ఆ అమ్మాయి ఏమీ బావుండలేదు. పైగా వికారంగా కూడావుంది.
ఒకరకంగా చెప్పాలంటే స్త్రీ పురుషులిద్దరిలో పోలిస్తే - పురుషులు తక్కువ భాగం అందంగా వున్నా ఎక్కువ భాగం ఏవరేజ్ గా వుంటారు. అందవికారంగా వున్నవాళ్ళు తక్కువగా వుంటారు. ఆడవాళ్ళలో అందగత్తెలు, తక్కువ, యావరేజిగా వున్నవారు తక్కువ, అంద వికారంగా వున్నట్లు కనిపించే వాళ్ళెక్కువగా వుంటారు. కాని యీ వికారాలు వయసు ఉప్పొంగులతో కప్పబడిపోతూ వుంటాయి.
వినోద్!
ఏ పదిలక్షలో కట్నం తీసుకుని ఉంటాడు. అందుకే అందంగా లేకపోయినా ఆ అమ్మాయిని చేసుకుంటున్నాడు. జల్సాగా అనుభవించటానికి యితర మార్గాలు చాలా వున్నాయి.
ఆ రాత్రి....
ఆలోచన్లతో , సంఘర్షణతో చాలాసేపు అలసిపోయాక ఎప్పటికో నిద్ర పట్టింది.
చెంపమీద చల్లగా తగిలేసరికి మెలకువ వచ్చింది.
అర్ధమైంది అతని పెదవులామెను ముట్టుకుంటున్నాయి.
"ఏమిటిది?" అంటూ దూరంగా జరగబోయింది.
"రాజహంసా ప్లీజ్" అంటూ ఆమెను కదలకుండా పొదివి పట్టుకున్నాడు.
'అంటే నాకిష్టం లేకపోయినా బలాత్కారం చేస్తావా?" అంది కోపంగా.
"నీ కిష్టం లేకపోతే బలవంతం చెయ్యను. కాని నేన్నిన్ను పెళ్ళి చేసుకున్నాను. నువ్వు నా భార్యవి."
'అందుకని.....అధికారం ప్రదర్శిస్తావా?"
"అధికార బలంతో నిన్ననుభావిచాలని అనుకునే అల్పుడ్ని కాదు మన యిద్దరి మధ్యా యిది సహజం అనే నిజం నీ కర్ధం కావాలనే నా తాపత్రయం. పెళ్ళి చూపుల రోజున నిన్ను చూసి మురిసిపోయాను మన పెళ్లి జరగాలని, నిన్ను భార్యగా పొందాలని ఎన్నో కలలు గన్నాను. నా కల నిజమైనందుకు ఎంతగానో సంతోషించాను. నీ ప్రవర్తన చూసి, నీ మనసుకు కష్టం కలగజేయ్యకూడదని ఈ రెండు రోజుల బట్టీ ఏం చెయ్యాలో తెలీక సతమతమవుతున్నాను. నువ్వు దగ్గరగా వుండీ మనిద్దరం ఏమి కాకుండా వున్నట్లు జీవించడాన్ని నేను సహించలేను. పోనీ యింకా ఏ రకంగానైనా మార్గాంతరం వుందా అంటే నిన్ను విడిచి నేను జీవించలేనని తెలుసుకున్నాను. ప్లీజ్ రాజహంసా నన్ను కాదనకు."
అతని గొంతులో వేడికోలు వుంది. అభ్యర్ధన వుంది. ఆమె పట్ల పొంగి పొర్లుతున్న ప్రేమ వుంది.
ఆమె గబగబా ఆలోచించింది. ఎలాగూ ....ఎలాగూ ....ఓ జీవితంలో యిమిడి పోయింది. అనుకున్నది ఒక్కటీ నెరవేరలేదు. ఒకరకంగా ఎలాగూ లొంగిపోయింది. ఎంత మొండితనం చేసినా, ప్రతిఘటించినా పేచీలు పెట్టినా ఏ బలహీన క్షణంలోనో అతనికి అర్పించుకోక తప్పదు. తన మనస్సుని గాని, వాదనని గాని ఎవరూ అర్ధం చేసుకుని సానుభూతి ప్రదర్శించరు. ప్రస్తుతంలో కాదని సాధించేదేమీ లేదు. జీవితంలో యింకో రకంగా పురోగమించాలంటే ఈ అర్పణ తప్పదు.
అర్ధం ఆకారం లేని కసి, స్పష్టమైన స్వరూపం లేని తిరుగుబాటు ధోరణి, సమన్వయము లేని అహంకారం, తాను బలి అయ్యానన్న ఉద్రేకం అతన్ని బలిపశువుగా చేసి ముందుకు సాగాలన్న దృడ సంకల్పం ఆమెలో పెనవేసుకునేటట్లుగా చేశాయి.
ఆమె అతని వైపు తిరిగింది. ఆ చూపుల్లో ఆహ్వానం లేదు.
కాని యాంత్రికమైన పట్టుదల వుంది.
7
రాజహంస అత్తగారింటికి కెళ్ళాటానికి పేచీ పెడుతుందేమోనని అంతా అనుకున్నారు. అలాంటిదేమీ చెయ్యకుండా పాండురంగ వెంట విశాఖపట్నం వెళ్ళిపోయింది.
మీనాక్షమ్మగారు కోడల్ని చూసి మురిసిపోయింది. ఇరుగూ, పొరుగూ వార్ని పిలిచి గర్వంగా ఆమెని చూపించింది.
వచ్చిన వాళ్ళు ఎంత పలకరిద్దామని చూసినా రాకహంస ఆ, ఉ అనటం తప్ప అంతకంటే పెదవి విప్పలేదు. ఈ మహాతల్లికి గర్వం కాబోలు వాళ్ళంతా పెదవులు కొరుక్కుని వెళ్ళిపోయారు.
మీనాక్షమ్మగారి మనసు చాలా మంచిది. సహనం యితరులకు సాయపడే మనస్తత్వం కొడుకంటే విపరీతమైన ప్రేమ. కోడలు పిల్ల మీద కూడా చాలా అపేక్ష . ప్రేమగా వుండటానికి ప్రయత్నిస్తోంది.
చీటికీ మాటికీ "రాజహంసా రాజహంసా" అని పిలుస్తూ వుండేది. ఆవిడ యిటు పిలుస్తుంటే రాజహంస అటు వెళ్ళి ఉండేది 'ఉ' 'అ' జవాబివ్వటం ముఖం విసుగుదల ప్రదర్శించటం మినహాయించి మనస్పూర్తిగా ఎప్పుడూ సమాధాన మిచ్చెది కాదు.
రాజహంస ప్రొద్దుట ఏడు ఏడున్నర దాకా నిద్ర లేచేది కాదు.
పాండురంగ తెల్లవారు జామున అయిదు గంటలకు లేచేవాడు. అరగంటలో స్నానాదికాలు పూర్తి చేసుకుని ఎర్ర రంగులో వున్న పూజా వస్త్రాలు ధరించి పూజా గదిలోకి వెళ్ళేవాడు. మొదట సంధ్యావందనం, తర్వాత విష్ణు సహస్రనామం, శ్రీ చక్రం ముందు పెట్టుకుని లలితా సహస్రనామం, శ్రీ సూక్తం, పురుష సూక్తం, శివార్చన యివన్నీ యధావిధిగా చేసేవాడు. పూజా గదిలో ఆ శభ్దాలు వగైరాలు బయటకు వినిపిస్తుంటే రాజహంసకు కలపరంగా వుండేది. అతను పూజ గదిలోంచి బయటకు రాగానే వికారంగా ఓ జంతువును చూసినట్లు చూసేది.
"అమ్మాయ్! నువ్వు కూడా పెందరాళే నిద్ర లేచి స్నానం అదీ చేసి అబ్బాయికి పంచామృతాలు అవీ ఇవ్వటంలో సాయం చెయ్యకూడదు?" అన్నది మీనాక్షమ్మ గారు ఒకటి రెండు సార్లు.
