ఆమె మాటలు అతని గుండెల్లో నాటుకున్నాయి. వాటిలోని యదార్ధాన్ని అర్ధం చేసుకునేందుకు కొంచెం లోపలికి పోవటానికి ప్రయత్నిస్తున్నాడు.
"ఆడది సుస్థిరత్వాన్ని , పదిలత్వాన్ని కోరుకుంటుంది. మగాడు శాశ్వతత్వాన్ని భరించలేడు."
"ఊ మీరు పెద్ద పెద్ద మాటలు చెప్పి నా మూడ్ చెడగొడుతున్నారు. అవన్నీ తర్వాత ఆలోచిద్దాం లెండి" అంటూ మళ్ళీ ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరకు లక్కోబోయాడు.
"ఊహు" అంటూ మృదువుగానే అతని చేతుల్ని వెనక్కి నెట్టింది.
"మొదట.....నన్ను మీదాన్ని చేసుకుని తర్వాత సొంతం చేసుకోండి."
"అంటే...."
"వయసులో వున్న ఆడపిల్ల .....ప్రేమగురించి ఎంత అమాయకంగా ఆలోచిస్తుందో పెళ్ళి గురించి కూడా అంత నిజాయితీగా ఆశపడుతూ వుంటుంది."
పెళ్ళి.
"ఎందుకలా మాట్లాడకుండా స్తబ్దుగా వుండిపోయారు?"
"రాజహంసా! నువ్వు చాలా అందగత్తేవు" చాలా మంది అమ్మాయిలలో లేని వయ్యారాలు నీలో వున్నాయి."
మరి....? ఏమిటతని అభ్యంతరం? ఎందుకని సందేహిస్తున్నాడు?
ఆమె గుండె వడి వడిగా కొట్టుకుంటుంది.
"చెప్పండి" అగ్ని పరీక్షకు లోనవుతున్నంత టెన్షన్ గా వుంది.
"ప్రతి మనిషికి - ఒక సర్కిల్ , కుటుంబ వాతావరణం అతని చుట్టూ అలుముకుని వున్న వాతావరణ ప్రభావం యివన్నీ వుంటాయి. ఈ పరిధిలోకి రాకుండా అతను సాగించే వ్యక్తిగత జీవితం వేరు. అతని చుట్టూ వ్యాపించి పెనవేసుకుని వున్న వ్యక్తులందరితో సంబంధించి వున్న జీవితం వేరు."
ఆమె శరీరం ప్రకంపనలకు గురి అవుతోంది.
"మీరెంత గొప్ప వారయినా, ఎన్ని అర్హతలున్నా అక్కడ ఆదరటానికి అనేక అడ్డంకులూ, అభ్యంతరాలు వుంటాయి. అనేక మనస్తత్వాలతో,ప్రవర్తనలతో పోటీ పడాల్సి వస్తుంది. మీతో కలిసి ఒంటరిగా ప్రపంచంలో ఎక్కడికైనా రాగాలను. ఎకక్దికైనా తీసుకెళ్లగలను కాని ఎన్నో పొరలతో నిండివున్న మా వాతవరనంలోకి అన్ని చేదించుకు తీసుకెళ్ళలేను. మీకన్నా తక్కువ అర్హతలున్న వారికీ, మీకేమాత్రం సరిపోలని వారికి అక్కడ ప్రవేశం వుండవచ్చు. అది వేరే విషయం."
ఆమె పెదవుల మధ్య నుండి బాణంలా వెలువడ్డాయి యీ వాక్యాలు.
"ఓహో! నేను వైఫ్ గా వుండటానికి తగనని మీ స్టేటస్ కి తగనని చెప్పటానికి యింత చుట్టు కోస్తున్నారా?"
"అది కాదు రాజహంసా"
"షటప్, డోర్ తీయ్యండి."
"ప్లీజ్! ఈ వర్షంలో .....నన్ను మీ యింటివరకూ అయినా డ్రాప్ చెయ్యనీ...."
"నో" అంటూ విసురుగా యివతలకు జరిగి తనే డోర్ తెరిచేసింది.
"నా మాట విను రాజహంసా" అని లోపల్నుంచి అతను పిలుస్తున్నా వినిపించుకోలేదు. జోరున కురిసే వానలో, ఆ చీకట్లో వడివడిగా నడవసాగింది.
అతనితో మాటలో పడి ఎంత దూరమొచ్చారో , అసలిప్పుడేక్కడుందో అర్ధం కాలేదు. అంతటి ఆవేశంలో కూడా ఊహించుకుంటూ నడుస్తోంది. కాసేపటికి మెయిన్ రోడ్డేక్కాక ఎక్కడ వుందో అర్ధమైంది. ఆ దార్న వస్తోన్న రిక్షా ఆపి అందులో ఎక్కింది.
* * *
ఆ రాత్రంతా రాజహంసకు దుఃఖంతో, ఉద్వేగంతో , ఉక్రోషంతో నిద్ర పట్టలేదు.
వెక్కి వెక్కి ఏడుస్తోంది.
అలసిపోతున్న అహం, కరిగిపోతున్న కసి, నీరు కారి పోతున్న నిశ్చలత్వం , అరిగిపోతున్న ఆత్మవిశ్వాసం.
వ్యక్తిత్వం నలిగి ముద్దయిపోతోంది.
* * *
మరునాడు ఆఫీసుకు వెళ్ళకపోవటం చూసి తండ్రి అడిగాడు.
"టైమయిపోతోంది. యింకా తేమలవేమిటి?"
"నేనివాల్టినుంచీ ఆఫీసుకు వెళ్ళను."
ఆమె ముఖంలోని మార్పుని, విరక్తిని గమనించాడు.
"మానేశావా?"
"అవును"
"మరి....వేరే ఉద్యోగం....?"
"ఏ ఉద్యోగమూ చెయ్యను."
"అయితే ఉద్యోగమూ చెయ్యకుండా, యింట్లో పనీ లేకుండా ఏం చేస్తావు?"
"అతని మాటల్లోని వేటకారాన్ని లెక్క చెయ్యలేదు . "పెళ్ళి చేసుకుంటాను".
"ఎవర్ని?"
"మీకందరకూ నచ్చిన సంబంధాన్ని."
6
మరో రెండు నెలల్లో రాజహంసకు పెళ్ళి అయిపొయింది.
వరుడి పేరు పాండురంగారావు.
ఇరవై ఏడు ఇరవై ఎనిమిదేళ్ళు ఉంటాయి. చాలా తెల్లగా వుంటాడు. ఆ తెలుపులో కాంతి లేదు. 'మా అబ్బాయికేం మాంచి తెలుపు" అని చెప్పుకోవటానికి పనికొచ్చే రంగు. కొంచెం పొట్టి. మాటలలో గాని, నడకలో గాని ముఖ కవాళికలలో గాని ఏ ఆకర్షణ లేదు. అనాకారి మాత్రం కాదు.
