"నేను ఏడున్నరకి ముందుగా లేవలేను చేత కాదు" అంది రాజహంస.
"నీకు దేవుడంటే నమ్మకం , భక్తీ లేదా?" అనడిగింది మీనాక్షమ్మగారు.
"దేవుడంటే నమ్మకముంది. ఎంతవరకుండాలో అంత వరకు, ఈ పిచ్చి పిచ్చి పూజలూ అవీ అసహ్యం" అంది రాజహంస.
"ఎవరి అలవాట్లు వాళ్ళకుంటాయి. తనని ఒత్తిడి చేయకమ్మ అని సరిపెట్టుకున్నదావిడ.
కొత్తకదా అని కొన్నాళ్ళపాటు వంటింట్లోకి పిలవలేదు. కాని ఎన్ని రోజులు గడిచినా వంటపనిలో జోక్యం చేసుకునే ప్రయత్నం కనిపించకపోయేసరికి "అమ్మాయ్! నీ చేతివంట రుచి చూడాలని కోరిగ్గా వుంది. అదీ గాక యివేళ కొంచెం నీరసంగా వుంది. కాస్త వంటపని చూడమ్మా" అంది.
"నాకూ వంటా గింటా చేతకాదు. అలాంటి పనులేమీ నా నెత్తిన పెట్టకండి" అంది రాజహంస.
"అలా అంటే ఎలాగమ్మా రేపోద్దుట అవసరమొస్తే....?"
"హోటలునుంచి క్యారియర్ తెప్పించుకుని తినాలి."
ఆమె చిన్నబుచ్చుకుని ఏమి మాట్లాడలేకపోయింది.
రాజహంస రాత్రుళ్ళే కాకుండా పగలు కూడా మేక్సీలు వేసుకుని తిరుగుతూ వుండేది. ఇంటికి అతిదులేవరైనా వచ్చినా పట్టించుకోనట్లు అలాగే తిరుగాడుతూ వుండేది. బయట కెళ్ళినప్పుడు చుడీదార్లు, వగైరాలన్నీ వెరైటీగా వేసుకుని తిరుగుతూ వుండేది.
మీనాక్షమ్మగారికి యీ వేషధారణ చూడటానికి యిబ్బందిగా వుండేది.
"పాండూ! అమ్మాయిని అలాంటి డ్రస్సులు వేసుకోవద్దని చెప్పరా. మన సంప్రదాయానికి బావుండదు. పైట పల్లెబాటు లేకుండా అలా...."
"ఇప్పటి రోజుల్లో ఆడపిల్లలు అంతేనమ్మా. వేషధారణ విషయంలో పెద్దవాళ్ళు జోక్యం చేసుకోవటం వాళ్ళ కిష్టం వుండదు."
"కాని నువ్వు భర్తవి. కించేపరిచేవి , ఎబ్బెట్టుగా కనిపించేవి వొద్దని చెప్పే హక్కు నీకుంది.
అతనేమీ జవాబు చెప్పలేదు. అతని మౌనంలో అసమర్ధత ఆమె గ్రహించి నిస్సహాయంగా వూరుకుంది.
కొన్నాళ్ళు పోయాక మరో సంగతి మీనక్షమ్మగారు దృష్టి కొచ్చింది. మెన్సెస్ లో వున్న మూడు రోజులూ కూడా రాజహంస యింట్లో కలుపుతూ తిరుగుతుందని.
అధునాతన పద్ధతుల్ని , యిప్పటి ఆడపిల్లల తీరు తెన్నుల్ని , అంత అర్ధం చేసుకోలేని ముర్ఘురాలేమీ కాదు మీనాక్షమ్మగారు. కాని యింట్లో పూజా పునస్కారాలుంటాయి, అంటరాని మనిషన్నట్లు దూరంగా వుంచకపోయిన కొంత క్రమశిక్షణ - కనీసం శుభ్రత కోసమైనా అవసరమని ఆమె అభిప్రాయం. తన ఉద్దేశం రెండు మూడు సార్లు చెప్పి చూసింది. రాజహంస వినిపించుకోలేదు. చేసేది లేక వూరుకుంది.
* * *
ఒక్కొక్కరోజూ గడుస్తున్న కొద్ద్రీ యింట్లో అంతకు ముందు లేని కొత్త కొత్త సమస్యలన్నీ ఉత్పన్న ,మవుతున్నాయి.
"ఈ రోజుల్లో ప్రతి సామాన్యుడికి యింట్లో కూడా టి.వి. వుంది. టి.వి లేకపోతే మనిషికి ఎలా కాలక్షేపమవుతుంది?" అన్నది రాజహంస.
'అలాగే ఒకటి రెండు రోజుల్లో టి.వి తీసుకుంటాను."
"ఎలాంటిది తీసుకుంటారు?"
"బ్లాక్ అండ్ వైట్"
"బ్లాక్ అండ్ వైటా?" అంది. ఆమె గొంతులో వెటకారం , అసహ్యం వున్నాయి.
అతను తప్పు చేసినట్లామే ముఖంలోకి చూశాడు.
"బ్లాక్ అండ్ వైట్ లో అయితే టివి చూసిన ఫీలింగే రాదు. కలర్ టీవి. బావుంటుంది.
"కాని అంత డబ్బు....'
'డబ్బు గురించి ఆలోచించే మనిషి అసలు పెళ్ళి చేసుకోకూడదు."
అతను నేరస్థుడు అవునో కాదో ఆమెకు తెలీదు. ఆలోచించే ఓపిక కూడా ఆమెకు లేదు. కాని యీ సమాజం మీద వున్న కసి అతని మీద ముందు వెనకా ఆలోచించకుండా తీర్చుకుంటుంది.
"రాజహంసా!"
"అవునండీ. మీరింత మైజరని తెలిస్తే నేనసలు మిమ్మల్ని చేసుకునేదాన్ని కాదు. నాకు మాత్రం కోరిక లుండవా? అందరిలా ఎంజాయ్ చెయ్యాలని వుండదా?"
అతను తప్పు చేసినట్లు తెగ ఫీలయిపోయాడు. ఆమెను బుజ్జగించాడు. ప్రాధేయపడ్డాడు. చివరకు - ఆమెను సంతోషపెట్టాటానికి కలర్ టివి తీసుకొచ్చాడు.
ఆమె ఎంజాయ్ మెంటుకు సంబంధించిన కసితో కూడిన కోరికలు ఒకదాని వెంట ఒకటి చెలరేగుతున్నాయి.
బీరువా నిండా చీరెలున్నా ఎప్పటికప్పుడు కొత్త చీరెలు, పంజాబీ డ్రస్సులు, రవ్వల దిద్దులు, వి.సి.పి.....
అతనికి అంతో యింతో ఆస్తి వుంది. రెండు వేలకు మించని జీతం. జీతం సరిపోవటం లేదు. ఆస్తి కరిగిపోసాగింది.
ఇంత చేస్తోన్నా ఆమె ముఖంలో ఎప్పుడూ అసంతృప్తి, మాటల్లో ఎత్తి పొడుపులు.
ఆమె సంతోషం కోసం అతనేమయినా చెయ్యటానికి సిద్దపడుతున్నాడు. ఎప్పుడూ ఆమె తృప్తి గురించే ఆరాట పడుతున్నాడు.
అయినా నిరంతరం "నా జీవితం పాడయింది. నాజీవితం నాశనం చేసేసుకున్నాను. అన్న ధోరణిలో మాట్లాడుతుండేది.
