Previous Page Next Page 
రాజ హంస పేజి 12

 

    "అవునా?"
    "కాదా మరి?"
    ఆమె నవ్వి వూరుకుంది.
    "ఇప్పుడు మిమ్మల్ని యింటికి కాకుండా ఎక్కడికైనా తీసుకెళితే ఏం జరుగుతుంది?"
    "ఎక్కడికైనా అంటే?"
    "అంటే.....ఎక్కడికైనా"
    "అదే మాట అట్నుంచి యిటు చెప్పారు."
    "అవునా?"
    "కాదా మరి?"
    "నా మాట నాకే వప్పజెప్పారే" సరే నా ప్రశ్నకు జవాబివ్వండి."
    "ఏం జరుగుతుంది? ఏం జరగదు.
    "నా మీద మీకంత నమ్మకమా? లేక నా అసమర్ధత మీద విశ్వాసమా?"
    "మీ సంస్కారం మీద నమ్మకం"
    "అవతలి ప్రభావం ఉప్పెనలా విరుచుకు పడినప్పుడు ఆ వేగానికి సంస్కారం గింస్కారం ఎగిరిపోతుంది."
    "అవతలి ప్రభావం అంత గొప్పదా?"
    "మీకూ తెలీదా?"
    "తెలీదు ఎంతో కొంత తెలిసినా మీ నోట వినాలని వుంది."
    అతను చెయ్యి చాపి ఆమె అరచేతిని తన వ్రేళ్ళతో పట్టుకున్నాడు.
    "కొన్ని వివరించటానికి అతీతంగా వుంటాయి. మీలోని గొప్పతనం, దాని తాలుకూ ప్రభావం ఆ కోవకి చెందినది. అని ఎదుటి వారిని ఏ దిగంతాలకవతలకో తీసు కెడతాయి."
    ఆ చేతిని అలా మృదువుగా దగ్గరకు లాక్కుని పెదవుల కానించుకున్నాడు.
    "ముద్దు పెట్టుకోనా?"
    చెవుల్లో ఏదో హోరు. ఓ మృదుమధుర సంగీతం ఆ హోరులో మిళితమై వ్యాపిస్తున్నట్లుగా చక్కలిగింతలు పెడుతూ తరంగాలు.
    "ఇక్కడ కాదు అక్కడ...."
    అతని ఉద్దేశ్యం అర్ధమై చిన్నగా నవ్వింది.
    బయట వర్షం నేమ్మదయింది, చినుకులు రెండు వైపులా నుండి యించుమించు తడిపేసే స్థాయిలో లోపలి పడసాగాయి.
    "తడుస్తున్నారు" అంటూ మెదట తనవైపు అద్దం పైకెత్తి తర్వాత కారు బాగా స్లో చేసి ఆమె మీదుగా వొరిగి ఆమెకేసి అద్దం పైకి ఎత్తాడు.
    అతని శరీరం ఆమె వక్షస్థలాన్ని , ముఖాన్ని తాకుతోంది.
    ఒళ్ళు జలదరించింది.
    మళ్ళీ వెనక్కి, యధాస్థానంలోకి వొచ్చేసి, కారు వేగం పెంచాడు.
    ఎడమ చేతిని ఆమె భుజం చుట్టూ వేసి దగ్గరకు లాక్కున్నాడు.
    ఆమెలో కలుగుతున్న విపశత్వం వల్ల నిరాకరించలేకపోతోంది.
    కొంత దూరం పోయాక నిర్జనంగా వున్న ప్రదేశం చూసి రోడ్డు ప్రక్కకి త్రిప్పి కారాపేశాడు.
    రెండో చేతిని కూడా ఆమె భుజాల మీదుగా వేసి దగ్గరకు లాక్కున్నాడు.
    మొదట నుదురు, తర్వాత చెంపలు, ఆ తర్వాత పెదవులు.
    ఆమెకి కొత్త ప్రపంచం తెలిసి వస్తోంది. ఎంత తియ్యతనం ఇంకా ఇంకా ఎక్కడికో వెళ్ళిపోవాలనుంది. ఇంకా ఇంకా ఇంకా చాలా కావాలనిపిస్తోంది.
    మొదట రెండు చేతుల్తో ఆమె ముఖాన్ని పొదివి పట్టుకుని పెదవులకు పెదవులు ఆన్చి ఉక్కిరి బిక్కిరి చేశాడు, ఆ చేతులు మెడ మీదుగా క్రిందికి జారుతున్నాయి.
    అవేక్కడికి దారి తీస్తున్నాయో గ్రహించి, తన చేతుల్తో ఆ చేతుల్ని పట్టుకుని ఆపుతూ "ఊహు" అంది.
    "ఏం?"
    ఏమి జవాబు చెప్పాలా అని ఆలోచిస్తోంది.
    "నేన్నీకు నచ్చలేదా?"
    "నచ్చకపోతే యింత దూరం రానిచ్చే దాన్ని కాదుగా"
    "మరి?"
    "నేను మీకు నచ్చానా?"
    "నచ్చకపోతే యింత దూరం దూసుకొచ్చే వాడిని కానుగా"
    "కాని...."
    "చెప్పండి"
    "ఇంత దూరం రావటంలో కూడా అమ్మాయికి అబ్బాయికి తేడా వుంది."
    "ఏమిటది?"
    "స్త్రీ తన భవిష్యత్తుని నిర్ణయించుకునే సంఘటన యిది. ఇంకో మాటల్లో చెప్పాలంటే ఆమె భవిష్యత్తును నిర్ణయించే సంఘటన ఇది. మొగాడికి ఓ వేడుక కావచ్చు."
    "కాని మొగాడికి కూడా హృదయ ముంటుంది."
    "వుండవచ్చు. కాని అతని హృదయమూ, చేసే పనులు వేరుగా వుంటాయి."
    అతను మృదువుగా నవ్వాడు. "మీకు చాలా విషయాలు తెలుసే."
    "తెలుసో తెలియదో నాకు తెలీదు. కేవాలం ఆలోచన వల్ల జాగ్రత్త పడుతున్నాను."
    "మీ ఆలోచన్ల గురించి కొంత చెప్పండి.
    "ఆడది జీవితం గురించి ప్రాముఖ్యతనిస్తుంది. మగాడు అనుభవానికి ప్రాముఖ్యతనిస్తాడు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS