Previous Page Next Page 
రాజ హంస పేజి 19

 

    రాజహంస జవాబు చెప్పకుండా ఆలోచిస్తూ వూరుకుంది.
    "నీకు నచ్చాడా?" అనడిగింది ఊర్వశి ప్రియ చిలిపిగా.
    'ఛీ అదేం మాటలే" అంది రాజహంస.
    ఊర్వశి ప్రియ రాజహంస భుజం మీద గిచ్చింది. "నిజమెప్పుడూ ఛీ తోనే మొదలవుతుంది."
    'అల్లరి పిల్లా!"
    

                                                        *    *    *

    రాత్రి యింటికి చేరేసరికి పదకొండు దాటింది. ఊర్వశి ప్రియే కారులో దించి వెళ్ళిపోయింది.
    పాండురంగ నిద్రపోకుండా ఎదురు చూస్తున్నాడు. అనిల్ మంచం మీద నిద్ర పోతున్నాడు.
    "నువ్వు .....యింకా రాలేదేమిటా అని భయపడుతున్నాను....ఎక్కడి కెళ్ళావోనని"
    "ఎందుకూ ఎదురు చూడటం?" అంది రాజహంస విసురుగా.
    "చాలా రాత్రయిందని."
    "రాత్రయితే ఏమయింది? ఎవరన్నా ఎత్తుకు పోతారా?"
    'అలా అని కాదు. ఎక్కడికి వెళ్ళావో తెలీక...."
    "ఏం వెళ్ళకూడదా?"
    "కాని....ఎక్కడికో...."
    "ఎక్కడికో చెప్పి పర్మిషన్ తీసుకుని, వెడుతూ వుండాలా?"
    పాండురంగకి ఏమనాలో తెలీక ఊరుకున్నాడు.
    రాజహంస డ్రస్ మార్చుకుని ప్రక్క మీదకు చేరి పడుకుంది. మనసంతా.....ఉయ్యాల లూగుతూ, ఎక్కడికో అలా....అలా సాగిపోతున్నట్లు అనుభూతి తనముందుకు ఏదో కొత్త ప్రపంచం అవతరించినట్లు కొత్త బాట మీద కాలు మోపినట్లు....
    ఆప్రయత్నంగా ప్రక్కకి వొత్తిగిలిగింది.
    బెడ్ లైట్ వెలుగులో పాండురంగ గాడ నిద్రలో మునిగి వుండి కనిపించాడు.
    చాలా ఎలర్జీగా ఫీలయింది. ఈ యిల్లు, వాతావరణం యిక్కడ తాను.
    వాట్ ఏ బోర్!
    మళ్ళీ అటు వైపు తిరిగి పడుకుంది.


                                                             10

 

    రాజహంస సృష్టించుకున్న నూతన ప్రపంచం రోజు రోజుకు మరింత విశాలమవుతూ వచ్చింది.
    లయన్స్ క్లబ్ స్త్రీ శాఖ యింకా కొన్ని సంస్కృతిక సంస్థలు వీటిలో సభ్యత్వ మిప్పించింది ఊర్వశి ప్రియ.
    సినిమా మీటింగులు, కొత్త తెలుగు సినిమా రిలిజయినప్పుడల్లా యిష్టా గోష్టి సమావేశాలు పత్రికల వాళ్ళు వూళ్ళో కొందరు ప్రముఖుల్ని కూడా పిలుస్తారు. ప్రోడ్యుసరూ, డైరెక్టర్, సాంకేతిక నిపుణులూ, కొంతమంది నటులు వస్తారు. ఆ చిత్రం ఎలా వున్నా స్పీకర్లు ప్రశంసావాక్యాలు కురిపించాలి.
    రాజహంసకు ఆ సమావేశాలకు కూడా ఆహ్వానాలు రాసాగాయి.
    సమావేశాలకు, ఆహ్వానం పంపే ముందు సినిమా కూడా చూపించేవారు.
    ఒకసారి యిష్టా గోష్టి సమావేశంలో ఆమెను మాట్లాడమన్నారు.
    ఆరోజు మీటింగుకు దిలీప్ కూడా వచ్చాడు.
    సస్టేజి మీద మాట్లాడటం అంతకు ముందెప్పుడూ రాజహంసకు అలవాటు లేదు. "మీరు మాట్లాడాలని చెప్పగానే గుండెలో చిన్న వొణుకు లాంటిది వొచ్చింది. కాని తాను ఓడిపోకూడదు. తన పర్శనాలిటీకి తగ్గట్టుగానే స్పీచ్ కూడా వుండాలి. లోపల్నుంచి తరుము కోస్తున్న తడబాటును బయటకు రాకుండా అడిమేసింది. వొంట్లో ప్రతి అణువులో ప్రవహిస్తోన్న శక్తినంతా నాలిక మీదకు తెచ్చుకుంది.
    మాట్లాడేసింది.
    మాట్లాడింది అయిదు నిమిషాలే అయినా సంమోహాన పరిచే తియ్యటి గొంతు అందమైన పరిమితమైన బాష చక్కని భావం.....సభంతా పువ్వులు విరజల్లి నట్లయింది.
    మీటింగయి పోయాక దిలీప్ దగ్గర కొచ్చాడు. "మీరు చాలా బాగా హాయిగా మాట్లాడారు" అన్నాడు.
    "ఆ అందులో ఏముంది? మీరు వూరికే అలా అంటున్నారు" అంది రాజహంస మొహమాట పడుతూ.
    "నేనవర్ని అనవసరంగా పొగడను"
    "దెన్ ఐయామ్ రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్."
    "మీరి వేళ రెట్టింపు అందంతో కనబడుతున్నారు.
    ఆమె చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి.
    ఏమనాలో తోచక "ఈ మధ్య ....ఎక్కువగా కనిపించడం లేదేం?" అనడిగింది కొంచెం సిగ్గుపడుతూ.
    "ఈ ఊళ్ళో నెలకు నాలుగయిదు రోజులకు ఎక్కువ వుండను. ఆ టయిములో యిలాంటివి తటస్థించాలి , నాకు తీరికా చిక్కాలి."
    "మీరు మరీ అంత బిజీ అయితే ఎలా?" అంది కొంచెం చనువు తెచ్చుకుంటూ.
    "ఏం చెయ్యమంటారు? మనం కొన్ని కావాలని సృష్టించుకుంటాం. తర్వాత బయటకు రాలేం"
    "అలా సృష్టించు'కునే నేర్పు కూడా అందరకూ చేతనవాలి కదా"
    "మీరు చాలా బాగా మాట్లాడతారు"
    అందంగా నవ్వింది. "నాకు తెలీదు"
    అతన్తో మాట్లాడుతుంటే ఆమెకు చాలా హాయిగా వుండి టయిం తెలియటం లేదు. ఆ గొంతు మాడ్యూలేషన్ యింకా యింకా వినాలనిపిస్తోంది.
    ఆ రాత్రి కారులో అతనే, డ్రాప్ చేశాడు.
    పాండురంగ కిటికీ దగ్గర నిలబడి వున్నాడు. చూశాడు ఆమె లోపలికోచ్చాక అతన్ని గురించేమీ ప్రశ్నించలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS