.png)
“అదిగో రావిచెట్టు. దాని కిందే శిల్పం చెక్కుతున్న అర్థనగ్నుడు. కొండకోనల నుండి బండ్లమీద మోసుకొచ్చిన పాషాణాల్ని ఎన్నో రోజులనుండి చెక్కుతున్నాడు.
ఛన్, ఛన్, ఫట్, చిట్, టప్, చట్ – రాతి ముక్కలు శబ్దం చేస్తూ గాలిలోకి ఎగిరి భూమ్మీద పడుతున్నాయి. శిల్పి చేతిలోని ఉలి నర్తిస్తోంది. దాని అన్వేషణ దేనికోసమో!
మరో శిల్పి సదాశివ అటువైపు వెళ్తూ శీలభద్రుడి దగ్గర ఆగి చూడసాగాడు. “ఏంటి శీలభద్రా! నీ దేహమంతా స్వేద బిందువులు చిందుతున్నా లెక్కచేయక పాషాణాన్ని ముక్కలు చేస్తున్నావు. నాకు ఎటువంటి ఆకారము అగుపించడం లేదు. అందులో ఏముందని శ్రమ పడుతున్నావు?’’
“ఈ రాతి లోపల నాతి దాగివుంది. పైపోరాలు తొలగిస్తే ఆ దివ్య సుందరి దర్శనమిస్తుంది’’
“ఎవరో ఆ దివ్య సుందరి?’’
“తినబోతూ రుచి అడగటమెండుకూ? వారం రోజుల తరువాత వచ్చి చూడు. నీవు చూడదలుచుకున్నది కనిపిస్తుంది’’
అందం బండరాతిలో ఉందా? ఉలి, సమ్మెటలో వుంటుందా? లేక శిల్పి కల్పనలో వుంటుందా? అనుకుంటూ సదాశివ ఉత్తరీయాన్ని సవరించుకుంటూ అక్కడినుండి వెళ్ళిపోయాడు. ఈలోగా శీలభద్రుడి ప్రాణస్నేహితుడు ఆదిత్య వచ్చి మరో రాతిమీద కూర్చున్నాడు. అంగవస్త్రంతో కప్పబడిన మరో శిల్పాన్ని చూస్తూ అడిగాడు ఆదిత్య- “తెరవెనుక బొమ్మెవరిది?’’
“ఒక మగువది’’
“చూడవచ్చా?’’
“నిరభ్యంతరంగా!’’ ఆదిత్య లేచి అంగవస్త్రాన్ని తొలగించాడు. ఆ ప్రతిమను చూసి ఆదిత్య ఆశ్చర్యపోయాడు. “ఎంత దివ్యంగా వుందీ ప్రతిమ! ఇంత అపురూపంగా చెక్కగలవని నేను కలలో కూడా ఊహించలేదు. నీ చేతుల్నే కాదు, ఉలి, సమ్మెటల్ని కూడా ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది. అది సరే ఎవరీ సుందరి?’’
“నా ఊహా సుందరి ...’’ నవ్వుతూ అన్నాడు శీలభద్రుడు.
“బుకాయించకు, నిజం చెప్పు ... ఎవరా ఊహాసుదరి?’’
“నీకు కూడా శిల్పివే కదా! అంత స్పష్టమైన ఆకృతి నీ ముందుండగా తెలిసి కూడా తెలియనట్టడుగుతావెందుకు?’’
“భావానీదా?’’
“భవానీ ఎవరూ ? ఆవిడెవరో నాకు తెలియదు’’
“నిజంగానే తెలియదా?’’
“ఒట్టు తెలియదు’’
“భవానీకున్న అంగసౌష్టవం మరే మగువకూ లేదు. నీ శిల్పంలో ప్రాణం లేకపోయినా ‘నేను భవానీనే’ అంటూ ఆ శిల్పం సిగ్గుపడుతూ చెబుతున్నట్టుగా వుంది. అది సరేగాని ఈ శిల్పాన్ని ఎవరు చూసినా అది భవానీదేనని ఖచ్చితంగా చెబుతారు. ఇంత ప్రమాదకరమైన పని ఎందుకు చేశావు?’’
“అంటే?’’
“పరాయి ఆడపడుచుల ప్రతిమల్ని ఇంత స్పష్టంగా చెక్కడం ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే! నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటారు’’
“భవానీ గురించి వినడమేగాని నేనెప్పుడూ చూడలేడు. ఈ ప్రతిమ భవానీదేనని నిక్కచ్చిగా ఎలా చెప్పగలవు?’’
“నీవు ఆమెను చూడకపోవచ్చు. కానీ ఖజురహో నగరంలో భవానీని మించిన అందగత్తె లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రత్యెక సందర్భాల్లో తప్ప మరెక్కడా భవానీని చూడలేము. ఎప్పుడు ఏ ప్రమాడ్డం జరుగుతుందేమోనని ఆమె తండ్రి ఎప్పుడూ కాపలా కాస్తుంటాడు. ఎప్పటినుంచీ నీ ప్రమాయణం?’’
“ప్రేమా? ఎవరితో?’’
“ఇంకెవరూ? భవానీతోనే!’’
“చెప్పానుగా ఆదిత్యా! భవానీ ఎవరో నాకు తెలియదు. చూడకుండా ప్రేమించడం వీలవుతుందా?’’
“ఎందుకు వీలుపడదూ? స్వప్న సుందరీమణుల కథలెన్నో విన్నాం. ఒకరి గురించి వింటూ ఆలోచిస్తూ ఆ రూపాన్ని తలచుకుంటూ వుంటే ఏదో ఒకరోజు ఆ రూపం కలలోకి రాకపోతుందా? కల్పన నిజాలకంటే చాలా పదునైనది. ఎంతటి దూరాలనైనా దగ్గరికి చేరుస్తుంది. వాస్తవానికి మించిన ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది.’’
“అంటే నీవనేదేమిటి? నాకు ఈ ప్రతిమవల్ల ప్రమాదముందంటావు. అంతే కదా నీవుండగా నాకు ప్రమాదమేమిటి?’’
“అది సరేగాని నేనడిగింది సూటిగా జవాబు చెప్పు. భవానీని నీవు ప్రేమిస్తున్నావా లేదా?’’ శీలభద్రుడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు ఆదిత్య.
“ప్రేమంటే ఏమిటో నాకు తెలియదు. కానీ ఆమె గురించి ఆలోచించకుండా ఉండలేని మాట వాస్తవం’’ దిగులుగా అన్నాడు శీలభద్రుడు.
“మామూలుగానే ఆడవారికి ‘అహం’ ఎక్కువ. అందునా అందమైన వాళ్ళల్లో అది ఎంత మోతాదులో వుంటుందో చెప్పనక్కర్లేదు. ప్రాణంలేని పాషాణంలో కోమల హృదయాన్ని శిల్పి చెక్కగలదేమో గాని అదే ప్రాణమున్న పడతిలో దాన్ని పొందడం చాలా మందికి వీలుకాని పని. అదిసరేగాని నీ ఊహాసుందరి నీకు దక్కకపోతే ఏం చేస్తావు?’’
“ఈ ప్రతిమను చూసుకుంటూ శేష జీవితం గడిపేస్తాను’’
“ఏ ముహూర్తంలో పుట్టావో! అసలు నీవెట్లా బతుకుతావు రా? అంత మాయకండా వుంటే నిన్ను ఏ పిల్లా కట్టుకోదు. ఎప్పుడైనా భవానీని చూట్టానికి ప్రయత్నించావా?’’
“అదెలా సంభవం?’’
“కృషితో నాస్తి దుర్భిక్షమ్! అన్నారు పెద్దలు. ప్రయత్నం మనది, తర్వాత దైవేచ్చ. అదిసరే నీకు భవానీని చూడాలని లేదా?’’
“అదెలా వీలవుతుంది?’’
“నేను వీలు కల్పిస్తాను. దానికో నాటకం ఆడాలి. సరే నేను వెళుతున్నాను. నీవు సిద్ధంగా వుండు. వీలయితే భవానీతో మాట్లాడు. వనితలు తమంతట తామే వలచిరారు. వస్తా’’నంటూ ఆదిత్య వెళ్ళిపోయాడు.
