పాండురంగారావు బి.ఏ. ప్యాసయి ఎలక్ట్రిసిటి బోర్డులో ఎల్. డి.సి గా చేస్తున్నాడు.
పూర్వర్జితం వల్ల సంక్రమించిన చిన్న సొంత ఇల్లు వుంది. తలిదండ్రులకి ఒక్కడే కొడుకు. అప్పటికి తండ్రిపోయి నాలుగయిదేళ్ళయింది. యాభయి ఏళ్ళ వయసులో , కొంత రోగిష్టినంతో బాధపడుతున్న తల్లిని కనిపెట్టుకుని వుంటున్నాడు.
అతనిలో కావలసినంత మంచితనముంది. బంధువర్గంలో, స్నేహితుల్లో మంచి పేరుంది.
తోలి రాత్రి......
రాజహంస చిన్న చిన్న అలంకారాలతో గదిలోకి పంపబడింది.
శోభనం గది.
అసలా భావనే ఆమెకి గగుర్పాటు కలిగిస్తోంది. తాను పెళ్ళి గురించి ఊహించుకున్నది వేరు. గ్రాండ్ గా మేరేజ్, తర్వాత రిసెప్షన్, ఆ తర్వాత హనీమూన్.
నాటు పద్దతిలా యిలా శోభనం. "మా అబ్బాయికి అన్నీ సంప్రదాయసిద్దంగా జరగవల్సిందే" అని పట్టుబట్టింది పాండురంగ తల్లి మీనాక్షమ్మగారు.
రాజహంస తలుచుకుంటే ఎదిరించగలదు. పట్టుబట్టి అతన్ని హనీమూన్ తీసుకెళ్ళగలదు- కాని అతన్ని భర్తగా బహిరంగంగా భరిస్తూ హనీమూన్ కి వెళ్ళటం , అతను భర్త హోదాలో తనతో ప్రక్క ప్రక్కన తిరగటం, తన పొదుపరి తనంతో, పిసినారి తనంతో ఏమాత్రం వసతుల్లేని చిన్న చిన్న హోటల్సు.... హనీమూన్ కి వెడితే ఫైవ్ స్టార్ హోటల్స్ లో దిగాలి. అక్కడ పార్టీలు, బఫేలు, టాక్సీ బుక్ చేసుకుని సైట్ సీయింగ్.....యివి లేకపోతే ఆ చాలి చాలని డబ్బుల్తో హనీమూన్ ని భరించటం దుర్భరం.
మొదట కొంతసేపు యిద్దరూ మాట్లాడుకోలేదు. ఆమె అతన్ని గమనించనట్లు విముఖంగా ఎటో చూస్తోంది.
"హంసా" అన్నాడు కొంతసేపటికి ధైర్యం తెచ్చుకుని.
"ఊ" అంది విసురుగా.
"ఇటు ....నేనిటున్నాను"
అతనికేసి తిరిగింది. "ఆ ఏమిటి?"
ఆమె కంఠస్వరంలోని కటుత్వానికి ఉలికిపడ్డాడు.
"కొంచెం తడబడుతూ "ఎందుకు.....ఎందుకు అలా వున్నావు' అన్నాడు.
"ఎలా వున్నాను?"
"ఏదో.....అన్యమనస్కంగా....."
"మీకలా కనిపిస్తున్నానేమో? ఇంకెలా వుండాలి ."
'అది కాదు....ఎలాగో"
"బహుశా .....అది నా అలవాటయి వుంటుంది."
పాండురంగలో విశేషమేమిటంటే .....అతన్ని ఎన్ని విధాల హింసించినా కోపం రాకపోవటం. అలా కోపం రాకపోవటానికి కారణం, తనలోనే వున్న ఏదో పొరపాటు వల్ల అవతలివాళ్ళు అలా మాట్లాడారని సరిపెట్టుకోవటం.
"బహుశా ....పెళ్ళి , యీ తతంగం వల్ల అలసిపోయి వుంటావు" రెస్టు తీసుకో.
చాలాసేపు మెదలకుండా , శిలా విగ్రహంలా అలాగే కూచుంది. అలా, ఓ గంటా గంటన్నర గడిచాక, అతనేం చేస్తున్నాడోనని తల త్రిప్పి చూసింది. కుర్చీలో వెనక్కి అనుకుని నిద్రపోతున్నాడు.
"హమ్మయ్య" అనుకుని తల్లో పెట్టిన పూలు తీసి ప్రక్కన పెట్టేసి మంచం మీద వాలిపోయింది.
మెల్లగా నిద్ర పట్టింది. ఆ నిద్రలో కూడా మూసి వున్న ఆమె కనుల నుండి చిన్న చిన్న నీటి బిందువులు చెంపల మీదుగా జారుతున్నాయి.
అలా ఎంతసేపు గడిచిందో తెలీదు, మేడమీద ఏదో స్పర్శ అనిపించేసరికి కళ్ళు విప్పి చూసింది.
నీలిరంగు బెడ్ లైటు వెలుగు గదంతా వ్యాపించి వుంది. పాండురంగ ఆమె ప్రక్కనే పడుకుని వున్నాడు. అది చెయ్యి కంఠం మీదుగా , కొంచెం పిరికిగానే చుట్టుకుని ఉంది.
"ఏమిటిది?" అంటూ ఆ చేతిని విసిరికొట్టి దూరంగా జరిగింది.
"సారీ" అన్నాడు.
ఆమె ఏమీ మాట్లాడలేదు.
"కోపమొచ్చిందా?"
"నిద్రపోతుంటే ఎందుకు డిస్టర్బ్ చేశారు?" అంది కోపంగా.
అతను మొహామాట పడుతూ "ఎందుకంటె .....యివేళ .....మానమిద్దరం....
"ఆ. మనమిద్దరం ...ఏమిటి వేళ ప్రత్యేకత?"
'అదే....మనకి...."
"ఆ ఏమిటి మనకి?"
"పెద్దవాళ్ళు...."
"సిగ్గులేకపోతే సరి" అని ఆమె అటువైపు తిరిగి పడుకుంది. "నన్ను డిస్టర్బ్ చెయ్యకండి చెబుతున్నా."
* * *
మర్నాడు కూడా అలాగే గడిచిపోయింది.
ఆ మర్నాడు....
ఉదయం నుంచి కూడా రాజహంసకి బలహీనంగా కాదు గాని మగతగా వున్నట్లనిపిస్తోంది. ఓడిపోయానని ఉక్రోషం, రాజీపడ్డానన్న దుఖం చుట్టూ వున్న సమాజం మీద కసి -
అన్నం కూడా తినలేకపోతోంది. ఎవరితోనూ మాట్లాడలేకపోతోంది.
దానికి తోడు ఆరోజు పోస్ట్ లో ఓ వెడ్డింగ్ యిన్ విటేషన్ వచ్చింది.
వినోద్ పెళ్ళి.
వధూవరులు యిద్దరి ఫోటోలు వేశారు -
