Previous Page Next Page 
నేటి కాలపు మేటి కథకులు పేజి 4

    
    'గమ్యం' కథ నిస్సందేహంగా ఆడపిల్లలకు బ్రతుకు పాఠం లాంటిది. పదహారేళ్ళ వయసులో ప్రేమలో పడి పారిపాయి ఓ బిడ్డ కడుపులో పడ్డాక ప్రేమించినవాడు పారిపోవడంతో పడరాని అగచాట్లు పడిన సీత చివరికి పడుపు వృత్తిలోకి నెట్టివేయబడుతుంది. కటిక దరిద్రంలో కూతురు రేణుకను పెంచుకుంటూ గడుపుతున్న సమయంలో అనుకోకుండా సినిమాల్లో ఎక్స్ట్రా వేషాల అవకాశం వచ్చి సహాయనటి స్థాయికి ఎదుగుతుంది. కొన్నాళ్ళకు అక్కడ కూడా ఆమె దేహం అప్పగించకపోతే వేషాలు రాని పరిస్థితి ఏర్పడుతుంది. కాకపోతే ఆర్ధిక స్థితిగతులు మెరుగవుతాయి.
    ఇలా సాగుతున్న జీవితంలో మళ్ళీ సమస్య ఎదురవుతుంది. టెంత్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన రేణుక చాలా అందంగా ఉంటుంది. ఆమెపై కన్నేసిన ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ఆమెను హీరోయిన్ను చేస్తానని సీత లేనప్పుడు ఇంటికి వచ్చి భ్రమలు కల్పించడం మొదలుపెడతాడు. తన లాంటి జీవితం తన కూతురుకు వద్దని ఆమెని కన్విన్స్ చేసి వేరే ఊరిలో హాస్టల్ కి పంపుతుంది సీత. ఆ సందర్భంలో సీత మాటలు చాలా మంది టీనేజ్ అమ్మాయిలకు రచయిత్రి చెప్పే వ్యక్తిత్వ వికాస పాఠాలు. ఇలా అవకాశమొచ్చినప్పుడల్లా మంచి మాటలు కథలో జొప్పించడంలో దారితప్పుతున్న ఆడపిల్లలను ఎలాగైనా కాపాడుకోవాలన్న ఆరాటం. బాధ్యతా కనిపిస్తుంది.
    'శేషప్రశ్న' కథలో ఇరవై ఏళ్ల లోపు యువతి ఓ యువకుడితో ఆకర్షణలో పడి దాన్నే ప్రేమ అనుకుని పెళ్ళి చేసుకుని కొన్నాళ్ళకు అతనితో సరిపడక విడిపోతుంది. మరికొద్ది రోజులకు మరో పెళ్ళి చేసుకుంటుంది. ఆ పెళ్ళి కూడా భగ్నమవుతుంది. చివరికి రెండుసార్లు పెళ్ళి జరిగినా ఆమె ఒంటరిగా 'శేషప్రశ్న' లా మిగిలిపోతుంది. జీవితంలో పదే పదే మోసపోవడం లేదా అవతలి మనిషిని అర్ధం చేసుకోవడంలో విఫలమవడం అంటే ఎదుటి వ్యక్తి పెళ్ళికి ముందు తనలోని ఒక కోణాన్ని మాత్రమే చూపడం, కొన్నాళ్ళు పోయాక తన అసలు స్వరూపాన్ని బయట పెట్టడం ఒక కారణం రెండవది ఈ యువతికి ఉన్న అవగాహనా లోపం. అవతలి వాళ్ళ స్వభావాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోవడం. కారణాలేవైనా కాపురాలు నిలబడాలంటే స్త్రీ బహు జాగ్రత్తగా ఉండాలని రచయిత్రి ఎక్కువ కథల్లో చెబుతారు. ఎందుకంటే ఈనాటికీ ఒక వివాహం భగ్నమయితే మరొక జీవిత భాగస్వామి దొరకడం అబ్బాయిల విషయంలో ఉన్నంత తేలిక కాదు అమ్మాయిలకు. పైగా రెండోవాడు షరతుల్లేని దాంపత్యం హామీ ఇవ్వడు. ఎప్పుడూ భార్యను దెప్పిపొడుస్తూనే ఉంటాడు. చాలాసార్లు రెండోసారి పెళ్ళి చేసుకున్నాక మొదటి వాడికంటే ఇతడు దారుణమైన అనుభవాలు అందించిన సందర్భాలు ఉంటాయి. రచయిత్రి సుదీర్ఘ జీవితంలో చుట్టుపక్కల మనుష్యులను ఎందరినో పరిశీలించి రచించిన కథలు ఇవి.
    ఇందుకు ఉదాహరణగా 'ప్రియురాలు ఎంత కఠినం' అనే కథను ఉదహరించవచ్చు. నిజానికి ఇది అత్యంత సాదా సీదా కథ. ఇక్కడ పోలికకు కాకపోతే ఉటంకించాల్సిన పని లేదు. గౌతమ్, ఊహ ఒకే సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తూ, ప్రేమించుకుని సినిమాలూ, షికార్లూ, పార్టీలూ తెగతిరుగుతారు. ఇక ఊహ కుటుంబం నుండి వెళ్ళి మాటలు రావడమే తరువాయి. సడన్ గా ఊహ కనబడదు, ఇంటికెళ్ళినా కలవదు, ఆ తరువాత అందం, స్టేటస్, అమెరికాలో ఉద్యోగం ఉన్న అబ్బాయితో పెళ్ళి అవుతుంది. గౌతమ్ ఆమెను మర్చిపోలేక దాదాపు పిచ్చివాడవుతాడు. తల్లి సావిత్రికి హార్ట్ ఎటాక్ వచ్చి కోలుకుంటుంది. ఆమె కోరిక మేరకు, ఆమె కోసం, ఆమె వెతికిన సౌమ్య అనే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు. ఆమె కూడా ఉద్యోగి. సౌమ్యకు అంతా చెప్పి తను ఆమెకు దగ్గరవడానికి కొంత టైం అడుగుతాడు. ఆమె కూడా పేరుకు తగ్గట్టు అతని జీవితంలో ఇమిడిపోతుంది. ఏడాదిన్నరకు ఓ రోజు అతన్ని చూడ్డానికి ఊహ వస్తుంది. తన పెళ్ళి అనుకోకుండా జరిగిందనీ, ఇండియాలో ఉన్న పదిహేనురోజులూ హాయిగా గడుపుదామనీ అంటుంది. నీలాంటి అవకాశవాదిని చేసుకోనందుకే సౌమ్య లాంటి అమ్మాయి దొరికిందని గౌతమ్ వ్యంగ్యంగా మాట్లాడి ఆమెను పంపించి వేసాక సౌమ్యకు దగ్గరవుతాడు. ఈ కథలో గౌతమ్ కి సౌమ్య దొరికినట్టు, నిజ జీవితంలో అమ్మాయిలకు మరో గౌతమ్ దొరకడు. దొరికినా అది నూటికి పదిశాతం ఉంటుందేమో!
    'దుష్ట రక్షణ' అనే కథ ఆరేళ్ళ క్రితం రాశారు రచయిత్రి. న్యాయానికి కళ్ళే తప్ప చెవులుండవనే నానుడి అందరికీ తెలుసు. ఆ కథాంశంతో గతంలో ఎన్నో కథలు వచ్చాయి. అయితే ఈ కథ వాటికి భిన్నమైంది. శృతి అనే అమ్మాయి ఓ కాల్ సెంటర్లో పనిచేస్తుంది. ఓ రోజు రిలీవర్ రావడం ఆలస్యమై సిటీకి దూరంగా ఉండే కాలనీలో ఉన్న తన ఫ్లాట్ కి బయల్దేరుతుంది. రాత్రి అవడం, ఎక్కువ జనసంచారం లేకపోవడంతో ఇద్దరు యువకులు ఆమెను అటకాయించి అఘాయిత్యం చేయబోతారు. ప్రమాదం గ్రహించి కొంచెం సమయస్ఫూర్తితో వాళ్ళను ఇంటికి పిలిచి గదిలో పెట్టి బయట తలుపేస్తుంది. చుట్టుపక్కల ఉన్నవాళ్ళ సహాయంతో పోలీస్ రిపోర్ట్ ఇస్తుంది. అయితే కోర్టులో ఆ యువకుల తల్లిదండ్రులు అపాయింట్ చేసుకున్న ప్రతిపక్ష లాయర్ తెలివిగా వాదించి వాళ్ళను రక్షిస్తాడు. అఘాయిత్యానికి ప్రయత్నిస్తున్నప్పటి సాక్ష్యం లేదని, తప్పు చేశారనే ఆధారాలు లేవనీ స్వల్ప జరిమానా విధిస్తారు జడ్జి.
    తనను కలిసిన శృతితో 'ఇప్పుడున్న పరిస్థితుల్లో మన న్యాయ శాస్త్రాలు, చట్టాలు తిరగ రాస్తే తప్ప 'దుష్ట శిక్షణ' ప్రస్తుతం చట్టంలో ఉన్న లొసుగుల వల్ల దుష్ట శిక్షణ-శిష్ట రక్షణ అన్నమాట పోయి 'దుష్ట రక్షణ' అంటుంది మహిళా జడ్జి స్వయంగా.  ఈ మాటలు అక్షరాలా నిజం.    
    'నరకంలో ఓ నిముషం' కథాంశం వేరే అయినా ఈ కథలో రచయిత్రి మాటలు చాలా ముఖ్యమైనవి.
    'స్త్రీ పురుష సమానత్వం అత్యవసరం, అణగదొక్కబడిన స్త్రీ జాతి పురుషుడి కంటే దేన్లోనూ తక్కువ కాదు, స్త్రీ స్వేచ్చ అంటే విచ్చలవిడితనం కాదు, స్త్రీలు తమ హక్కుల్ని పోరాడి గెల్చుకోవాలి.  సమాజంలో కుటుంబ వ్యవస్థ సరిగా ఉండాలంటే స్త్రీ పురుష భేదాలు తగ్గి స్త్రీని గౌరవించినపుడే సాధ్యం. స్త్రీలు తమ వ్యక్తిత్వం, ఆత్మాభిమానం కాపాడుకోవాలి'.
    బాగా చదువుకుని, గొప్ప హోదాలో ఉండి, బాగా సంపాదించే మహిళలు కూడా చూపించలేని మనోస్థైర్యాన్నీ, తెగువనూ, సమయస్ఫూర్తినీ మామూలు మహిళలు చూపించడం, జీవితాల్ని ముందుకు నడిపించుకోవడం కామేశ్వరి గారి కథల్లో చూస్తాం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS