Previous Page Next Page 
మారణహోమం పేజి 21

 

    "ఏమో తెలియదు. కాలేజీ నుంచి ఇంటికి వస్తుంటే జరిగి ఉంటుంది అది."    
    ఇన్స్ పెక్టరు చిరాగ్గా మొహం పెట్టాడు. "కాలేజీ నుంచి ఇంటికొచ్చే దారిలో పది పోలీసు స్టేషన్లు ఉండొచ్చు. మీరు నేరం సరిగ్గా ఎక్కడ జరిగిందో చెప్పకపోతే మీరు ఏ పోలీస్ స్టేషన్ కెళ్ళి రిపోర్టు చెయ్యాలో నేనెలా చెప్పగలను?"    
    ఆశ్చర్యపోతూ చూశాడు రంగారావు. "నేను ఇక్కడే ఉంటానండీ! పక్క సందులోనే మా ఇల్లు!"    
    "ఎటు పక్కా? మెయిన్ రోడ్డుకి కుడిపక్కా? ఎడంపక్కా?"    
    "ఎడం పక్కనండీ!"    
    "అయితే మా పోలీస్ స్టేషన్ జురిస్ డిక్షన్ లోకి రాదు. మెయిన్ రోడ్డులో ఇంకో పోలీసు స్టేషనుంది. అక్కడ రిపోర్టు చెయ్యండి."    
    అతను మనసు మార్చుకుని తనకేమన్నా సహాయం చేస్తాడేమోనని కాసేపు నిలబడి లాభంలేక "వెళ్ళొస్తానండీ!" అని చెప్పి మెయిన్ రోడ్డులో ఉన్న పోలీసు స్టేషన్ కి వెళ్ళాడు.    
    అక్కడ ఇవే ప్రశ్నలు. నేరం ఎక్కడ జరిగింది? ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో?    
    అక్కడ నుండి మరో స్టేషన్!    
    అక్కడ ఇన్స్ పెక్టర్ ముందు నిలబడి, ఏడుపు ఒక్కటే తక్కువగా చెప్పాడు రంగారావు.    
    "సార్! ఒక రౌడీ రోజూ మా అమ్మాయి వెంటబడి వేధించుకు తింటున్నాడు."    
    చాలా రోజులు తనలోనే ఈ విషయాన్ని దాచుకుని, సహించి, చివరికి మా అమ్మాయి నాతో చెప్పుకుని ఏడ్చింది. నేను ఒక రోజున తనతోబాటు వెళ్ళి అతనికి బాగా బుద్ది చెప్పాను. అదే తప్పయిపోయింది. అందరూ వింటుండగా తనకు అవమానం జరిగిందని ఉగ్రుడయిపోయాడు అతను. ఇవాళ నా కూతుర్ని టాక్సీలో వేసుకుని వెళ్ళిపోయాడు.    
    అర్దరాత్రి లోపల దాన్ని చెడగొట్టి తర్వాత చంపిపడేస్తానని బెదిరింపు పంపించాడు. అర్దరాత్రి కావడానికి ఇంకా గంటే వ్యవధి ఉంది. పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగడంతోనే టైం గడిచిపోతోంది. నాకు సాయం చెయ్యండి బాబూ!"    
    "పోనీ ఇలా చెయ్యండి" అన్నాడు ఇన్స్ పెక్టర్.    
    ఏమిటన్నట్లు ఆశగా చూశాడు రంగారావు.    
    "నేరుగా కంట్రోలు రూంకి వెళ్ళిపోండి."    
    వెంటనే ఇన్స్ పెక్టరు కాళ్ళమీద పడిపోయాడు రంగారావు. "కంట్రోలు రూముకి కాదు, కాటికి వెళ్ళమన్నా వెళతా నాయనా! కానీ టైములేదు! నన్ను కరుణించి, నా కూతుర్ని కాపాడు! నాకంటే వయసులో చాలా చిన్నవాడివయినా, నీకు దణ్ణం పెట్టి అడుగుతున్నాను బాబు!"    
    ఇన్స్ పెక్టర్ కొద్దిగా చలించాడు. తన సబార్డినేట్ ని పిలిచి కేసు రిజిష్టరు చేసుకోమని ఆదేశించాడు. ఆ సబార్దినేట్ వెళ్ళి కార్బన్ కాయితాల కోసం డ్రాయర్లు వెదకడం మొదలెట్టాడు. కార్బన్ కాయితాలు దొరికాక రిజిష్టరు కనబడలేదు. అది కూడా దొరికాక, కేసు నమోదు అయింది. రూల్సు, రెగ్యులేషన్సుతో కూడిన రెడ్ టేపు కాలసర్పంలా కాటెయ్యడానికి బద్దకంగా పడగవిప్పుతోంది.    
    మణికట్టులోకి వచ్చేటట్లు పెట్టుకున్న వాచీవైపు మాటిమాటికీ చూసుకుంటున్నాడు రంగారావు.    
    ఇంకో అరగంటలో అర్ధరాత్రయి పోతుంది! ఆయన గొంతులో నుంచి దుఃఖం మూలుగులా బయటికి రావడం మొదలెట్టింది. "బాబూ! నా కూతురు...." అన్నాడు మూసుకుపోతున్న గొంతుతో.    
    "మేం చెయ్యాల్సింది చేస్తున్నాం కదుసర్! ఫార్మాలిటీస్ అన్నీ పూర్తికాకుండా మేమేం చేసినా అది తర్వాత మా పీకెల మీదికే వస్తుంది" అన్నాడు ఇన్స్ పెక్టరు అనుభవంతో. అతని భయాలు అతనికి ఉన్నాయ్. ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళిన రౌడీ ఎవరో తెలియదు. అతనికి ఉన్న పొలిటికల్ కనెక్షన్సు ఏమిటో తెలియవు. ఇవేమీ తెలియకుండా తను ప్రొసీడయిపోతే, 'హుష్ మాయం కాళీ' అని మంత్రం వేసినట్లు తను ఇక్కడ మాయమై, ఏ మారుమూల ఊళ్లోనో తేలతాడు - ట్రాన్స్ ఫర్ మీద!    
    అందుకని సాధ్యమైనంత తాత్సారంచేస్తూ నేరం వెనక ఎవరు ఉండి ఉంటారో, ఆ నేరస్తుల వెనక ఎవరు ఉండి ఉంటారో, ఈ కేసు సాల్వ్ చేస్తే తనకు పోలీసు మెడలు వస్తుందో, మెడలిరక్కొట్టి తరిమేస్తారో అంచనా వేస్తూ ఉండిపోయాడు.    
    "ఇన్స్ పెక్టరుగారూ! మీకు పనికొచ్చే ఒక క్లూ గుర్తొచ్చింది నాకు" అన్నాడు రంగారావుగారు హఠాత్తుగా.    
    "ఏమిటది?"
    "ఆ రౌడీ తను నిఖిల్ మనిషినని పొగరుగా చెప్పుకుని వెళ్ళాడు. అందుకే అతన్ని ఆపడానికి కూడా ఎవరూ సాహసించలేకపోయారు."    
    "అలాగా!" అన్నాడు ఇన్స్ పెక్టరు పైకి.    
    'అలా అయితే ఇంకా నువ్వు తూర్పుకి తిరిగి దణ్ణం పెట్టుకోవచ్చు. నీ కూతురు ఇంక కల్లోకూడా తిరిగిరాదు' అనుకున్నాడు ఇన్స్ పెక్టరు మనసులో.
    
                                                             * * *
    
    "ఏమిటి గొడవ?" అన్నాడు నిఖిల్ రాజుతో.    
    "ఈమధ్య కొత్తగా ట్రబుల్ ఒకటి స్టార్టయింది. చిన్నచిన్న నేరాలు చేసే ప్రతివెధవా తను నిఖిల్ మనిషినని ప్రకటించుకుంటున్నాడు. అలా చెప్పుకుంటే తమని ఎవరూ ఏమీ చెయ్యలేరన్న ధైర్యం వచ్చింది చాలా మందికి" అన్నాడు రాజు.    
    "ఏమయింది ఇప్పుడు?" అన్నాడు నిఖిల్.    
    "ఎవడో లోకల్ గూండా ఒకడు, ఒక ఎన్జీవోగారి అమ్మాయిని టాక్సీలో వేసుకు వెళ్ళిపోయాడుట. అర్దరాత్రి లోపల అనుభవించి తర్వాత చంపేస్తానని అల్టి మేటమ్ ఇచ్చాడుట!"    
    "ఎందుకు?"    
    "ఏదో చిన్న గొడవయింది ఆ ఎన్జీవోగారితో. అందుకని ఛాలెంజ్ చేసినట్లు ఇలా చేస్తున్నాడు"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS