.png)
శీలభద్రుడి గుండె వేగంగా కొట్టుకుంది.
ఆదిత్య మొండివాడు అనుకున్నది దుస్సాధ్యమైనా సాధించి తీరుతాడు. తెలివైనవాడు కూడా. ఎంతటి నాటకమాడతాడో? భవానీ తండ్రి రవివర్మ ఆవేశపరుడు, ముక్కోపి, అతడి అనుమతి లేనిదే భవానీ బయటికి రాదు. తగిన వరుడు దొరికితే భవానీ పెళ్ళి త్వరగా జరిపించాలని రవివర్మ శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. భవానీని ఆదిత్య తన దగ్గరికి ఎలా తీసుకురాగలడు? ఏమిటి అతడి ధీమా? ఆదిత్యకు రవివర్మ బంధువే, ఐనా ... అంటూ ఆలోచిస్తున్న శీలభద్రుడి చూపు తనవైపు వడివడిగా నడిచి వస్తున్న రవివర్మ మీద పడింది.
ఏం జరుగుతుందో? శీలభద్రుడి గుండె వేగంగా కొట్టుకుంది. రవివర్మ చేతిలో గండ్రగొడ్డలి కూడా వుంది. మళ్ళీ అంగవస్త్రంతో భవానీ ప్రతిమను కప్పివేశాడు. ఆదిత్య బదులు రవివర్మ ఎందుకు వస్తున్నట్టు? రవివర్మను చూసి శీలభద్రుడు లేచి నిలుచున్నాడు. రవి వర్మ నగర ప్రముఖుడు. రాజు దగ్గర కూడా బాగా పరపతి వుందతనికి.
“వర్మగారికి నమస్సులు ...’’ లేని నవ్వును తెచ్చి పెట్టుకుంటూ ముకుళిత హస్తాలతో స్వాగతం పలికాడు శీలభద్రుడు.
“అతి వినయం ధూర్త లక్షణం. నీవు సార్థక నామధేయుడవనుకున్నాను. పచ్చి మోసగాదివని తేలిపోయింది. శీలభద్రుడని పేరు పెట్టుకున్నావు. అసలు నీవు శీలమంటూ ఉందా అని? గౌరవంగా బ్రతికే ఆడపడుచుల్ని అల్లరిపారు చేస్తావా? అంగవస్త్రంతో కప్పిన ఆ ప్రతిమ ఎవరిది?’’
“శాంతించండి, అంగవస్త్రం తొలగిస్తాను. మీరే చూసి చెప్పండి’’ అంటూ శీలభద్రుడు వస్త్రాన్ని ప్రతిమ నుండి వేరు చేశాడు.
“ఈ ప్రతిమను చెక్కింది నీవేనా?’’
“అవును’’
“ఇది నా కూతురు భవానీదే! ఆ విషయం తెలుసా నీకు?’’
“ఎవరి ప్రతిమో నాకు తెలియదు. మీ అమ్మాయిని నేనెప్పుడూ చూడలేడు. చూడకుండా ప్రతిమలో ప్రతిబింభాన్ని మలచడం సాధ్యం కాదు. ఆ ప్రతిమ భవానీదేనని ఏమిటి మీ నమ్మకం? వేరొకరిది ఎందుకు కాకూడదు?’’
“నోర్ముయ్ వాచాలుడా! నిజం చెప్పుకునే ధైర్యం కూడా నీలోలేదు. నా కూతుర్ని వలలో వేసుకోవడానికి నీవు పన్నిన పన్నాగామిది. నీవు భవానీని పొందలేవు. నా గురించి నీకు తెలియదు. నా కూతుర్ని ఎవరైనా కన్నెత్తి చూసినా వాడికి భూమ్మీద నూకలు చెల్లినట్లే. లే ప్రక్కకు జరుగు’’
“దేనికి?’’
“నీ ప్రతిమను ముక్కలు ముక్కలు చేస్తాను. ఎవరైనా ఆ ప్రతిమను చూస్తే ఏమనుకుంటారో ఆలోచించావా?’’ అంటూ రవివర్మ తన చేతిలోని గండ్రగొడ్డల్ని పైకి ఎత్తి “తప్పుకో ...’’ అంటూ గట్టిగా అరిచాడు.
శీలభద్రుడు ఆ ప్రతిమకు అడ్డంగా నిల్చుని ఇలా అన్నాడు. “ప్రతిమను చెక్కింది నేను. దోషం ప్రతిమది కాదు. నాది. నన్ను చెయ్యండి ముక్కలుచెక్కలు. ఆదిత్య చాడీలేవో చెప్పి మిమ్మల్ని రెచ్చగొట్టి పంపినట్లుంది. నేను మీరనుకున్నంత నీచుడిని కాను. ఆ ప్రతిమ మీ అమ్మాయిదేనని మీరు దృఢంగా నమ్మితే నన్ను నరికేయండి. కానీయండి ...’’ అంటూ శీలభద్రుడు తల వంచాడు.
రవివర్మ ఎత్తిన చేయి ఎత్తినట్టుగానే వుండిపోయింది. “ఛీ ... ఛీ ... పిరికిపందను చంపానన్న అప్రదిష్ట నాకెందుకు? కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నేను బ్రతికున్నంతవరకూ నీ ఆటలు సాగానివ్వను. నీ గుండెల్లో నిద్రపోతాను. ఆ ప్రతిమను మరుగులో వుంచుకో!’’ అంటూ వెళ్ళబోయి అకస్మాత్తుగా ఆగిపోయాడు రవివర్మ.
ఎదుటి దృశ్యాన్ని చూసి అవాక్కయిపోయాడు.
ఆదిత్యతో పాటు భవానీ కూడా అక్కడకు వచ్చింది.
మొదటిసారిగా, మొదటిచూపుగా శీలభద్రుడు రెప్పవాల్చకుండా కొన్ని క్షణాలు భవానీని చూస్తూ ఉండిపోయాడు. ఆమె సౌందర్యం ముందు తను ఎంతో శ్రమపడి చెక్కిన శిలాఖండం వెలవెలపోయింది. ప్రపంచంలోని సౌందర్యమంతా రూపుదిద్దుకుని తన ముందుకొచ్చినట్లనిపించింది. భూతల స్వర్గాన్ని సైతం మైమరిపించే భవానీ సౌదర్యం అద్భుతమనుకున్నాడు శీలభద్రుడు.
కమలాలను సైతం మైమరిపించే తన కళ్ళను ప్రతిమవైపు తిప్పి కొన్ని క్షణాల వ్యవధిలో భవానీ ముందున్న ప్రతిబింబాన్ని దాన్ని చెక్కిన శిల్పిని ఒక్క క్షణం ఓరగా చూసింది.
అంతే ప్రకృతంతా స్తంభించినట్టయింది శీలభద్రకు.
మెరుపుతీగ లాంటి చూపు అది. తన లేత గుండెలో పిడిబాకులా గుచ్చుకుంది. గాయమెక్కడైందో తెలియదుగానీ కనుపాపల చుట్టూ కన్నీరెందుకో పొంగి పొరలింది. ఎక్కడో మేఘాలు లేకుండానే పిడుగు పడినట్టనిపించింది.
