Previous Page Next Page 
యువత నవత పేజి 12

   
    పల్లెల్లోనేకాదు పట్నవాసాల్లోనూ ఈ మురికి వాడలున్నాయి. అవి అభివృద్ది చెందుతూనే వున్నాయి! కోట్లు కోట్లు గుమ్మరించి రోదసిలోకి రాకెట్లు పంపుతూ గర్వంతో రొమ్ములు గుద్దుకొనే ప్రభుత్వం  యీ మురికి వాడల నిర్మూలనను చేపట్టడం లేదు? తన దరిద్రానికీ, బీదతనానికీ యీ మురికివాడలు దర్పణాలు కావా?

     ముఖం కడగడం పూర్తిచేసి గుడిసెలోకి వెళ్లిన ముసలామెతోసాటు తనూ లోపలికి వెళ్లింది సుధ. గుడిసెలో ఓ ప్రక్క వంటకి ఓ తడిక అడ్డుంది. అక్కడే కట్టెలతో  వంటచేసుకోడానికి ఓ పొయ్యి వుంది.  బాగా మసిబారిన సత్తుగిన్నెలు, చిన్న చిన్న చట్టీలు వున్నాయి ఓ  పక్క బుట్టలో జొన్న రొట్టెలు పడేసి వున్నాయి. ఓ సత్తుగిన్నెలో వాళ్లు రొట్టెల్లో అంబలిలో తినేకారం (పచ్చడి లాంటిది) వుంది. మంచినీళ్ళ కుండతోసహా దేనిమీదా సరిగా మూతలు లేవు.

     "వాటిమీద మూతలు పెట్టాలవ్వా? ఈగలు వాలుతాయి, బల్లులు పడతాయి. ఈగలు, దోమలు వాలిన పదార్దం తింటే యెన్ని జబ్బులైనా వస్తాయి!" చెప్పింది సుధ.

     "ఏదో యింత డొక్కకేసుకోవడమే తెల్సమ్మా మాకు!  అసొంటీయన్నీ మీలాంటోళ్లకి  పొద్దున్నలేసి ఇంత గంజి కాసుకుతాగి  అడివిని బడితే తప్ప  మాకు గంజినీళ్లకయినా పైసలు దొరకవు."

     "చేసుకో! తాగు! అడవిబడు. కానీ, తినేపదార్దాలమీద, తాగే నీళ్లమీద మూతలు పెట్టుకోవడానికేమి? దానికి పెద్దగా సమయం, డబ్బు ఖర్చు పెట్టాల్సి వుండదుకదా?"

     "ఆయన్నీ మాకు తెలవ్వు తల్లీ!"

    "నాబోటివాళ్లు చెబుతున్నప్పుడైనా తెలుసుకోవాలికదా! మీకు తెలియని విషయాలు చెప్పడం కోసమే గవర్నమెంటే మాకు జీతాలిచ్చి మీ దగ్గరికి పంపిస్తూంది మమ్మల్ని!"

    "ఏ గవర్న మెంటొచ్చి మాకేం చేసిందిలే! రెక్కాడితేకాని, డొక్కాడని మా బతుకులిట్లనే గడిచిపోతున్నాయి!"

    "మీ బ్రతుకులిట్లానే గడిచిపోతున్నాయి! మీ పిల్లల బ్రతుకులు కూడా ఇలాగే గడిచిపోవాలని కోరుకుంటున్నారా మీరు?"

    "మా పొరల బతుకులు మాత్రం ఇట్లనే గడిచిపోక ఇంకెట్ల గడిచిపోతయి తల్లీ?"

    "వాళ్ల కోసం బళ్లున్నాయి పగలు కూలీపనికి వెళ్లినా రాత్రి చదువుకోడానికి "అనియత" విద్యాకేంద్రాలున్నాయి."

    "కాస్త అక్షరం ముక్కొస్తే వస్తుద్ది! డాక్టరేట్ అవుతాడా? వకీలు అవుతాడా?"

    "అవన్నీ కాకపోయినా అక్షరంముక్క వస్తే చాలవ్వా! అది వస్తే పత్రికలు, పుస్తకాలు చదివి చాలా తెలుసుకోవచ్చు!"

    "కూలిపని, గంజినీళ్లు తప్పనికాడికి ఇంక ఏంసదువు తల్లీ!"

    ఆ ముసలామెకు ఎలా నచ్చజెప్పాలో తెలియలేదు. సుధకు. మరో గుడిసెకు వెళ్లింది.

     ".........మీ యింటి మురికికాలువ, మీవాకిట్లో నిలవకుండా అవతలికి వెళ్లిపోతే చాలుననుకొంటే ప్రక్కింటివాళ్లు అలానే అనుకొని వదిలేసిన మురికి కాలువ మీ వాకిట్లో సుడితిరిగితే మీరు ఆశ్చర్యపోనక్కరలేదుకదా? ప్రక్కింటివాళ్ల మురికి కాలువ మీ వాకిట్లోకి వస్తే మీకెంత అసహ్యంగా వంటుందో,  మీ మురికి కాలువ ప్రక్కింటివాల్ల వాకిట్లోకి వస్తే  వాళ్లకీ అంతే అసహ్యంగా వుంటుందని గ్రహించండి మురికి కాలువలను అంత విచ్చలవిడిగా వదలొద్దు. ప్రాణాలను హరించే క్రిములను అవి సృష్టిస్తాయి.గవర్నమెంట్ సైడుకాలువలు కట్టివ్వాలంటే గవర్నమెంట్ డబ్బంతా ఈ మురికి కాలవల్లో పోసినా అవి శుభ్రంకావు అందుకే మన పరిసరాలను మనం పరిశుభ్రంగా వుంచుకోవడానికి ప్రయత్నించాలి. ఆ మురికి కాలువలు అలా సాగిపోకుండా మూడుఫీట్లు గొయ్యితీసి, బొగ్గులు, ఇసక నింపండి. బొగ్గులు నీళ్లనిపీల్చి, నీళ్లు ముందుకు వెళ్లనీయవు! పెంటకుప్పల్ని మరీ అలా ఇళ్ళ ప్రక్కనే వేసుకోకండి! ఇళ్లకి దూరంగా వేయండి...."

    మురికి వాడల్లో సుధ ప్రచారం ఇలా సాగుతూంటుంది!

    కూలినాలి జనం ఇళ్ళల్లో పిల్లలు పౌష్టికాహారలోపంతో అర్బకంగా తయారవుతుంటారు. అసలు, పిల్లలు గురించి పెద్దవాళ్లు పట్టించుకోరు. కాళ్లు చేతులు చీపురుపుల్లల్లా, బానకడుపులతో, దవడలకి కరుచుకుపోయిన చెంపలతో, కళ్లమాత్రం బయటికి వెళ్లుకొచ్చి - చొక్కా కూడా లేకపోతే వరుసగా ఎంచుకొనేట్టుండే ఆ పక్క టెముకల్ని అస్సలు చూడలేం. పిల్లలకి చీమిడికారుతూంటే తుడిచే ఓపిక కూడా తల్లికుండదు. కారి కారి ముక్కు క్రింద చెడి పుండులా అయ్యి ఈగలకి చక్కని ఆహారంగా మారినా వాళ్లు పట్టించుకోరు! గబగబా ఇంత ఉడికేసుకుతిని అడవికి పరిగెత్తడమే తెలుసు వచ్చాక  అలసటతో తినో, తినకో - పక్కలమీద ఒరిగిపోతారు!

    "మీకు పాలుకొనడానికి డబ్బులు లేకపోవచ్చు! పళ్లు కొనడానికి డబ్బులు లేకపోవచ్చు. వున్నదే బలవర్దకంగా తినడానికి యెందుకు ప్రయత్నించకూడదూ?" ఒకరోజు అడిగింది సుధ.

     "మాకు ఉండేదేంది? తినేదేంది? నాలుగు వరిమెతుకులు! పుడిసెడు గంజినీళ్లు!  పప్పొండుకొన్నరోజు మాకు పండగ!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS