రెండవది విచ్చిన్నమవుతున్న కుటుంబ వ్యవస్థ. డెబ్బై ఏళ్ల క్రితం మన అమ్మమ్మలకీ, నానమ్మలకీఉన్న జీవితం మనకు ఉండకపోవచ్చు. నలభై ఏళ్ల క్రితం మన తల్లిదండ్రులు గడిపిన విధానంలో మనం గడపలేకపోవచ్చు. తరానికీ, తరానికీ మధ్య మార్పు అనివార్యం. ఉమ్మడి కుటుంబాలు అదృశ్యమయ్యాయి. ఉద్యోగాల రీత్యా, బతుకుతెరువు రీత్యా, విదేశీ వలసల రీత్యా ఒకే కుటుంబం లోని వ్యక్తులూ, వారి పిల్లలూ తరచూ కలుసుకోలేకపోవచ్చు. అయితే...మన చుట్టూ నివసిస్తూ ఉన్న వాళ్ళతో స్నేహబాంధవ్యాలు పెంచుకోవడం తప్పనిసరి. ఒకే కుటుంబం లోని వారు, అన్నదమ్ముల, అక్కాచెల్లెళ్ళ పిల్లలయినా తరచు కలుసుకునేలా కనీస ప్రయత్నం ఎవరికివారు చేస్తే శృతి లాంటి చిన్నపిల్లల మనసుల్లోని దిగుళ్ళను పోగొట్టొచ్చేమో!
మూడవది అనాథ పిల్లలను పెంచుకోవడం, అధిక జనాభా ఉన్న మనదేశంలో అనాథ శిశువులు ఎక్కువే. చేయని నేరానికి చిన్నారుల బాల్యం బలి కావడం చూస్తున్నాం. వారు బతికి బట్టకడితే పెద్ధయింతర్వాత ఏమవుతారో తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆర్దికంగా కాస్త వెసులుబాటు ఉన్నవాళ్ళు ఎవరో బంధువుల పిల్లల్ని పెంచుకునే బదులు ఈ కథలోని కీర్తనలా ఒక పిల్లాడ్ని పెంచుకోవచ్చు. పాత రోజుల్లో అంతా మంచి లేదు, ఇప్పుడున్నదంతా మంచీ కాదు. ఎప్పుడయినా, ఏ కాలంలోనైనా చెడును విసర్జించి మంచిని తీసుకోవడమే మనిషి చేయాల్సిన పని. ఇలా ఒక కథలో మూడు కోణాలు చర్చించడం వల్ల 'ఆపాత మధురాలు' ఒక ప్రత్యేక కథ అయింది.
'మనసే శిక్ష' ఒక గొప్ప కథ. ఎనభై రెండేళ్ళ యశోదమ్మ పల్లెటూర్లో సొంత ఇంట్లో ఉంటూ ఎంతో ఆరోగ్యంగా, నలుగురికీ తలలో నాలుకలా, పెద్ద దిక్కులా ఉంటుంది. నెలరోజులుగా ఆవిడలో ఏదో తేడా వచ్చి చివరికి మరణిస్తుంది. పెద్దకొడుకు వెను అమెరికాలోనూ, చిన్నకొడుకు మాధవ్, కూతురు రాధిక ఇండియాలోనూ ఉంటారు. మంచు పెట్టెలో పెట్టొద్దన్న ఆవిడ ఆఖరి కోరిక ప్రకారం అదే రోజు చిన్నకొడుకు మాధవ్ అంత్యక్రియలు నిర్వహిస్తాడు. శాస్త్రోక్తంగా, వైభవంగా అపరకర్మలు నిర్వహించాక తల్లి వీలునామా ప్రకారం నగలూ, డబ్బూ కూతురుకూ పొలం చిన్నకొడుక్కూ, ఇల్లు పెద్దకొడుక్కూ అనుకున్నాక ఇల్లూ, పొలం బేరం పెట్టమని మేనమామకు చెబుతాడు వేణు.
అందరికీ చెల్లింపులు చేస్తూ ఉన్నప్పుడు ఆ పన్నెండు రోజులూ వంటలూ, వడ్డనలూ, ఇతర పనులూ... ఇలా అన్నివిధాలా సహాయపడ్డ పూర్ణను గుర్తుపట్టడు. పాతికేళ్ళ క్రితం తొలి యవ్వనపు రోజుల్లో ఇంట్లో ఎవ్వరూ లేని రోజున ఆమెతో తొందరపడ్డ విషయం గుర్తొచ్చి....ప్రస్తుతం భర్తపోయి, పిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసి కుమిలిపోతాడు. మర్నాడు పరామర్శకు ఆమె ఇంటికి వెళతాడు.....పూర్ణ పాతికేళ్ళ కొడుకు మురళి ఆక్సిడెంట్ కు లోనై మంచానికే పరిమితమై ఉండటం చూసి, తన ఇల్లు ఆమెకు ఇచ్చేస్తానంటాడు. పూర్ణ మాటల్తో మురళి తన కొడుకేననీ, తన తల్లికి నెలక్రితమే అతన్ని చూసాక ఆ విషయం తెలిసిందనీ అర్ధమవుతుంది. ఇంటికి తిరిగొచ్చాక తల్లి తిరిగి రాసిన విల్లులో కూడా ఇల్లు పూర్ణకు రాసి ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. తల్లి ఎందుకు చనిపోయిందో, తన మొహం చూడడానికి కూడా ఎందుకు ఇష్టపడలేదో, తోచినంతలో పూర్ణకు న్యాయం చేయాలని ఎందుకు అనుకుందో అర్ధం అయి కుమిలిపోతాడు వేణు. ఎనభై రెండేళ్ళ యశోదమ్మ వ్యక్తిత్వం, నలభై అయిదేళ్ళ పూర్ణ వ్యక్తిత్వం ఎంతో గొప్పగా చిత్రీకరించారు రచయిత్రి.
'పురుషులందు' ఒక కొత్త కథాంశంతో కూడింది. చట్టం, న్యాయం అనేవి రెండు పరస్పరాధిత అంశాలు. అయితే కొన్ని సార్లు మానవతా దృష్టితో చూసినపుడు న్యాయం అయిన ప్రతిదీ చట్టబద్దం కాకపోవచ్చు. కొన్నిసార్లు చట్టబద్ధమూ, న్యాయమూ అయిన విషయాల్ని కూడా సమాజం వేలెత్తి చూపవచ్చు. ఈ అంశాల్ని 'పురుషులందు' కథ చర్చకు పెట్టింది. ఒకే అపార్టుమెంట్స్ లో నివసించే అయిదుగురు రిటైర్ అయిన వ్యక్తుల మధ్య గాఢ స్నేహం ఏర్పడుతుంది. మార్నింగ్ వాక్ మొదలుకుని పార్కులో ఒకే బెంచ్ మీద కూర్చుని ఇష్టాలు, అభిరుచులు, సినిమాలు, పుస్తకాలు, రాజకీయాలు, పిల్లలు, పరిస్థితులు వంటివన్నీ మాట్లాడుకునేవారు. మిగతా నలుగురూ పెద్ద ప్రభుత్వోద్యోగాల్లో రిటైర్ అయి మంచి పెన్షన్ తీసుకుంటుంటే.....ఒక్క విశ్వనాధం అన్నాయన మటుకు పెద్ద ప్రైవేట్ కంపెనీలో పనిచేసి రిటైర్ అవుతాడు. ఇద్దరు కూతుళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినా, కొద్దిపాటి డబ్బు మాత్రం ఉంచుకుని పీఎఫ్ సొమ్మంతా ఇంటికోసం కొడుక్కే ఇచ్చేస్తాడు. కొడుకూ, కోడలూ, తానూ, భార్యా కలిసి ఉన్నా.... వచ్చే కొద్దిపాటి వడ్డీ మందులకూ, ఖర్చులకూ సరిపోక ఎంతో బాధపడుతుంటారు. మూడు నెలలుగా మంచం పట్టిన విశ్వనాథం ఓ రోజు చనిపోతాడు.
ముందే ఆప్యాయతా, ఆదరణా కరువైన అతని భార్య శారదమ్మ......ఏడాదికే కొడుకింట్లో జీతం బత్తెం లేని పనిమనిషిగా, వంటమనిషిగా కనీసం మందులకు కూడా డబ్బు లేకుండా అనేక బాధలు పడుతుంది. నలుగురు స్నేహితుల్లో ఒకరైన కృష్ణమూర్తి.. ముందే అతని భార్య పోయి ఉండడం వల్ల మిగతా స్నేహితుల సహకారంతో శారదమ్మని ఒప్పించి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాడు. ఇది ఇటు శారదమ్మ పిల్లలకి గానీ, అటు కృష్ణమూర్తి పిల్లలకు గానీ నచ్చదు. శారదమ్మ కొడుకు తీవ్రమైన దుర్భాషలాడితే, కృష్ణమూర్తి కొడుకూ, కూతురూ నిష్ఠూరంగా నిరసన తెలియజేస్తారు. స్నేహితుడి భార్య అయిన ఆవిడను ఆదుకోవాలన్నా, ప్రశాంతమైన, ఆరోగ్యమైన శేషజీవితాన్ని అందించి ఆ నరకంలోంచి తప్పించాలన్నా అంతకు మించి మార్గం లేదని తన పిల్లలతో చెపుతాడు కృష్ణమూర్తి. వాళ్ళు బాధపడాల్సింది ఏమీ లేదనీ, తన ఆస్తిపాస్తులు ఎలాగూ వాళ్ళకే వచ్చేలా చేశాననీ, ఆమెను తోబుట్టువులానే భావిస్తాననీ, తనున్నాళ్ళూ తిండికీ, బట్టకూ లోటు లేకుండా చూడడంతో బాటు తన తదనంతరం ఆమెకు పెన్షన్ రావాలంటే ఆమె భార్య అయితే తప్పు ఆ హక్కూ, అధికారం పొందలేదనీ, ఇది పది మందికీ తెలిస్తే ఫామిలీ పెన్షన్ కోసమే మళ్ళీ పెళ్ళి చేసుకున్నారని తెలిస్తే పరిణామాలు ఎలా ఉంటాయోనని రిజిస్టర్ మేరేజ్ చేసుకున్నాననీ, ఫ్యామిలీ పెన్షన్ ఎలా పిల్లలకు రాదు గనుక ఆమెకు సహాయం చేయాలంటే తనకు తోచిన ఏకైన మార్గం అదేననీ నచ్చజెపుతాడు.
కన్న పిల్లలకు తల్లిదండ్రులు చదువులు చెప్పించి, పెళ్ళిళ్ళు చేసి, ఆస్తిపాస్తులిచ్చి ఎన్ని సౌకర్యాలు అమర్చినా చాలామంది పిల్లలు తల్లిదండ్రుల కనీస సౌకర్యాలను గానీ, సుఖసంతోషాలను గానీ పట్టించుకోకుండా వారిని కేవలం ఆస్తిపాస్తులివ్వడానికో పనులు చెయ్యడానికో పనికొచ్చే యంత్రాల్లా చూడ్డం చేదు వాస్తవం, వాళ్ళకూ కోరుకునేలా జీవించే స్వేచ్చ, జీవితాన్ని ఎలా గడపాలో నిర్ణయించుకునే అధికారం ఉండాలని భావించే సంతానం దాదాపు మృగ్యం. ఇది స్త్రీల విషయంలో ఇంకా ఎక్కువ. వాళ్ళ చేతుల మీద పెరిగిన పిల్లలు కూడా తల్లులు ఎలా బ్రతకాలో శాసిస్తుంటారన్న కఠిన వాస్తవాన్నీ, మనకంటూ ఒక జీవితం కావాలనుకున్నప్పుడు ఈ సమాజాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడాలనీ ఈ కథ తెలియజేస్తుంది.
నలభై యాభై ఏళ్ల క్రితం అతిపెద్ద సామాజిక సమస్య అయిన వరకట్నం ఇప్పుడు అంతగా ప్రత్యక్షంగా లేకపోయినా అది మరో రూపంలో ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రుల పాలిటి శాపమవుతోంది. అమ్మాయిల చదువులు, ఉద్యోగాలు, ఆర్ధిక స్వావలంబన కొంతవరకూ అబ్బాయిల కోర్కెలకు కళ్ళెం వేయగల్గినా.. ఆచార సాంప్రదాయాల పేరుతో కొందరింకా పిల్లనిచ్చిన అత్తమామల్ని పీడిస్తూనే ఉన్నారు. పెళ్ళిలోనూ, ఆ తరువాత వచ్చే పండుగల్లోనూ పెద్ద పెద్ద కోరికలు కోరడం.కూతురు అత్తవారింట్లో సుఖంగా ఉండాలని అమ్మాయి తల్లిదండ్రులు అప్పులు చేసి వాటిని నెరవేర్చడం, తిరిగి అవి తీర్చలేక నలిగిపోవడం ఓ మాదిరి కుటుంబాల్లో పరిపాటి. అలాంటి ఒక అల్లుడు పండక్కి టీవీ కొనిమ్మని అలుగుతాడు. కూతురు సలహాతో ఎలాగోలా ఒక వాయిదా కట్టి తీసుకొచ్చి ఇస్తారు అత్తవారు. మరో పండక్కి తమ ఇంటికి వెళ్ళినప్పుడు భార్య తనకు అత్తగారు బంగారు నగ కొనిచ్చేదాకా అన్నంతిననని అలగడం చూసి ఉక్రోషపడతాడు. చివరికి ఇంట్లోవాళ్ళు కూడా కోడలు వాదనకు కన్విన్స్ అవడం చూసి దారికొస్తాడు. కొంత సినిమాటిక్ గా ఉన్నా, అవసరమైన కథ ఇది.
