Previous Page Next Page 
పగలే వెన్నెల - 7 పేజి 10

 

 

అతను మామిడితోటకు చేరుకునేటప్పటికి పదకొండు గంటలైంది. ఎండ ఎక్కువైపోయి, కళ్ళను చీలుస్తున్నట్లు ఎండమావులు దారాలు దారాలుగా కనిపిస్తున్నాయి. బంగారాన్ని కాలుస్తున్న కొలిమిలా వుంది అకాశం. పక్షులు ప్రాణాల్ని రెక్కల్లో పెట్టుకొని చల్లని ప్రదేశంకోసం సాగుతున్నాయి. జోరిగల రొద మొత్తం మామిడితోటనంతా ఓ స్పికర్ కింద మార్చేశాయి.

సురేష్ ను చూడగానే బాబు పరుగున ఎదురొచ్చాడు

"పనెలా జరుగుతోందిరా?"

"కంచెపని జరుగుతోంది. దాంతో పాటు రంగడు, శీను చెట్లకి మందు కొడ్తున్నారు.

ఇద్దరూ నడుచుకుంటూ పని జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళి కొంత సేపు అక్కడే వుండి తిరిగి బయల్దేరారు. తోట మొదట్లో ఓ చిన్న పెంకుటిల్లు వుంది. చాలా ఏళ్ళనాటిది. కాలం అంచున నిలబడి ఎప్పుడో పడిపోయేటట్లుగా వుంటుంది. లోపల మంచం, దానిమీద దుప్పట్లూ, దిళ్ళూ వుంటాయి. తినడానికి ప్లేట్లూ, గ్లాస్ లు లాంటివి మరికొన్ని వున్నాయి. ఆ ఇంటి ముందున్న ఓ చెట్టు నీడలో కుర్చీ వేయించుకుని కూర్చున్నాడు సురేష్ వర్మ.

"నువ్వూ కూర్చోరా. పని జరగడం ఇక్కడ్నుంచి కనిపిస్తోందికదా?"

"సరేలెండి." అంటూ వాడు ఎదురుగా టవల్ పరుచుకుని కూర్చున్నాడు.

"ఏమిట్రా విశేషాలు?" బాబుని మెల్లగా ముగ్గులోకి దింపాలి. డైరెక్టుగా శశిరేఖ గురించి అడిగితే వాడు కనిపెట్టేసే ప్రమాదం వుంది. అందుకే మాటల్ని ప్రారంభించాడు సురేష్ వర్మ.

"విశేషాలా? విశేషాలంటే చాలానే వున్నాయండి. బ్రాందీ సీసాలు ఊర్లలో అమ్మకూడదని ఈ మధ్య అందరూ నిర్ణయించిన విషయం దగ్గర నుంచి, చంద్రయ్యది మామూలు చావుకాదని రంగంలో చెప్పిన విషయం వరకు చాలానే వున్నాయయ్యా"

"మామూలు చావు కాదంటే?"

"చంపేశారటండి"

" అంటే హత్యా?"

"అదేనటండి! రంగంలో చెప్పారు"

"రంగమా? అదేమిట్రా?" సురేష్ వర్మకు దాని గురించి తెలియదు.

"రంగమంటే తెలియకపోవడమేమిటి?" మన వూర్లో ఎవరు చచ్చిపోయినా రంగానికి పోతారుకదా"

"నిజంగా నాకు తెలియదురా"

"అయితే వినండి" అంటూ ప్రారంభించాడు బాబు.

"చంద్రయ్య మీకు తెలుసుగా?" మధ్యలో బ్రేక్ వేసినట్టు కాసేపు ఆగాడు.

"చంద్రయ్య అంటే కాటన్ మిల్లులో పనిచేసేవాడు కదా?" అని అడిగాడు సురేష్ వర్మ.

"ఆ అతనే! ఈ మధ్య ఓ రోజు మిల్లు నుంచి తిరిగివస్తూ దారిలోనే చనిపోయాడు."

"ముందేమో సైకిల్ తో వస్తూ మధ్యలో గుండెల్లోనొప్పి వచ్చిందని , అలా కిందపడిపోయాడని ప్రాణం పోయిందని చెప్పాడు. రోడ్డు పక్కన ఆ సమయంలో ఓ పాప గేదెల్ని మేపుతూ వుంది. అమే ఈ కథంతా చెప్పింది. మొదట్లో అందరూ దీన్ని నమ్మారు కూడా. కర్మక్రియలు కూడా జరిగిపోయాయి. ఆ తరువాతే మొదలయ్యాయి గుసగుసలు."

"గుసగుసలా?" అన్నాడు సురేష్.

"ఆ చంద్రయ్య భార్య జయలలిత వుంది కదా! అమె మీదే అందరి డౌట్. చంద్రయ్యకు బహు డబ్బుపిచ్చి. జీతాన్ని వడ్డీలకు తిప్పి, బాగానే సంపాదించాడు. వడ్డీ ఇస్తానంటే భార్యనైనా ఇచ్చేస్తాడని అనేవారు. అంత లోభి ప్రపంచంలో వుండడనుకో. ఇలాంటివారితో ఏ భార్య అయినా మనస్పూర్తిగా కాపురం చేస్తుందా? అమె మీద చాలా అభాండాలున్నాయి. నిజమెంతో ఆ భగవంతుడికి తెలియాలి."

"తరువాత" అడిగాడు సురేష్ వర్మ.

"రంగం పెట్టెవాళ్ళు మన ప్రాంతంలో బుచ్చినాయుడు కండ్రికలో వున్నారు. తొలుత చంద్రయ్య అన్న గురవయ్య వెళ్ళి తన తమ్ముడి చావు మీద రంగం పెట్టాలన్నాడు. ఆ రంగం పెట్టే ఆయన పేరు వెంకటేశ్వర్లు. సరేనని ఆయన ఒప్పుకుని వారం రోజుల తరువాత కరెక్టుగా అదివారం రమ్మన్నాడు"

"అడిగిన రోజే చెప్పరన్నమాట" సందేహంగా అడిగాడు సురేష్.

"ఖాళీ వుండద్దూ! డాక్టర్ దగ్గరికి వెళ్ళడంతోనే చూస్తాడా? ఫలానా రోజు రమ్మంటాడు గదా. లేదా టోకెన్ తీసుకుని వేచి చూడద్దూ. ఇదీ అంతే. ఆ ఏం చెబుతున్నాను?" అడిగాడు బాబు.

"అదేరా- అదివారం రమ్మన్నాడు.''

"అదివారం ఉదయం అందరూ బయలుదేరారు. చంద్రయ్య తల్లితండ్రులు, గురవయ్య, ఆయన భార్య కళావతి, చంద్రయ్య చిన్నాన్న, పిన్నమ్మ, తమ్ముళ్ళు, వాళ్ళ భార్యలు మొత్తం పదిహేనుమంది దాకా తేలారు. గురవయ్యకు, నాకు స్నేహం గదా- నన్నూ రమ్మంటే నేనూ వాళ్ళతోపాటే వెళ్ళాను." మధ్యహ్నానికి బుచ్చినాయుడు కండ్రికకు చేరాం. స్కూల్లో బస. ఎత్తుకెళ్ళిన పచ్చిపులుసన్నం తిన్నాం.

ఏం పనిలేదు గదా కళ్ళు మూతలు పడ్డాయి. నిద్రలేచాం. నేనూ , గురవయ్య రంగం చెప్పే వెంకటేశ్వర్లు దగ్గరికి వెళ్ళాం. పెద్ద బోదిల్లు. దానిచుట్టూ సొరపాదులు, గుమ్మడి పాదులు, ఊరికి దూరంగా బయలు ప్రదేశంలో మొత్తం పదిళ్ళు వున్నాయి. అందరూ ఒకే కులంవాళ్ళు. వెంకటేశ్వర్లు తప్ప మిగతవాళ్ళంతా వెదురుబుట్టలు అల్లుతారు అదే జీవనాధారం.

మేము వెళ్ళి మాతోపాటు తెచ్చిన అయిదు కేజీల బియ్యం, యాభై రూపాయలు దక్షిణా పెట్టాం. క్వార్టర్ బాటిల్ చీఫ్ కి మరో ముఫ్పై రూపాయలు ఎగ్ స్ట్రా. వెంకటేశ్వర్లుకు ఓ అసిస్టెంట్ వున్నాడు. వాడికి చీఫ్ తో కలిసి నూర్రూపాయలు ఇచ్చాం. "ఎనిమిదింటికంతా వచ్చేయండి" అన్నాడు వెంకటేశ్వర్లు.

మేము తిరిగొచ్చేశాం. చీకట్లుపడ్డాయి. తాగేవాళ్ళమంతా చేరి చెరో క్వార్టర్ చీఫ్ తాగాం. తిరిగి అదే పచ్చిపులుసన్నం తిని చేతులు కడుక్కునేటప్పటికి టైమ్ ఏడున్నర అయింది


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS