.png)
టీ తాగి సెక్షన్ లొ కొచ్చి కూర్చున్నాడు సంతోష్. అతని స్నేహితులు రామారావు, పాండు, లోకనాథం వచ్చి అతని కెదురుగా కూర్చున్నారు. ”ఏమంటున్నదిరా నీ ఫోన్ సుందరీ!” అడిగాడు పాండు.
”రంభలా వుంది కదూ!” రామారావు ఛలోక్తి విసిరాడు.
”రంభలా వున్నా, ఊర్వశిలా వున్నా వీడి కుంచెరంగు పడాల్సిందేగా?” అన్నాడు పాండు.
సంతోష్ కి ముందు అర్థంకాలేదు. వాళ్ళు తనని పోగుడుతున్నారా? లేక గాలితీసి పారేస్తున్నారా అన్న సంగతి.
”నేను చూశానురా! రంభలా లేదు, ఊర్వశిలా లేదు, తిలోత్తమలా వుంది” నవ్వాడు పాండు.
”ఏంటిరా! నీకు వాళ్ళందరూ తెలుసా?” ఎగతాళిగా అడిగాడు రామారావు.
”వాళ్ళెం ఖర్మరా! వాళ్ళ అమ్మమ్మలు కూడా తెలుసు నాకు” చెప్పాడు పాండు. సంతోష్ సిగరెట్ వెలిగించి సీరియస్ గా చూశాడు.
”నువ్వెప్పుడు చూశావు?” అడిగాడు.
”నిన్న… నీతోనే!” చెప్పాడు పాండు.
”నాతోనా?” సంతోష్ కనుబొమలు ముడిపడ్డాయి.
”అవున్రా! ఆమె ఎలా వుంటుందో చూడాలన్న ఆతృత అణచుకోలేక దూరంగా వుండి చూస్తూనే వున్నాను.
”ఏం చూశావు?” కళ్ళు తిప్పకుండా గుచ్చి గుచ్చి అడిగాడు సంతోష్.
”నువ్వు మాకు చెప్పినట్టుగానే ఆరుగంటలకి ఆటోలో ఆ అమ్మాయి దిగడం… ఆమెతో నువ్వు మాట్లాడటం, అటు తర్వాత ఆమె మోటార్ సైకిల్ పై మరో వెధవతో వెళ్లిపోవడం…” పాండు మాటలకి సంతోష్ జవాబు ఇవ్వలేదు. మరో సిగరెట్ వెలిగించాడు. ‘సంథింగ్ ఫిషీ’ మనసులోనే అనుకున్నాడు.
”ఇలా జరిగిందన్న మాట కథ” నీరసంగా అన్నాడు రామారావు.
”బాగుందిరా అబ్బాయి. నేనింకా దాన్ని తీసికెళ్ళి కుంచె రంగు వేశావనుకున్నాను” లోకనాథం నిట్టూర్చాడు.
”ఆమె రోషిణి కాదు” అన్నాడు సంతోష్.
ఆశ్చర్యంగా చూశారు మిత్రులు. ”మరి?” పాండు గొంతులో ఆత్రం.
”ఎవరో పోచమ్మ. అది మన కేసు కాదు.”
”రోషిణి చేయ్యిచ్చింది” సంతోష్ ఒక్కోమాట చెబుతుంటే మిత్రుల మొహాలలోకి పరీక్షగా చూస్తున్నాడు.
”ఏంటి మాకేసి అలా చూస్తావ్?” అన్నాడు పాండు.
”నాకు మీమీదే అనుమానంగా వుంది. నన్ను ఆట పట్టించడానికి ఇది మీరు ఆడిన నాటకం అని నాకు సందేహంగా వుంది.” సంతోష్ మాటలు కటువుగా వున్నాయి,
”ఒరేయ్! ఇంతకాలంనించీ ఒకేచోట పనిచేస్తున్నా ఒక ఆడమనిషి మాతో కాసేపు ముచ్చటగా మాటాడిన పాపాన పోలేదు. నువ్వు పాపులర్ ఫిగర్ వి, నీకు అభిమానులున్నారు. అన్నాడు పాండు నిన్ను చూడ్డానికి ఎవరన్న వచ్చినా, ఏ అమ్మాయితోనన్నా నువ్వు సరదాగా కాలక్షేపం చేస్తుంటే విషయాలు విని శ్రవణానందం, చూసి నయనానందం పొందడం తప్ప మాకు ఒరిగి చచ్చింది ఏమీ లేదు” అన్నాడు రామారావు.
”సారీ! నేను మిమ్మల్ని అనుమానించడం లేదు. సిల్లీగా ఆటపట్టించారేమోనని అడిగానంతే! ఈ రోషిణి కాకపొతే మరో రోషిణి! లేకపోతె ఇంకో రేణుక నాకేం వర్రీలేదు” ఈజీగా అన్నాడు సంతోష్.
”గురూ! అసలు… అమ్మాయిని పట్టాలంటే ఏం చేయాలి?” అనడిగాడు పాండు.
”గుండు కొట్టించుకోవాలి. అద్దంలో చూసుకుంటే నీ మొహం చూసుకుని నువ్వే భయపడతావు! నీకు అమ్మాయిలు ఎందుకురా?” ఎద్దేవా చేశాడు లోకనాథం. సంతోష్ నవ్వాడు.
”ఆడవాళ్ళని ఆకట్టుకునే పనులు కొన్నుంటాయి. వాళ్ళు చూస్తుండగా వాళ్ళకి నచ్చేపనులు మనం చేస్తుండాలి. తరచుగా వాళ్ళ దృష్టిలో మనం పడాలి. కానీ వాళ్ళని మనం పట్టించుకోనట్లు నటించాలి అంతే. మనం వాళ్ళ కోసం వెర్రెక్కి ఛస్తున్నాం అని తెలిస్తే మనకేసి కూడా చూడరు వాళ్ళు” చెప్పాడు సంతోష్.
”అలాంటి టాలెంట్ నీకుంది. దీనికి తోడు అందం, బొమ్మలువేసే ప్రతిభ వుంది. మాకేం వుందిరా ఫేస్ వాల్యూ! ఇంటినించి ఆఫీస్ కి, ఆఫీస్ నించి ఇంటికెళ్ళి, తిని తొంగోడం… ఇంకేం వుందిరా ఎంటర్ టైన్ మెంట్?” పాండు నిస్సహాయతని వ్యక్తం చేశాడు.
సంతోష్ నవ్వాడు. ”దీనికి చింత పడకూడదురా పాండు. ముందు నువ్వు ఉన్న లెవల్ నించీ ప్రయత్నం చెయ్యి. ''
”అంటే?”
”నువ్వు సెక్షన్ హెడ్ వి. నీ లేడీ అటెండర్ తొ మొదలుపెట్టు. సక్సెస్ అయితే ఒక్కో మెట్టు పైకెక్కవచ్చు!”
గొల్లున నవ్వారు లోకనాథం, రామారావులు.
