.png)
పూరిపాకలాంటి ఇంటి దగ్గర ఇరుగుపొరుగు జనం గుమిగూడారు. ఆ పూరిల్లు శీలభద్రుడిదే. దానిచుట్టూ అసంపూర్తిగా చెక్కిన శిల్పాలు, బండరాళ్ళు చెల్లాచెదురుగా పడివున్నాయి. చూస్తుండగానే చాలామంది జనం పరుగు పరుగున అక్కడికి వచ్చారు.
వీరి పోట్లాట చూసి కాదు, భవాని అందాన్ని చూట్టానికి స్త్రీలు కూడా చకచకా వచ్చారు. అందరూ తనను కళ్ళార్పకుండా చూట్టం భవాని గమనించి తల వంచుకుంది.
“నువ్వెందుకు వచ్చావిక్కడికి? నీకేమైనా బుద్ధుందా? ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారన్న సిగ్గూ లజ్జా కూడా లేకుండా ... ఛీ ... ఛీ .. నిన్నేం చేసినా పాపం లేదే. నీవసలు ఎందుకు వచ్చావిక్కడికి ... చెప్పూ!’’ సింహంలా గద్దించాడు రవివర్మ.
భవానీకి తన తండ్రి కోపిష్టితనం బాగా తెలుసు. కోపంతో రెచ్చిపోయినప్పుడు ఏమి జవాబు చెప్పినా ప్రమాదమే. చెమటలు పట్టిన ముఖంతో, తప్పుచేసిన దానిలా తల వంచుకుని కొన్ని క్షణాలు మౌనం వహించింది. భవానీ అంటే రవివర్మకు పంచ ప్రాణాలని, ఆదిత్యకు తెలుసు.
ఇంత మంది జనం ముందు తానేమి మాట్లాడినా అసందర్భంగా వుంటుందేమోనని తన మిత్రుడు శీలభద్రుడి వైపు చూసి, భవానీని జాగ్రత్తగా చూడమని కనుసైగ చేశాడు. కొన్ని క్షణాలు అంతా నిశ్శబ్దం రాజ్యమేలింది. తన కూతుర్ని జనం అలా నోరు తెరుచుకుని చూట్టం రవివర్మకు చిరాకనిపించింది.
“నేను మీ కోసమే వచ్చాను నాన్నా! అమ్మకు ఒంట్లో బాగోలేదు. మిమ్మల్ని వున్నఫలంగా వెంటనే తీసుకురమ్మంది పదండి’’
“ఏమైంది?’’
“అవన్నీ అక్కడకెళ్ళి మాట్లాడుకుందాం. ముందు పదండి నాన్న! ఎంతమంది జనం గుమిగూడారో చూడండి!’’ అందరివైపు ఒక్కక్షణం కలగలపి చూస్తూ భవాని – శీలభాద్రుడివైపు కూడా అదోలా చూసింది.
ఆ చూపు కత్తిలా అతని సుతిమెత్తని గుండెకు గుచ్చుకుంది. పాషాణాలు చేక్కేప్పుడు నిప్పురవ్వల్లా ఎగిరిపడే రాతి ముక్కలు తన దేహానికి గుచ్చుకున్నప్పుడు శీలభద్రుడికి ఏమీ అనిపించలేదు. కానీ ఆ మెత్తనిచూపు ... భవానీ చూపు! తన గుండెను తాకగానే ఓ బలమైన ఉల్క భూమిని డీకొన్నట్టయింది.
ఆ చూపులోని ఆంతర్యం, వాలుతనం, మెరుపులాంటి తెల్లదనం, ప్రేమామృతంలో మునిగితేలిన గులాబీ ముగ్ధత్వం – ఏ కవికీ అందని అ రూపం, తను చెక్కిన ప్రతిమలో రావాలంటే? ఎన్ని జన్మలు తపస్సు చేయాలి!?’’ అనుకున్నాడు శీలభద్రుడు”
“శీలభద్రా! నిన్ను వూరికే వదలను, మహారాజుకు నీవు చేసిన పని తెలిస్తే నీకు శిరచ్చేదం తప్పదు. ఈ రవివర్మంటే రాజుగారి దగ్గర కూడా ఎంత పరపతి వుందో ఈ ఖజురహో నగరానికంతా తెలుసు. నీ సంగతేమిటో తర్వాత తేలుస్తాను. పద~’’ శీలభద్రుడిని హెచ్చరించి కూతురు భవానీ చేతిని పుచ్చుకుని లాక్కుని వెళ్తున్నట్టుగా నడిచాడు రవివర్మ.
పోద్దుగూకింది భానుడి అంతిమ కిరణంలా చాలా దూరం వెళ్ళాక భవానీ శీలభద్రుడివైపు ఒక్కక్షణం తిరిగి చూసింది. అది పసిగట్టిన శీలభద్రుడు గుండెను ఒక చేత్తో గట్టిగా అదుముకున్నాడు. ఎవరో గుచ్చినట్టుగా వున్నా తియ్యగానే వుందెందుకో అనుకున్నాడు శీలభద్రుడు. భవానీ వెళ్ళిపోయినా తర్వాత అక్కడ గుమిగూడిన జనమంతా ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు.
“ఎంత పనిచేశావు ఆదిత్యా! ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే?’’ అన్నాడు శీల.
“అలా జరగకుండా ఉండాలనే, ఓ చిన్న అబద్ధం చెప్పి భవానీని లాక్కొచ్చాను. నా మాట నిలబెట్టుకున్నాను.’’
“నీ మొండితనం నాకు తెలుసు ఆదిత్యా! తెలివైనవడివి కూడా ...’’
“మునగచెట్టు ఎక్కించకు. రాబోయే ప్రమాదం గురించి ఆలోచించు’’ చెవి దగ్గర మెల్లగా అన్నాడు ఆదిత్య.
“ఎలాంటి ప్రమాదం?’’ ఆశ్చర్యంగా చూశాడు శీలభద్ర.
“రవివర్మ సంగతి నీకు తెలియదు. ఎవరైనా తనను అవమానపరిస్తే వాడి అంటు చూడందే నిడురపోడు. నీవు చెక్కిన భవానీ శిల్పాన్ని చూసిన వారంతా నీకూ, భవానీకి మధ్య ఏదో సంబంధం వుందని గుసగుసలు బయలుదేరి వుంటాయి. అలాంటప్పుడు భవానీకి పెళ్ళి సంబంధాలు ఎలా కుదురుతాయి? ముందు ఆ ప్రతిమను ఎవరికీ కనిపించకుండా దాచేయి. తర్వాత చూద్దాం ఏం జరుగుతుందో!’’
“రాజుగారితో నా గురించి రవివర్మ ఏమైనా చేబుతాడేమో! నాకు భయంగా వుంది ఆదిత్యా!’’
“కంగారుపడకు. భయపడినంత మాత్రాన వచ్చే ఆపదరాక మానదు. ప్రేమించేవారికి పిరికితనం పనికిరాడు. ఐనా నీ మతిలేనితనం కాకపొతే, భవానీలాంటి అపురూప లావణ్యవతి నిన్ను ఏం చూసి ప్రేమిస్తుందనుకున్నావు? మణులా, మాణిక్యాలా, మాగాణా లేక భూములా? కేవలం చిత్రకళను చూసి ప్రేమిస్తారనుకున్నావా?’’
“నీవన్నది నిజమే ఆదిత్యా, ప్రేమిచడానికి హృదయమొక్కటే చాలనుకున్నాను. కానీ స్త్రీ కోరుకునేది అదొక్కటే కాదంటున్నావు,
పోనీలే ... భవానీ ప్రతిబింబంగా వెలసిన ఆ ప్రతిమను చూసుకుంటూ నా శేష జీవితాన్ని గడిపేస్తాను. జీవితంలో అనుకున్నవన్నీ జరగవు కదా ... (నిట్టూరుస్తూ) ఇంకేంటి, నగర విశేషాలేమిటి?’’
“ఏముందీ మన మహారాజు మళ్ళీ విజయం సాధించి తిరిగి వచ్చారు. నగరంలో వేడుకలు జరుపుకుంటున్నారు. కానీ ఏం లాభం?’’
“అంటే?’’
“ఆయనకు సంతానం లేదుగా, వారసుడు లేడని మహారాణి కుమిలిపోతోంది. ఎన్ని రాజ్యాలు జయించినా, సంతానం లేకపోతే రాజులు పడే మానసిక బాధ అంతా ఇంతా కాదు. మన నగరానికి దూరంగా ఒక తాంత్రికుడు వచ్చి శ్మశానం దగ్గర కుటీరం వేసుకుని వున్నాడట. అతను శక్తిమంతుడా కాదా తెలుసుకురమ్మని నాకు మహారాజుగారు ఆదేశాలు పంపించారు. నేను ఆ తాంత్రికుడి దగ్గరవెళుతున్నాను. అతని దగ్గర ఏవో శక్తులున్నాయంటున్నారు. వస్తే నీవురా! భవానీని పొందే తాయత్తేదైనా ఇస్తాడేమో! వస్తావా?’’
“అలాగే .... ఎప్పుడు?’’
“అమావాస్య, ఆదివారం అర్థరాత్రి – తాంత్రికులకు చాలా ముఖ్యమైన రోజు! అది వారంరోజుల్లో రాబోతోంది’’
“శ్మాషణం దగ్గర ... తాంత్రికుడితో వ్యవహారం, ప్రమాదమేమీ వుండదా?’’
“మనం మహారాజు తరపున దూతలం మాత్రమే! తాంత్రికుడు మనల్నేమి చేస్తాడు?’’
“నేను సిద్ధంగా వుంటాను. నీవెప్పుడు రమ్మన్నా సరే!’’
*****
