Previous Page Next Page 
రాజ హంస పేజి 18

 

    "ఎలావుంది జీవితం?" అనడిగింది ఊర్వశి ప్రియ.
    "ఏడిసినట్టుంది. అర్ధం లేకుండా, శూన్యంలా రోజులు గడిచి పోతున్నాయి.
    "కొన్నాళ్ళ క్రితం నాకూ అలాగే వుండేది. అలోచించి, అలోచించి పద్దతి మార్చుకున్నాను."
    "ఇంట్లో కూచుని జీవితం పాడయిపోయింది. అని రోజులు లెక్క పెట్టుకోకుండా సొసైటీలో యాక్టివ్ గా తిరగటం నేర్చుకున్నాను."
    'అంటే.....ఎలాగ?"
    "గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయాలు, స్నేహాలు పార్టీలు, మీటింగులూ.... జీవితం ఎలా థ్రిల్లింగ్ గా వుంటుందో తెలుసా?"
    "కాదని నేననను. అలాంటి ఆశలూ వున్నాయి. కాని డబ్బేది?"
    "డబ్బు అవసరమే .....కాని...."
    "కాదు. అన్నిట్లోనూ ముఖ్యావసరం డబ్బే. అలాంటి పెద్ద పెద్ద పార్టీల కెళ్ళాలంటే డబ్బు కావాలి. ఇంట్లో ఫోనుండాలి. ఖరీదైన చీరెలు, నగలూ వుండాలి. అంతటి స్థాయి నాకు లేదు."
    "స్థాయి .....డబ్బులో లేకపోయినా , చాలామంది ఆడవాళ్ళలో లేని మేగ్నటిక్ పవర్ నీలో వుంది. ఆ పవర్ తో అవన్నీ మీ యింటికే వచ్చేటట్లు చేసుకుంటావు."
    రాజహంస ఆలోచనలో పడిపోయింది.


                                                              9

    ఊర్వశి ప్రియ సూచన రాజహంస జీవితంలో మరో టర్నింగ్ పాయింట్ తీసుకొచ్చింది.
    ఊర్వశి ప్రియ కారు తీసుకొచ్చింది. తానే డ్రైవ్ చేసుకుంటూ.
    ఆ సాయంత్రం ఆమె స్నేహితుల్లో ఒకరికి మేరేజ్ డేపంక్షన్ జరుగుతోంది. కాందారీ హోటల్లో పార్టీ.
    "హంసా" అన్నది దారిలో. అక్కడకు అడుగు పెట్టేప్పుడు నువ్వు యిన్ వైట్ చెయ్యబడకుండా వచ్చిన గెస్టు వనీ, అన్నీ కొత్త మొహాలనీ మొహమాట పడబోకు. నవ నాగరికతలో కొత్తగా వచ్చిన మర్పేమిటంటే దేనికి సిగ్గుపడకుండా చొచ్చుకుపోతూ వుండటమే. ఎవరితో పడితే వారితో మాట్లాడుతుండాలి. పెదాల మీద చిరునవ్వు చెరగకుండా చూసుకోవాలి. బఫీ డిన్నర్లు ఉంటాయి. కొత్తగా ఫీలవకుండా మనకిష్ట మొచ్చినది మనమే సర్వ్ చేసుకుంటూ చలాకీగా వుండాలి.
    ఈ హితోపదేశం గుర్తు పెట్టుకుంది.
    కార్లలో కొందరు జంటలుగా వస్తున్నారు. కొందరు విడివిడిగా వస్తున్నారు.
    నవ్వులు, కేరింతలు , జోకులు, గ్లాసులు, సోడాలు ,విస్కిలు అనందాలు....
    రాజహంస లోలోపల పొంగుతున్న ఆశ్చర్యాన్ని అణచుకుంటూ వాళ్ళతో కలిసిపోవటానికి ప్రయత్నిస్తోంది.
    తనకి తెలీని ప్రరంచం ఎంత వుంది. ఈ విశాల ప్రపంచంలో తనెంత ఇరుకు జీవితమనుభావిస్తోంది.
    ఈ ప్రపంచం తనకు తెలీకుండా ఎంత ముందుకెళ్ళి పోయింది.
    ఎంత ఆకర్షించే వేగం!
    ఊర్వశి ప్రియ గుర్తు పెట్టుకుంటూ అందరికీ పరిచయం చేస్తోంది. ముందుగా మేరేజ్ డే చేసుకుంటూ పార్టీ యిస్తోన్న దంపతులకు పరిచయం చేసింది.
    "ఓహ్! యిటీష్ థ్రిల్లింగ్ మీరు రావటం మాకెంతో సంతోషం" అన్నాడతను.
    తనని చాలామంది కళ్ళు గమనిస్తున్నాయని గ్రహించింది. ఆ చూపుల్లోని ప్రశంస కూడా తెలుస్తుంది.
    చాలా గర్వంగా ఫీలయింది.
    కొందరు - ముఖ్యంగా మొగవాళ్ళు ఆమెతో కల్పించుకొని మాట్లాడుతున్నారు. మొదట్లో కొంచెం కాంప్లెక్స్ కనిపించినా వాళ్లతో మిక్సవటం ఆమెకేమీ కష్ట మనిపించలేదు.
    ఆమె యింకొక ముఖ్యమైన విషయం గమనించింది. ఎవరూ కూడా ఆమెని మీ భర్త ఎవరని గానీ, అయన ఏం చేస్తారని గానీ అడక్కపోవటం.
    సభ్య సమాజంలోని ఈ అందం ఆమె కెంతో రిలీఫిచ్చింది.
    "హాయ్ "అంటూ ఊర్వశి ప్రియ అప్పుడే లోపలికి వస్తోన్న ఓ యువకుడ్ని చనువుగా పలకరించింది.
    రాజహంస అటు కేసి చూసింది. దాదాపు ముప్పయి ఏళ్లు న్న యువకుడు. ఇన్ షర్టు వేసుకుని చాలా స్టయిల్ గా వున్నాడు. ముఖంలో ఠీవి, దర్పం, అందం కలబోసి విరుస్తున్నాయి. రాజహంస అతనికేసి విస్మయంగా చూసింది.
    "ఇతను దిలీప్ బిజినెస్ మేగ్నేట్ హి ఈజ్ ప్లాష్" అంది.
    "అతను నవ్వాడు. ఆ నవ్వు కూడా మనోహరంగా వుంది.
    'ఊర్వశి నా మీద ప్రేమ కొద్దీ అలా అంటుంది అలాంటిదేమీ లేదులెండి."
    "బైదిబై షి  ఈజ్ రాజహంస" అంది ఊర్వశి ప్రియ. '
    ఆ ఒక్క పరిచయంతోనే ప్రపంచంలోని అన్నీ యిమిడి వున్నట్లు చాలా క్లుప్తంగా చేసింది.
    "ఫైన్" అన్నాడు దిలీప్ పలకరింపుగా ఆ ఒక్క క్షణంలోనే తనని చూడగానే అతని కళ్ళలో ,మెరిసే కాంతి రాజహంస గమనించక పోలేదు.
    ఇంతలో ఎవరో దిలీప్ ని ఓ వైపు నుంచి కేకవేశారు. "వన్ మినిట్" అంటూ అటుకేసి వెళ్ళాడు.
    "అతనేం చేస్తాడు?" అనడిగింది రాజహంస.
    "చాలా పెద్ద బిజినెస్ డిటెయిల్స్ నాకు తెలీవు గాని హైదరాబాద్ లో వుంటాడు. కాని నెలకు పదిహేను రోజులు ప్లయిట్స్ , టూర్స్ మీదే వుంటాడు. వెరీ బిజీ ఈ హోటల్ కి వారానికి ఒకసారి వస్తాడు. ఒకటి రెండు రోజులుండి  పని చూసుకుని వెళ్ళిపోతాడు. అందుకే అన్నాను ప్లాష్ అని.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS