Previous Page Next Page 
అగ్నిప్రవేశం పేజి 2

   

    వార్డులో అందర్నీ చూసుకుంటూ వస్తున్న విశ్వపతిని దూరంనుంచే చూసింది అరుంధతి. ఆమె ముఖం సంతోషంతో విప్పారింది.
   
    "మొత్తానికి మీరే గెలిచారు!" అతను దగ్గరకు రాగానే నవ్వుతూ చెప్పింది.
   
    "నీకు ఎప్పుడూ నేను గెలవడం, నువ్వు ఓడడమే ఇష్టంగా- రాత్రంతా చాలా బాధపడ్డావా?" ఆప్యాయంగా అడిగాడు.
   
    "ఊఁ! చాలా కష్టపడ్డాను. ఇప్పుడేమీ అనిపించడంలేదు. ఎలా వుంది మీ పాపాయి?"
   
    "కుందనపు బొమ్మలా, అచ్చంగా నాలాగా" నవ్వాడతను అని, మళ్ళీ తనే- "పోలికలు యిప్పుడే తెలియవనుకుంటానుగానీ కాస్త కాఫీ తాగు ముందు" గ్లాసులో పోసి ఆమెచేత తాగించాడు. "అచ్చం నాలాగా" అని అతను అంటుంటే పక్కనే వున్న నర్సు ఆదిలక్ష్మి నవ్వుకుంది.
   
    విశ్వపతి బుట్టలోంచి పాత జుబ్బా తీసి పాపకి జాగ్రత్తగా తొడిగాడు. పాతచీర ముక్కలు చింపి ఒక్కటి పక్కమీద వేసి మరోటి కప్పాడు.
   
    "అబ్బో! ఇప్పట్నుంచే కూతురికి శుశ్రూష చేస్తున్నారే!"
   
    "అవును మరి! ఎంతయినా నా బంగారుతల్లి కదా!"
   
    "పావని- పేరు బావుందా?"
   
    "చాలా బావుంది"
   
                             *    *    *
   
    "అయ్యగారు వచ్చారా?" నిద్రలేవగానే అడిగింది నిర్మల.
   
    "లేదమ్మా! డ్రైవర్ వచ్చాడు. పాపకి కావలసినవన్నీ తెచ్చాడు. వీలయితే సాయంత్రం వస్తానని చెప్పమన్నారట."
   
    నిర్మల కంటినుంచి ఓ నీటిబొట్టు రాలి దుప్పట్లోలో కలిసిపోయింది.
   
    "బహుశా బాబు పుట్టివుంటే వచ్చేవారేమో!" నర్సు అందించిన మాత్ర వేసుకుని హార్లిక్స్ తాగి మళ్ళీ నిద్రలోకి జారిపోయింది. పాపాయికి "సాహితి" అని పేరు పెట్టినట్లు కల వచ్చిందామెకు.
   
                           *    *    *
   
    అరుంధతి పాపని ఎత్తుకుని హాస్పిటల్ మెట్లు దిగుతోంది. మరో పక్కనుంచి నిర్మల వచ్చింది. పాపని నర్సు ఎత్తుకొచ్చింది.
   
    ఇద్దరి కళ్ళూ కలుసుకున్నాయి. ఒకరికొకరు ఏమీ కాకపోయినా ఏదో తెలీని ఆత్మీయతా భావం! వాళ్ళిద్దర్నీ ఆదిలక్ష్మి చూస్తూంది. చెప్పేద్దామా అనుకుంది. ఉహు! ఇప్పుడు కాదు. పాతిక సంవత్సరాల తర్వాత చెప్పాలి. ఇద్దరి అడ్రసులూ తన దగ్గరున్నాయి. అప్పుడయితే.... ఎంత నాటకీయంగా వుంటుంది? ఆ దృశ్యం.....కన్నీళ్ళూ .... కలుసుకోవటాలూ.... "ఇద్దర్నీ నా బిడ్డల్లా చూసుకుంటాను" అని డబ్బున్నామె అనటం-దూరంగా ఆనందభాష్పాల్తో చేసిన తప్పుకి పశ్చాత్తాపపడుతూ తనూ, ఈ రకంగా ఆదిలక్ష్మి ఆలోచిస్తోంది.
   
    "ఎటువైపు వెళ్ళాలి మీరు?" అడిగింది నిర్మల.
   
    "సీతాపల్ మండి. మీరో?"
   
    "బంజారాహిల్స్"
   
    ఈ సంభాషణ వల్ల జరిగే ఆలస్యాన్ని మెట్ల దగ్గర పియట్ కార్లో వున్న వినయచంద్ర అసహనంగా చూశాడు.
   
    అది గమనించి "వస్తాను" అని మెట్లు దిగి వెళ్ళిపోయింది నిర్మల.
   
    వెనకే విశ్వపతి తీసుకొచ్చిన రిక్షాలో ఎక్కింది అరుంధతి.
   
    రెండు వాహనాలూ ఎదురెదురు దారుల్లోకి కదిలాయి- ఇద్దరు పాపల భవిష్యత్తుల్లా.
   
                             *    *    *
   
    "పాప పుట్టిన సమయం నోట్ చేశారా? నక్షత్రం ఏమిటి?" రిక్షాలో అడిగాడు విశ్వపతి భార్యని.
   
    "పాపం ఆ నర్సెవరో మంచిదండీ. సెకన్లతో సహా రాసిచ్చింది" అంటూ కాగితం తీసింది.
   
    అదే సమయానికి కార్లో వెళ్తున్న నిర్మల కూడా పాప పుట్టిన సమయాన్ని చూసింది. ఇద్దరి కాగితాల్లోనూ ఒకటే టైము, జాతకశాస్త్రాన్ని పరిహసిస్తున్నట్టు.
   
    00 అవర్స్  - 13 - ఫ్రైడే
   
                                     2
   
    చిన్న పెంకుటిల్లే అది. కానీ చాలా నీట్ గా వుంది. చుట్టు ప్రక్కల నాలుగువైపులా ఖాళీస్థలం వుంది. ముందు వైపంతా పూలమొక్కలు. అరుంధతి ఏడాదినుంచి మరీ నీరసించిపోతుంటే డాక్టర్ కి చూపించారు. క్యాన్సర్ అని అనుమానిస్తూ ఆపరేషన్ చేసి వెంటనే గర్భసంచి తీసేయాలన్నారు. పదిహేను రోజుల క్రితం పట్నంలో ఆమెకు ఆపరేషన్ జరిగింది.
   
    తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి కాళ్ళూ చేతులూ కడిగి హాల్లో కూర్చోపెట్టి తలా రెండు బిస్కట్లు యిచ్చింది పావని. ఒక అరగంట రెస్ట్ తర్వాత వాళ్ళతో పాటు కూర్చుని చదువు చెపుతూ తనూ చదువుకుంది. "నానమ్మా! నాన్న ఇంకా రాలేదేం" అడిగింది దిగులుగా చెల్లి.
   
    "వస్తాడ్లేమ్మా! ఆపరేషనయ్యాక అమ్మని తీసుకుని వస్తానన్నాడుగా, ఇవ్వాళో రేపో రావాలి"
   
    "నానమ్మా! అమ్మకు నయమయిపోయుంటుందా? ఆపరేషనంటే చాలా రక్తం పోతుంది కదూ."
   
    "తగ్గిపోయుంటుంది. కాకపోతే రెండు మూడు నెలలదాకా విశ్రాంతి తీసుకోవాలన్నారట డాక్టర్లు."
   
    "అక్కా! నాన్నొచ్చాడు" బాలూ అరుపుకి లేచి బైటకు పరిగెత్తింది. వాకిట్లో దృశ్యాన్ని చూస్తుంటే ఆమె కంటనీరు ఆగలేదు.
   
    గుమ్మంలో రిక్షా ఆగింది. అందులోంచి అస్థిపంజరంలా వున్నా అరుంధతిని దింపి నడిపించుకొస్తున్నాడు విశ్వపతి. నెల రోజులకే అయిదేళ్ళ వయసు పెరిగిపోయినట్లున్నాడు.
   
    హాల్లో మంచంవేసి అరుంధతిని పడుకోబెట్టారు.
   
    "బాలూ, బాబీ, టిక్కీ.....అదేమిటి దూరంగా నిలబడి పోయారు? ఇలా రండి" పిలిచిందావిడ. అందరూ నిశ్శబ్దంగా వెళ్ళి పక్కనే కూర్చున్నారు.
   
    "అమ్మా! నీకు నొప్పి తగ్గిందా?" అడిగాడు బాలూ.
   
    "ఆ, తగ్గిపోయింది నాన్నా! నువ్వెలా వున్నావు? బాగా చదువుకుంటున్నావా? మన తోటెలా వుంది?"
   
    "భలే బావుందమ్మా! రోజూ ఇంట్లో ఆ కూరలే వండుతోంది నానమ్మ."
   
    "అవునమ్మా! నువ్వు చాలా మంచిదానివి. అందుకే అంత బాగా కాయలు కాస్తున్నాయి" తన బాధ తెలియకుండా పిల్లలతో సంభాషణలో పడిన అరుంధతిని చూస్తున్నాడు విశ్వపతి. పావని దూరంనుంచి తల్లినే చూస్తోంది.
   
    అమ్మ తనకు గోరుముద్దలు తినిపించినప్పట్నుంచీ అంతా గుర్తే పావనికి. అమ్మా, నాన్నా అన్నిటికీ పోటీపడేవారు. కేవలం అమ్మలే చేస్తారు, చేయాలి అన్న పనులన్నీ విశ్వపతి కూడా చేస్తూండేవాడు. అందరి ఇళ్ళలోనూ తండ్రులు బయట పనంతా చేయటం, పిల్లలు తల్లులకే ఎక్కువగా చేరువ కావడం చూసింది. కాని తమ యింట్లో అలా ఎప్పుడూ లేదు. టీచర్ గా స్కూల్లో తన బాధ్యత పూర్తి చేసుకొన్నాక విశ్వపతి ఇల్లు కదిలేవాడు కాదు. చంటిపిల్లను భార్య సముదాయిస్తుంటే పెద్దపిల్లల్లో తల్లి తమకు దూరం అయిందన్న భావం కలగకుండా వాళ్ళను అంటిపెట్టుకుండేవాడు.
   
    ఆ యిల్లు యెప్పుడూ నవ్వులతో కళకళలాడుతూ ఓ ఆనంద ప్రపంచంలా వుంటుంది. అత్తాకోడళ్ళ పోట్లాటలు లేవు. భార్యాభర్తల కీచులాటలు లేవు. పిల్లల మధ్య పోటీలు, ఈర్ష్యలు లేవు. ఇప్పుడేమో అమ్మ ఇలా అయిపోయింది. పావని తండ్రివైపు చూసింది. గుమ్మం దగ్గర నిలబడి ఎవరూ చూడకుండా కళ్ళు తుడుచుకుంటున్నాడు. అమ్మను చూస్తున్న బాధకంటే, తండ్రి కన్నీరు ఆమెను ఎక్కువ కదిలించింది.
   
    "నాన్నా!" దిగులుగా దగ్గరగా వెళ్ళింది.
   
    "ఏమ్మాపావనీ! ఫర్వాలేదు. అమ్మకు త్వరగానే నయమవుతుంది. కొద్దిరోజులు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అంతే" అన్నాడాయన అనునయంగా.
   
    "మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు నాన్నా? నిన్నలా చూస్తుంటే నాకు దిగులేస్తుంది."
   
    "అబ్బే నేనెందుకేడుస్తున్నాను- లేదు. నిద్ర సరిగా లేదుకదూ అందుకే అలా" ముఖంలో చిరునవ్వు పులుముకుంటూ అన్నాడు.
   
    "ఎంత కష్టమొచ్చినా ఏడ్వకూడదు. ధైర్యంగా వుండాలని నువ్వేగా నాన్నా ఎప్పుడూ చెపుతూండేవాడివి."
   
    అప్పుడర్ధమైందాయనకి తన కూతురు వయసుకి మించి ఎదిగి పోయిందని.
   
                              *    *    *


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS