Previous Page Next Page 
హౌస్ సర్జన్ పేజి 20


    ఒకరోజు నేను డ్యూటీలో వున్నాను. అప్పుడే ఓ కేసు కాస్త గాభరాచేస్తే దానికి ఎటెండ్  అయి వస్తున్నాను. వెనుకనే ఆయా పరిగెత్తుకు వచ్చింది ! "ఇప్పుడే బర్ న్స్ కేసు  ఎడ్మిట్  అయిందండీ. మీరు రావాలి" అంటూ.

    ఆయా వెనకనే  ఫిమేల్ సర్జికల్  వార్డుకు  వెళ్ళాను. సిస్టర్ నన్ను చూసి "రండి. చాలా ఎక్స్ టెన్ సివ్ బరన్స్ అండీ. యంగ్ బ్యూటీఫుల్ గరల్" అని పేషెంటు  వున్న బెడ్  దగ్గరకు  తీసుకువెళ్ళింది.

    ఆమెను చూస్తూనే  అప్రతిభుణ్నయి నిలబడిపోయాను ఒక్క ముఖం తప్ప శరీరమంతా  కాలిపోయినట్లుంది. ఎక్కడా ఖాళీలేకుండా  అంతా బాండేజస్ వెయ్యబడి  వున్నాయి. ముఖం మీద  మాత్రం  ఒక్క  కాలిన గుర్తుకుగాని, మచ్చగాని లేదు. నిండు చందమామలా  దీప్తి రేఖలతో  నిండి వుంది ఆమె ముఖం, ఆమె తెలివిగానే  వుంది.

    కేస్ షీటు తీసి, దాని కంటించి వున్న  ఓ.పి.చీటీ చూశాను, క్యాజుయాలిటీవాళ్ళే  వేజ్ లైన్ గాజుతో డ్రెస్ చేసి, బేండేజ్ చేసేశారు. మార్పియా అప్పటికే  ఇచ్చేశారు. ఆమె పేరు రామలక్ష్మి.

    ఆమె నా వంక  చూసి నవ్వింది. అట్లా నవ్వుతూ  వుంటే  ఆ ముఖం ఎంత అందంగా వున్నదంటే  దేవలోకం నుంచి  ఏ దేవత శిరస్సో ఎగిరివచ్చి, తనది కాని మరో శరీరానికి  అంటుకున్నట్లుంది.

    "అక్కడయింది ! ఇహ ఇక్కడ  మొదలుపెడతారా వైద్యం ?" అన్నది, మధుర స్వరంతో. ఆమె తనకేమీ  బాధ లేనట్లు  కనిపించడానికి ఎంత ప్రయత్నిస్తున్నా, ఆ స్వరం ఎంతో హీనంగా వినవచ్చింది.

    "మీకు ఇంజక్షన్ ఇచ్చి  ఎంతసేపయింది ?"

    "ఏం మీరు ఇంకొకటి ఇస్తారా ?"

    "ఇవ్వనులే  చెప్పండి."

    "రెండు గంటలకు  పైగా  అయిందనుకుంటాను. షాక్ తగ్గాలి  అనుకుంటూ  మొదట రాగానే ఇంజక్షన్ ఇచ్చేశారు, షాకూ వల్లకాడూ  ఏమీ లేదంటే  విన్నారుకాదు" అన్నదామె.

    మార్పియా ఇచ్చినా ఆమె రవ్వంతకూడా మత్తులేకుండా స్పష్టంగా మాట్లాడుతున్నందుకు నా కాశ్చర్యమేసింది. చెయ్యిపట్టుకుని  పల్స్ చూశాను. నాడి పలచగా కొట్టుకూంటుంది.

    "బాగానే వుంది కదా ?" అనడిగింది.

    "ఫస్టుగా వుంది"

    ఆమె నవ్వింది. "చాలా మాట్లాడారు డాక్టరుగారూ!" అంటూ,

    ఒక్క నిమిషం కనులు మూసుకుని, ఏదో ఆలోచించినట్లు వూరుకుని, మళ్ళీ కనురెప్పలు విప్పి నా వంక చూస్తూ, "అమ్మకి సీరియస్ గా వున్నట్లు నిన్న  టెలిగ్రాం  వచ్చింది. అమ్మే ముందు వెళ్ళిపోతుందనుకున్నాను...." అంది.

    నా ప్రక్కనే నిలబడి  వున్న సిస్టర్  "అసిస్టెంటుకు మెమో రాస్తారా?" అంది.

    "అవును" అంటూ నేను వెనక్కి వెళ్ళి  కుర్చీలో  మెమో పుస్తకం అందుకున్నాను.

    వార్డుబాయ్ తో  మెమో  పంపించేశాక, లేవబోతూంటే  అంతవరకూ  వసారాలో తచ్చాడుతున్న ఓ వ్యక్తి ఎదురుగా వచ్చి నిలబడి, 'ఆమె కెలా వుంది సార్ ?" అని అడిగాడు. పాంటూ ,స్లాక్ వేసుకుని, ముఖంమీద పడిన జుట్టుతో చిరాగ్గా  కనిపిస్తున్నాడు. పాతికేళ్ళకు పైగా  వుంటాయి.

    "ఆమె మీ కేమవుతుంది ?" అనడిగాను.

    "నా భార్యే"

    "వళ్ళంతా బాగా కాలిపోయింది. చెప్పటం కష్టమే .ఎలా జరిగింది యీ ప్రమాదం ?"

    "నేను యింటికి వచ్చేసరికి  జనమంతా  గుంపుగా కనబడి అంతా గగ్గోలుగా వుంది .సరిగ్గా అంతకుముందే  జరిగిందట. స్టవ్ మీద పాలు కాస్తూండగా  యీ ప్రమాదం జరిగిందని  ఆమే అంటుంది .వెంటనే హాస్పిటల్ కి తీసుకొచ్చేశాను.

    కేసు షీటు క్లుప్తంగా రాసి  పూర్తిచేయాలని  లేచి ఆమె బెడ్ దగ్గరకు వెళ్ళాను. సిస్టర్ దూరంగా ఏదో పనిలో వుంది. ఆమెను ప్రశ్నలు  వేసి బాధ పెట్టటానికి  మనసు ఒప్పక క్యాజువాలిటీ  వాళ్ళు రాసిన ఓ.పి.చీటీ ఆధారంగా చేసుకుని  నాలుగు ముక్కలు రాయదలిచాను.

    "హాస్పిటల్లో  ఎడ్మిట్  అయి, ఆ అనుభవం  కూడా  చవిచూడాలని ఎంతగానో కోరిగ్గా వుండేది డాక్టర్ గారూ! ఏ జబ్బూ చెయ్యలేదు  నాకు. హమ్మయ్య ! ఇన్నాళ్ళకు  తీరింది నా కోరిక" అన్నదామె. ఆమె కళ్ళు తృప్తిగా మెరిశాయి.

    "బాగుందా అనుభవం ?"

    "ఓ! ఫస్టుగా  వుంది !" ఆమె నవ్వింది _ 'మీ మాటలు  మీకే అప్పజెప్పాను చూశారా' అన్నట్టు.

    మృత్యువుతో  పోరాడే  దశలో  వుండి, లోలోపల  నరకయాతన అనుభవిస్తూ బయటకు అంత తేలిగ్గా  మాట్లాడటం  నాకు ఆశ్చర్యాన్ని  గొల్పింది.

    "మీకు  శరీరమంతా  కాలిపోయింది  కదా ! బాధ  అనిపించటం  లేదూ?" అని ప్రశ్నించాను.

    "నాకు  ఎందుకు  బాధ  అనిపించటంలేదో  మీకు చెబుతాను. ఎవరికి చెప్పకుండా  మనసులో  దాచుకుంటారా ?" అన్నది.

    "అలాగే" అన్నట్టు  తల వూపాను.

    "మరేఁ! డాక్టరుగారూ!....."

    ఇంతలో  "ఏమండీ ! ఎలా వుంది కేసు ?" అంటూ వెనక నుండి శేఖరంగారు వచ్చారు. దగ్గరకు  వచ్చి పరీక్షచేసి, "ఏమమ్మా! అంత  నిర్లక్ష్యంగా  యెలా  వున్నావు ? నీ వొళ్ళంటే  నీకు యిష్టంలేదా?" అన్నాడు.

    ఆమె జవాబు  చెప్పకుండా  నవ్వి  ఊరుకుంది.

    "ఇలా రండి" అని ఆయన నన్ను  ఇవతలకు  పిలిచాడు. "పరిస్థితి యిప్పుడు అంత  ప్రమాదకరంగా  వుంది. ప్రిలిమినరీ  ఇంజక్షన్లన్నీ  క్యాజువాలిటీవాళ్ళు  పూర్తిచేశారు కదా ! ఆమె దేనినీ  లెక్కచెయ్యని  దానిలా కనిపిస్తోంది.వన్ ఫోర్త్ గ్రెయిన్ మార్ఫియా  మళ్ళీ  యిచ్చెయ్యండి. బ్లడ్ తీసి గ్రూపింగ్ కు పంపించండి. ఏ క్షణంలోనైనా  ట్రాన్స్ ఫ్యూషన్ అవసరం కావచ్చు. ఆక్సిజన్ కూడా  యివ్వాల్సి  రావచ్చు. జాగ్రత్తగా  చూస్తూ వుండండి. అవసరమైతే  నాకు కబురు చెయ్యండి" అని వెళ్ళిపోయాడు.    

    సిస్టర్ని  సిరంజి  తీసుకురమ్మని  చెప్పి రక్తం తీసుకోవటానికని  ఆమె దగ్గరకు  వెళ్ళాను. ఈ తతంగమంతా చూసి  ఆమె "ఏమిటి ! రక్తం తీసుకుంటారా ? మీరు తీసుకోలేరని  పందెం" అంది.

    "ఎందుకని ?"

    "మీకు  వెయిన్  కనిపించవద్దూ ? అసలు పై పై రక్తనాళాలన్నీ  చాలా భాగం కాలిపోయి  వుంటాయి. వెతకటానికైనా  మీకు  జాగా  ఏదీ ?"

    ఆమె చెప్పింది నిజమే. రక్తం తీయటానికి  ఆమె శరీరంలో ఎక్కడా  చోటు కనిపించలేదు .ఏం  చెయ్యటమా అని ఆలోచిస్తూంటే  కంఠం దగ్గర ఖాళీగా  కనిపించి, జుగులర్  వెయిన్ లోంచి  రక్తం  తీద్దామన్న  ఊహ తోచింది. సిస్టర్ని  కంఠంమీద  స్పిరిట్  రాయమని  చెప్పి  వ్రేళ్ళతో  తడిమి ఎక్కడనుంచి  తియ్యాలో  నిశ్చయించుకుని, నెమ్మదిగా సూదిగ్రుచ్చి కావలసిన  నెత్తురు  తీసుకోగలిగాను.

    "మొత్తం మీద మొండివాళ్ళే" అంది.

    "మీకంటేనా ?"

    చప్పున  నవ్వింది. వెంటనే  మాట  మార్చివేస్తూ  "అవునుగాని, మృత్యువును  నేనింకా  ఎంతసేపటిలో  చేరుకుంటానో  చెప్పండి" అంది.

    "మృత్యువా ? అది మిమ్మల్ని  ఎన్నటికీ  సమీపించదు."

    "మీ డాక్టర్ల మాటలు  నేను  నమ్ముతాననుకున్నారా ? చివరిదాకా ఇలానే కబుర్లు చెబుతూ  ఊరిస్తారు .నేనేం  దురాశ పడటల్లేదు లెండి."

    సిస్టర్ నవ్వుకుని ,రక్తంనింపిన  చిన్న  సీసామీద  పేరురాసి  లేబిల్ అంటించటానికి  వెడుతోంది. "రిక్విజిషన్ మీద  గ్రూపింగ్  ఎండ్  క్రాస్ మేచింగ్ అని రాయండి" అని గుర్తుచేశాను.

    సిస్టర్ వెళ్ళిపోయాక, ఆమె ముఖంలోకి  కొంచెం  దీర్ఘంగా  చూసేసరికి  ఆమె నిదివరకెప్పుడో  చూసినట్లు  అనుమానం  తోచింది. ఎవరు, ఎప్పుడు చూశాను అనుకుంటూ  ఆలోచిస్తున్నాను.

    "ఏమిటలా చూస్తున్నారు నావంక ? ఈమెనెప్పుడు చూశాననా ?"

    నిజంగా ఆమె ఎంత తెలివిగలది ? గుండెలు పగిలిపోయే సన్నివేశంలో కూడా  నా మనసులోని  ఊహ ఎంత సులభంగా  కనిపెట్టివేసిందో !

    "అవును" అన్నాను ఆశ్చర్యంగా.

    "దానికంత  ఆలోచన  దేనికి? నన్నడిగితే  వెంటనే  చెప్పేసేదాన్నిగా. రెండు నెలలక్రితం  మా అత్తగారికి  టెట్ సన్ వచ్చి  హాస్పిటల్ లో జాయిన్ చేసినప్పుడు ,మీరు  ఇంజక్షన్ ఇవ్వటానికి  వస్తే  మనం కలుసుకున్నాం" అన్నది, చాలా యధాలాపంగా  చెప్పినట్లు.

    అవును. ఇప్పుడు జ్ఞాపకం  వచ్చింది. ఒకరోజు  మృదులా, నేనూ డ్యూటీలో వున్నప్పుడు  ఆమె పడుకుని  నిద్రపోతూంటే, ఆమెకు బదులు ఒక మెమో అటెండ్ అవడానికి  నేను ఐసోలేషన్ వార్డుకు వెళ్ళాను.

    సిరంజిలో  పెరాల్డిహైడ్  లోడ్ చేసుకుని  తీసుకుని  వెడుతూంటే, వార్డుబాయ్ తో ఒకామె  ఘర్షణ పడుతూ  కనిపించింది.

    "నే'నేమి'టన్నాను ? పేషెంటు ప్రక్కన  వార్డులో  అలా కూర్చోటానికి  వీల్లేదన్నాను. దానికింత  రభస దేనికి ?" అంటున్నాడు వార్డుబాయ్.

    "అది చెప్పేవిధంగా  చెప్పాలి. భుజంమీద చెయ్యేసి  'యిక్కడుండ కూడదు. బయటకు రండి' అని త్రోశావు  నువ్వు. అది తప్పు" అంటున్నదామె.

    "అందరు  ఆడవాళ్ళనూ  అలా తొయ్యడం  మా కలవాటే. తప్పూలేదు ,గిప్పూలేదు" అంటున్నాడు వార్డుబాయ్.

    "మిగతావాళ్ళ  విషయం  నాకు తెలీదు. నాలాంటి  కుటుంబ స్త్రీలతో యెలా ప్రవర్తించాలో  తెలుసుకోకపోతే  వొళ్ళు  చెడుతుంది,జాగ్రత్త" హఠాత్తుగా ఆమె మాటలు  నిప్పురావ్వల్లా  రాలిపడ్డాయి.

    ఇంతలో నేను దగ్గరకు పోయాక, వార్డుబాయ్ దగ్గర నుండి  చౌకరకం  సారా  వాసన గుప్పున కొట్టింది. నన్ను  చూడగానే  అతను కిక్కురు మనకుండా  ప్రక్కకి జారుకున్నాడు. నేను వెళ్ళి మౌనంగా  ఇంజక్షన్ యిచ్చేసి  బయటకు వస్తున్నాను.

    చీర చెంగు  ముఖం మీదకు లాక్కుని  ఆమె  నా వెంట  కొంతదూరం  నడిచి  వచ్చింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS