డ్రస్ చేంజ్ చేసుకుని ఆమె పడుకునే ప్రయత్నం చెయ్యటం చూసి "అదేమిటి అన్నం తినవా?" అన్నాడు.
"తినను"
"ఎందుకని?"
"ఆకలి లేదు?"
"నువ్వున్నావని నేను తినకుండా కూచున్నాను."
"అలా చెయ్యవద్దని లక్షసార్లు చెప్పాను. ఈ రోజుల్లో ఒకరితో ఒకరు పెట్టుకుంటే కుదరదు. మనిషన్నాక లక్ష పనులుంటాయి. ఇలాంటివన్నీ...."
"పోనీలే ..ఈసారికి యిద్దరం కల్సి అన్నం తిందాం రా"
"ఆకలి లేదని చెప్పాను . నేను రాను"
"నా కాకలేస్తోంది రాజహంసా"
"వేస్తె మీరు తినండి"
విసురుగా వెళ్ళి ప్రక్కమీద పడుకుంది. అతనికిందాకటి దాకా తెలీక నిజంగానే ఆకలిగానే వుంది. ఇప్పుడు చచ్చిపోయింది. చేసేది లేక ఓ పావుగంట పాటు స్తబ్దుగా కూర్చుని తర్వాత మెల్లగా లేచి ప్రక్క మీదకు చేరాడు.
అలికిడి విని రాజహంస గోడవైపు యింకా జరిగి పడుకుంది.
పది నిమిషాలు జరిగాయి.....అతనికి మనసంతా వికలంగా, బాధగా వుంది. ఆమె ఎంత దూకుడుగా విముఖంగా ప్రవర్తించినా తనంటే ఎంతో ప్రేమ యిష్టం వున్నాయి. ఆమెను దగ్గరకు తీసుకోవాలని గుండెకు హత్తుకోవాలనీ అతని ,మనసు కొట్టుకుపోతున్నది.
సంకోచిస్తూనే కొంచెం భయం భయంగా ఆమె ఒంటిమీద చెయ్యి వేశాడు.
ఆమె పట్టించుకోనట్లు మెదలకుండా వూరుకుంది.
ఆ చెయ్యి.....కొంచెం ముందుకు ....అలా సున్నితంగా జరిపాడు.
ఏమిటిది? అంది విసురుగా.
"రాజహంసా మనం భార్య భర్తలం.
"అయితే?"
"నువ్వు నాకు...."
"........."
"కావాలని వుండదా?"
"నాకూ వుండాలిగా?"
"అయితే...."
"మన యిద్దరం....ఒకరితో ఒకరు.....అలా క్లోజ్ గా వుండటం సహజం."
'అంటే .....నాకిష్టం లేకపోయినా కూడానా?"
"ఇష్టమంటే ...పెళ్ళి జరిగి, పిల్లాడ్ని కని....మన ఇద్దరం వుండి ఎన్నాళ్ళయింది చెప్పు."
"నాకు మూడ్ లేదు, బలవంతం చెయ్యకండి."
"కాని.... నా సైడ్ గురించి కూడా ఆలోచించాలిగా"
"మీ సైడ్ గురించి ఆలోచించేటంతటి విశాల హృదయం నాకు లేదు. కాని నేను ఆట బొమ్మని కాదని గుర్తుంచుకోండి"
అతని చెయ్యి నిస్సహాయంగా ఆమె వంటిమీద నుంచి జారిపోయింది.
11
దిలీప్ నెలకు రెండు మూడు సార్లయినా కలుస్తూనే వున్నాడు.
ఇప్పుడు రాజహంస చాలా బిజీ మనిషి . పార్టీలు మీటింగులూ, లయన్స్ క్లబ్బులూ , సాంస్కృతిక కార్యక్రమాలూ , ఆమెను తీసుకెళ్లటానికి రోజు కార్లూ, అవీ వస్తూ వుండేవి.
ఆమెకి కొత్త జీవితం చాలా థ్రిల్లింగ్ గా వుంది.
పెళ్ళి విషయంలో మనుషులు ఎందుకు తొందరపడి వుజ్వలమైన భవిష్యత్తులు పాడు చేసుకుంటారు? కొంచెం ఆలశ్యమవగానే మంచి సంబంధం రాదేమోనన్న ఆందోళన, పెద్ద వాళ్ళ పోరు , తొందరపాటు.
అమూల్యమైన జీవితాలేన్ని యిలా నిర్ధాక్షిణ్యంగా నలిగిపోతున్నాయి?
దిలీప్ ఆమె మనసుని చాలా ఆకర్షిస్తున్నాడు. అతని అందం, పర్సనాలిటీ , వర్చస్సు , అంతస్థు....
ఓసారి కారులో కలిసి యిద్దరూ పోతున్నారు.
కారు ఊరు సరిహద్దులు దాటి, నిర్మానుష్యంగా వున్న రోడ్డు మీద మెల్లగా, మెత్తగా సాగిపోతుంది.
ఈ సన్నివేశం ఆమెకు మనోహరంగా వుంది. మనం అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంటే జీవితమెంత మధురం.!
ఇద్దరి మధ్యా ఏదో సందిగ్ధంతో కూడిన మౌనం ఆవరించుకుని వుంది.
"మనం ఎక్కడికి పోతున్నాం?" అంది రాజహంస ఆ మౌనాన్ని చేధిస్తూ.
"ఊ?"
"నన్నెక్కడికి తీసుకు పోతున్నారు?"
"మళ్ళీ వెనక్కి రాకుండా ....ఎక్కడికో..."
"అమ్మా ఆశ."
"మీలాంటి సౌందర్యరాశి ప్రక్కన పెట్టుకుని ఆశ పడటం తప్పా?"
రాజహంస నవ్వింది. ఆ నవ్వులో హోయలుంది. ఆత్మవిశ్వాస ముంది. అహంకారముంది. వాటితో బాటు కావలసినంత బాధ వుంది.
"ఆశ పడటం తప్పు కాదు. కాని అది ఆచరణకి దగ్గరగా రావటం కష్టం."
"ఎందుకని?"
"ఎందుకనో మీకు తెలుసు."
అతను మాట్లాడకుండా కారు నడుపుతూ వూరుకున్నాడు. ఆమె అద్దంలోంచి బయట రోడ్డువైపు యధాలాపంగా చూస్తోన్నదల్లా , అతన్నుంచి ఏమాటా వినబడక పోయేసరికి, తల ప్రక్కకి త్రిప్పి అతని ముఖంలోకి చూసింది. చాలా అందంగా, దర్పంగా, కొంచెం దిగులుగా కనిపించాడు. ఆమె వంక చూడటం లేదు. నిశ్శబ్దంగా డ్రైవ్ చేస్తున్నాడు.
