వేంకటేశ్వర స్వామికి శనివారం అంటే ఎందుకు ఇష్టమంటే!
వేంకటేశ్వర స్వామికి శనివారం అంటే ఎందుకు ఇష్టమంటే!
కలియుగదైవం వేంకటేశ్వర స్వామి. ఎంతో మందికి, ఎన్నో కుటుంబాలకు ఆయన ఇంటిదైవంగా ఉన్నాడు. ఈ కలియుగంలో దైవ భక్తి నిలిచి ఉండటానికి కారణం వేంకటేశ్వర స్వామే అని చాలా మంది నమ్మకం. వడ్డీకాసుల వాడు, ఆపంధ్భాందవుడు, ఆపాద మొక్కుల వాడు అని.. ఇలా చాలా పేర్లతో పిలుచుకునే వేంకటేశ్వర స్వామికి శనివారం అంటే ఎంతో ప్రీతి. శనివారం అనగానే వేంకటేశ్వర స్వామే గుర్తుకువస్తారు. కష్టాల నుండి బయచ పడటానికి సప్త శనివార పూజ చేసుకుంటారు, వేంకటేశ్వర స్వామి ఏడు కొండల పైనే కొలువై ఉన్నాడు. ఏడు శనివారాల పూజ చేసుకుంటే కష్టాల నుండి గట్టెక్కుతారని, కోరిన కోరికలు తీరుస్తాడని నమ్ముతారు. అయితే.. వేంకటేశ్వర స్వామికి శనివారమే శ్రేష్టం ఎందుకు? దీని వెనుక కారణాలు తెలుసుకుంటే..
ఓంకారం..
ఓంకారం శనివారం రోజే ప్రభవించిందట. అందుకే శనివారం ఎంతో శ్రేష్టమని చెబుతారు.
శనిదేవుడి వాగ్దానం..
వేంకటేశ్వర స్వామిని శనివారం రోజు భక్తిశ్రద్ధలతో పూజించే వారిని శనిదేవుడు పీడించనని వాగ్దానం చేశాడట. అందుకే శనివారం వేంకటేశ్వర స్వామికి చాలా ముఖ్యమైనది.
మొదటి దర్శనం..
తిరుమలలో కొలువై ఉన్న వేంకటేశ్వర స్వామిని భక్తులు మొదటగా దర్శనం చేసుకున్నది శనివారం రోజునే.
శ్రీనివాసుడి ఆజ్ఞ..
తొండమాన్ చక్రవర్తికి వేంకటేశ్వర స్వామి కలలో కనిపించి ఆలయం నిర్మించమని చెప్పింది శనివారం రోజేనట.
స్వామి కళ్యాణం..
వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రవేశించినది, పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్నది శనివారం రోజే అని చెబుతారు.
సుదర్శన ఆవిర్భావం..
సుదర్శన చక్రం ఆవిర్బవించినది శనివారం రోజేనట. సుదర్శనం అంటే వేంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతి. అందుకే శనివారం కూడా స్వామి వారికి ఎంతో ప్రీతి అయ్యింది.
ఏడు శనివారాలు..
శనిదేవుడి దోషం ఏదైనా ఉంటే.. ఏడు శనివారాలు వేంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకుంటే మంచిది. దోషం పోతుందని చెబుతారు. అలాగే వేంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి 7 ప్రదక్షిణలు చేసి, ముడుపు కడితే శనిదేవుడి ప్రభావం తగ్గుతుందట.
రావిచెట్టు..
ప్రతి శనివారం రావిచెట్టుకు మూడు ప్రదక్షిణలు చేస్తే.. అంతా శుభమే జరుగుతుందని పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. రావి వృక్షంలో సకల దేవతలు కొలువై ఉంటారు అందుకే శనివారంకు అంత ప్రాముఖ్యత.
శనివారానికి., వేంకటేశ్వర స్వామికి ఇన్ని విషయాలలో సంబంధం ఉంది. అందుకే వేంకటేశ్వర స్వామికి శనివారం అంటే అంత ప్రీతి.
*రూపశ్రీ.