Previous Page Next Page 
హౌస్ సర్జన్ పేజి 17


    "ఏమోయ్ ? ఎలా వుంది ?" అనడిగాడు  నాయుడుగారు  అతని ముఖంమీదకి వొంగి.

    "బాగుందండీ. చాలా భాగం  తగ్గింది."

    "చూశారా ?" అన్నట్లు  నావంక చూసి  కనుబొమ లెగురవేసి అక్కడ నుంచి నిష్క్రమించాడు  నాయుడుగారు.

    కొంతమంది రోగులు  హౌస్ సర్జన్లతోనూ, అసిస్టెంటుతోనూ, చీఫ్ తోనూ  తమ బాధలను రకరకాలుగా మార్చి  చెబుతూండేవారు. ఒకరికి  చెప్పేదానికీ, మరొకరికి  చెప్పేదానికీ సంబంధ ముండేదికాదు.

    చక్రపాణిగారు  అంటూండేవారు. "మనం వార్డు నుంచి  బయటకు వెళ్ళిపోయాక రోగులందరూ  మాట్లాడుకునేది మనల్ని  గురించే. మనకు అత్యల్పంగా  కనిపించే  విషయం  వారికి ఎంతో పెద్దదిగా  కనిపించి, దాన్ని గురించి గంటలతరబడి  చర్చించుకుంటారు  ఒక రోగికి  ఒకపూట  ఇంజక్షన్ యివ్వటం మరిచిపోతే, అది మీకు సామాన్యంగా  కనిపించవచ్చు. కాని ఆ విషయమే అతని  మనసుని  తొలిచివేసి  ఆ రాత్రి నిద్రపట్టకుండా చేస్తుంది" అని.

    ఆ విషయం  నిజమే. ఒక్కొక్క పేషెంటుకూ  వార్డులో  ఇంజక్షన్ యిస్తూ  పోతున్నప్పుడు, ప్రతిఒక్కరూ కూడా తమనెక్కడ  మరచి పోతారేమోనని ప్రాణాలు బిగపట్టుకుని, చేతిలో  సిరంజితో అటూ యిటూ తిరుగుతూన్న  హౌస్ సర్జన్ వంక ఆశగా  చూస్తూ, కదలిక ద్వారానో, ఓ చతురోక్తి ద్వారానో  అతని దృష్టి నాకర్షించటానికి  ప్రయత్నిస్తూ వుండేవారు. వ్యాధినిబట్టి  కొంతమందికి  కొన్ని రోజులు  ఇంజక్షన్  యిచ్చాక  యిహ ఆపివేయమని చీఫ్ చెప్పేవారు. మిగతావారికి  సూదివేస్తూ  తనకు  వెయ్యకపోయేసరికి  ఆ పేషెంటు యింత ముఖం  చేసుకుని కూర్చునేవాడు. తనకు కూడా చెయ్యమని బ్రతిమాలేవాడు, పేచీ పెట్టేవాడు. దెబ్బలాడేవాడు. అతనికి ఇంజక్షన్ లు ఆపేశారని  ఒప్పించటానికి  తల ప్రాణం తోకకు వచ్చేది.    
   
    "రోజూ మీ రిచ్చే  సూది మందు  పవర్ ఫుల్ గా వుండేది బాబుగారూ! నిన్న మీ రిచ్చింది బొత్తిగా పవరు  చాలలేదు. అసలు చేసినట్లే లేందే" అని ఒకసారో పేషెంటు గోల పెట్టాడు.

    అంతవరకూ  మొనలు  అరిగిపోయిన  సూదులూ, బండ సూదులూ వుంటే విధిలేక అవే వాడుతూండేవాళ్ళం. అంతకు క్రితం  రోజే  కొత్త నీడిల్సు వస్తే, అవి స్టెరలైజర్ లో పడవేసి పాతవాటిని తీసి  దాచిపెట్టాం.

    అతన్ని  మాటలతో  ఒప్పించలేమని, ఆరోజు  పాత వాటిలో ఓ బండ సూదిని  తీసుకువచ్చి, దాంతో ఇంజక్షన్ చేశాను.

    "ఆఁ యిప్పు డెక్కింది  బాబుగారూ  పవరు అదీ ! అదీ !!" అని ముఖం చాటంత చేసుకున్నాడు.

    ఇహ స్పెషల్ రూమ్స్ లో వుండేవాళ్ళ సంగతి  చాలా విడ్డూరంగా వుంటుంది. సి.క్లాస్ వారు ఫర్వాలేదు. సి,క్లాసులో  ఒక్కొక్క  విశాలమయిన  గదిలో  నాలుగయిదు  బెడ్సువరకూ వుంటాయి. బి. క్లాసు ఒక్కొక్క మనిషికీ  ఒక గది ప్రత్యేకించి  వుంటుంది. ఎటాచ్ డ్ బాత్, వగైరాలుంటాయి.

    బి. క్లాస్ గదుల్లో  వుండే  పేషెంట్లు  అతి గారాబాలు  చేస్తారు. సాధారణంగా వారు ఏ ఆఫీసర్లో, సంపన్నులో అయివుంటారు. అరగంటకోసారి  కాలింగ్ బెల్ కొట్టి సిస్టర్ని  పిలుస్తూ వుంటారు. "నాకు నిద్ర పట్టటంలేదు సిస్టర్ ! "కడుపులో వికారంగా  వుంది. సిస్టర్ !" "నాకు పాలు పెట్టే టైమయింది సిస్టర్ !" "రెండోసారి  మందు త్రాగే టైమ్ అయింది సిస్టర్" అని  వరుసగా కంప్లెయింట్ లు చేస్తూ వుంటారు.

    ఒకసారి పెద్ద కాంట్రాక్టరొకాయనకు  బి.పి. చూడాల్సి వచ్చింది. సిస్టర్ ఏదో పనిమీద   హడావుడిగా వుండటంచేత ,నేనే బి.పి. ఇన్ స్ట్రుమెంటు తీసుకువెళ్ళి  యదాలాపంగా  ఆయన  కుడిచేతికి  కట్టి  చూస్తున్నాను. చూస్తున్నంతసేపూ  ఆయన నా ముఖం వంక  కళ్ళార్పకుండా   చూడటం గమనిస్తూనే వున్నాను.

    చూడటం  పూర్తి అయి  ఛార్టులో నోట్ చేశాక "ఒకమాట" అని పిలిచా డాయన.

    వెనక్కి  తిరిగి ఆయన దగ్గరకు  నడిచి వెళ్ళాను.

    "ముప్పయి ఏళ్ళ క్రితం  మద్రాసులో ఒక ఫారిన్ డాక్టరుతో  మొట్టమొదటిసారి బ్లడ్ ప్రెషర్  చూపించుకున్నాను. ఆయన కుడిచేతికి కట్టి చూశాడు. అప్పట్నించీ  ఎంతమందితోనో, ఎన్ని వందలసార్లో  చూపించుకున్నాను. అందరూ  ఎడంచేతికి  కట్టి చూసినవాళ్ళే ఇప్పుడు మీరు కుడిచేతికి కట్టి తనిఖీచేశారు. ఆ ఫారిన్ డాక్టరులా చూసేవారెవరైనా కనిపిస్తారా అని, బయటకు  చెప్పలేదుగాని ,ఎన్నడూ  మధనపడేవాణ్ని. ఆ నా డాయన్ని  చూశాను, ఈనాడు  మిమ్మల్ని  చూశాను. కంగ్రాచ్యులేషన్స్  డాక్టర్ !" అన్నాడు. ఆయన ముఖంలో  ప్రశంసా, కళ్ళల్లో తృప్తి గోచరించాయి.

    నేను ఆ ప్రతిభుణ్నయాను. గుండెకు దగ్గరగా  వుండటంవల్ల  ననుకుంటాను .సాధారణంగా  అందరూ ఎడంచేతికేకట్టి  చూస్తారు. నేను యీ నియమాన్నెప్పుడూ  పాటించక ఎటు వీలయితే  అటు చూస్తుండేవాణ్ని.

    బయటికేమీ  అనకుండా  గుంభనంగా  నవ్వి ఊరుకున్నాను.

    అప్పట్నించీ  ఆయన నాకెంతో  స్నేహితుడయిపోయాడు. డిశ్చార్జి అయి వెళ్ళిపోయేవరకూ ఎంతో ఆత్మీయంగా  కబుర్లు  చెబుతూ  గడిపాడు. మరి కొంతమందికి  లక్ష అనుమానాలు. ఈ మందు ఎలా తాగాలి ! ఫలహారం చేసేముందా? చేశాకా ? టాబ్లెట్ వేసుకున్న ఎంతసేపటికి  మందు తాగాలి ?ఏది ముందు ? ఏది వెనక ? ఇందాకా మీరు చెప్పినట్లు  గాక  ఒక అయిదు నిమిషాలు  ఆలస్యంగా  టాబ్లెట్ వేసుకున్నాను. దానివల్ల ఏమైనా ప్రమాదమా ?_ ఇట్లా వుంటాయి వాళ్ళ సందేహాలు.

    ఒకసారి  రిటైర్డ్  యింజనీరు  ఒకాయన _ బి.క్లాస్ పేషెంటు. "అబ్బాయి ! యివేళ నేను  మామూలుగా హార్లిక్స్  పుచ్చుకోవచ్చు కదూ" అని అడిగాడు.

    "పుచ్చుకోండి" అన్నాను.

    "ఎన్నిసార్లు  పుచ్చుకోమంటా వేమిటి ?"

    "మూడుసార్లు  తీసుకోండి" అన్నాను ఏదో  ఒకటి  సమాధానం చెప్పాలి గనుక.

    "నిన్న మీ చీఫ్ రెండుసార్లే  తీసుకోమన్నాడే !"

    బ్రహ్మాండమైన  ఆయన సందేహానికి  సమాధానం  వెంటనే  తోచక ఒక నిమిష మాలోచించి "చూడండీ, నిన్నటి పరిస్థితినిబట్టి  మీరు హార్లిక్స్ రెండుసార్లే  త్రాగాలి. ఇవేళ  మీ పరిస్థితి  కొంచెం  మెరుగ్గా  వుంది  టెంపరేచర్ ఓ పాయింటు తగ్గింది. నిన్న 99.4 వుంది. ఇవేళ 99.3 వుంది. అందుకని మూడుసార్లు త్రాగాలి" అని నచ్చజెప్పాను.

    నా జవాబు  ఆయనకు  నచ్చినట్లే  కనిపించింది. మళ్ళీ  ఏ ఫిర్యాదూ చేయలేదు.

    మరికొంతమందికి యింకా  లోతైన  సందేహాలొస్తాయి.

    "నా జబ్బు  టైఫాయిడే  నంటారా ? టైఫాయిడ్ కి క్లోరో మైసిటిన్ వాడటం మంచిది కాదని ఎందులోనో చదివానే! రిలాప్సెన్  వస్తాయిటగా. ఈ యింజక్షన్  దేనికి ?దేనికి పనిచేస్తుంది ? మొన్న నెత్తురు తీశారే ! దేనికదీ ? ఏ పరీక్షకు  పంపారు ?రిపోర్టు వచ్చిందా ?" అంటూ ప్రశ్నలు గుమ్మరిస్తారు.

    మొత్తం మీద  మెడికల్  వార్డులో  పనిచేసిన  రెండు నెలలూ  చాలా సునాయాసంగా గడిచిపోయాయి. చక్రపాణి దగ్గర  ఎన్నో  విషయాలు నేర్చుకున్నాను. ఆయన ఎప్పుడు ఏ కేసుని గురించి ఏ ప్రశ్న అడుగుతారోనని భయపడి. అన్నీ  క్షుణ్నంగా  చదివి జ్ఞాపకం  పెట్టుకుని జవాబు సిద్ధంగా  వుంచుకునేవాడిని.

    ఆఖరు రోజున చక్రపాణిగారు  యిద్దరు  అసిస్టెంట్లనూ, యిద్దరు హౌస్ సర్జన్లనూ కారులో కాఫీకి  తీసుకు వెళ్ళారు. ఆవేళ  చాలా సరదాగా మాట్లాడారు. తియ్యని భాషలో భవిష్యత్తుని  గురించి  అనేక  ఉపదేశాలిచ్చారు.

    ఆయనెందుకు  కటినంగా వుంటారో  ఆ రోజు  తెలుసుకున్నాను. సోమరితనంతో, మత్తుతో మ్రగ్గిపోతున్న ప్రజలకు  ఆ మాత్రం  కటినత్వం కొరడాదెబ్బలా  చళ్ళు  మనందే కాలం సక్రమంగా  ముందుకు  జరగదు. ఎవరూ మాట వినరు.       
    ఈ సూత్రం  అర్ధం చేసుకున్న  నాలో ఆయనంటే  సద్భావం పెరిగిపోయింది. ఆ క్షణంలొ ప్రపంచంలో  ఎవర్నీ  ద్వేషించలేకపోయాను.

                                   *    *    *

    తరువాత సర్జికల్ పోస్టింగ్ మృదులకు  మెడికల్  పోస్టింగ్ కాదు. ఆమెకు స్పెషల్  పోస్టింగ్సు  పడ్డాయి. మొదట రేడియోలజీ, తర్వాత యింకేవేవో  వుండే, గైనిక్, పబ్లిక్ హెస్టా  చివరికి  మెడిసిన్....అట్లా వచ్చింది వరస.

    "నేను మెడికల్ లో  చేస్తే మళ్ళీ  యిద్దరకూ  డ్యూటీరోజులు కలిసేవి. అలా జరగలేదని సంతోషిస్తున్నావు కదూ" అంది మృదుల ఎత్తిపొడుపుగా.

    "నేను సంతోషించటం  లేదు" అన్నాను.

    "ఒప్పుకుంటాను. విచారం కూడా లేదు ,ఏం ?"

    మాట్లాడలేదు.

    "నాకూ విచారంలేదు .కాకపోతే  డ్యూటీలో  నా పని సగం  చేసి పెడుతూ వుండేవాడివి. ఆ తోడు పోయిందేనని  బెంగ" అని అక్కణ్నుంచి గబ గబ వెళ్ళిపోయింది.

    సర్జికల్ వార్డు. నా కెంతో  ఇష్టమైన సర్టికల్  వార్డు  డ్యూటీ రోజు  వచ్చిందంటే  ఎమర్జన్సీ  అవకాశాల కోసం కాచుకు  కూర్చునేవాణ్ని. నిజంగా  ఎవర్జన్సీ  ఆపరేషన్ అనేది హౌస్ సర్జన్ కు ఎంత  అపూర్వమైన అవకాశం! థియేటర్ లో అసిస్టెంటూ, హౌస్ సర్జనూ, ఎనస్థటిస్టూ, సిస్టరూ తప్ప ఎవరూ  వుండరు. వార్డుబాయ్ లు మాత్రం  వుంటారు .లోపల దేదీప్యమానంగా  లైట్లు  వెలుగుతూ  వుంటాయి .పేషెంటు తాలూకు  ఒకరిద్దరు బంధువులు బయట తచ్చాడుతూ  వుండటం  మినహాయించి, సర్వత్రా నిశ్శబ్దం. అప్పుడప్పుడూ  ఎక్కడో  అడుగుల చప్పుడు. ఈ వాతావరణం నా కెంతో  యిష్టం.

    ఇదివరకు  థియేటర్ కు ఎన్నోసార్లు  వెళ్ళాను. ఎన్నో ఆపరేషన్ లు చూశాను గాని ,థియేటర్ పద్ధతిలో  చేతులు వాష్ చేసుకుని లోని కెప్పుడూ ప్రవేశించలేదు  నేను  సర్జికల్  సైడుకు వచ్చిన రెండో రోజునే  మాకు ఆపరేషన్ రోజు అవగా చీఫ్ రంగయ్యగారు  చేస్తూన్న గేస్ట్రోజెజు  నాష్టమీకి అసిస్ట్ చేయడానికి  వాష్ చేసుకుని  సిద్ధంగా  వుండమని  మూర్తిగారు చెప్పగా, చేతులు కడుక్కోవటానికి  వాష్ బేసిన్ దగ్గరకు  వెళ్ళాను. అప్పటికే థియేటర్ డ్రెస్ అయిన పైజమా, పైన చొక్కా, ముఖానికి  మాస్క్ కాళ్ళకు తెల్లని రబ్బరు బూట్లు వేసుకొని  వున్నాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS