Previous Page Next Page 
నేటి కాలపు మేటి కథకులు పేజి 6


    'మమకారం' అన్న కథలో పెళ్ళయిన కొత్తలోనే తమ కొడుకు చనిపోతే, కోడలు అప్పటికే నెలతప్పిందని తెలుసుకున్న ముసలి దంపతులు ఆ కోడలికి అబార్షన్ చేయిద్దామనుకున్న ఆమె తల్లిదండ్రులను వారించి, ఆ బిడ్డని తామే పెంచుకుంటామని బతిమలాడి ఒప్పిస్తారు. మనవడిలో తమ కొడుకును చూసుకుంటూ అల్లారుముద్దుగా ఆ పిల్లవాడి ఎదుగుదలను చూసి మురిసిపోతున్న వేళ కోడలు తన రెండో భర్తతో కలిసి వచ్చి తమకు పిల్లలు లేరనీ, తన కొడుకును తాను తీసుకెళ్తాననీ వస్తుంది. అప్పుడు ఆ దంపతులు పడ్డ వేదననూ, పిల్లవాడిపై పెంచుకున్న మమకారాన్ని వదులుకోలేక పడే యాతననూ ఈ కథలో హృద్యంగా చిత్రించారు రచయిత్రి.
    సున్నితమైన మానవ సంబంధాలను విశ్లేషించే కథ 'మా బతుకు మాది'. అపార్టు మెంట్ సంస్కృతిలో సింగిల్ బెడ్ రూమ్ ఇళ్ళల్లో తల్లిదండ్రులకు ప్రైవసీ లేక సర్దుకుని బ్రతుకుతూ, ఎప్పుడైనా ఏకాంతంగా ముచ్చట్లాడుకుంటే.. అది చూసిన కోడలు ఈసడింపులనూ, అవహేళనలనూ భరిస్తూ ఉండే కంటే అన్ని వసతులున్న వృద్ధాశ్రమంలో ఉందామని నిర్ణయించుకుంటారు వాళ్ళు. తమ బ్రతుకు తాము బ్రతకగలిగే ఆర్ధిక వెసులుబాటు ఉన్నప్పుడు మనుషులు దూరంగా ఉన్నా మనసులు దగ్గరయే ప్రయత్నం చేయడంలో తప్పు లేదనే విషయాన్ని ఎంతో కన్విన్సింగ్ గా చెబుతుందీ కథ. ఇప్పుడు సర్వసాధారణమైన ఈ విషయాన్ని పాతికేళ్ళ క్రితమే రాశారు రచయిత్రి.
    'ఋణ భారం' కథలో తల్లి పోతే తమ్ముడిని కొడుకులా భావించి నిస్వార్దంగా పెంచి పెద్ద జేసిన అక్క సుగుణాన్ని అర్ధం చేసుకోకుండా, భార్య చెప్పుడు మాటలు విని అక్కయ్య చావుబతుకుల్లో ఉంటే కూడా చూడడానికి వెళ్ళని తమ్ముడు..... తనకు రాసిన లేఖను అక్క చనిపోయాక చదివి ఆమె ఎంత త్యాగం చేసిందో తెలిసి జీవితాంతం ఆ 'ఋణభారం' మోస్తూ బతకాల్సిందేనని పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. ప్రేమానురాగాలనూ, ఆప్యాయతలనూ అర్ధం చేసుకోలేకపోతే అవి దూరమయ్యాక ఏమీ మిగలదనే సత్యాన్ని చెప్పిన ఈ కథ ఇరవై ఏళ్ల క్రితంది. అయితే తల్లిదండ్రులు పోతే తమ్ముళ్ళనీ, చెల్లెళ్ళనీ స్వంత పిల్లల్లాగా పెంచిన ఆనాటి అన్నయ్యలూ, అక్కయ్యలూ, అంతే అభిమానంతో వారిని ప్రేమించి, గౌరవించే తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూ ఈనాడు మృగ్యం.
    'ఫోటో ఫ్రేమ్' కథలో విశ్వాస్ ను ప్రేమించి పెళ్ళి చేసుకుని ఓ బాబు పుట్టాక అతడి కుటుంబమూ, పద్ధతులూ నచ్చక విడిపోయిన పవిత్ర అతను స్నేహితుడిగా ఫర్వాలేదు కానీ, భర్తగా సూట్ అవలేదు అంటుంది. బిజినెస్ ఫామిలీకి చెందిన విశ్వాస్ మొదట్లో వేరు కాపురం పెట్టటానికి వాళ్ళింట్లో వాళ్ళు ఒప్పుకోరని నిస్సహాయంగా ఊరుకుంటాడు. కొన్నాళ్ళకు విడిగా ఉంటానని తండ్రిని ఒప్పించి మళ్ళీ కలిసుందామని పవిత్రను బతిమిలాడతాడు. అతని కుటుంబంతో అడ్జస్ట్ కాలేక, అతను మంచివాడైనా వదులుకున్న పవిత్ర 'భార్యా భర్తలిద్దరూ ఒక ఫ్రేములో ఒదిగి, ఇద్దరి ఈగోలను అద్దం కింద దాచేస్తేనే ఫ్రేమ్ లోని ఫోటో లా కాపురం నిలుస్తుంది' అంటూ తన బామ్మ చెప్పిన మాటలకు ఆలోచనలో పడి తిరిగి భర్త దగ్గరికి వెళ్ళడానికి నిర్ణయించుకుంటుంది.
    ఇప్పటి యువతీ యువకులకు చాలా అవసరమైన కథ ఇది. ప్రేమించుకున్నప్పుడు కనపడని ఇరుపక్కలా లోపాలు, బలహీనతలు, కుటుంబాల ఆచార సంప్రదాయ ప్రమేయాలు, బాధ్యతలు పెళ్ళయ్యాక తొలిప్రేమ పొరలు కొంచెం కొంచెం తొలుగుతూంటే స్పష్టంగా, అడ్డుగా కనపడి విడాకులకు దారితీయడం, ఇద్దరి మధ్యా పిల్లలుంటే.....వారి బాల్యం, భావి జీవితం నలిగిపోవడం వంటి సమస్యలను ఇలాంటి చాలా కథల్లో చర్చిస్తారు రచయిత్రి.
    చాందస భావాలు, మూఢ విశ్వాసాలు అణువణువునా నిండిన సావిత్రమ్మ తన ఒక్కగానొక్క కొడుకు మతాంతర వివాహం చేసుకున్నాడన్న కారణం చేత ఉత్తమురాలైన కోడల్నీ, అభం శుభం తెలియని మనవడ్నీ సరిగా చూడలేకపోతుంది. తీర్ధ యాత్రల్లో ఓ స్వామీజీని దర్శించాక పరివర్తన కల్గి వెనక్కి రావడం కొంత నాటకీయంగా ఉన్నా ఇంకా కులాంతర వివాహాలు చేసుకుంటే పరువు హత్యలు జరుగుతున్న ఇప్పటి కాలానికి కూడా అవసరమైన కథే అనిపిస్తుంది. పైగా ఈ 'విముక్తి' కథను రచయిత్రి యాభై అయిదేళ్ళ క్రితమే రాయటం ఆమె లోని చైతన్యాన్ని, అభ్యుదయ దృక్పథాన్ని తెలియజేస్తుంది.
    ఆపాతమధురం అనే మాటను ప్రస్తుతం చాలామంది వేరే అర్ధంలో వాడుతున్నారు. ఆపాతము అంటే పడడం అని అర్ధం. ఆపాత మధురం అంటే ఒక విధంగా తాకగానే లేదా చూడగానే గొప్ప అనుభూతినీ, మాధుర్యాన్నీ కలుగజేసేది అన్నమాట. అయితే పాతకాలం నాటి అలవాట్లు, సంప్రదాయాలు, పాటలు మొదలైన వాటిని గురించి చెప్పేటప్పుడు ఆ 'పాత' మధురాలను ఆపాతమధురాలు అనడం పరిపాటి అయింది. 'ఆపాతమధురాలు' అనే కథలో కీర్తన అనే స్త్రీ కొన్నాళ్ళ పాటు అమెరికాలో ఉండి ఒక కూతురు పుట్టిన తర్వాత భర్తతో సరిపడక విడిపోయి ఇండియా వచ్చి ఉంటుంది. ఓ రోజు తన కూతురు శృతికి తను ఎప్పుడో అమ్మమ్మగారింటికి వెళ్ళినప్పుడు తీసిన మొక్కలు, పాత ఇల్లు పరిసరాలు, పిల్లలు ఆడుకోవడం ఇలాంటివి చిత్రించిన వీడియోని చూపిస్తుంది.
    అమ్మాయి దానికి ఆకర్షితురాలై 'ఈ ఇల్లు చాలా బాగుంది, మరి ఇప్పుడు ఎందుకు లేదు? ఇప్పుడు అందరూ అప్పట్లా ఎందుకు కలుసుకోవడం లేదు? ఈ ఉడతలు, ఈ పక్షులు, ఈ చెట్లు....ఇవన్నీ మీరే ఎంజాయ్ చేశారు మాకు ఏవి?' అని తల్లిని అడుగుతుంది.
    'ఇప్పటి జీవన విధానానికి అవన్నీ సరిపోక కుదరట్లేదు' అని తల్లి చెబుతుంది. తర్వాత ఆ అమ్మాయి 'నువ్వు డాడీ ఎందుకు కలిసి ఉండరు? మనం డాడీ దగ్గరికి వెళ్దాం లేదా డాడీనే ఇక్కడికి రమ్మను, మనం అందరం కలిసి ఉందాం. నాకు ఒక్కదానికే బోర్ కొడుతోంది. ఆడుకోవడానికి ఎవరూ లేరు'. అని తల్లిని అడుగుతుంది. ఆ ప్రశ్నకి తల్లి ఆ వయసుకి సరిపడ జవాబు చెప్పలేక పోతుంది. చివరికి ఒక చిన్న అనాధ పిల్లాడిని తీసుకొని వచ్చి కూతురికి తమ్ముడు మనింట్లోనే ఉంటాడు అని సమాధానపరుస్తుంది.    
    ఈ కథలో అంతర్లీనంగా మూడు సందేశాలున్నాయి. మొదటిది పర్యావరణం, జనాభా పెరుగుతున్న కొద్దీ, మానవుల అవసరాల కోసం, ఇళ్ళు, ఇతర నిర్మాణాల కోసం చెట్లను నరికి వేస్తున్నారు. పొలాలను ఇళ్ళ స్థలాలుగా మార్చి వేస్తున్నారు. విడిగా సొంత ఇల్లు, దాని చుట్టూ కొన్ని పూల, పళ్ళ మొక్కలు అనేది ఏ కొద్ధిమందికో తప్ప మిగతా వారికి అందని కల. ఇక చెట్లు, పళ్ళూ, పక్షులూ మనం తరువాతి తరాలకు మిగులుస్తున్నామా అనేది మనం వేసుకోవాల్సిన ప్రశ్న.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS