Antera Bamardee 6
This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.
ఆరవ భాగం
“నాకిష్టమైన పుస్తకం !”అని.
“నేను మీటైపే!నాదీ మీ టేస్టే !”అన్నాడు వేణు.
“ఉడ్ హవుస్ రాసిన 'కేరీ ఆన్ జీన్స్' చదివేరా ?”
“జీన్స్ సిరీస్ అన్నీ చదివేను.మీ చేతిలో వున్న మనీ ఇన్ ది బేంక్ కూడా చదివేను !”
“అయ్ సీ !”
“కాకపొతే అన్ ఫార్చునేట్లీ ఆ పుస్తకం మిస్సయింది !”
“చదివేసేరు గదా!మిస్సయినా ఫర్లేదు లేండి "
“ఉడ్ హవుస్ పుస్తకాల్ని నేను ఒకటికి పదిసార్లు పదే పదే చదువుతాను "
“వండ్రపుల్ !నేనూ మీ టైపే "ఆకస్మాత్తుగా అనేసింది ఉమ. ఆ తరువాత సర్దుకుని అన్నది.
“నేను కూడా మనీ యిస్ ది బేంక్ ని కూడా అయిదాసార్లు చదివేను.విమల ముచ్చటపడి అడిగితే యిచ్చేను "
“విమల ఎవరు ?”
“నా క్లాసుమేటు.ఈ మధ్యనే విమలకి పెళ్లయింది.అత్తవారింటికి ఆ పుస్తకాన్ని వెంటబెట్టుకుపోయింది.అంచేత కొత్త పుస్తకం కొనుక్కుందామని వచ్చేను "
“చాలా మంచి విషయాలు చెప్పేరు.ఉడ్ హవుస్ పుణ్యమాని "ఏం చెప్పాలో తోచక ఆగిపోయేడు.
వీళ్ళ వరసని షాపులో ఉన్న వాళ్ళంతా విడ్డూరంగా గమనిస్తున్నారు.వాళ్ళు తమని గమనిస్తున్నారని ఉమా కూడా గమనించింది. ఉమ గమనించినట్టు వేణు గమనించని కారణంగా ఉడ్ హవుస్ పుణ్యమాని అనే మాటని పూర్తీ చేసే ప్రయత్నంలో మినీ ఉపన్యాసమే ప్రారంభించాడు.
“ఆ మహనీయుడి జ్ఞాపకార్ధం-ఉడ్ హవుస్ హవుసి అనే పేరుతొ చిన్న సైజు లైబ్రరీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను.అందులో అన్నీ ఉడ్ హవుస్ పుస్తకాలే వుంటాయి.వారానికో రోజు సభ్యులంతా ఉడ్ హవుస్ లోనే సమావేశమవుతారు.ఉడ్ హవుస్ ప్రతిభ గురించి తలోకరు తలొక కోణం తీసుకుని మాటాడుతారు.ఇంత అందమైన కార్యక్రమానికి అందమైన మీ చేయూత చాలా అవసరం.అంచేత...” అతని మాటలకి అడ్డం పడింది ఉమ.
“ఈ విషయాలన్నీ మరో తడవ ముచ్చటించుకుందాం.సెలవిప్పించండి "అని.
అంత త్వరగా సెలవడగడం వేణుకిష్టం లేకపోయినా మరో తడవ అనే ఛాన్సుని స్వయంగా ఉమే యివ్వడం వల్ల వేణు అపారంగా ఆనందిస్తూ తన విజిటింగ్ కార్డు ఆమెకిస్తూ "ఉడ్ హవుస్ అభిమానులం గదా!నా కార్డు మీ దగ్గిరుండటం ధర్మం!ఇప్పట్నుంచీ మనం మంచి ప్రండ్సన్నమాట!” అని.
ఈ గొడవ జానకిరాం బుక్ హవుస్ లో జరిగింది గనక -అక్కడే ఉమని చూసి మనసు పారేసుకున్నాడు గనక,సదరు బుక్ హవుస్ ని అతను ఉడ్ హవుస్ గా భావించి బాగా యిష్టపడుతుంటాడు. ఎంతో మధురమైన మనోహరమైన ఈ సంఘటన జనవరి ఇరవై అయిదున జరిగింది గనక,అతను ఆ తేదీ మీద వల్లమాలిన స్థాయిలో యిష్టం పెంచుకున్నాడు.
ఏతావాతా కేవలం ఉడ్ హవుస్ పుణ్యమాని వేణు,ఉమల పరిచయం దినదినాభివృద్ధి చెందింది. మొదట్లో వాళ్ళిద్దరూ ఉడ్ హవుస్ గురించి మాత్రమే మాటాడుకునేవారు.రానురాను తమ గురించి కూడా మాటాడుకోవడం ప్రారంభించేరు.తత్పలితంగా ప్రేమలో పడిపోయేరు.
ఇక కథలోకి...
వేణు ఎక్కిన రైలు హైదరాబాద్ వేపు పరుగెడుతుంది.
(ఇంకావుంది)
(హాసం సౌజన్యంతో)