Previous Page Next Page 
మారణహోమం పేజి 20

 

    "నువ్వు నాతో వస్తున్నావు" అని ఖండితంగా చెప్పి, నడవడం మొదలెట్టాడు.   
    విధిలేక ఆయన వెంట వెళ్ళవలసి వచ్చింది అమూల్యకి. తప్పనిసరి తద్దినంలా ఉంది ఇది తనకి.   
    టార్చర్ ఛాంబర్ లో నిన్న కొక్కేనికి వేళ్లాడిన మనిషి ఇవాళ లేడు. ఇంకో లావాటి మనిషి ఉన్నాడు. ప్రాణభయం కనబడుతోంది అతని కళ్ళలో. గింజుకుంటున్నాడు. కాళ్ళా వేళ్ళా పడుతున్నాడు. పక్కన ఉన్న వాళ్ళని బతిమాలుతున్నాడు.   
    వాళ్ళు అతన్ని కదలకుండా గట్టిగా పట్టుకున్నారు. "ఒక్క పావుగంట సహించావంటే తర్వాత వదిలేస్తాం. అంతే! తమాషాగా ఉంటుంది!" అన్నారు నచ్చ చెబుతున్నట్లు.   
    "నిజంగానా?" అన్నాడతను ఆశగా.   
    "నిజమే! కదలకుండా నిలుచో!"   
    కదలకుండా బొమ్మలా నిలబడ్డాడు అతను.   
    అతని ప్యాంటుని వదులుచేసి, తమ చేతిలో ఉన్న సంచిలోని చిట్టెలుకలని అక్కడ వదిలేశారు. వాళ్ళు ప్యాంటుని నడుము దగ్గరా, మోకాళ్ళ కిందా గట్టిగా బిగించి కట్టేశారు.   
    వెంటనే ఎలుకలు లుకలుక లాడుతూ అటూ ఇటూ పరిగెత్తడం మొదలెట్టాయి, అతని ప్యాంటులో.   
    అతను కితకితలు పుట్టి నవ్వడం మొదలెట్టాడు. కాసేపటి తర్వాత ఉన్నట్లుండి అతని నవ్వాగిపోయింది.  మొహం వికృతంగా మారింది. ఒక్కసారిగా వెర్రికేక పెట్టాడు.   
    అంతే!   
    ఆ తర్వాత ఆ కేకలు ఆగలేదు!   
    వణుకుతున్న చేతులతో కళ్ళు మూసుకుంది అమూల్య.   
    బిల్డింగ్ వాలా చుట్ట వెలిగించి అన్నాడు. "భోజనం బాగుంటోందా అమ్మాయ్! ఇవాళ చైనీస్ ఫుడ్ తెప్పించమంటావా? నూడుల్స్, పెకింగ్ డక్......"   
    ఉన్నట్లుండి వాంతి వచ్చినట్లయింది అమూల్యకి. నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుంటూ, సింక్ కోసం అటూ ఇటూ చూసింది. బాత్ రూం కనబడింది అక్కడ. పరిగెత్తి వెళ్ళి వామిట్ చేసేసుకుంది అమూల్య. తర్వాత తన గదికి వచ్చి మంచం మీద ఎలా పడుకుందో తనకే తెలియదు.   
    మర్నాడంతా కొద్దిగా టెంపరేచర్ ఉంది అమూల్యకు. డాక్టర్ వచ్చాడు. ఇంజక్షన్ ఇచ్చాడు.   
    మళ్ళీ రాత్రికి రొటీన్ మొదలయింది.   
    సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్న ఒక మనిషి అరగంట తర్వాత అది దీనావస్తకు ఎలా చేరుకుంటాడో ఆ రోజు మళ్ళీ ఇంకోసారి చూసింది అమూల్య కళ్ళెంబడి నీళ్ళు ధారాపాతంగా కారిపోతూ ఉండగా.   
    వాళ్ళు పెడుతున్న చిత్రహింసలు చూడమని ఎందుకు బలవంత పెడుతున్నారుతనని?   
    ఇదొక రకం చిత్రహింసా? అర్ధంకాలేదు అమూల్యకి.   
    ఇవాళ టార్చర్ ఛాంబర్ లో ఉన్నది ఒక దృఢకాయుడు. కదలకుండా కట్టేసి ఉంచారు అతన్ని.;   
    ఒక సన్నటి వెదురుబొంగు తీసుకొచ్చారు నిఖిల్ మనుషులు.   
    అది చూడగానే, జరగబోయేది ఏమిటో తనకి తెలిసిపోయినట్లు ఏడవడం మొదలెట్టాడు చెట్టంత మొగాడు. హృదయవిదారకంగా ఉంది ఆ రోదన.   
    జరగబోయేది ఏమిటో చూడక ముందే స్పృహ తప్పిపోయింది అమూల్యకి.   
    ఆ తర్వాత రెండురోజులపాటు వళ్ళు మసిలిపోయేలా జ్వరం తనకి. ఏ సంఘటనా జరగకుండా మరో రెండు రోజుల రెస్టు దొరికింది అమూల్యకి.   
    ఆ తర్వాత రోజు నిఖిల్ అసిస్టెంటు రాజు వచ్చాడు.   
    "నువ్వు ఇవాళ నుంచి పని మొదలెట్టబోతున్నావు. రెడీగా ఉండు!" అని క్లుప్తంగా చెప్పి వెళ్ళిపోయాడు.   
    అర్ధం కానట్లు అతను వెళ్ళినవైపే చూస్తూ ఉండిపోయింది అమూల్య. పనా? ఏంపని? తను మళ్ళీ లాయరుగా వీళ్ళ కేసులు వాదించాలా. కేసులో బలంలేక ఓడిపోయినా తనను ఈసారి నిజంగానే చిత్రహింసలు పెడతారు కాబోలు! అవివేకంతో వచ్చి పులిగుహలో ఇరుక్కుపోయింది తను! అనవసరంగా!   
    తను ఇప్పుడు తిరగబడినట్లు మాట్లాడితే లాభంలేదు. రాజీపడి పోయినట్లే ఉంటూ సమయం చూసి దెబ్బకొట్టాలి.  

    అది తప్ప వేరే మార్గంలేదు.
    
                                                 * * *
    
    ఇంగ్లండు దేశంలో సగటు మనిషి తనకేదన్నా ఇబ్బంది వస్తే, వెంటనే దగ్గరలో ఉన్న పోలీసు కానిస్టేబుల్ సహాయం కోరతాడు. అక్కడ కానిస్టేబుల్స్ ని "బాబీ" అని అభిమానంగా పిలుచుకుంటారు కూడా.   
    కానీ ఎందుకనో గానీ, ప్రజలకూ, ప్రజారక్షకులకూ ఉండవలసిన ఈ పరస్పరాభిమానం చాలా దేశాల్లో లోపిస్తుంది. ఇండియాలో మరీనూ. ఇక్కడ మర్యాదస్తులెవరూ పోలీసు స్టేషన్ లోకి వెళ్ళడానికి తొందర పడరు. పోలీసుల దాకా వెళ్ళే వ్యవహారాలు ఉన్నవాడిని అదోలా చూస్తారు జనం. అందుకే ఒక సామెత కూడా ఏర్పడింది ఇక్కడ. "పొలేఉస్లథొ స్నేహం పనికిరాదూ. విరోధం అసలే పనికి రాదు" అని.   
    అలాంటి ఇండియాలో, ఎన్జీవో రంగారావుగారు బిక్కచచ్చిపోతూ ఒక పోలీస్ స్టేషన్లో ప్రవేశించాడు.   
    ఆయన్ని చూడగానే "ఏమిటి?" అన్నట్లు తల ఎగరేశాడు అక్కడున్న ఇన్స్ పెక్టరు.   
    "మా అమ్మాయిని గూండాలు ఎత్తుకుపోయారు" అన్నాడు రంగారావు గారు హీనస్వరంతో. 
        "ఎక్కడ?" అన్నాడు ఇన్స్ పెక్టరు మొదటి ప్రశ్నగా.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS