. నన్ను యిలాగే తెలివిగా వుండనివ్వండి. నా బాధనంతా భరిస్తూ యిలాగే నవ్వుతూ బ్రతకనివ్వండి. నా కదే యిష్టం .అవును. నా అనుమతి లేకుండా బలవంతంగా నాకు మత్తుమంతు యిచ్చే అధికారం ఏమున్నది మీకు ? మీరు పిరికివాళ్లైతే, నా రూపం చూడలేకపోతే మీరు తీసుకోండి మార్ఫియా ! నేను ధైర్యంగల పిల్లను. అన్నీ కళ్ళతో చూద్దామనుకుంటున్నాను. నా చావును స్వయంగా పర్యవేక్షించాలనుకున్నాను" అంటూ గట్టిగా అరుస్తోంది ఆమె.
నేను లెక్కచేయకుండా సిస్టర్ సహాయంతో ఇంజెక్షన్ ఇచ్చేశాను.
ఆమె కళ్ళు పెద్దవి చేసి నావంక కోపంగా చూసింది. "నాకేమన్నా భయమనుకున్నారా ? ఒకటికాదు, వంద మార్పియా యింజక్షన్ లు యిచ్చుకోండి. నాకేం తెలివి తప్పదు. నే నిలానే కళ్ళు తెరుచుకుని, దెయ్యంలా చూస్తూ వుంటాను."
నేను అక్కణ్నుంచి వెళ్ళిపోతూ మంచం ప్రక్కనే నిలబడి వున్న ఆమె పెనిమిటివంక ఒకసారి చూశాను. అతని మనసులో ఏముందో అర్ధం చేసుకోలేకపోయాను. దిగులుందో, సంతోషముందో, కౄరత్వ ముందో, అపరాధినా అన్న సంశయం వుందో, అమాయకత్వముందో పోల్చుకోలేకపోయాను.
అంతటి రూపవతిని పొందినందు కతడు అదృష్టవంతుడు.
ఈ భావం అతడి విలువను పెంపొందించింది.
నేను వెళ్ళిపోతూంటే వెనకనుండి ఆమె గట్టిగా అరుస్తూనే వుంది.
బయట నాకోసం ఓ మెమో సిద్దంగా వుంది. మేల్ వార్డు నుంచి వచ్చింది. అక్కడికి వెళ్ళేసరికి అంతకు ముందే అక్కడికి అసిస్టెంట్స్ వచ్చారుగాని, కేసు చూస్తున్నారు.
పేషెంటు నలభై ఏళ్ళ మనిషి పొట్టదగ్గర ఎత్తుగా ఉబ్బినట్టు కనిపిస్తోంది.
శేఖరంగారు తల ఎత్తి చూసి "అంబిలికల్ హెర్నియా. ఇప్పటికే వీళ్ళు ఆలస్యం చేశారు, వెంటనే ఆపరేట్ చెయ్యాలి" అన్నారు.
అనకూడదుగాని అప్పుడెంత సంతోషం కలిగింది ! ఒకరకంగా వైద్య వృత్తి అతి కౄరమైనది. ఆపరేషన్ చేయటానికి అద్భుతమైన కేసు లభించింది కదా అని నేను ఉప్పొంగిపోతున్నాను. అది ఆ వ్యక్తికి జీవస్మరణ సమస్య. అలాగే ఓ అసలైన హార్ట్ కేసు చూసి ఫిజీషియన్ "ఆహా ! వినండి, వినండి. మర్మర్ ఎంత బ్యూటీఫుల్ గా వినిపిస్తోందో" అంటాడు. ఈ వృత్తిలో ఎంత దారుణం వుంది !
ఆ కేసును ఆపరేషన్ థియేటర్ కు తీసుకువెళ్ళి అక్కడి హంగామా అంతా పూర్తి చేసుకుని ఆపరేషన్ జయప్రదంగా జరిపించి బయటపడేటప్పటికీ మూడు గంటలసేపు పట్టింది. ఈ మూడు గంటలలోను ఎన్నోసార్లు మా గుండెలు పీచుపీచుమన్నాయి. ఒకసారి బి.పి. పడిపోయింది. ఒకసారి ఆక్సిజన్ పెట్టవలసి వచ్చింది. ఒకసారి రక్తప్రవాహం ఎక్కువైపోయి ఎంతకూ కట్టుబడలేదు .మొత్తం మీద గడ్డుకాలం దాటిపోయి, ఆపరేషన్ పూర్తి అయి పేషెంటు బ్రతికే సూచనలు కానవచ్చాయి.
అతన్ని స్ట్రెచర్ మీద వార్డుకు పంపించేసి, థియేటర్ బట్టలు విప్పేసి, ప్యాంటూ, షర్టూ వేసుకుని టైము చూసుకునేసరికి మూడు దాటిపోయింది. ఫిమేల్ వార్డుకు వెళ్ళాలనిపించి అటుకేసి బయల్దేరాను.
వరండాలో గోడకానుకుని రామలక్ష్మి పెనిమిటి నిద్రపోతున్నాడు. సిస్టర్ వార్డులో పేదు. ప్రక్క వార్డులోని సిస్టర్ తో బాతాఖానీ కొట్టటానికో ,టీ త్రాగటానికో వెళ్ళి వుంటుంది. వార్డంతా నిశ్శబ్దంగా వుంది. అంతా గాఢ నిద్రలో మునిగి వున్నట్లు కనిపించారు.
రామలక్ష్మి బెడ్ దగ్గరకు వెళ్ళి నిల్చున్నాను. మార్పియా ఆమెమీద బాగా పనిచేసింది. బరువుగా మూతలుపడిన ఆమె కనుదోయి ఎంతో సహజంగా కనిపించింది.
"ఏమిటి చెప్పాలనుకున్నారు నాతో ? నేను వచ్చాను ,చెప్పరూ ?" అన్న ప్రశ్న నా పెదవుల వెనుక ఎన్నోసార్లు మననం చేసుకున్నాను.
ఆమె కదలలేదు. కనులు విప్పి చూడలేదు.
ఆ సమయంలో నా కనిపించింది. ఈమె గురించి ఏమి తెలుసుకోకూడదు. ఆమె నాకేమీ చెప్పకూడదు. రూపంలో కనిపించిన బరువు, ఆర్ద్రత ఆమె మాటల్లోని సత్యంలో వుండకపోవచ్చు. ఆ సత్యం నేను తెలుసుకోకపోవటమే మంచిది.
మెల్లగా వెనుతిరిగి డ్యూటీ రూమ్ వైపు సాగిపోయాను.
ఒక మంచంమీద మెడికల్ హౌస్ సర్జన్ పడుకుని నిద్ర పోతున్నాడు, హాయిగా. అలసట అనిపించి రెండో మంచంమీద నడుంవాల్చాను.
కనులముందు ఏవో చిత్రాలు, నల్లని మబ్బులు.... ....కలత నిద్ర పట్టింది.
తిరిగి మెలకువ వచ్చేసరికి ఆరుదాటిపోయింది. ఒక్క నిముషం బద్ధకం తీర్చుకున్నాక నా కాళ్ళు నాకు తెలియకుండానే ఫిమేల్ వార్డువైపు తీసుకుపోయాయి.
రామలక్ష్మి కళ్ళు తెరుచుకుని పైకి చూస్తోంది. ఆమె కళ్ళ నుండి మత్తు యింకా విడివడినట్లు లేదు. అలికిడి విని నన్ను చూసి, "వచ్చారా ? ఘనకార్యం చేశారు కదూ! మెచ్చి మేకతోలు కప్పుతాననుకున్నారా ?" అంది.
"ఎట్లా వుంది మీకు ?" అన్నాను.
"చెప్పను" అంది.
చెయ్యి అందుకుని పల్స్ చూశాను. పలుచగా కొట్టుకుంటోంది. "ఇప్పుడు చెప్పండి" అని
అడుగుదామనుకున్నాను.
'ఏమిటి' అంటుంది. 'ఎందుకు చెప్పాలి' అంటుంది. ఆమె ముఖం వంక చూస్తూ ఆలోచిస్తున్నాను.
"ఎలా అడగటమా అని ఆలోచిస్తున్నారా ? మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసులెండి మీరంటే నాకేం కోపంలేదు, ఇట్లా దగ్గరకు రండి !"
నేను వెళ్ళి ఆమె తల దగ్గర నిల్చున్నాను.
"చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పబోతున్నాను. మనసులో వుంచుకోండి."
"ఏమండీ ! పర్వాలేదంటారా ?" అన్న గొంతు వినబడింది ఆమె భర్త నా ప్రక్కకు వచ్చి నిల్చున్నాడు.
ఆమె నిట్టూర్పు విడవడం నా కళ్ళబడింది.
"అలాగే వుంది" అని చెప్పి కేసుషీటు తీసుకుని అవతలకు వెళ్ళి పోయాను.
కేసు షీటు పూర్తిచేసి, యథాస్థానంలో వుంచి, రాత్రి ఆపరేషన్ చేసిన కేసు ఎలా వుందో చూడటానికి మేల్ వార్డుకు వెళ్ళాను.
అతని పరిస్థితి బాగానే వుంది. బ్రతికి బయటపడ్డట్లే కనిపించాడు. దుష్పలితాలేమీ కనిపించలేదు.
వార్డులో మిగతా పనికూడా చూసేసరికి ఎనిమిదయిపోయింది. అక్కడి నుండి అలసిపోయిన శరీరంతో కాళ్ళీడ్చు కుంటూ క్వార్టర్స్ వైపు వెళ్ళిపోయాను.
ముఖం కడుక్కుని కాఫీ త్రాగాక, బాగా బద్దక మనిపించి మంచం మీద నడుం వాల్చాను. రాత్రి రెండు మూడు గంటల నిద్రపోయినా గాని, ఇంకా ఎంతో అలసటగా వున్నట్లు శరీరం విశ్రాంతి కోరుతోంది మనసంతా వికలమైనట్లు అనిపించింది.
కళ్ళ ముందు మళ్ళీ అవే మసక తెరలు....నల్లని కారు మబ్బులు. కళ్ళు మూతలు పడిపోయాయి.
