అక్షయ తృతీయ ఎందుకు జరుపుకుంటారు.. అక్షయ తృతీయతో ముడిపడిన పురాణ కథల గురించి తెలుసా!

 

అక్షయ తృతీయ ఎందుకు జరుపుకుంటారు..

అక్షయ తృతీయతో ముడిపడిన పురాణ కథల గురించి తెలుసా!

అక్షయ తృతీయను వైశాఖ మాసంలోని శుక్ల పక్షం మూడవ రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 19వ తేదీ, ఆదివారం నాడు వస్తుంది. త్రేతా యుగం, సత్య యుగాలు కూడా ఈ తిథి రోజే  ప్రారంభమయ్యాయట, అందువల్ల దీనిని కృత యుగాది తృతీయ అని కూడా పిలుస్తారు. భవిష్య పురాణం ప్రకారం, ఈ రోజున చేసే స్నానం, దానం, జపం, హోమం చేయడం, అధ్యయనం చేయడం , తర్పణం సమర్పించడం వంటి ఏ కర్మలైనా చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది.  అక్షయ తృతీయ తిథి అన్ని పాపాలను నాశనం చేసి, సకల సంతోషాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు.  అక్షయ తృతీయ తిథికి అధిదేవత పార్వతీ దేవి. పార్వతీ దేవి తృతీయకు తిరుగులేని ఫలితాలను ఇచ్చే శక్తిని ప్రసాదించింది. ఆ వరం వల్ల, ఈ తేదీన చేసే ఏ పనైనా ఎనలేని ఫలితాలు ఇస్తుంది. అక్షయ తృతీయ తిథితో  ముడిపడి ఉన్న కొన్ని పౌరాణిక సంఘటనలు ఉన్నాయి. ఇవి అక్షయ తృతీయ విశిష్టతను మరింత గొప్పగా చాటి చెబుతాయి. ఇంతకీ.. అక్షయ తృతీయతో ముడిపడిన పురాణ కథలు ఏమిటో తెలుసుకుంటే..

మహాభారత యుద్ధం ముగిసిన రోజు....

పురాణాల ప్రకారం, మహాభారత భీకర యుద్ధం అక్షయ తృతీయ నాడు ముగిసిందట. ఈ రోజు అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక. అందువల్ల, జీవితంలో సత్యం, ధర్మం , న్యాయం అనే మార్గాన్ని అనుసరించడానికి అక్షయ తృతీయ మనకు స్ఫూర్తినిస్తుంది.

విష్ణుమూర్తి  అవతారాలు..

నర-నారాయణులు, హయగ్రీవుడు,  పరశురాముడు ఈ రోజున అవతరించారని నమ్ముతారు. ముఖ్యంగా పరశురాముని జన్మదినం కారణంగా, ఈ రోజున పరశురామ జయంతిని కూడా జరుపుకుంటారు. ఈ అవతారాల ముఖ్య ఉద్దేశ్యం ధర్మాన్ని స్థాపించడం , అధర్మాన్ని నాశనం చేయడం, ఇది ఈ రోజు ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది.

 బ్రహ్మ కుమారుడు..

బ్రహ్మ కుమారుడు అయిన అక్షయ కుమారుడు  కూడా ఇదే రోజున జన్మించాడని పురాణ కథనాలు చెబుతున్నాయి. 'అక్షయ' అనే పదమే ఈ రోజు ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది, ఇది శాశ్వతమైన , నాశనం లేని ఫలానికి ప్రతీక. అందువల్ల ఈ రోజును ప్రత్యేకంగా పవిత్రమైనదిగా భావిస్తారు.

బద్రీనాథ్ ధామ్ ద్వారాలు తెరుస్తారు..

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ ధామ్ ద్వారాలు అక్షయ తృతీయ నాడు తెరుచుకుంటాయి. శీతాకాలంలో మూసి ఉండే ఈ ఆలయ ద్వారాలు, చార్‌ధామ్ యాత్ర ప్రారంభానికి గుర్తుగా ఈ పవిత్రమైన రోజున తిరిగి తెరుచుకుంటాయి. ఈ సంప్రదాయం ఈ పండుగను ఆధ్యాత్మికంగా అత్యంత ముఖ్యమైనదిగా చేస్తుంది. చార్‌ధామ్ యాత్ర ప్రారంభం అక్షయ తృతీయ రోజు నుండే జరిగినట్లుగా పరిగణిస్తారు. భక్తులు ఈ రోజు నుండే తమ ధార్మిక యాత్రను ప్రారంభిస్తారు. ప్రయాణాలకు, కొత్త పనులకు , శుభారంభాలకు ఈ రోజు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.

శ్రీ బాంకే బిహారీ ఆలయంలో చరణ దర్శనం..

బృందావనంలోని శ్రీ బాంకే బిహారీ  ఆలయంలో  స్వామివారి పాదాలు సంవత్సరం పొడవునా వస్త్రంతో కప్పబడి ఉంటాయి, కానీ అక్షయ తృతీయ నాడు భక్తులకు ఆ పాదాలను దర్శించుకునే ప్రత్యేక అవకాశం లభిస్తుంది. ఈ దర్శనం అత్యంత అరుదైనదిగా , పుణ్యమైనదిగా పరిగణించబడుతుంది,  స్వామి పాదాల దర్శనం కోసం భక్తులు నలుమూలల నుండి విచ్చేస్తారు.

                                        *రూపశ్రీ.