వాష్ టబ్ దగ్గర కర్బాలిక్ సబ్బుతో చేతులు కడుక్కుంటున్నాను. ప్రక్కనే వుండి చూస్తున్న సిస్టర్ "అలాకాదండీ.మోచేతులకు పైదాకా వాష్ చేసుకోవాలి చొక్కా చేతులు యింకా మడుచుకోవాలి" అని సలహా యిచ్చింది.
సబ్బుతో చేతులు కడుక్కున్నాక జాగ్రత్తగా పంపు క్రింద వాష్ చేసుకున్నాను. తర్వాత సిస్టర్ చేతుల మీద సేవ్ లాన్ పోసింది, పంపు నీళ్ళతో మళ్ళీ వాష్ చేసుకున్నాను. ఆ తర్వాత సిస్టర్ లోషన్ తో నిండి వున్న రెండు శంఖువుల దగ్గరకు తీసుకువెళ్ళి వాటిలో చేతులు ముంచమంది మోచేతుల పైవరకూ వాటిలో ముంచి బయటకు తీశాక "ఇప్పుడు వేటినీ తాకకుండా లోపలకు వెళ్ళి గౌను వేసుకోవాలి, పదండి" లని, థియేటర్ తలుపులు తెరిచింది. నేను జాగ్రత్తగా లోపలకు అడుగుపెట్టి, చేతులు ప్రక్కకి పెట్టుకుని, చొక్కాకి తగలకుండా చూసుకుంటూ నడుస్తున్నాను. ఇదివరకు ఎన్నిమార్లో థియేటర్ లో అడుగు పెట్టినా, యీసారి ఎందుకనో కొత్త అనిపించి, సిగ్గు పడ్డాను అందుకు తగినట్లే ఆపరేషన్ టేబుల్ దగ్గర నిలబడ్డ రంగయ్యగారు "ఓహ్ ! నో నో, అలాకాదు. వాష్ ఎగెయిన్" అనటం వినిపించి వెంటనే ఆగిపోయాను. కొద్దిగా అప్రతిభుణ్నయిపోయాను. ఓ సిస్టర్ నా కెదురుగా వచ్చి ముఖం చాటు చేసుకుని నవ్వుతూ, "బయటకు వెళ్ళి మళ్ళీ వాష్ చేసుకుని రండి" అంటోంది. నాకేమీ అర్ధం కాలేదు అంతా అయోమయంగా అనిపించింది అప్రయత్నంగా వెనుదిరిగి, తడబడుతూన్న అడుగులతో బయటకు వచ్చేశాను.
బయట నిలబడి వున్న సిస్టర్ నా పరిస్థితి గమనించి నవ్వుతూ "నేను వెనుక నుండి చూస్తూనే వున్నాను. జాగ్రత్తగా వుండమని చెప్పలా? అలా చేతులు పక్కకి పెట్టుకుని నడవకూడదండీ చేతులు రెండూ ముందుకు ఎత్తి పట్టుకుని ఒకదాని వ్రేళ్ళు మరో దానిలో దూర్చి నడవాలి చూడండి, యిలా" అంటూ ఎలా చెయ్యాలో తను చేసి చూపించింది. తర్వాత "రండి. మళ్ళీ మొదట్నుంచీ వాష్ చేసుకుందురు గానీ" అని, టబ్ దగ్గరకు తీసుకెళ్ళింది.
సబ్బుతో చేతులు కడుక్కోవటం మొదలై ఆ తతంగమంతా పూర్తి అయాక యీసారి సిస్టర్ చెప్పినట్లు, చేతులు ఒకదానితో ఒకటి కలిపి ,ఎత్తిపట్టుకుని లోపలికు ప్రవేశించాను.
లోపలకు వెళ్ళాక మరో సిస్టర్ ఒక పెద్ద బిన్ దగ్గరకు తీసుకువెళ్ళి, మూత తెరిచి, "అందులోంచి ఓ గౌను తీసి వేసుకోండి" అంది. ఆమె చెప్పినట్లే, జాగ్రత్తగా స్టెరిలైజ్ డ్ గౌను తీసి చేతితో పట్టుకున్నాను.
"గౌను చేతుల్లోంచి మీ చేతులు దూర్చండి, దాని త్రాళ్ళు కొంచెం నాకు అందీయండి, అంతే! మీరు చేతులు వెనక్కి మాత్రం పెట్టకండేం."
నే నలాగే చేతులు దూర్చి, యిరుప్రక్కలా త్రాళ్ళు ఆమెకు అందిచ్చాను. ఆమె వెనకనుండి నా వీపుమీద ముడివేస్తూ, "మీరు మరీ అంత ఎత్తు వుంటే ఎలా ? ఆ పైముడి నా కందటం లేదు బాబూ! మీరు కొంచెం వొంగాలి" అంది.
గౌను తొడుక్కోవటం అయ్యాక గ్లవ్స్ ఎక్కడున్నాయో చూపించి వేసుకోమంది, చేతికి పౌడర్ అద్దుకుని గ్లవ్స్ వేసుకున్నాక "హమ్మయ్య!" అని ఊపిరి పీల్చుకున్నాను. అంతవరకూ వుక్కిరి బిక్కిరి అయినట్లుగా వుంది. ఇంతకాలంగా హాస్పిటల్ లో వుంటూ ,యిన్ని ఆపరేషన్ లు అటెండ్ అవుతూ కూడా అక్కడి ప్రొసీజర్ అర్ధం చేసుకోలేనందుకు ఎంతో కించపడ్డాను.
నళిని క్యాజుయాలిటీలో పని చేస్తోంది .తర్వాత కలుసుకున్నప్పుడు "ఆపరేషన్ థియేటర్ లో చాలా ఫీట్లు చేశారుటగా. అక్కడి సిస్టర్ చెప్పింది లెండి" అంది, నవ్వుతూ.
"నా గురించి మీకు చెప్పేటంత అగత్యమేమొచ్చింది ? అసలా టాపిక్ ఎలా వచ్చింది ?" అన్నాను ఆశ్చర్యపడుతూ.
"మన మిద్దరం క్లోజ్ గా వుంటామని ఆ అమ్మాయికి తెలుసులెండి."
ఆ మాట అదోలా అనిపించి, మాట తప్పించాలని, "ఎట్లావుంది మీ క్యాజుయాలిటీ ?" అన్నాను.
నళిని పెదవి విరిచి "ఎట్లా వుందని చెప్పను ? క్షణం తీరిక వుండటంలేదు. నిల్చుని నిల్చుని కాళ్ళు బలపాలుకట్టిపోతున్నాయి. అవును గానీ, మొన్న 'డే ఆఫ్' రోజున లలితా, నేనూ మ్యాట్నీ సినిమా కెళ్ళామండీ. మాకు ముందువరుసలో ఎర్రగా, పొడుగ్గా ఒకబ్బాయి కూర్చున్నాడు. వెనకనుంచి అచ్చం మీలాగే వున్నాడు. చాలాసేపు మీరే ననుకుని మాలో మేము తర్జన భర్జన చేసుకున్నాం, పిలుద్దామనుకున్నాం కూడా. కాని తటపటూయించి వూరుకున్నాం. ఇంటర్వెల్ లో లైట్లు వెలిగాక చూద్దుము కదా, అవ్వ ! మరెవరో" అన్నది, మధ్య మధ్య అభినయం కోదా చేస్తూ. కదా, అవ్వ ! మరెవరో" అన్నది, మధ్య మధ్య అభినయం కూడా చేస్తూ.
"ఇంకా నయం ! పిలిచారు కాదు" అన్నాను.
"అలా అనకపోతే 'ఆ అబ్బాయిని నేనైనా బాగుండును' అనటానికి మీకు నోరు రాదా ?"
నేనేదో అనేలోపల ఆమే మళ్ళీ "అందుకే మిమ్మల్ని చూస్తే కోపం వస్తుంది. తరచు కనిపిస్తూంటానని మాట యిచ్చి, వారానికి ఒకసారైనా కనబడటం లేదుగానీ" అంది, కోపం వచ్చినట్లు ముఖంపెట్టి.
"మాటల్ని అద్వితీయంగా మార్చటంలో మీ ఆడవాళ్ళు అఖండులు" అన్నాను, అప్రయత్నంగా.
నళిని నా వంక ఆశ్చర్యంగా చూసింది. "మీరేనా యీ మాట అనేది ?" అన్నది, సన్నని స్వరంతో. నన్ను ఒక కొత్త మనిషిని చూచినట్లు చూసింది.
"నా కెందుకో యింకా అలాగే మాట్లాడాలనిపించింది. పని తొందరలో నాకు వీలుగాకపోతే, పోనీ మీరు రావచ్చుగా" అన్నాను.
"అమ్మో !" అంది నళిని, బుగ్గమీద వేలు పెట్టుకుని. 'ఇంత సానుభూతితో ఆహ్వానం పంపిస్తున్నది మీరేనా ?' అన్న భావం ఆమె కళ్ళలో ద్యోతక మవుతూంది.
"నేను వస్తే యింకేమైనా వుందా ? మా స్టాఫ్ లా ప్రశ్నలు వేస్తాడు. 'ఆ సర్జికల్ వార్డులో నీకేం పని ? అక్కడెవరితో మాట్లాడుతున్నావు ? ఏముంటాయి అతన్తో నీకు మాటలు ?' అంటూ. ఇంక మిగతా సిస్టర్స్ మాత్రం తక్కువ తిన్నారా ? ఇప్పటికే....ఎందుకు లెండి ?" అని అర్ధోక్తిలో ఆపేసింది.
"ఆ అనుకునేది, నేను యిక్కడికి వస్తే మాత్రం అనుకోరా ?" అన్నాను వదిలిపెట్టకుండా.
"అదివేరు యిదివేరు" అన్నది దృష్టి ప్రక్కకు మరల్చి. ఒక క్షణమాగి "అసలు ఎవర్నీ లెక్కచేసే స్వభావం కాదు నాది" అంది. ఆమె గొంతు కొద్దిగా వొణికినట్లయింది.
నలుగురు సిస్టర్స్ కలిసినప్పుడు హౌస్ సర్జన్లను గురించి, అసిస్టెంట్లను గురించి మాట్లాడుకోవటమూ, నలుగురు హౌస్ సర్జన్లు కలిసినప్పుడు సిస్టర్లను గురించీ, అసిస్టెంట్లను గురించీ యథేచ్చగా మాట్లాడుకోవటమూ హాస్పిటల్ వాతావరణంలో పరిపాటి అయిపోయింది.
ఒకసారి కేంటిన్ లో జగన్నాధం, మరో నలుగురు హౌస్ సర్జన్లూ కలిసి యిదే విషయాన్ని గురించి తీవ్రంగా చర్చిస్తున్నారు.
"మా వార్డులో సరోజిని అనే సిస్టర్ వుందిలే, ఎర్రగా, సన్నగా మనిషి బాగానే వుంటుందిలే. మనం ఏదయినా పని చెబుతామనుకో. 'ఊ' అనదు, 'ఆ' అనదు. మనం చెప్పింది వినిపించుకుందో లేదో కూడా తెలీదు. ఒకసారి స్టాఫ్ తో ఏమండీ! ఈ సిస్టర్ 'ఊ' అనదు, 'ఆ' అనదు. ఎలాగండీ వేగేదీ ?" అన్నాను. స్టాఫ్ వెళ్ళి ఆమెను అడిగినట్లుంది. అపళంగా నా మీదకు దండయాత్రకొచ్చి 'నేను మీకు 'ఊ', 'ఆ' పలకటం లేదూ, మీరు చెప్పిన పని చెయ్యటం లేదూ ?' అని సాగదీసింది. అప్పట్నుంచీ మరీ పెడసరంగా వుంటూందనుకో" అన్నాడు వాసు అనే హౌస్ సర్జన్.
"ఇంకో అతను "వీళ్ళ పార్సు బలే వుంటుందిలే. మా ఆర్ధోపెడిక్ లో సిస్టర్ గోవిందరావును 'మా గోవింద్, మా గోవింద్' అంటూ వుంటుంది. అతనెప్పుడైనా రావటం ఆలస్యమైతే నా దగ్గరకొచ్చి 'మా గోవింద్ ఇంకా రాలేదా!' అనడిగేది. ఒకసారి నేను మా వార్డులోని రెండో సిస్టర్ తో 'ఏమిటి కథ ? సోఫియాకు గోవిందరావంటే అంత యిష్టమా ఏమిటి ? మోజు పడిందా అతనంటే?" అనడిగాను. ఆమె యీ విషయం తీసుకువెళ్ళి సోఫియాకు క్యారీ చేసింది కాబోలు, ఆ సిస్టర్ మరునాడు వచ్చి పెద్ద తగాదా పెట్టుకుంది. 'ఇలా అన్నారట నిజమేనా?' అంది. 'అనే వాళ్ళకుంటాయి గాని, మాకు అలాంటి బుద్ధులు లేవండీ' అంది. ఇంకేవో చాలా సాగదీసింది. అంత రగడ చేసిందా, ఒకసారి ఆ అమ్మాయే గోవిందరావుతో చీకట్లో దగ్గరగా నిల్చుని మాట్లాడుతుంటే హెడ్ నర్స్ చూసి యీసారి అలా పిచ్చి చేష్టలు చేస్తూ కనిపించావంటే సస్పెండ్ చేస్తానని బెదిరించిందట. తిక్క వదిలిపోయింది" అన్నాడు.
జగన్నాధం అందుకుని "ఆడ స్టాఫ్ లైతే కొంత ఫర్వాలేదు. మనం ఏ వార్డుకి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా అట్టే పట్టించుకోరు. ఒకవేళ స్టాఫ్ చిన్నదైతే మనం వాళ్ళతోనే సరదాగా మాట్లాడుతూ కూర్చోవచ్చు. మేల్ స్టాఫ్ అయితేనే వస్తుంది చిక్కు. సీతాకోకచిలుకల మధ్య కందిరీగల్లాగా వాళ్ళను చూస్తేనే ఎలర్జీ పుట్టుకొస్తుంది నాకు. నర్సింగ్ శాఖకు ఆడపిల్లలే అమరుతారు గాని, మొగవాళ్ళేమి బాగుంటారు ? ఇహ అక్కణ్నుంచీ వాళ్ళ దగ్గర పనిచేస్తున్న సిస్టర్సుతో మనం ఎవరైనా వెళ్ళి మాట్లాడితే వాళ్ళ కడుపు మండిపోయి అధికారం, జులుం అంతా సిస్టర్స్ మీద చూపించటం, రిపోర్టు చేస్తానని బెదిరించటం, లేకపోతే ఆరిందలా నీతులు బోధించటం. అసలింతకీ ఏడు పేమిటంటే వాళ్ళు మనతో మాట్లాడుతున్నారని ఈర్ష్య.... !" అన్నాడు.
ఇట్లా మాట్లాడుకునేవాళ్ళు.
విద్యార్ధులంతా యిళ్ళ నుండి తిరిగివచ్చేశారేమో వార్డులన్నీ కలకలలాడుతుండేవి. ఒక్కొక్క పేషెంటు మీదా పదిమంది ఎగబడి గబగబ ప్రశ్నలు వేసి అటునడవమని _ ఇటు నడవమని _ కూర్చోమని _ పడుకోమని వాళ్ళను గాబరా పెట్టేసి, తాము హైరానపడిపోయి, చీఫ్ వచ్చాక కేసు ప్రెజెంటు చెయ్యటం, అక్కడి నుంచీ ప్రశ్నలు ,జవాబులు __ఇట్లా హడావుడిగా వుండేది.
ఒకసారి మల్టిఫుల్ న్యూరోఫైబ్రోమా కేసు. పళ్ళంతా అంగుళం మేరా ఖాళీ లేకుండా, భయంకరంగా వుంది ఓ డెబ్బయిఏళ్ళ ముదివగ్గు. స్టూడెంట్సు ఎగ్జామిన్ చేస్తున్నారు. అప్పుడే క్లినికల్ సైడ్ లోకి కొత్తగా ప్యాసయివచ్చిన ఓ అమ్మాయి, వున్నట్లుండి, కళ్ళు తిరిగి పడిపోయింది.
