Next Page 
అగ్నిప్రవేశం పేజి 1

                         అగ్నిప్రవేశం
   
                                                   --యండమూరి వీరేంద్రనాథ్
   
                      


           

                                  ఒకటి

                         నవంబరు 12, గురువారం.
   
    అర్దరాత్రి కావొస్తూంది. ఆ గది తప్పమిగతా హాస్పిటల్ అంతా నిశ్శబ్దంగా వుంది.

   
    ఆ గది మాత్రం నిశ్శబ్దాన్నెప్పుడూ బ్రతకనివ్వదు. చావు పుట్టుకల ఘర్షణ అక్కడ నిరంతరం ప్రతిధ్వనిస్తూ వుంటుంది. ఒక జీవి ప్రాణానికి పరీక్ష పెడుతూ మరో జీవి జన్మించేది అక్కడే! నిర్మొహమాటంగా స్త్రీ తన బాధని ఒప్పుకునేది అక్కడే!
   
    ఆ గదిలో ఇద్దరు నిండు గర్భిణీ స్త్రీలున్నారు. పక్క గదిలో లేడీ డాక్టర్ నిద్రపోతోంది. ప్రసవ వేదన పడుతున్న ఇద్దరు స్త్రీలనూ ఒక నర్సు అనునయిస్తూంది. ఎందరో గృహిణులను ఈ విధంగా అలరించిన మృదుత్వం ఆమె కంఠంలో కనబడుతోంది.
   
    ఆ గదిలోనే మరో నర్సు నిద్రపోతూంది. ఆవిడ పేరు ఆదిలక్ష్మి!
   
    ప్రసవ వేదన పడుతూన్న ఇద్దరు స్త్రీలకూ దాదాపు ఒకే వయసు వుంటుంది. ప్రసవ సమయం దగ్గర పడుతోంది.
   
    అవసరమైనప్పుడు లేపమని ఆదిలక్ష్మి తోటి నర్సుకి చెప్పి పడుకుంది. ఆమెకి సినిమాల పిచ్చి చాలా వుంది. ఆ రోజే ఫస్ట్ షోకి వెళ్ళింది. రెండూ పక్క పక్కథియేటర్లు. ఒకదాంట్లో ఏయన్నార్ ది. మరోదాంట్లో ఎన్టీఆర్ దీ ఆడుతున్నాయి. టాస్ వేసి చూడటం ఆమెకి మరో హాబీ..... టాస్ వేసి ఎన్టీఆర్ సినిమా కెళ్ళింది.
   
    ప్రసవ వేదన పడుతున్న ఇద్దరు స్త్రీలలో ఒకరి పేరు నిర్మల. సన్నగా, నాజూగ్గా, తెల్లగా వుంది. డబ్బున్న స్త్రీలాగే కనబడుతోంది. బాధను తట్టుకోలేక పెద్దగా అరుస్తోంది. పక్కన బల్లమీద అరుంధతి బలంగా, ఆరోగ్యంగా వుండి పైకి తెలీనీయకుండా బాధను ఓర్చుకుంటోంది. అమ్మాయో, అబ్బాయో అని గత తొమ్మిది నెలలుగా పేరుకుంటున్న సస్పెన్స్ త్వరలో విడబోతోంది ఇద్దరికీ.
   
    ఇద్దరికీ నొప్పులు అధికం అయ్యాయి. నర్సు ఇద్దర్నీ అనునయిస్తూ ఆదిలక్ష్మిని కూడా లేపింది.
   
    చక్కటి కలలో ఉన్న ఆదిలక్ష్మి కళ్ళు నులుముకుంటూ లేచింది. ఆమె కలలో ఒక డబ్బున్నవాడి కొడుకు దొంగ కొడుకుగా పెరిగి, ఎన్టీఆర్ అయి, "ఓహో గులాబి బాలా" అన్న పాటలో పాల్గొంటాడు-జగ్గయ్యతో కలిసి.
   
    ఇద్దరు నర్సులూ చెరో స్త్రీ దగ్గరా చేరి ఉపచారాలు చేస్తూ ధైర్యం చెబుతున్నారు. ఈ లోపులో డాక్టరు కూడా వచ్చింది.
   
    నిమిషాలు భారంగా కదులుతున్నాయి.
   
    ఉన్నట్టుండి నిర్మల  కెవ్వున అరిచింది. అప్పటివరకూ  బాధని అణుచుకుంటున్న అరుంధతి కూడా! అంతసేపు పడ్డ టెన్షన్, బాధ ఒక్కసారిగా తీసివేసినట్టు పోయింది. రెండు పసి గొంతుల ఏడుపు వినిపించింది. సరిగ్గా....అదే సమయానికి గడియారం పన్నెండు గంటలు కొట్టింది.
   
    ఈ ప్రపంచపు సుఖాల్నీ, దుఃఖాన్ని, ఆనందాన్ని, విషాదాన్ని పంచుకోవడానికి సెకను కూడా తేడా లేకుండా ఇద్దరు శిశువులు భూమిమీద మొదటి ఊపిరి పీల్చారు.
   
    అనుభవించే అదృష్టం ఉంటే ఈ జీవితమంత ఆనందకరమైనది మరొకటి లేదు. లేకపోతే బ్రతుకంత నరకం లేదు. అదృష్టాన్నీ, జాతకాన్నీ నమ్ముకోకుండా స్వశక్తిని నమ్ముకున్న వాళ్ళకి ఈ ప్రపంచమంత ఛాలెంజి మరొకటి లేదు.
   
    ఆదిలక్ష్మి ఇద్దరు పిల్లల్నీ వాష్ టబ్ దగ్గరికి తీసుకెళ్ళింది.
   
    అప్పుడొచ్చింది ఆమెకి ఆలోచన!
   
    అందులో ఏ స్వార్ధమూ లేదు. ఏ పరమార్ధమూ లేదు. కేవలం థ్రిల్...అంతే!
   
    ఆమె చూసిన సినిమాలో ఒక దొంగ, తన కొడుకు స్థానం మారుస్తాడు. దొంగ కొడుకు దొంగ కానవసరంలేదని నిరూపిస్తాడు.
   
    ఇక్కడ అలా కాదు-అసలేమీ లేదు. ఇద్దరూ తన దగ్గరే వున్నారు కాబట్టి, మార్చి చూస్తే ఎలా వుంటుంది అన్న ఆలోచన! మళ్ళీ.....అది తప్పేమో అన్న భావం.
   
    ఆమె కాయిన్ (నాణెం) తీసుకుని, 'బొమ్మ పడితే మారుస్తా' అనుకొని గాలిలోకి విసిరి అరచేత్తో పట్టుకుంది.
   
    బొమ్మ పడింది!
   
    ఆదిలక్ష్మి వెనక్కి తలతిప్పి చూసింది. శిశుజన్మ సమయాన్ని రెండో నర్సు నోట్ చేస్తూంది.
   
    ఆమె ఒకరి తర్వాత ఒకర్ని తీసుకొచ్చి చెరో తల్లి పక్కలోనూ పడుకోబెట్టింది. అప్పటికి నిర్మల ఇంకా స్పృహలోకి రాలేదు. ఆదిలక్ష్మి ఆమె ఎడమ తొడమీద చిన్న పుట్టుమచ్చని చూసింది. తను ఈ రోజు చేసిన దానికి గుర్తుగా, అరుంధతి పక్కలో వున్న పసిగుడ్డు (ఆ పాప నిర్మల కూతురు) ఎడమ తొడమీద కూడా చిన్న మార్కు పెట్టింది. పాతిక సంవత్సరాల తరువాత ఈ మార్కు ఆధారంగానే తను ఈ తల్లీ కూతుళ్ళని కలవబోతూంది.
   
    - ఆ విధంగా ఒక సినిమా చూసొచ్చి, కేవలం 'ఏం జరుగుతుందో చూద్దాం' అన్న అనారోగ్యకరమైన చిలిపి ఆలోచనతో ఒక నర్సు చేసిన పని, ఇద్దరు పసివాళ్ళ జీవిత గతుల్నే మార్చేసింది. అయితే ఈ "అగ్నిప్రవేశం" కథ ఆ విధి మార్పిడి గురించి కాదు.
   
                             *    *    *
   

    నిర్మల ముందుగా కళ్ళు తెరిచింది.
   
    "ఇలా చూడమ్మా నీ బిడ్డని" ఎత్తి చూపించింది ఆయా.
   
    "ఆడపిల్లా?" నిర్మల నీరసంగా కళ్ళు మూసుకుంది.
   
    "ఆడపిల్లా అని అంత తేలిగ్గా అనకు. ఆడపాప అను. లేదా అమ్మాయి అను. ఎందుకింత నిరాశ....? కూతురు చూసినంతగా మొగుడూ, కొడుకులూ కూడా నిన్ను చూడరు" అంది ఆయా అనుభవంతో ఆ మాటలకి అరుంధతి కళ్ళు తెరిచింది. ఆశగా ఆయవైపు చూసింది.
   
    "నీ బిడ్డని కూడా చూసుకోవమ్మా. ఆరోగ్యంగా, బొద్దుగా ఎంత బావుందో!"
   
    "బావుంది సిస్టర్" కృతజ్ఞతగా చూసింది అరుంధతి.
   
    "మీ ఇద్దరు పిల్లలూ ఒకే క్షణంలో పుట్టారు. ఇద్దరి జాతకమూ ఒకటే అవుతుంది. నా సర్వీసులో ఎప్పుడూ జరగలేదిలా" అంది డాక్టరు వాళ్ళ జన్మ సమయాన్ని నోట్ చేసిన కాగితం చూస్తూ.
   
    అరుంధతి నిర్మలవైపు చూసి పలకరింపుగా నవ్వింది. నిర్మల మందహాసం చేసి కళ్ళు మూసుకుంది. స్ట్రెచరు మీద అరుంధతి పక్కనే పాపను పడుకోబెట్టీ జనరల్ వార్డులోకి తీసుకుపోయింది ఆయా.
   
    "బంగారపు బొమ్మలాంటి పాపాయి పుట్టింది. అయ్యగారికి చెప్పి మంచి ఇనాం యిప్పించాలి" వెళుతూ చెప్పింది.
   
    "అలాగే యిస్తాలే!" అంది అరుంధతి. ఆమెకు చాలా నీరసంగా వుంది. కళ్ళు మూసుకుపోతున్నాయి. పక్కన పడుకున్న పాపని చూస్తూవుంటే నిద్రపోవడం అపరాధంగా అనిపిస్తోంది.
   
    పాప ఒత్తిగిలి పడుకునుంది. దుప్పటి తీసి నిండుగా కప్పింది. 'బట్టలేవయినా తెచ్చుకుంటే బావుండేది. ఏమిటో..... నెప్పులు మొదలవగానే ఒకటే హడావుడి' అనుకుంది మనసులో.
   
                            *    *    *
   
    నిర్మలకోసం ముందుగానే బుక్ చేసిన స్పెషల్ ఎయిర్ కండిషన్డ్ రూంలోకి ఆమెను జాగ్రత్తగా తీసుకెళ్ళింది ఆయా. ఆమె కోసం నియమింపబడ్డ నర్సు అప్పటికే అన్నీ సిద్దంచేసి వుంచింది. నిర్మలను పక్కమీద పడుకోబెట్టి ఇంటిదగ్గర నుంచి తెచ్చిన రగ్గు కప్పింది. పాపాయికి బట్టలు వేసి ఉయ్యాల్లో పడుకోబెట్టింది.
   
    పాప గురించి నిర్మలకు బెంగలేదు. ఆమె నిద్రలోకి జారిపోయింది.
   
    భర్త గురించి ఎదురు చూడాల్సిన అవసరం కూడా లేదని ఆమెకు తెలుసు.
   
                             *    *    *


Next Page 

  • WRITERS
    PUBLICATIONS