Previous Page Next Page 
హౌస్ సర్జన్ పేజి 19


      ఆపరేషన్ చూస్తూ  కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతూండేవారు.

   ఎవరు చెప్పగలరు, యీనాడు రక్తం చూస్తే  భయపడిపోయేవారేం ఒకనాటికి  పెద్ద సర్జన్లయి, అవలీలగా  ఆపరేషన్లు  చేసివేస్తారనిపించేది ఒక్కొక్కసారి.

    రంగయ్యగారు  సన్నగా, పొడవుగా, చురుగ్గా  వుంటారు. సన్నగా వున్నా ఎంతో బలంగా, ఆరోగ్యంగా వున్నట్లు  కనిపిస్తుందాయన్ని  చూస్తే. చేతులు మోచేతులు  క్రిందనుంచి  వెడల్పుగా, బలిష్ఠంగా  వుంటాయి.

    ఆయన యింటిదగ్గర  ఎటువంటి  పరిస్థితుల్లోనూ  ఏ కేసూ  చూడరు. కన్సల్టేషన్ ఫీజు  అన్నది ఆయన తీసుకుని ఎరుగను.

    సర్జరీయే  ఆయన జీవితం! హాస్పిటలే  ఆయన ప్రపంచం.

    తన దగ్గర  పనిచేసేవారిని  ఆయన గమనిస్తారో లేదో  తెలియదుగాని వాళ్ళ గురించి  ఏమీ పట్టించుకోనట్లు  వుంటారు. "ఈ పని సరిగ్గా  జరగలేదు. ఆపని సరిగ్గా  జరగలేదు" అని బాధపడతారేగాని  "దీనికి  నువ్వే కారణం" అని ఆయన ఒకర్ని  వేలెత్తి  చూపించి  మందలించగా  నేను చూడలేదు.

    ఆయన రౌండ్సు  మొదలు పెడితే  కనీసం  రెండు  గంటలకు  తక్కువ  పుచ్చుకోరు. ప్రతి పేషెంటుదగ్గరా  ఆగటం, పరామర్శ చేయటం ,వాళ్ళు చెప్పేది వినటం _ యిట్లా  ఎంతో టైము  గడిచిపోతుంది.

    అదీగాక  ప్రతిరోజూ  యీవినింగ్  రౌండ్సుకు వస్తారు నేను ఎవరికో  ఇంజక్షన్ ఇస్తూండగానో, సెలైన్ పెడుతుండగానో, డ్రెసింగ్ చేస్తూండగానో  ఆయన  వెనుకనుండి  వచ్చేవారు. "ఎట్లావున్నాయి వార్డులో  కేసులు?" అని అడిగేవారు. అక్కణ్నుంచీ ఇద్దరం కలిసి రౌండ్స్  పూర్తిచేసేవాళ్ళం. రౌండ్స్ అయేసరికి  ఒక్కోసారి  రాత్రి తొమ్మిది, పది కూడా  అయిపోతూ  వుండేది.

    ఇహ  ఆపరేషన్ రోజున  ఆయన థియేటర్ లోంచి  బయటకు  వచ్చేసరికి  మూడు, నాలుగు అయిపోయేది. ఇంటికివెళ్ళి  తిరిగి  ఆరుకంటకల్లా  తిరిగి వచ్చేవారు.

    ఏదైనా  ఓ కేసు ఫెయిలయి, పేషెంటు చావు బ్రతుకుల్లో వుంటే ఆయన పడే శ్రమా, తాపత్రయం, పిచ్చెత్తినట్లయిపోయే  ఆయన వాలకం చూస్తే  ఒక్కోసారి భయంవేసేది  ఏ కేసైనా  సీరియస్ గా వుంటే, బెడ్ దగ్గర్నుంచి కదిలేవారుకాదు. పేషెంటును  బ్రతికిద్దామని చేసే  ప్రయత్నంలో రక్తం ధారపోసేవాడు. అసిస్టెంట్లూ, హౌస్ సర్జన్లూ, సిస్టర్లూ, సిస్టర్లూ  ఆయన ఆజ్ఞల్ని  నిర్వర్తించటానికి  అటూ ఇటూ  హడావుడిగా  పరుగులు పెట్టాల్సి వచ్చేది.

    అంత ప్రయత్నమూ  వృథా అయి, పేషెంటు  దక్కకపోతే  రెండు రోజుల దాకా యీ ప్రపంచంలో  పడలేకపోయేవారు.

    సర్జికల్  అసిస్టెంట్లు  ఇద్దరూ  సరదాగా, చలాకీగా  వుండేవారు మూర్తిగారు మేల్ సైడ్, శేఖరంగారు ఫిమేల్ సైడ్.

    సిస్టర్లతో  మూర్తిగారు  ఆడే పరాచికాలు, ప్రదర్శించే  చనువు, వాళ్ళకు యిచ్చే చనువూ హాస్పిటల్లో  అంతా కథలక్రింద  చెప్పుకునేవారు. తనని గురించి ఇతరులనుకునే  మాటలు  ఆయనకు  తెలుసో తెలియదోగాని, బయటకుమాత్రం  నవ్వుతూ ,తృళ్ళుతూ ఏమీ గమనించనట్లే  కనిపించేవాడు. మనిషి ఎర్రగా, బలంగా, ఎత్తుగా పంజాబీలా  వుండేవాడు.

    ఆయన అమ్మాయిలతో  అంత చనువుగా  వున్నాగానీ  ఎప్పుడూ అసభ్యంగా  ప్రవర్తించినట్లుగాని, ఒక అడుగు ముందుకు  వెళ్ళినట్టుగాని నా కనిపించలేదు.

    ఇహ థియేటర్ లో ఆపరేషన్  చేసినంతసేపూ ఆయన నోరు క్షణంసేపు  వూరుకోదు. ఏదో జోక్స్ నిర్విరామంగా  వేస్తూనే వుంటాడు. థియేటర్ సిస్టర్స్ కూడా, తాము ఓ ఆరునెలలు  ట్రెయినింగ్ ఎక్కువ అయ్యామనే వుద్దేశ్యంతోనో ఏమో కొంచెం గర్వంగా  వున్నట్లు కనిపిస్తారు. అసలు  హౌస్ సర్జన్ల కేమీ  తెలియదని  వారిలో  కొంతమంది ఉద్దేశం.

    ఆపరేషన్ పూర్తి  అయాక  గ్లవ్స్  తీసివేస్తూ "పాపం! ఇవేళ  సిస్టర్ చాలా బాగా అసిస్టుచేసింది" అనేవాడు మూర్తిగారు.

    "అబ్బే! నాకేం  వచ్చులెండి. అంతా  మీ దగ్గర్నుంచి  నేర్చుకున్నదేగా" అనేది సిస్టర్ బహుశా మాస్క్ లోంచి  మూతి  విరుచుకుంటూ.              

    సర్జికల్ వార్డులోకి  వచ్చిన  పదిరోజులకుగాని నాకు మొదటి  ఆపరేషన్ ఛాన్స్ రాలేదు.

    "ఏమండీ ! మీరు సర్జరీ  అంటే  ఇంత  ఇంటరెస్టు  చూపిస్తారుకదా! ఛాన్స్ ఇమ్మని  అడగరేం?" అని అడిగాడు ఒకసారి మూర్తిగారు.

    నేను నవ్వి ఊరుకున్నాను.

    "అడగందే  మాకు ఇవ్వాలని  వుండదు  తెలుసా ? ఎన్ని చేసినా ,ఇంకా తనివితీరక ప్రక్కవాడికి అవకాశం  రానీయకూడదనీ, అన్నీ  మాకే చేసెయ్యాలనీ  వుంటుంది. కత్తి పట్టుకుంటే  వళ్ళు  మరిచిపోతాం  సరే ఇవేళ రాత్రికి హైడ్రోసిల్ ఆపరేషన్ గురించి బాగా  చదవండి. రేపు చూద్దురుగాని."

    మర్నాడు  థియేటరులో  ఎనస్థీషియాలో  పనిచేస్తూన్న  హౌస్ సర్జన్ స్పైనల్  ఎనస్థీషియా ఇచ్చాక,  ఇన్ సిషన్ యిచ్చి ఆపరేషన్ మొదలుపెట్టాను. మూర్తిగారు నాకు  అసిస్టుచేస్తూ  మధ్య మధ్య "అంత స్లోగా చేస్తే ఎలాగ ? హైడ్రోసిల్ ఏడు నిమిషాల్లో  పూర్తిచేయాలి....ఆఁఆఁ, మరీ అంత ప్రక్కగా  పోకండి. స్పెర్మటిక్  కార్డు ఎగిరిపోగలదు... సూచర్స్  ఆర్టరీఫోర్ సెప్స్ తో చకచకా  వేసెయ్యాలి. అలా చేత్తో  కాదు" అంటూ సలహాలు  యిస్తున్నాడు. సిస్టర్ ఇన్ స్ట్రుమెంట్సుఅందిస్తూ సూదిలో కేట్ గట్ మొదలైనవి, గబగబ గ్రుచ్చియిస్తూ  సాయపడుతోంది.

    ఇరువైపులా  ఆపరేషన్ పూర్తయేసరికి  గంటసేపు పట్టింది. నేను ఇవతలకువచ్చి  గ్లవ్స్ వూడదీస్తుండగా  సిస్టర్  వెనుకనేవచ్చి "పాపం అలిసిపోయారుగాని, మా అందరికీ  మీరు టీపార్టీ  యివ్వాలి తెలుసా ?" అంది.

    హౌస్ సర్జన్ మొదటిసారి  ఆపరేషన్ చేసినప్పుడు  థియేటర్ లో పనిచేస్తూన్న వారందరికి పార్టీ  యివ్వటం ఓ సంప్రదాయంగా వస్తోంది.

    నేను నవ్వి  అక్కడి  సిస్టర్లకూ, ఆక్సిలరీ  నర్సులకూ, వార్డు బాయ్ లకూ, అసిస్టెంట్లకూ  అందరకూ  కేకులూ, కాఫీలు  తెప్పించాను.

    ఆ తర్వాత, ఆ రోజున  ఆ పేషెంటుకు  కుట్లు విప్పేవరకూ  అతన్ని  ఒకకంట  కనిపెడుతూనే  వున్నాను. గుండె బిక్కు బిక్కు మంటూనేవుంది. ఎందుకంటే  ఇదివరకు అప్పుడప్పుడూ  కొందరు హౌస్ సర్జన్లు చేసిన ఆపరేషన్లలో, కొంతమందికి సెప్టిక్ అయినట్లూ, మరి కొందరికి  చెప్పుకోదగ్గ  దుష్పలితాలు  ఏర్పడినట్లూ  విన్నాను. అతను నా ఆరాటాన్ని  గమనించకుండా  వుండటానికి  ప్రయత్నిస్తూ, ఎంతో శ్రద్దగా, పరిశీలిస్తూ వుండేవాణ్ని. ఆరో రోజున కుట్లు విప్పాక, అంతా  సవ్యంగా  వున్నట్లు  తెలుసుకుని 'హమ్మయ్య' అని నిట్టూర్చాను.

    నిజం చెప్పాలంటే  డ్రెసింగ్ చేయటం ,బాండేజివేయటం  మొదట్లో  సరిగ్గా  కుదిరేదికాదు. బాండేజివెయ్యటం  వార్డుబాయ్ దగ్గరే  నేర్చుకున్నాను. వాళ్ళు ఎంత బాగావేస్తారని !

    వాళ్ళ  సంపాదనకూడా  బాగానే వుంటుంది. డ్రెసింగులు  చేసినందుకూ, ఆపరేషన్ చెయ్యటానికి ముందు కేసును ప్రిపేర్ చేసినందుకూ, వాళ్ళకు బాగా  ముడుతూవుండేది. పేషెంట్లతో వాళ్ళు  మాట్లాడే పద్ధతి కూడా ఆసక్తికంగా  వుండేది .ఒకసారో పేషెంటు  "కాస్త గట్టిగా కట్టవయ్యా బాబూ! రాత్రి కట్టూడిపోయింది" అంటే "ఓ యబ్బ! నీలాంటి పోటుగాళ్ళని  చాలామందిని  చూశా  నా సర్వీస్ తో. నేను గట్టిగా  పట్టుబడితే  నువ్వాగగలవేమిటి ? 'సహదేవుడూ, వొదులొదులునును' కేకెట్టవూ" అని జవాబు చెబుతున్నాడు వార్డుబాయ్.

    అటు తర్వాత  సర్టికల్  పోస్టింగ్ అయిపోయేలోగా  ఎన్ని  ఆపరేషన్లు చేశానని ! ప్రతి ఆపరేషన్ రోజునా ఒకటి రెండు అవకాశాలు  తప్పకుండా వస్తూవుండేవి  హైడ్రోసిల్, పైల్స్, హెర్నియా, ఎపెండిసైటిస్  వేసెక్టమీ యివిగాక చిన్న చిన్న కంతులు, యాబ్సిస్ లు, ఫిస్ట్యులా _ అన్నీ  చేయగలిగాను.

    మొదటిరోజుల్లోనే  ఓసారి  సిస్టు ఒకటి తీసివేయాల్సి  వచ్చింది. చిన్నదే. కంటికి క్రిందుగా వుంది. శేఖరంగారు మెయిన్ థియేటర్ కు ప్రక్కనే వున్న గదిలో  పేషెంటును పడుకోబెట్టి  నన్ను  చెయ్యమని చెప్పి వెళ్ళిపోయారు. ఒక ఆక్సిలరీ  నర్సు  నాకు అసిస్టెంట్ గా వుంది.

    ఎందుకో  ఆరోజు  భయంవేసింది. సిస్ట్ చిన్నదే  అయినా  కంటికి దగ్గరగా  వుంది. ఆ ప్రదేశంలో  ముఖ్యమైన  నరాలు  చాలా వున్నాయి.పోవలసిన దానికంటే  ఎక్కువ లోతుగాపోతే  అవి దెబ్బతిని, ఏ దుష్పలితమైనా  కలగవచ్చు.      
  
    అందుకని  ఎంత  తొందరగా  చేద్దామని  వున్నా, జాగ్రత్తపడుతూ చేసేసరికి  గంటకు పైగా పట్టింది.

    నేను గౌను విప్పేసి, నుదిటికి పట్టిన  స్వేద బిందువులు తుడుచుకుంటూంటే  శేఖరంగారు వచ్చి "ఏమండీ! మీ సర్జరీ పూర్తయిందా చివరకు ? ఈ లోపల నేను నాలుగు వేసక్టమీలు  పూర్తిచేశాను" అన్నాడు.

    తర్వాత  ఆక్సీలరీ  అమ్మాయి  చెప్పింది. నేను  చేస్తున్నప్పుడు  మధ్య మధ్య మొత్తం మూడుసార్లు వచ్చి చూసి వెళ్ళారుట. నేను అధైర్యపడతానని, చెప్పొద్దని  సౌంజ్ఞ చేసి మళ్ళీ  వెళ్ళిపోతూ వుండేవారుట.

    ఆపరేషన్  చేస్తుంటే  ఎంత థ్రిల్ వుండేది ! చెప్పరాని ఆనందం, సొగసు వున్నాయి  అందులో. రాత్రుళ్ళు ఆ మధురాలోచనలతో  నిద్రపట్టేదికాదు.

    అసలు రాత్రిపూట చాలా తక్కువసేపు నిద్రపోయేవాణ్ని. సాధారణంగా పన్నెండు గంటలదాకా ఏదో పుస్తకం  ముందేసుకుని  చదువుకుంటూ  కూర్చునేవాణ్ని. కిటికీముందు  కుర్చీ వేసుకుని  కూర్చుంటే  ఎదురుగుండా  ఆపరేషన్  థియేటర్ కనిపిస్తూ  వుండేది. నా డ్యూటీరోజు కాకపోయినా_థియేటర్ లో లైటు వెలిగిందంటే  వెంటనే లేచి బట్టలేసుకుని  వెళ్ళి పోయేవాణ్ని.

    అలా ఎన్నో  ఎన్నో  ఆపరేషన్ లు చూశాను.

    డ్యూటీ రోజున సరేసరి. సిస్టర్స్ వేళాకోళం చేసినట్లే  ఆ రోజు ఎమర్జన్సీలు తగుల్తూండేవి. ఎపెండిసైటిస్ లు, స్ట్రాంగ్యులేటెడ్  హెర్నియాన్, పెర్ ఫరేషన్ కేసులు ఏదో ఒకటి వస్తూనే  వుండేది.

    ఇహ ఇప్పుడు చేతులు  వాష్ చేసుకుని, థియేటర్ డ్రెస్  వేసుకుని ,లోపల నేనూ, అసిస్టెంటూ ,సిస్టర్ _ మృత్యువుతో  పోరాటం  సాగించే వాళ్ళం.

    శేఖరంగారి డ్యూటీ  రోజున  మరీ అవకాశాలు  వచ్చేవి. ఆయనకు అసిస్ట్ చేయడమే గాకుండా  మేజర్ ఆపరేషన్లు _ సలహాలు  చెబుతూ _ దగ్గరుండి చేయించేవాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS