ఖేరేపతి ఆలయం.. ఇక్కడ స్వయంగా సర్పాలే విష్ణుమూర్తిని అలంకరిస్తాయట..!

 

ఖేరేపతి ఆలయం.. ఇక్కడ స్వయంగా సర్పాలే విష్ణుమూర్తిని అలంకరిస్తాయట..!


భారతీయులు పంచభూతాలను కూడా దైవంగా పూజిస్తారు. వీటిలో పుట్టలు,  పుట్టలలో నివసించే సర్పాలు కూడా దైవ సమానమైనవిగా పరిగణిస్తారు. పాములను నాగదేవతలుగా కొలుస్తారు. నాగదేవతలను నాగ పంచమి రోజు ఆరాధించడం భారతీయుల సంప్రదాయం. కొన్ని పుణ్యక్షేత్రాలలో పాములు దైవ విగ్రహాల దగ్గర ఉండటం,  శివలింగాలకు చుట్టుకుని ఉండటం, కొన్ని ప్రత్యేక రోజుల్లో పాములు గుడులలో ప్రత్యక్షం కావడం వంటివి చూస్తుంటాం.  ఖేరేపతి ఆలయం కూడా ఈ కోవకు చెందినదే.. ఈ ఆలయంలో నాగపంచమి నాడు.. సర్పాలే విష్ణుమూర్తిని అలంకరిస్తాయట.  ఎంతో ఆసక్తికరమైన ఈ ఆలయం గురించి వివరంగా తెలుసుకుంటే..

ఆలయం ఎక్కడుంది?

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో ఖేరేపతి ఆలయం ఉంది. ఈ ఖేరేపతి ఆలయం నాగమేళాకు చాలా ప్రసిద్ధి చెందిందట. కాన్పూర్ నగర నడిబొడ్డున ఉన్న మాల్ రోడ్‌లో ఖేరేపతి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని మొదటిసారి సందర్శించే వారికి ఇది ఒక సాధారణ ఆలయంగా కనిపిస్తుంది, కానీ నాగ పంచమి రోజున ఆలయ స్వరూపం పూర్తిగా మారిపోతుందట. ఇక్కడ జరిగే భారీ నాగ మేళాకు దేశ నలుమూలల నుండి భక్తులు తరలివస్తారు.

ఖేరేపతి ఆలయ కథ..

ఖేరేపతి ఆలయం సుమారు 200 సంవత్సరాల పురాతనమైనది. ఈ ఆలయంలో దేవతలందరినీ పూజిస్తున్నప్పటికీ, విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం నిర్మించిన ప్రదేశంలో ఒకప్పుడు బావి ఉండేదని చెబుతారు. ఈ ఆలయాన్ని కాన్పూర్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త నిర్మించారు. అతని తల్లికి కలలో శేషనాగు దర్శనమిచ్చి, ఈ ఆలయాన్ని నిర్మించమని ఆదేశించారట.

ఆలయ స్థలాన్ని తవ్వినప్పుడు ఒక పురాతన బావి బయటపడిందట, దానిలో పాములు కనిపించాయట. శేషనాగుడు ఆ ఆలయంలో కొలువై ఉంటాడని నమ్ముతారు. నేటికీ ప్రతి సంవత్సరం నాగపంచమి జాతర కోసం దేశవ్యాప్తంగా ఉన్న పాములను ఇక్కడికి తీసుకువచ్చి ప్రదర్శిస్తారట. కోరికలు తీర్చే ఒక జత నాగుపాములను కూడా ఇక్కడికి తీసుకువస్తారట, దీనికి చాలా ప్రాముఖ్యత ఉందని చెబుతారు.

సర్పాలే విష్ణుమూర్తికి అలంకారం..

ఈ ఆలయం  అత్యంత విశిష్టమైన సంప్రదాయం.. ప్రతి నాగపంచమి నాడు ఒక జత నిజమైన పాములు  విష్ణుమూర్తిని అలంకరిస్తాయి. ఈ అలంకరణ కోసం,  విష్ణుమూర్తి  విగ్రహం ఉన్న అద్దాల  గదిలోకి పాములను వదులుతారట, ఆ తరువాత  ఏర్పడే దృశ్యం నిజంగా అద్భుతంగా ఉంటుందని చెబుతారు.

 

                       *రూపశ్రీ.