అతనికి యింకా దగ్గరగా జరిగి , భుజం మీద అలా తల వాల్చుకోవాలని కోరిక కలిగింది. కాని సంకోచంతో ...నిగ్రహించుకుంది.
"మాట్లాడరేం?" మెల్లగా అడిగింది.
"ఒక విషయం చెప్పాలనిపించి, సందేహంతో ఆగిపోతున్నాను."
"ఏమిటది?"
"మీరు.....పెళ్లి కాకముందు ఎందుకు పరిచయం కాలేదా?" అని.
తనూ లత మీద పూల వాన కురిసినట్లయింది. ఒక్క క్షణం ....అంతలోనే అనుమానం.
"ఎవరి పెళ్ళి ?" తడబడే కంఠంతో అడిగింది.
"మీది...."
"అంటే.....?"
"నాకింకా పెళ్ళి కాలేదు కాబట్టి"
మరోసారి పూలవాన కురిసింది. ఎక్కడ్నుంచో వెన్నెల హాయిగా ప్రవహించినట్లయింది.
"మీకు యింకా ....పెళ్ళి కాలేదా?" గొంతులో ఆర్ద్రత.
"ఊహు"
"ఎందుకని?"
"నాకు నచ్చే పిల్ల కనిపించక."
'అందుకని అలా వుండిపోతారా?"
"ఏం చెయ్యను?"
అతనలా అంటూంటే ఆమెకు జాలి వేసింది. హృదయం లోపల్నుంచి ఉవ్వెత్తుగా ప్రేమతరంగాలు బయటకు వుబుకుతున్నాయి. అప్రయత్నంగా దగ్గరకు జరిగి అతని భుజం మీద తల ఆనించింది.
"దిలీప్"
"ఊ"
"నువ్వు నాకు పరిచయంగా కుండా వుంటే బావుండేది. ఆమె గొంతులో వేదన ధ్వనిస్తోంది.
"ఎందుకని.....?"
"ఆలోచిస్తే నువ్వు జవాబు చెప్పగలవు"
"నా జవాబు నువ్వు చెప్పినంత పరిపూర్ణంగా వుండకపోవచ్చు....అదీగాక నీ నోటి వెంట వినాలన్న కుతూహలం వుండవచ్చుగా."
"దిలీప్"
"ఊ"
"ఏం జవాబు చెప్పమంటావు? మొదట జీవితం మీద ఎన్నో ఆశలు పెంచుకున్న దాన్ని, వాటన్నిటికీ తిలోకాలిచ్చి , యాంత్రికమైన , నా మనస్సు అంగీకరించని సంసార కూపంలోకి జోరబడ్డాను, చాలా వికారంగా పొడిగా, రసహీనంగా గడుస్తోంది నా జీవితం. ఇంతలో ఊర్వశి ప్రమేయం యిన్నాళ్ళు తెరచాటుగా వున్న రంగు రంగుల జీవితం కళ్ళెదుట సాక్షాత్కరించింది. ఆతర్వాత మనసులో కల్లోలాన్ని రేపుతూ నువ్వు దూసుకోచ్చావు. ఏం చెయ్యను నేను? ఏం చెయ్యాలో తెలీటం లేదు."
కళ్ళవెంట నీళ్ళు కారుతున్నాయి.
అతనామే భుజం చుట్టూ చెయ్యి పోనిచ్చి దగ్గరకు లాక్కున్నాడు. కారు కొద్దిగా స్లో చేసి బుగ్గమీద సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు.
చీకటి పడింది, రోడ్లు చాలా వరకు నిర్మానుష్యంగా వుంది. అటూ యిటూ పొడవుగా విశాలంగా విస్తరించిన చెట్లు ఎంతో కొంత కాంతిని ప్రసరిస్తూ స్ట్రీట్ లైట్లూ....
"రాజా!" ఈ పిలుపెంతో మధురంగా , వినూత్నంగా వుంది. మైకం ఆవరించినట్లయింది.
"ఊ"
"నిన్ను విడిచి వుండలేకపోతున్నాను."
"దిలీప్"
"రాజా! నాలోని ప్రతి అణువూ నీ కోసం కలవరించి పోతోంది. ఎక్కడ వున్నా ఏ పని చేస్తోన్నా , ఎంత దూరంలో వున్నా నీ దగ్గరకే పరుగెత్తుకు వచ్చేయాలనిపిస్తోంది."
"ఓ! దిలీప్! నిజంగా నాకేం చెయ్యాలో తెలీటం లేదు." ఆమె ఏడుస్తోంది.
ఒకచోట పూర్తిగా నిర్మానుష్యంగా వుంది. ఓ ప్రక్కన కారపాడు! ఇంజన్ నిశ్శబ్దంగా పనిచేస్తూ వుంది. కొంచెం ప్రక్కకి తిరిగి ఆమెను రెండు చేతులతో దగ్గరకు తీసుకుని నుదుటి మీదా , కళ్ళమీదా, బుగ్గల మీదా, పెదవుల మీదా ముద్దులు పెట్టుకుంటున్నాడు.
తెలీకుండా నిమిషాలు దొర్లిపోతున్నాయి.
"రాజా!"
"ఊ"
"మనం ఏం చేయ్యాల్లో చెప్పు"
"నాకు తెలీటం లేదు."
"నాతొ వచ్చేయ్"
"ఈ భర్తా, ఓ పిల్లాడూ సమాజం.....నాకు భయంగా వుంది."
"కాని నువ్వు నాకు కావాలి"
"అర్ధం చేసుకున్నాను దిలీప్. అంతేకాదు నువ్వు కూడా నాక్కావాలని అర్ధం చేసుకున్నాను."
"నిన్ను విడిచి నేను వుండలేక పోతున్నాను."
విధి ఎంత క్రూరమైంది. మనం ఆశించింది ఎంత ఆలశ్యంగా , సమయం మించిపోయాక , ఏమీ చెయ్యలేని నిస్సహాయస్థితిలో వున్నప్పుడు చేతికి అందుతాయి.
"మనం...."
"సమయం మించి పోయిందనుకుంటాను దిలీప్.
"మనసులో ఒకవైపు కఠిన్యం పెంచుకొంటే ...."
"నాకు చేతకాదేమో దిలీప్.
అతనేం మాట్లాడలేదు. ఆమెను మరింత గట్టిగా దగ్గరకు పొదువుకుని తలమీదాం వీపు మీదా నిమురుతున్నాడు.
