షోరూమ్ లో కళ్ళు జిగేల్ మనేటట్లు నిండి వున్న ఆ వస్తువులు చూస్తోంటే ఆమె నరాలు జివ్వుమని లాగుతూ వుండేది. ఆయా వస్తువులు కొనుక్కోటానికి చాలామంది దంపతులు , లేకపోతే పురుషులు, స్త్రీలు విడివిడిగా వస్తుండేవారు. కొంతమంది కార్లలో, కొందరు స్కూటర్ల మీద .....వాళ్ళ వేష భాషలు, విలాసవంతంగా కానవచ్చే వాళ్ళ జీవన విధానం - ఆమె మనసు అసూయతో భగ్గుమంటూ వుండేది.
అలా వచ్చేవారిలో చాలామంది ఆకర్షణీయంగా కనిపించే తనవంక అభినందన పూర్వకంగా చూడటం కూడా ఆమె గమనించేది. అంతలోనే సంతోషం, ఒకింత గర్వం రెండు మూడు నిమిషాలు మాత్రమే, కాని ఎందుకీ అచ్చి రాని అందం వృధా. మళ్ళీ నీరు కారిపోయేవి.
షాప్ ఓనరు యువకుడు. అతని పేరు వినోద్ . పంచ్యుయాలిటీ అన్నీ స్ట్రిక్ట్ గా పాటిస్తాడు. గొప్ప వ్యవహార దక్షత గలవాడు. స్నేహితుల్ని కొద్దిమందిని మాత్రం ఎందుకుని వాళ్ళతో కులాసాగా కాలక్షేపం చేస్తూ ఉంటాడు. పిసినారి కాదు గానీ, డబ్బు విలువ తెలిసినవాడు అవసరమని అతనికి తోచకపోతే అతనో పైసా కూడా ఎవరూ ఖర్చు చేయించలేరు. ఇష్టపడితే తనంతట తాను యెంత ఖర్చు చెయ్యటానికైనా నేమ్మదియ్యడు.
అతను రాజహంసను నవ్వుతూ పలకరించేవాడు.
ఆ పలకరింపులో లాలన, అనురాగం, ఆప్యాయత వుట్టిపడేవి.
ఆమె ఆలోచించింది. అతనందరితోనూ నవ్వుతు మాట్లాడుతాడు. కానీ తనతో మాట్లాడటంలో ఓ ప్రత్యేకత వున్నట్లు ఫీలయ్యేది.
వినోద్ అందంగా కూడా వుంటాడు.
అతని పట్ల ఓ యిష్టం ఆరాధన తనకి తెలీకుండా పెంచుకుంటోంది.
అతని కేబిన్ ఏ.సి. చెయ్యబడి, ఖరీదైన సోఫాల రకరకాల నగిషిలతో చాలా రిచ్ గా వుంటుంది.
అప్పుడప్పుడూ అతను లోపలికి పిలవటం వల్ల ఏకాంతంగా మాట్లాడే అవకాశం దొరికేది.
"నాకు సన్నగా, నాజుగ్గా యిలా వుండే అడ వాళ్ళంటే యిష్టం" అన్నాడు ఓసారి.
"ఎలా?"
"నీలా"
సిగ్గుగా ఆమె కపోలాలు ఎర్రబడినాయి.
"యు ఆర్ వెరీ బ్యూటి ఫుల్"
"ఊ?" అంటూ నవ్వింది.
"నవ్వినప్పుడు అందంగా కనబడే హక్కు కొందరికే వుంటుంది. ఆ హక్కు మీకు వుంది."
ఆ రాత్రి ....ఎన్నో మధురస్వప్నాలు.
అతతన్నట్లు తనలో ఎన్నో అర్హతలున్నాయి. మధ్యతరగతి కుటుంబంలో పుట్టినంత మాత్రాన అందమైన జీవితాన్ని కోరుకోకూడదా? కేవలం కట్నం ఇవ్వలేని పరిస్థితి వల్లె మిగతా అర్హతలెన్ని వున్నా ఆశల్ని అనద్రోక్కేసుకోవాలా? దారుణంగా రాజీ పడిపోవాలా?
మధ్య మధ్య మెలుకువ వచ్చినప్పుడు - గుండెల నుండి ఉబికే ఉద్యేగాన్ని తట్టుకోలేక ఆమె కళ్ళ నుండి జలజలమని నీళ్ళు కారాయి.
కొంతమంది ఆకారాలు ఎలావున్నా కలవారి కుటుంబంలో వుండే క్వాలిఫికేషన్ వల్ల ఆ లోపాలన్నీ కొట్టుకుపోతాయా?
వినోద్ కు పెళ్ళి కాలేదని మాటల్లో మాటగా తెలిసినప్పుడు ఆమెలో అనందరేఖలు ఎంతో ఆశతో విచ్చుకున్నాయి.
ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతోంది. రోజుకు కనీసం ఒకటి రెండు సార్లు కలుసుకునే అవకాశం తేలిగ్గా లభిస్తోంది.
అతని కళ్ళలో, మాటల్లో భావాలు స్పష్టంగా చదవ గలుగుతోంది.
కాని అడగడెం? ఎంత కాలమలా రోబుచులాడతాడు?
తనే బయటపడాలనా?
ఆడపిల్ల ఎలా .....ఎలా .....అడగగలుగుతుంది?
ఒకరోజు.....
అనుకోకుండా అలాంటి అవకాశం లభించింది.
ఆకాశం మబ్బు మబ్బుగా వుండి వర్శమొచ్చే సూచనలు కనబడుతున్నాయి.
ఎనిమిది గంటలకు ఆమె షాపు నుంచి బయట కొచ్చి బస్ స్టాప్ వైపు నడవబోతుంది. అదే సమయానికతను తన బిస్కెట్ కలర్ మారుతీ కారును షాపు ఆవరణనుంచి బయటకు తీస్తున్నాడు.
సాధారణంగా అలా జరగదు. వినోద్ స్టాపంతా వెళ్ళిపోయాక లెక్కలు చూసుకుంటూ ఓ గంటసేపు అదనంగా వుంటాడు. చాలాసార్లు అతని కోసం స్నేహితులు లోస్తారు. షట్టర్స్ మూడొంతులు దింపేసి వాళ్ళతో కార్స్ ఆడుతూ , డ్రింక్ చేస్తూ రెండు మూడు గంటలు కాలక్షేపం చేస్తాడు. ఎంత ఖచ్చితంగా వుండే లేబర్ అవసరమయిన అతని జోలికి రాడు. వాళ్ళని ఎలా మేనేజ్ చెయ్యాలో అతనికి తెలుసు.
కారు పూర్తిగా బయటికొచ్చాక ఆమెను చూశాడు.
ఇద్దరి చూపులు కలుసుకున్నాయి.
కారు దిగి ఆమె దగ్గర కొచ్చాడు. "వర్శమోచ్చేలా వుంది. రండి మీ యింటి దగ్గర డ్రాప్ చేస్తాను."
రాజహంస సంకోచించలేదు. నవ్వి అతన్తో పాటు కారు దగ్గరకు నడిచింది.
కారు స్టార్టయింది. కొద్దికొద్దిగా వర్షపు చినుకులు పడసాగాయి.
"అందమైన అమ్మాయిని ప్రక్కన కూచో పెట్టుకుని ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో డ్రైవ్ చేస్తుంటే ఆ ఫీలింగ్ చాలా నైస్ గా వుంటుంది."
