కుటుంబ సంబంధాల కథలు
కామేశ్వరి గారి చాలా కథల్లో కుటుంబ సంబంధాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఆ మాటకొస్తే కుటుంబం కూడా సమాజపు అంతర్భాగమే. సమాజం లోని అధిక శాతం వ్యక్తులు ఏ ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఇతరత్రా ఏ వృత్తి చేపట్టినా కుటుంబ పోషణకే అన్నది నిర్వివాదాంశం. కుటుంబం ఎంత బావుంటే ఆ వ్యక్తులు బయట అంతగా రాణిస్తారు అనే విషయం కూడా. అఘాయిత్యం తిరుగులేని సత్యం.
కార్ల్ మార్క్స్ చెప్పినట్లు 'మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అయినప్పటికీ కనీసావసరాలు తీరి ఆర్దికంగా స్థిరపడిన మనుషులందరు కూడా సంతోషంగా, సంతృప్తిగా జీవించకపోవడం మనం గమనిస్తూ ఉంటాం. ఇంకా ఏదో కావాలని తపన పడడం, ఆరాటపడడం, అని దొరకనప్పుడు అసంతృప్తి చెందడం తరచూ జరుగుతుంది. వీటికి అన్ని సందర్భాలలోనూ ఆర్ధికపరమైన విషయాలే కారణం కానక్కర్లేదని కామేశ్వరి గారి కథలు తెలుపుతాయి.
కుటుంబం లోని వ్యక్తుల మధ్య పరస్పర గౌరవం, ప్రేమ, అభిమానం ఉండాలనీ, చిన్న చిన్న లోపాలున్నా సర్దుకుపోతేనే కాపురాలు నిలబడతాయనీ చాలా కథల్లో రచయిత్రి చెబుతారు. కుటుంబ వ్యవస్థ చాలా బలమైనదనీ, కుటుంబం అనేది అందులోని వ్యక్తులకు ఈ సమాజంలో రక్షణనూ, భద్రతనూ కలిగిస్తుందనీ, దానిని కాపాడుకోవలసిన బాధ్యత కుటుంబం లోని అందరిదీ అని రచయిత్రి భావన.
ఉమ్మడి కుటుంబాలు పోయి న్యూక్లియర్ ఫామిలీస్ వచ్చిన పరిణామ క్రమంలో, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ, సమానంగా సంపాదిస్తున్నప్పుడు......వారిద్దరిలో ఎవరు ఎక్కువ... ఎవరు తక్కువ అని కాకుండా పరస్పర ప్రేమానురాగాలతో, విశ్వాస గౌరవాలతో, బాధ్యతతో సంయమనంగా జీవించాలని చాలా కథలు తెలియజేస్తాయి. ఈ క్రమంలో తమ ఈగోలను అదుపులో పెట్టుకుని కొన్ని సందర్భాల్లో రాజీ పడక తప్పదని కూడా రచయిత్రి ఉద్భోధిస్తారు.
ఈ నేపథ్యంలో పాతతరం, కొత్తతరం మధ్య అభిప్రాయాలలోనూ, ఆలోచనల్లోనూ, అలవాట్లలోనూ వచ్చిన తీవ్ర వైరుధ్యాలను, అవి తెచ్చిపెట్టే ఘర్షణలనూ, వాటి మూలంగా కుటుంబ సంబంధాలు బీటలువారుతున్న దృశ్యాన్నీ కామేశ్వరి లోని రచయిత్రి బాగా పట్టుకుంది. ఈ శతాబ్దపు మొదట్లో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన విదేశీ వలసలు కుటుంబ వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపాయో కూడా ఆ కలం నుండి వెలువడ్డ ఎన్నో కథలు వివరించాయి.
కుటుంబ కథల్లో కూడా భార్యాభర్తల సంబంధాలు, స్త్రీ పురుష సంబంధాలు కలగలిసి ఉంటాయి. ఒక్కోసారి ఒక కథను ఏ విభాగంలోకి చేర్చాలో కూడా తేల్చుకోలేని నిస్సహాయత ఏర్పడుతుంది.
దాంపత్య సంబంధాలలో మగవాడు అమాయకుడైతేనో, అర్జనపరుడు కాకపోతేనో సర్దుకుపోవాలి గానీ దుర్మార్గుడైతేనో, శాడిస్టు అయితేనో అలాంటి బంధాన్ని కొనసాగించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని రచయిత్రి అభిప్రాయం.
తొలినాళ్ళలో రాసిన కథల్లో మధ్య తరగతి జీవితాలు. అసంతృప్తులు, చిన్న చిన్న ఆనందాలు, నిరాశలు......ఇలాంటి అంశాలు నిండి ఉంటాయి.
'నీరెండలు' అన్న కథ ఇప్పుడయితే రచయిత్రి రాసేవారో కాదోననిపిస్తుంది. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన పార్వతి అందరి ఆడపిల్లల్లాగా పెళ్ళి చేసుకుని, పిల్లల్ని కని ఓ మామూలు గృహిణిలా జీవితం గడపడాన్ని ఇష్టపడక బాగా చదువుకోవాలనే జిజ్ఞాసతో, నిరంతరం ఏదో కొత్త విషయం తెలుసుకోవాలనే తృష్ణతో మధన పడుతుంది. తన వద్దే ఉండి చదువుకుంటున్న మేనగోడలు ప్రమీలకి ఆమె ఇష్టపడ్డ వ్యక్తితో పెళ్ళి చేయాలని నిశ్చయించుకుని తన అన్నయ్యకు తెలుపుతుంది. అన్నీ ఉన్నా కూడా పెళ్ళి తోనే జీవితానికి పరిపూర్ణత చేకూరుతుందని, తన జీవితంలో ఏర్పడ్డ వెలితి మేనకోడలి జీవితంలో ఉండకూడదని పార్వతి భావిస్తుంది.
అయితే యాభై ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. పెళ్ళితోనే జీవితానికి సార్ధకత ఏర్పడుతుందని ఇప్పటి అమ్మాయిలు భావించడం లేదు. పెళ్ళి జీవితంలో ఒక భాగమే కానీ, అదే జీవితం కాదనే అభిప్రాయాన్ని యువతులు బాహాటంగానే వ్యక్తపరుస్తున్నారు. చదువుల వల్ల వచ్చిన అవగాహన, ఉద్యోగాల వల్ల వచ్చిన ఆర్ధిక స్వాతంత్ర్యం తెచ్చిన ఆత్మవిశ్వాసం అందుకు కారణాలు. పెళ్ళి చేసుకుని, పిల్లల్ని కని, పెంచి పెద్ధజేసే విషయంలో స్త్రీలు మాత్రమే కోల్పోతున్న స్వేచ్చ వల్ల కూడా కావచ్చు.
ఎంత సాధించినా, వృత్తిలో ఎన్ని విజయాలు పొందినా పెళ్ళి లేనిదే జీవితానికి పరిపూర్ణత లేదనే విషయాన్ని ఈ కథ ద్వారా రచయిత్రి చెప్పారు. అయితే అరవైల నాటి పరిస్థితి ఏమో కానీ, ఈ విషయంలో ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. ఉన్నత విద్య పూర్తి చేసి, గొప్ప ఉద్యోగాలు చేస్తూ కూడా, వైవాహిక జీవితాన్నీ, ఉద్యోగ జీవితాన్నీ బాలన్స్ చేస్తున్న వాళ్ళున్నారు, ఏదో ఒక ఉద్యోగం చేస్తూ కూడా భర్తతో సరిపడకనో, ఇతరత్రా చేదు అనుభవాల వల్లో, ఒంటరిగా జీవితం కొనసాగిస్తున్న వారున్నారు. పిల్లలు పుట్టాక కూడా శాడిస్ట్ భర్తలతో దాంపత్యం కొనసాగించలేక విడిపోయి సింగిల్ పేరెంట్స్ గా మిగిలిన వాళ్ళున్నారు. స్త్రీ విద్య పెరిగి, స్వేచ్చ, స్వావలంబన వల్ల వచ్చిన ఆత్మ విశ్వాసం, ధీమా..... వీటితో అవివాహితులుగా కొనసాగుతున్న యువతులు ఎందరో మనకు కనిపిస్తున్నారు నేడు. అయితే, అరవై ఏళ్ల నాటి కథ గనుక ఆ దృష్టికోణం లోనే చూడాలి. పెళ్ళిలో ఉన్న భద్రత మరింకే వ్యవస్థ లోనూ లేదన్న భావన క్రమంగా అంతరిస్తున్న సందర్భంలో మనమున్నాం.
రెండు కుటుంబాలు పక్క పక్క వాటాల్లో అద్దెకుండడం, ఒకరితో ఒకరు పోటీ పడడం సర్వసామాన్యం. అరవైల కాలంలో కామేశ్వరి గారు రాసిన కథ' దూరపు కొండలు'. ఒక మామూలు గుమాస్తా శంకరం భార్య జానకికి తమ పక్కింట్లోకి కొత్తగా వచ్చిన ఇంజనీర్ కుటుంబాన్ని చూసి అసంతృప్తి మొదలవుతుంది. ఒకప్పుడు తనను పెళ్ళి చూపుల్లో చూసి డబ్బు, హోదా తక్కువని తిరస్కరించిన పెళ్ళికొడుకే ఆ ఇంజనీర్ ప్రసాద్ అని తెలిసాక ఆ బాధ మరింత ఎక్కువై భర్తపై, పిల్లలపై చిరాకు కోపతాపాలు పెంచుకుంటుంది. తీరా కలెక్టర్ కూతురైన అతని భార్యకూ, అతనికీ అభిప్రాయభేదాలుండడం, ఆమె విలాసాలకూ, ఖర్చులకూ అప్పులవడం, అతను మాటల సందర్భంలో భార్యతో తన గురించి చెప్పి మెచ్చుకోవడం విన్నాక జానకి హృదయం శాంతిస్తుంది. ఇది మామూలు కథే అయినా అప్పటికీ ఇప్పటికీ మనుషుల స్వభావాల్లో ఈ పోల్చుకుని బాధ పడడాలు, అసూయలు, ఫాల్స్ ప్రెస్టీజ్, అల్పాదాయాలు, అసంతృప్తులు, రాజీ పడడాలు.....ఇలాంటి విషయాల్లో పెద్దగా మార్పు లేదన్నది ఈ కథ చదివితే తెలుస్తుంది.
