.png)
బాబు కిందనుంచి పరుపుతెచ్చి వేశాడు. మళ్లీవెళ్ళి ఈసారి దిళ్ళూ దుప్పట్లూ తెచ్చి పరిచాడు! ఇక మిగిలింది బాబుతో మాట్లాడటం. అలా అయినా శశిరేఖ ఆలోచనలనుంచి తప్పించుకోవచ్చని బాబుని పిలిచాడు.
"ఇలా కూర్చోరా కాసేపూ"
"అలాగే" నంటూ వాడు కూర్చున్నాడు.
"ఏరా! నువ్వో నిజం చెప్పాల్రా" పరుపుమీద కూర్చుంటూ అడిగాడు. "ఏమిటండీ?"
"నువ్వెవరినైనా ప్రేమించావురా?" వాడు ఓ మారు ఉలిక్కిపడ్డాడు. అలాంటి ప్రశ్నలడుగుతాడని వూహించలేదు.
" ఎందుకలా అడిగారు. కారణమేమైనా వుందా......?" అన్నాడు.
"అదంతా నీకెందుకురా - ముందు జవాబు చెప్పు" అన్నాడు సురేష్ వర్మ.
"లేదు. ప్రేమంటే ఎలా వుంటుందో కూడా తెలియదు. పోనీ ప్రేమంటే అందరికంటే ఎక్కువ ఇష్టమనుకుంటే అలాంటి యిష్టం ఎవరి మీదా కలగలేదయ్యా."
'మరి నీ భార్యంటే?'
"అలాంటివేమీ లేవు. కలిసి కాపురం చేస్తున్నాం. అంతే - అసలు మాకా ఆలోచనే రాకుండా పెళ్లి అయిపోయింది. నాకిప్పుడు ముప్పైదాకా వుంటాయనుకుంటాను. ఎనిమిది సంవత్సరాలక్రితం అంటే నాకు ఇరవై రెండున్నప్పుడు మా నాయన ఓరోజు పిలిచి 'ఒరేయ్ నీకు పెళ్లిరా' అన్నాడు. పక్కనున్న మా అమ్మ పెళ్లికూతురి వివరాలు చెప్పింది."
"అంటే - నువ్వు పెళ్లిచూపులక్కూడా వెళ్లలేదన్నమాట."
"ఉహూఁ! అమ్మానాయన చూడడమే. పెద్దవాళ్లకి తెలియదా అనుకుని సరేనంటూ తలాడించాను"
"పెళ్ళిపీటల మీదనేనా ఆమెను చూడడం" అని అడిగాడు సురేష్ వర్మ.
"ఆఁ! నుదుటున బాసికం, పెద్ద అంచుతో గాడీరంగులో వున్న పట్టుచీర, మెడనిండా నగలు - ముఖమే సరిగా కనిపించలేదు. బావుందిలే అనుకున్నాను."
"ఈ ఎనిమిదేళ్ళ సంసారం......?" బాబు అతని మాటలకు మధ్యలో అడ్డు తగిలాడు.
"బావుందా అని అడుగుతున్నారా? బావుందోలేదో కూడా నాకు తెలియదు. అంతమాట ఎప్పుడూ ఆలోచించలేదు కూడా" అన్నాడు. అందుకే వాడు హ్యాపీగా వుంటాడనిపించింది సురేష్ వర్మకి. వాడు దేన్నీ సీరియస్ గా తీసుకోడు. శరీరం ఎలా చెబితే అది చేస్తాడు. జీవితం జీవించడానికే. వాడే ఒక విధంగా కరెక్ట్! ఇలా సంఘర్షించుకోవడాలూ, సందేహించుకోడాలూ వుండవు.
"బాబుగారూ! నా మాట వినండి" బాబు కాసేపు మౌనం తరువాత అన్నాడు.
"ఏమిట్రా?"
"మానసమ్మ మీరంటే పడి చచ్చిపోతుంది. ఆమె మీమీద చూపించే ఇంట్రెస్ట్ చూసే బహుశా ప్రేమంటే ఇదేనేమో అనుకున్నాను. మీరంటే ఆయమ్మకి ఎంత ఇష్టమో చెప్పలేను. ఆమెను పెళ్లిచేసుకోండి. అమ్మగారు కూడా ఎంతో సంతోషిస్తారు."
"నాకామెను చూస్తే ఏ భావనా కలగడంలేదురా" అన్నాడు సురేష్.
"మాకంతా కలిగిందా? పెళ్లి చేసుకుంటే అదే కలుగుతుంది" వాడు మధ్యలోనే దూరి అతను చెప్పేదాన్ని ఖండించాడు. వాడు చెప్పింది నిజమేననిపించింది సురేష్ వర్మకి. అయినా తనమీద ప్రేమ కలగకుండా, తనతో గడపాలన్న గాఢమైన కోరిక లేకుండా ఎలా పెళ్లి చేసుకోవడం? సాయంకాలం ఓ పూట సరదాగా గడపడానికే మనం మనకు నచ్చిన స్నేహితుడి దగ్గరకు వెళతాం తప్ప, ఎవరి దగ్గరికంటే వాళ్ళ దగ్గరికి వెళతామా?
"సరేలేరా! ఇది ఇప్పుడు ఈ క్షణాన మనిద్దరిమధ్య తెగే విషయంకాదు గానీ వెళ్లిరా. రేపు నేరుగా మావిడితోటకే వెళ్లిపో. నేను నిదానంగా వస్తాను."
"అలాగే!" వాడు వెళ్ళిపోయాడు.
రాత్రి అలస్యంగా పడుకోవడంతో మరుసటిరోజు ఉదయం పది గంటలకి నిద్ర లేచాడు. నిద్ర లేస్తూనే శశిరేఖ గుర్తొచ్చింది. కలల్లో కూడా అమే. కల అంతా ఏదో జీవపదార్దం సాగినట్టు స్పష్టత లేకుండా సాగింది. కానీ తనమీద అమె ఎంత ప్రభావం చూపుతుందో తెలిసింది. అమెను తలుచుకోగానే కొత్త ఉత్సాహం వచ్చింది. అమె గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి.
తనకున్న స్టార్ ప్లస్ మరియు స్టార్ మూవిస్ ఛానల్ బాబు ఒక్కడే. వాడు ఈపాటికి మామిడితోటకు మందు కొట్టిస్తూ వుంటాడు. తనూ అక్కడికే వెళితే, కాలక్షేపంతోపాటు వివరాలు కూడా తెలుస్తాయి. ఈ ఊహతోనే కొత్త ఉత్సాహం వచ్చింది. నిద్రపడక మీదనుంచి లేచి తయారయ్యాడు. టిఫిన్ తిన్నాక మామిడితోటకు బయల్దేరాడు.
"మధ్యాహ్నంకూడా రాను, నాకూ బాబుకూ క్యారియర్ పంపించు" అని చెప్పాడు తల్లితో.
